నేడు గాంధీజీ దండి ఉప్పు సత్యాగ్రహ యాత్ర ముగిసిన రోజు… బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడ వణిికించిన రోజు
(మనోహర్ పెన్నా)
చరిత్రలోకి వెనక్కి వెళ్ల లేకపోయినా,చరిత్ర దరిదాపుల్లోకి, చరిత్ర మిగిలించిన ఆనవాళ్ల దగ్గరికి వెళ్లి తొంగిచూడ్డం చాలా హుశారుగా ఉంటుంది. నిజం. నమ్మండి. మీరొకసారలా ఒక చారిత్రక యాత్రకు వెళ్లిరండి. మీలో హ్యాపీ హార్మోన్స్ జరజర ప్రవహిస్తాయి. ఆనందం ముఖంలో కళ తెస్తుంది. సంతోషంతో తుళ్లిపడతారు. హాయిగా మాట్లాడతారు, చిక్కగా నవ్వుతారు. చారిత్రక ప్రదేశాలకు మనం వెళ్లినా, మనసు చరిత్ర పొరల్లోకి వెళ్లి వస్తుంది. అంటే ఒక చారిత్రక ప్రదేశానికి వెళ్తే రెండు యాత్రలు, మనం మన యాత్రలో ఉంటే మనసు చరిత్రలోకి వస్తుంది.
నాకీ అనుభూతి దండి యాత్ర టూర్ వెళ్లినపుడు కలిగింది. దండి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ఒక అద్భుతమయిన ఘట్టం. దండి యాత్రగా అది ప్రసిద్ధం. బ్రిటిష్ ఇండియాలో ఉప్పు తయారీని ప్రభుత్వం స్వాదీనం చేసుకుని (Salt Law) మరొకరు తయారు చేసేందుకు వీళ్లేదని శాసనం చేసింది. దీనిని గాంధీ వ్యతిరేకించారు. ఉప్పు మీద నీ పెత్తనం ఏంటోయ్ అని ఆయన బ్రిటిష్ ప్రభుత్వాన్ని ధిక్కరించారు. మాటల్లో కాదు, చేతల్లో కూడా చూపించారు. దీనికోసమే ఆయన గుజరాత్ తో దండి సమీపంలో సముద్ర జలాన్ని సేకరించి ఉప్పు తయారు చేసి ఉప్పు మా ఊపిరి అని చాటి చెప్పారు.
నిజానికి బ్రిటిష్ వాళ్ల ఉప్పు పన్నులకు వందేళ్ల చరిత్ర ఉంది. 1835 తొలి ఉప్పుచట్టం వచ్చింది. ఉప్పు లేకుండా మనిషి బతకలేడు కాబట్టి ఉప్పు వ్యాపారం , ఉప్పు పన్నులతో బాగా ఆర్జించవచ్చని ఈస్టిండియా కంపెనీ ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. అపుడు లివర్ పూల్ నుంచి ఉప్పు దిగుమతి చేయవచ్చని భావించి ఈస్టిండియా కంపెనీ భారత దేశంలో కంపెనీ తప్ప మరొకరు ఉప్పు తయారు చేయవద్దని నిషేధించింది. కంపెనీ పాలన పోయి బ్రిటిష్ ప్రభుత్వం పరిపాలన వచ్చినా ఉప్పు విధానాలు మారలేదు. ఉప్పు చట్టం రకరకాల రూపాలు తీసుకుని 1930 నాటికి ప్రజల మీద మోపెడు భారం మోపింది. అంతేకాదు, గాంధీజీ ఉప్ప పన్నును సౌతాఫ్రికాలో కూడా వ్యతిరేకిస్తూ వచ్చారు. ఆయన ఉప్పు శక్తి ఏమిటో తెలుసు. అందుకే భారత్ కు వచ్చాక సహాయ నిరాకరణోద్యమానికి ఉప్పుపన్ను ఉపసంహరణ సరైన నినాదం అని భావించారు. దానిని ఉల్లంఘించాలనుకున్నారు. అదే దండియాత్రకు దారి తీసింది.
నాడు దండియాత్ర ఇలా సాగింది
మార్చి 12, 1930 ఉదయం 6.10 కి అనుకున్నట్లే యాత్ర మొదలయింది. మహాత్ముడి వెంబడి కేవలం 78 మంది కాంగ్రెస్ వలంటీర్లు మాత్రమే ఉన్నారు. యాత్రకోసం గాంధీజీ తన గది నుంచి ప్రశాంతవదనంతొ బయటకువచ్చారు. ఆయన వెంబడి ప్రభాశంకర్ పటాని, మహదేవ్ దేశాయి, సెక్రెటరీ ప్యారేలాల్ ఉన్నారు. ప్రార్థన పూర్తయింది. 6.30 కు యాత్ర మొదలయింది.
ఇక్కడొక మాట చెప్పుకోవాలి. ఆ రోజుల్లో టివిల్లేవు, సోషల్ మీడియా లేదు. ఉన్నవార్త పత్రికలు కూడా చాలా తక్కువ. అయితే, గాంధీజీ యాత్ర ప్రారంభం వైరల్ అయింది. నోటి మాటతో కన్యాకూమారి నుంచి కాశ్మీర్ దాకా, కలకత్తా నుంచి పెషావర్ దాకా బ్రిటిష్ భారత్ యాత్ర వార్త ప్రసారమయింది. దేశమంతా కోలాహలంలో మునిగిపోయింది.
గాంధీ దండియాత్ర ప్రారంభించారో లేదో, దేశమంతా ప్రార్థనలు మొదలయ్యాయి , పతాకం ఎగరవేశారు, సింబాలిక్ పాదయాత్రలు చేపట్టారు, భజనలు మిన్నుముట్టాయి. ఇక గుజరాత్ లో గాంధీజీ కాలుమోపిన ప్రతి గ్రామంలో జనం నీరాజనాలు పట్టారు. ఆయన నుదుట కుంకుమ దిద్దారు. హారతులు పట్టారు. పూల వెదజల్లి స్వాగతం పలికారు. నోట్ల వర్షం కురిపించారు. ఆయనను అరెస్టు చేస్తారేమో అని ఆందోళన దేశమంతా అలుముకుంది.
మొదటి రోజు యాత్ర అస్లాలీ అనే గ్రామం దాకా సాగింది. రెండో రోజు బస బజేరా అనే గ్రామంలో. తర్వాత ఆయన ఖేడా జిల్లాలో ప్రవేశించారు. నవగామ్ చేరుకున్నారు. ఆపైన వసాన గ్రామం. నదియాద్, ఆనంద్, బోర్సాద్ చేరుకున్నారు. మార్చి 18 నాటికి రాస్ తాలుకా చేరుకున్నారు. ఇక్కడే సర్దార్ పటేల్ ను అరెస్టు చేశారు. ఏప్రి ల్ 1కి సూరత్ చేరారు. 25వ రోజున ఆయన దండి చేరుకున్నారు. ఇందులో గాంధీ అనుచరులు 22 రోజులు నడిచారు. మిగతా మూడు రోజులు గాంధీజీ మౌన వ్రతం పాటించారు.
మొత్తంగా 241 మైళ్లు దండియాత్రలో గాంధీ నలభై గ్రామాల పట్టణాల ప్రజలతో సంభాషించారు. వారిని స్వాత్రంత్య్రోదమం వైపు మళ్లించారు. ఎందరో ప్రభుత్వ పదవులకు రాజనామా చేశారు. పదహైదు సంవత్సరాలు దాటినవారంతా సాతంత్య్ర సంగ్రామంలోకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. విద్యార్థులు లేని ప్రపంచ విప్లవాలు లేవని ఆయన అనేవారు. ఏప్రిల్ 5 ఉప్పు సత్యాగ్రహ యాత్ర దండి చేరింది. ఏప్రిల్ 6 వ తేదీన ఆయన ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించాలి. ఆ రోజు ఉదయం 8.30కి సత్యాగ్రహులు ఉప్పుచట్టం ఉల్లంఘించారు. సరోజినీ నాయుడు ఆయన పక్కన నిలబడి పొలికేక Hail Deliverer విసిరారు.
గాంధీజీ ఉప్పు ముద్దను చేతపట్టు కుంటూ దీనితో నేను బ్రిటిష్ సామ్రాజ్య పునాదులను కదిలిస్తున్నాను( With this , I am shaking the foundations of the British Empire)అని ఉద్వేగంగా అన్నారు. తర్వాత ఆయన హస్తాలతో సేకరించి, శుభ్రం చేసిన రెండు తులాల ఉప్పును వేలం వేశారు. అహ్మదాబాద్ లోని ఒక మిల్లు వోనర్ రణ్ చోడ్ షోధాన్ దానిని రు. 525 లకు కొన్నాడు.
మన దండియాత్ర ఇలా ఉంటుంది
దండిబీచ్ కు వెళ్లేందుకు చాలా టూర్ పాకేజీలు ఉన్నాయి. మేమయితే తీరుబడిగా ఈ యాత్రని ఎక్స్ప ప్లోర్ చేయాలనుకున్నాం. అందుకే మూడు రోజుల ప్యాకేజీ ఎంచుకున్నాం. ఇది మూడేళ్ల కిందటి జ్జాపకం. మా టూర్ రెండు రాత్రులు మూడు పగళ్ల ప్యాకేజీ . వివరాలకు మీరు గుజరాత్ టూరిజం వెబ్ సైట్ ని సందర్శించవచ్చు.
మొదటి రోజు
మాటూర్ ఆహ్మదాబాద్ సబర్మతి ఆశ్రమం నుంచి ఉదయం తొమ్మిదికి బయలు దేరి గాంధీజి నడిచిన బాటలో మనల్ని తీసుకెళ్తుంది. ఆశ్రమం, అస్లాలీ, నవగామ్, మాతర్, నడియాద్ (ఇక్కడి శాంతారామ్ మందిరంలో గాంధీజీ ఒక రాత్రి బస చేశారు), ఆనంద్, బోర్సాద్,కన్కపురా (రాత్రిబస)
రెండో రోజు
కన్కపురాలో బ్రేక్ ఫాస్ట్ చేసిబయలు దేరాం. కన్కపురా నుంచి కరేలీ దాకా బోట్ రైడ్ ఉంది. మేం దాన్ని ఎంచుకోలేదు. కరేలీ నుంచి మంగ్రోల్ మీదుగా వంజ్ చేరుకున్నారు.రాత్రిబస అక్కడే.
మూడో రోజు
వంజ్ నుంచి దండికి చేరుకున్నాం. దండిబీచ్ చూశాం. దండి మ్యూజియం సందర్శించాము . మధ్యాహ్నం లంచ్ తర్వాత అహ్మదాబాద్ తిరుగు ప్రయాణం. దారి పొడవునా, ఆరోజుల్లో గాంధీ నాయకత్వంలో దండి యాత్ర ఎలా సాగిఉంటుందో ఉంతా వూహించుకుని భాగస్వాములయ్యాం.