“నాకు తెలిసిన మా నాన్నగారు”

-పరకాల సూర్యమోహన్

మా నాన్న (పరకాల పట్టాభి రామారావు) గారి  గురించి ఎంతచెప్పినా తక్కువే .ఆయనొక నిష్కలంక దేశభక్తుడు, నిఖార్సైన కమ్యూనిస్టు . నమ్మిన సిద్ధాంతాలకు చివరివరకూ కట్టుబడివున్న మహోన్నత మైన వ్యక్తి ఆయన. స్నేహశీలి, సహృదయులు, అజాత శతృవు అయిన మా నాన్నగారు పరకాల పట్టాభి రామారావు గారి జీవితం ఆద్యంతం వుత్కంఠ భరితం.

ఎన్నో సాహసకృత్యాలు ఆయన జీవితంలో అడుగడుగునా తారసపడతాయి. ఆయన, ఎంతో నిబథ్థత గల కమ్యూనిస్టుగా, అజ్ఞాత వాసంలో , పోలీసుల కంటపడకుండా, మారువేషాల్లో, రహస్యంగా ఏఏ రాష్ట్రాలలో తిరిగినది మాకు చెబుతోంటే ఏదో త్రిల్లర్ సినిమా కధ లా నోరువెళ్ళబెట్టి వింటూవుండేవాళ్ళం.

తాను రహస్యంగా వుంటున్న డెన్ పరిసరాల్ని ఓ అరగంట వ్యవథిలో పొలీసులు జల్లెడ పట్టబోతున్నారన్న సమాచారం అందగానే ఎక్కడికీ పారిపోలేక , అక్కడున్న అతిపొడవాటి తాటిచెట్టు పైకంటా ఎక్కి, తాటి మట్టల గుబురులోఒక రోజంతా వుండిపోయారట. అది ఎవరికీ వూహకందని రహస్య ప్రదేశం. ఆ రాత్రి అంతా పోలీసుల బూట్ల చప్పుడు , టార్చిలైట్ల కాంతి, విజిళ్ళ శబ్దాలతో ఆ ప్రదేశం మార్మోగిందట. రాత్రి తెల్లవార్లూ కంటిమీద కునుకులేకుండా గడిపారట మా నాన్నగారు.

అదొక నరాలు తెగే, ఒళ్ళు జలదరించే వుత్కంఠ భరిత సాహసకృత్యం. తాటిచెట్టు మీద తాటి మట్టల గుబురులో మా నాన్నగారు, కింద తాటిచెట్టును ఆనుకుని బీడీలు కాలుస్తూ నుంచునివున్న పోలీసులు. వాళ్ళలో ఎవరు చెట్టుమీదకు టార్చిలైట్ వేసినా, లేక మా నాన్నగారు ఏ మాత్రం చప్పుడు చేసినా ఏమైయ్యేదో తలుచుకుంటే గుండె ఆగిపోతుంది.

సెర్చి పార్టీ వెళ్ళిపోయిన తరువాత , నెమ్మదిగా చెట్టు దిగి, ఆకలి బాథ తట్టుకోలేక సమీపంలో వున్న ఓ పూరిగుడిసెలోకి వెళ్ళారట. అదొక చాకలివాళ్ళ ఇల్లు . ఈయన వాలకంచూసి , కాస్త మిగిలిన అన్నం ముద్ద, గిన్నెలో అడుగున మిగిలిన కాస్త చేపల పులుసు పెడితే ఆవురావుర మని తిన్నారట. ఎంతో నిష్టగల బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చిన విషయంగానీ, జీవితంతో చేపల పులుసు అదే మొదటి సారి అనిగానీ ఆయనకు జ్ఞాపకం రాలేదుట. వెంట్రుకవాసిలో మృత్యువును తప్పింకున్న ఘటనల ఆ కాలంలో కోకొల్లలు.

చిన్నచిన్న పొరపాట్లు చేసి పోలీసులకి దొరికి పోయినా , వారి కౄర, కిరాతక చిత్రహింసలు భరిస్తూ , పార్టీ రహస్యాల్ని గుండెల్లో నే దాచుకుని, పోలీసుల తూటాలకు బలైపోయిన కామ్రేడ్లగురించి కంటతడిపెడుతూ ఆయన మాకు చెప్పిన విషయాలు మా మనసుల మీద చెరగని ముద్ర వేసాయి.
విద్యార్థి దశలోనే స్వాతంత్ర్య పోరాటాల పట్ల ఆకర్షితులైన మా నాన్నగారు, 1931, మార్చి 23వ తేదీన భగత్ సింగ్ ను బ్రిటిష్ పాలకులు వురి తీసినందుకు నిరసనగా మార్టేరు హైస్కూల్ విద్యార్థులు నిర్వహించిన ప్రదర్శన లో మొదటిసారిగా పాల్గొన్నారు. అప్పుడు ఆయన వయస్సు 11ఏళ్ళు. ఆ విథంగా ఆ సంఘటన జాతీయోద్యమం పట్ల ఆసక్తికి ఆయనలో అంకురార్పణ జరిగింది అని చెప్పవచ్చు.

ఆ తరువాత కాకినాడ P R college లో చదువుతున్నప్పుడు విద్యార్థి వుద్యమాల్లో ఎంతో క్రియాశీలంగా పాల్గొనేవారు. 1939 సెప్టెంబరు 1వ తేదీన కాకినాడలో ఆంధ్ర రాష్ట్ర విద్యార్థి ఫేడరేషన్ 16వ మహాసభ జరిగే సమయానికి మా నాన్నగారు ఆహ్వాన సంఘం కార్యదర్శిగా వుండేవారు.ఆ సభ ప్రారంభకులుగా నేతాజి సుభాస్ చంద్రబోస్ ని ఆహ్వానించడం, అందుకు నేతాజి కాకినాడ వచ్చి ప్రారంభోపన్యాసం చేయడం అంతా మా నాన్నగారి చొరవతోనే జగిందని చెప్పాలి.

ఆ మహాసభ మా నాన్నగారి రాజకీయ జీవితంలో అతి ప్రథాన ఘట్టం. 1939 సెప్టెంబరు 7 న జరిగిన సమ్మెకు నాయకత్వం వహించారు. 1943లో జనవరి లో అరెస్టు అయ్యారు,1946-48 మథ్య జమిందారీ వ్యతిరేక పోరాటాల్లో పాల్గొని పలుమాట్లు జైలు శిక్ష అనుభవించారు. 1948-52 మధ్య ప్రభుత్వ తీవ్ర నిర్భంథకాలంలో గడిపిన అజ్ఞాత వాసంలో ఆయన ఎదుర్కొన్న సవాళ్ళు, తిరిగిన ప్రదేశాలు, చేసిన సాహసాలు అన్నీఇన్నీకావు.

1942లో ప్రజాశక్తి వారపత్రికలో రిపోర్టరుగా చెరడంతో ఆయన పాత్రికేయ జీవితం ప్రారంభమైంది
1952 నుంచి 1992 వరకూ విశాలాంథ్ర దినపత్రిక సంపాదఖ వర్గ సీనియర్ సభ్యునిగా, కమ్యూనిజం మాస పత్రిక సంపాదకునిగా పనిచేసారు.

సంఘమిత్ర ప్రచురణల పేరుతో మా అమ్మగారు పరకాలా అహల్యాదేవి ఆథ్వర్యంలో అనేక జాతీయ,అంతర్జాతీయ అంశాల మీదా , సామాజ రుగ్మతలమీదా దాదాపుగా 25
పుస్తకాలు రచించారు .

సోవియట్ భూమి నెహ్రూ అవార్డు , ఢిల్లీ తెలుగు అకాడమీ ఉగాది పురస్కారం, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ జర్నలిజం పురస్కారం, స్వాతంత్ర్య సమారయోథునిగా ప్రపంచ తెలుగు సమాఖ్య పురస్కారం, అందుకున్న పలు సన్మానాలు,యోగ్యతా పత్రాలు ఇందుకు కొన్ని ఉదాహరణలు మాత్రమే.
ఆయన మాకు తండ్రి మాత్రమేకాదు.మాకు guide and philosopher కూడా. మా జీవితాల్ని చక్కదిద్ది మాకు దశ దిశా ఏర్పర్చిన మహోన్నత వ్యక్తి మా నాన్నగారు .మాకోసం నిరంతరం పాటుపడిన ఆదర్శ జీవి ఆయన.ఏన్ని జన్మలెత్తినా ఆయన రుణం తీర్చుకోలేము.

బాల్యంనుంచే ప్రగతి శీల భావాల్ని పుణికి పుచ్చుకున్న మా నాన్నగారిలో సమాజానికి తనవంతు సేవచేయాలన్న తపన ఆయన ఎంతో బలీయంగా వుండేది.కవిటంలో, ఆస్తి పంపకాల్లో తనకు వచ్చిన వాటాలో “పరకాల ట్రస్ట్” ను ఏర్పాటు చేసి వయోభారం మీదపడుతున్నా లెక్కచేయకుండా, స్వాతంత్ర్య సమరయోథునిగా తనకు ప్రతినెలా వచే ఫించన్ని ఇంటి ఖర్చులకి కూడాఇవ్వకుండా పరకాల ట్రస్ట్ అభివృద్ధికే పూర్తిగా వినియోగించేవారు.

ఎన్నో సేవా కార్యక్రమాలు, సమాజిక అంశాలమీద సభలు,సదస్సులు, ఉచిత వైద్యశిబిరాలు నిర్వహించారు. ఆయన తదనంతరం ఆయన స్ఫూర్తి తో , ఆయన అడుగుజాడల్లో, ఆయన పిల్లలమైన మేము, ఆయన సోదరుల పిల్లలూ, సన్నిహిత బంథువులూ పరకాల ట్రస్ట్ ని ముందుకు తీసుకువెడుతూ ట్రస్ట్ వుజ్వల భవిష్యతుకు బాటలు వేస్తున్నాం.

1920 నవంబర్ 16న కవిటంలో పుట్టిన మా నాన్నగారు (పరకాల పట్టాభి రామారావు)2013లో జనవరి 23 వ తేదీన , తన 92 వ ఏట, మమ్మల్ని అందరినీ దుఃఖసాగరంలో ముంచి కన్ను మూసారు.

ఆయన భౌతికంగా మా మథ్య లేక పొవచ్చు. ఆయన స్మృత్యర్థం శతజయంతి సంచిక తీసుకు వచ్చాం.
మా నాన్న గారికి అత్యంత సన్నిహిత మిత్రుల్ని , మా నాన్నగారితో వారి అనుబంధం గురించి రాయమని అభ్యర్థించాం. మేము అడిగిన వెంటనే మా నాన్నగారి గురించి అమూల్యమైన వ్యాసాలు రాసి పంపారు. వారందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.

మా నాన్నగారికి బంథుప్రీతి చాలా ఎక్కువ . గౌరవనీయులైన అశేష బంథువర్గం, మా నాన్నగారితో తమకున్న సాన్నిహిత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ,ఎన్నో ఆసక్తి కరమైన విషయాల్ని వెలుగు లోకి తీసుకు వస్తూ అద్భుతమైన వ్యాసాల్ని పంపారు. వారందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేసాను.

(పరకాల సూర్యమోహన్,సీనియర్ జర్నలిస్ట్, చెన్నై)

2 thoughts on ““నాకు తెలిసిన మా నాన్నగారు”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *