-ప్రసాద్ గోసాల
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన విన్యాసాలు రాజకీయాల్లో రాణిస్తాయా? జగన్ ఆశించిన ప్రయోజనం నెరవేరుతుందా? పాత మంత్రుల తొలగింపునకు ప్రాతిపదిక ఏమిటి? అనే ప్రశ్న లు ఇప్పుడు జనం మదిని దొలిచేస్తుననాయి.
ముఖ్యమంత్రి గా ప్రమాణం చేసిన సందర్భంగా ఆయన చెప్పిన మాటేమిటంటే రెండున్నర ఏళ్ళ తరువాత ఇప్పుడు ప్రమాణం చేసిన మంత్రులు మారతారని కొత్త మంత్రులు బాధ్యతలు స్వీకరిస్తారని చెప్పి సంచలనం కలిగించారో ఆ రోజే తన మంత్రివర్గ సభ్యుల రాజకీయ జీవితాన్ని కుదించేశారు.
మంత్రివర్గం కూర్పు అనేది ముఖ్యమంత్రి విచక్షణ అయినా కులమత, ప్రాంతాలకు న్యాయం చేయాలని భావిస్తారు. అంజయ్య మంత్రివర్గంలో 60మందికి స్ధానం కల్పించిన నాటి పరిస్ధితులకు ఇప్పుడు ఉన్న పరిస్థితులకు చాలా తేడావుంది.
ఆంధ్రప్రదేశ్‌లో మంత్రులందరినీ ఒకేసారి రాజీనామాలు చేయించిన మూడో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఊహించినట్లుగానే ఆయన తన 24 మంది మంత్రులందరు గురువారం రాజీనామాలు సమర్పించారు. ఏప్రిల్ 11న ఆయన కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయనున్నారు.
అంతకుముందు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, అప్పటి ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య తన మంత్రులను రాజీనామాలు సమర్పించాలని కోరారు. కేబినెట్లో ముఖ్యమంత్రితో పాటు 60 మంది మంత్రులతో జంబో క్యాబినెట్ ఉందనే విమర్శలను ఎదుర్కొన్నారు. టంగుటూరి అంజయ్య అతను మంత్రులందరి రాజీనామాలను తీసుకున్నాడు ,రెండు రోజుల తర్వాత తన మంత్రివర్గాన్ని చాలా తక్కువ సంఖ్యతో ఏర్పాటు చేశారు.
తరువాత, నందమూరి తారక రామారావు తన రెండవ మంత్రివర్గాన్ని 1985-89 మధ్య 31 మంది మంత్రులతో ఏర్పాటు చేశారు. అయితే, తన క్యాబినెట్ మంత్రులందరినీ రాజీనామా చేయించిన రెండవ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు అయ్యారు. బడ్జెట్ ముఖ్యాంశాలు లీకేజీ కావడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజుల్లో ఎన్టీఆర్ జాతీయ రాజకీయాల్లో చురుగ్గా ఉండేవారు కాబట్టి ఆ పార్టీ శాసనసభ్యులు నిరసన వ్యక్తం చేయలేదు.
1984 ఆగస్టులో తన మొదటి ఆర్థిక మంత్రి నాదెండ్ల భాస్కరరావు తిరుగుబాటు బావుటా ఎగురవేసిన తర్వాత ఆయన ఆగ్రహాన్ని, ప్రజల్లో ఆయనకున్న ఆదరణను వారు చూశారు. ఆ విధంగా తన క్యాబినెట్ మంత్రులందరి రాజీనామాలు చేసిన మూడో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. కొత్త క్యాబినెట్‌ను ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రికి స్వేచ్ఛ ఉంటుంది, ఇందులో కొంతమంది పాత ముఖాలకు కూడా చోటు కల్పించాలని భావిస్తున్నారు. మొదటి రెండు సంఘటనలు ముందస్తు నోటీసు లేకుండానే జరిగినప్పటికీ, మూడవ పరిణామం ఊహించినది.
రెండున్నర సంవత్సరాల తర్వాత మంత్రులందరినీ తప్పించి కొత్త ముఖాలతో కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తానని జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. దీంతో ఆయన గురువారం తన మంత్రులను రాజీనామా చేయించారు.
ఇంతవరకూ బాగానే వున్నా అసలు సమస్యే ఇక్కడ ప్రారంభం అయింది. తనతో పాటు మంత్రలందరీనీ గంపగుత్తగా తొలగిస్తారని ఒకమంత్రి ప్రకటించారంటే అది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ చేసిన పదవీ ప్రమాణాలకు విరుద్ధం గా వుందన్న విషయం కూడా గమనించాలి.
మంత్రులందరినీ తొలగించడానికి మొదట్లో చేసిన అనాలోచితంగా తొందరపడి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటనే ప్రాతిపదిక. మంత్రివర్గం పనితీరును పరిశీలనలోకి తీసుకుంటే మాత్రం ఆర్ధిక మంత్రి బుగ్గన, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మునిసిపల్ మంత్రి బొత్స సత్యనారాయణ మినహా మిగతా 22మంది మంత్రి వర్గ సహచరుల పనితీరు మందగించి నట్లే లెక్క.
ఇక ఇప్పుడు ఉన్న 25మందిని తొలగించి కులాల సామాజిక సమీకరణాల పేరుతో ఎవరిని కొనసాగించాలని నిర్ణయించినా అది రాజకీయంగా ఆశించిన ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉండదు. 1988లో ఎన్టీఆర్ బడ్జెట్ లీక్ అయ్యిందని చెప్పి మంత్రులందరినీ తొలిగించిన తర్వాత 1989లో ఎన్టీఆర్ అధికారం కోల్పోయిన సంగతి తెలిసిందే.
మళ్ళీ అధికారంలోకి రావాలని కలలు కంటున్న జగన్ కొత్త మంత్రులు పేరిట చేసే ప్రయోగం విజయవంతం కావడం రానున్న రెండేళ్లలో ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆర్ధిక సమస్యలకు పరిష్కారం లభించడం బట్టే ఉంటుంది.
మంత్రివర్గం కూర్పు అనేది ముఖ్యమంత్రి కి బలం చేకూర్చే విధంగా ఉండాలే కానీ ,అది గుది బండగా మారి అసలుకే ఎసరు వచ్చే విధంగా ఉండకూడదు. ఇప్పటికి వరకూ బయటే సమస్యలు కొని తెచ్చే విధంగా నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ మంత్రి వర్గం కూర్పు లో కష్టం కలిగించే నిర్ణయం తీసుకుంటే ఆ నష్టం భర్తీ చేసుకోవడం జగన్ వల్లే సాధ్యం కాదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు