ఇపుడు ఆంధ్రప్రదేశ్ లొ క్యాబినెట్ లేదు. ముఖ్యమంత్రి ఒక్కరే ఉన్నారు. మంత్రులంతా తలదించుకుని ఇళ్లకు వెళ్లిపోయారు. క్యాబినెట్ లేని ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి యాత్రలకు బయలు దేరుతున్నారు. తదుపరి క్యాబినెట్ ఎపుడొస్తుందో తెలియదు. ఇలా క్యాబినెట్ లేకుండా ముఖ్యమంత్రి ఒక్కరే రాష్ట్రాన్ని పాలించడం ఆంధ్రా కి కొత్త కాదు. ఇది రెండో సారి, మొదటి 1988 లో ‘అన్నగారు’ ఎన్టీఆర్ ఆ సాహసం చేశారు, ఆగ్రహంతో. ఇపుడు జగన్ మోహన్ రెడ్డి చిరునవ్వు చిందిస్తూ ఈ సాహసం చేశారు. క్యాబినెట్ తెలుగు వాళ్లు చాలా ప్రయోగాలు చేశారు. ఎన్టీఆర్,జగన్ క్యాబినెట్ లేకుండా బండి నడిపిస్తే, టి అంజయ్య గతంలో జంబో క్యాబినెట్ లో 60 మంది ఎక్కించుకుని రికార్డు సృష్టించారు. ఈ మధ్యలో తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు మరొక రికార్డు సృష్టించారు. ఆయన స్కూటర్ క్యాబినెట్, అంటే ఇద్దరే ఉంటారు. రెన్నెళ్లు పాటు, తాను ముఖ్యమంత్రి, మరొకరు డిప్యూటీ చీఫ్ మినిష్టర్. ఇదంతా గమనిస్తే, మినిస్టర్లంతా డమ్మీలే నని అనిపిస్తుంది. అసలు ముఖ్యమంత్రులకు మినిస్టర్లు అసరమా అని ప్రముఖ ఆర్థిక వేత్త, మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నపుడు మీడియా సలహాదారుగా ఉన్న డాక్టర్ సంజయ్ బారు ‘Do Ministers Matter?’ అని ఆశ్చర్యపోయారు.
ఇపుడు మొదటి సారి ఏం జరిగిందో ఫ్లాష్ బ్లాక్ ఏమిటో చూద్దాం.
అది ఫిబ్రవరి 8,1989.
జనం మద్దతు ప్రభంజనంతో 1985లో అధికారంలోకి వచ్చిన ఎన్టీరామారావుకు మంత్రుల మీద తెగ కోపం వచ్చింది. ఎన్నికల్లో గెలిచినవాళ్లు ప్రతిదానికి చికాకు పడతారు,ఎందుకంటే, గెలిచాం, ఇక తిరుగు ఉండకూడాదు అనుకుంటారు. ప్రజాతీర్పుకు అడ్డు అదుపు అప్పీల్ ఉండకూడదని విజేతలు భావిస్తారు. ఆ రోజు ఎన్టీరామారావు అలాగే భావించుకుని అగ్గిమీద గుగ్గిలంగా చిటపటలాడుతున్నారు.
ఎందుకంటే, ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో రేపో మాపో పెట్టబోయే 1989-90 బడ్జెట్ వివరాలు లీక్ అయ్యాయి. బడ్జెట్ లోటు, విద్యుత్ షార్టేజ్, ఇరిగేషన్ సెక్టర్ కేటాయింపుల మీద వివరాలు లీక్ అయ్యాయి.ఆ రోజుల్లో బడ్జెట్ పత్రం చాలా పవిత్రమయింది. లీక్ అయితే,కొంపమునుగుతుంది. అసెంబ్లీ సమావేశంలో ఉన్నపుడు, సభలో ప్రవేశపెట్టడానికి ముందే పత్రికలకు సమాచారం అందించడం ప్రివిలేజ్ వ్యవహారం. అందువల్ల అంత మెజారిటీాతో గెలిచిన వ్యక్తి సభలో తలదించుకునే పరిస్థితి వస్తుంది. అందువల్ల ఎవరు లీక్ చేసిఉంటారని ఆయన పొద్దుటి నుంచి సాయంకాలం దాకా తర్జన భర్జనలు నడిపి అయిదుగురు సీనియర్ మంత్రులు దీనికి కారణమయిన ఉంటారని అనుమానించారు.
వేగుల వారు కూడా అదే చెప్పారు. వాళ్లనేం చేయాలి? అయిదుగురిని క్యాబినెట్ నుంచి పీకేస్తే… బాగుండదు. బాగా ఆలోచించి మొత్తం క్యాబినెట్ మంత్రులందరినిపీకేయాలనుకున్నారు. ఈ విషయం చంద్రబాబు చెవిలో వేశారు. ఆయన ఒప్పుకోలేదు. వద్దు, సీనియర్లు తిరుగుబాటుచేస్తారేమోనని బాబు సలహా ఇచ్చారు. అంతమెజారిటీతో గెలిచిన ఎన్టీరామారావు ఇలాంటి సలహాలు వినేరకం కాదు. ముందుకెళ్లాలనుకున్నారు. మంత్రులందరికి ఫోన్ చేసి అర్జంటుగా మధ్యాహ్నం మూడున్నకర కల్లా పరిగెత్తుకుంటూ రావాలని సిఎం ఆఫీస్ నుంచి అందరికి కబురెల్లింది.
ఈ అర్జంటు సమావేశం ఏమిటి? క్యాబినెట్ మీటింగా, కాదు. మరేమిటి? ఈ ప్రశ్నతో మంత్రులంతా ఎన్టీరామారావు నివాసానికి చేరుకుంటున్నారు. సమయం మధ్యాహ్నం 3.50. వచ్చీరాగానే వాళ్ల చేత సెక్రెటరీలు రాజీనామా లేఖల మీద సంతకాలు తీసుకుంటున్నారు. మంత్రులంతా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. అంతకు మించి వాళ్లు చేసేదేమీ లేదు. ఎన్టీఆర్ పెద్ద అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు (ఆరోగ్య శాఖమంత్రి) వచ్చారు. ఆయన దగ్గిర నుంచి కూడా రాజీనామా లేఖ తీసుకున్నారు. మంత్రులంతా ఆశ్చర్యపోయారు. అయినా లోలోన సంతోషించారు. దగ్గుబాటికి కూడా ఇది అర్థం కాలేదు. అయితే, బడ్జెట్ లీక్ చేసిన నలుగురైదుగురిని తీసేందుకు మామ ఎన్టీ ఆర్ ఇలా రసవత్తర నాటకం వేస్తున్నారని వూహించుకుని ఆయన ఉల్లాసంగా చేతులూపుతూ తన లేఖ అందించారు. ఇతర మంత్రులనుంచి లేఖ లను సేకరించడం మొదలుపెట్టారు. ఎవ్వరూ ఎన్టీఆర్ ను కలుసుకునే సాహసం చేయలేదు. అందిరి ముఖాలు వాడిపోయాయి. ఉన్నట్లుండి పదవులూడి వూర్లకు పోవాలి. ఏ ముఖం పెట్టుకుని వెళ్లాలి?
వీళ్లందరి చేత రాజీనామాలు తీసుకున్నారు. మొత్తం 31. అన్నింటిని గవర్నర్ కు పంపించారు. మరుసటి రోజు వార్త ఏమిటి? మంత్రులను పెరికేశారని. దీనినే అంతా నమ్మారు. చివరకు 1989 ఫిబ్రవరి 8 సాయంకాలం నుంచి ఆంధ్రలో క్యాబినెట్ లేని ముఖ్యమంత్రి పాలన మొదలయింది. మరుసటి రోజు ఈ నాడు పేపర్లో ఎన్టీఆర్ కు పార్టీలో 120 మంది ఎమ్మెల్యేలు వ్యతిరేకమని రాసింది. ఇది వేరేవిషయం.
తర్వాత ఏమయింది?
ఎన్టీ రామారావు ఎవ్వరికీ అందుబాటులో లేకుండా ఢిల్లీ వెళ్లిపోయారు. అక్కడి నుంచి గౌహతివెళ్లిపోయారు. అప్పటికే ఆ వార్త వైరలయ్యింది. ఇవేవీ పట్టనట్లు ఆయన నేషనల్ ఫ్రంట్ ఏర్పాట్లలో మునిగిపోయారు. నేషనల్ ఫ్రంట్ ఏర్పడేందుకు ఎన్టీఆరే మూల స్తంభం. ఈచర్య వ ల్ల నేషనల్ ఫ్రంట్ కు ముప్పుువస్తుందేమోనని జాతీయ ప్రతిపక్ష నాయకులు ఆందోళన చెందారు. ఆరోజుల్లో టివి రాజేశ్వర్ ( 1949 బ్యాచ్ ఐపిఎస్ ఆఫీసర్ బ్యాచ్ , తర్వాత ఆంధప్రదేశ్ క్యాడర్) బెంగాల్ గవర్నర్ గా ఉన్నారు. ఈ విషయాన్ని ఆయన జ్ఞాపకాల పుస్తకం ( India : The Crucial Years) లో కూడా రాశారు. ఒక్క కలం పోటుతో క్యాబినెట్ ను మొత్తం ఎలా బర్తరఫ్ చేస్తారని బెంగాల్ ముఖ్యమంత్రి జ్యోతిబాస్ కూడా ఆందోళన చెందారని రాజేశ్వర్ రాశారు. పార్టీ అంటే తానే, ఎన్నికల్లో గెలిచాక తానే ప్రభుత్వం అని ఎన్టీఆర్ నిరూపించుదలుచుకున్నారు, చాలా బలాఢ్యుడు అని చెప్పదల్చుకున్నారని ఆయన అభిమానులు భావించారు. ఎవరైనా సరే, హద్దు మీరొద్దు అని ఆయన 31 మంత్రులను ఇంటికి పంపి హెచ్చరించారు. ఇలా జరగడం దేశంలో అదే మొదటి సారి.
ఎవ్వరూ పెద్దగా రచ్చ చేయలేదు. చేస్తే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్టే రాకపోవచ్చు. అందువల్ల చాలా జాగ్రత్తగా స్పందించారు. మొదట అసంతృప్తి వెలిగక్కింది వసంత నాగేశ్వరరావు. చాలా మంది పార్టీ పదవులు తీసుకున్నారు. ఆశోక్ గజపతి రాజు పార్టీ జనరల్ సెక్రెటరీ అయ్యారు. ఇంద్రారెడ్డి, ముద్దు కృష్ణమ నాయుడు, కళా వెంకటరావు పార్టీ రీజినల్ సెక్రెటరీలు అయ్యారు.కెయి కృష్ణమూర్తి,జానారెడ్డి పార్టీ వైస్ ప్రెశిడెంట్, పాలిట్ బ్యూరో మెంబర్ పోస్టులను తిరస్కరించారు. వీరు రెబెల్స్ గా కొనసాగారు.తర్వాత కథ అనేక కత్త మలుపులు తిరిగింది. అనే వేరే కథ
క్యాబినెల్ లేకుండా వారం రోజులు…
అలా ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం ప్రభుత్వం క్యాబినెట్ లేకుండా వారం రోజులు కేవలం ఎన్టీఆర్ ముఖ్యమంత్రి గా కొనసాగింది. తర్వాత 23 మంత్రి మంత్రులతో కొత్త క్యాబినెట్ కొలువు తీరింది. 23 సంఖ్య ఏమిటో ఎవరికీ తెలియదు. 23 జిల్లాలకు ప్రాతినిధ్యమా , కాదు, ఎందుకంటే ఈ క్యాబినెట్ లో కొన్ని జిల్లాలనుంచి మంత్రులు లేరు. కొన్ని ప్రముఖ కులాల ప్రతినిధులూ లేరు పాత వాళ్లెవరికీ చోటు దక్కలేదు. తర్వాత చాన్నాళ్లకు కొందరు సీనియర్ మంత్రులు తిరుగుబాటు చేశారు.
కొత్త మంత్రులంతా రాజకీయాలకు కూడా కొత్త వాళ్లు. మెజారిటీ 1985లో తొలిసారి గెలిచిన వాళ్లు. 1989 మార్చి 1న అసెంబ్లీకి హాజరయినపుడు ఎవరూ ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకపోయారు. దీనితో ఎన్టీ ఆర్ పదే పదే జోక్యం చేసుకోవలసి వచ్చింది. పోనీ ఎన్టీఆర్ కాకలు తీరిన పార్లమెంటేరియనా, కాదు. ఆయనకు పెద్దగా అనుభవం లేదు. దీనికి కొంత అపకీర్తి వచ్చిందని ఆయన దగ్గిర సెక్రెటరీ గా కొంతకాల పనిచేసిన ఐఎ ఎస్ అధికారి డాక్టర్ లక్ష్మినారాయణ NTR: A Biography లో రాశారు. ఈ పుస్తకాన్ని ఆయన మరొక రచయిత కే చంద్రహాస్ తో కలసి రాశారు.
ఇపుడు క్యాబినెట్ లేకుండా జగనన్న…
ఎన్టీఆర్ లాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూ ప్రభంజనం లా వచ్చారు. తనలో ఏదో దైవశక్తి లేకపోతే ప్రజలు ఇలా భారీ తీర్పు ఎలా ఇస్తారు అనుకునేంత పెద్ద మెజారిటీ వచ్చింది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన చేపడుతున్న పథకాలు, రాజకీయ క్యాంపెయిన్ అంతా చూస్తే ఎన్టీఆర్ ధోరణి గుర్తుకొస్తుంది.
ఇంత మెజారిటీతోప్రజాతీర్పు వచ్చాక ఇక అడ్డేమిటి అనే ధోరణిా కనిపిస్తుంది. కనీసం ఎన్టీ రామారావుకు బడ్జెట్ లీక్ అనే సాకు దొరికింది. జగన్ కు ఏ సాకు దొరికిందో తెలియదు. మంత్రులందరి చేత నాటి అన్నగారు ఎన్టీఆర్ లాగానే జగనన్న రాజీనామా లేఖలు తీసుకున్నారు. కాకపోతే, ఆనాటి హర్రర్, షాక్, సస్పెన్స్ ఎలిమెంట్ నిన్న క్యాబినెట్ లో లేదు.
ఆ రోజు అన్నగారు ఎన్టీఆర్ కోపంగా చిందులేస్తూ, మంత్రులెవ్వరినీ కలవనీయకుండా, సెక్రెటరీల చేత లేఖ రాయించుకున్నార. కాకపోతే, ఇపుడు జగనన్న క్యాబినెట్ సమావేశంలో చిద్విలాసంతో లేఖలు అందుకున్నారు. ఆరోజు మంత్రులు కన్ఫ్యూజన్ , అక్కసుడో ఎన్టీ ఆర్ నివాసం నుంచి వెళ్లిపోతే, ఈ రోజు పైకి కక్కలేని, మింగలేని ఫీలింగ్ ఇళ్లకు పోయారు.
ఆ రోజు అన్నగారు ఏన్టీఆర్ సరిగ్గా వారం రోజులకు కొత్త క్యాబినెట్ 23 మందితో ప్రమాణం చేయించారు. ఇపుడు జగనన్న ఎన్ని రోజులు తీసుకుంటారో చూడాలి.
ఇపుడు వేధిస్తున్న ప్రశ్నలు
- ఇంతకీ మంత్రులను ఎందుకు తీసేశారు?
- మంత్రులు బాగా అన్ పాపులర్ అయ్యారని జగనన్న భావించారా?
- ఈ ముఖాలతో ఎన్నికలకు పోలేమని జగనన్న భయపడ్డారా?
- మరి వాళ్లంతా అన్ పాపులర్ అయితే, ఆ మేరకు ప్రభుత్వం కూడా అన్ పాపులర్ అయినట్లు కాదా?
- ఈ క్యాబినెట్ మార్పులు జగన్ అనుకున్నది నెరవేరుతుందా?
జగన్ చిక్కటి నవ్వులో ఏదో రహస్యం దాగి ఉందని అర్థమవుతుంది. కాకపోతే, స్పష్టంగా లీక్ కావడం లేదు.