దర్శకుడు, నటుడు, నిర్మాత, రైటర్ మహేష్ మంజ్రేకర్ కూతురు సయీ మంజ్రేకర్. `దబాంగ్3` చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆమె `గని` సినిమాతో తెలుగులోకి రంగ ప్రవేశం చేసింది. వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో అల్లు బాబీ, సిద్దు ముద్ద సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 8న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా హీరోయిన్ సయీ మంజ్రేకర్ మీడియా ప్రతినిధులతో ప్రత్యేకంగా ముచ్చటించారు.
టాలీవుడ్ అంటే ప్రత్యేక అభిమానం
టాలీవుడ్‌లో అల్లు అర్జున్, పవన్, రామ్‌చరణ్ అంటే ఇష్టమని చెప్పారు. తెలుగు సినిమాలు కూడా చూస్తానని, రామ్‌చరణ్ నటించిన `మగధీర` ఎంతో బాగా నచ్చిందని, అలాగే బన్నీ నటించిన `పుష్ప` సినిమాకి ఫిదా అయిపోయినట్టు పేర్కొన్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ ఫాలోయింగ్ చూసి ఆశ్చర్యపోయినట్టు తెలిపారు. ఆయన నటించిన `వకీల్‌సాబ్` చూశానని తెలిపారు. తెలుగు సినిమాలు హిందీ డబ్బింగ్‌లో చూస్తానని పేర్కోన్నారు. టాలీవుడ్‌పై తనకు మంచి రెస్పెక్ట్ ఉందని చెప్పారు.
తెలుగు సినిమాలు చేస్తా అని ఊహించలేదు
`గని` ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అల్లు అర్జున్‌ని దగ్గరగా చూసి ఆనందానికి లోనయ్యానని, అదొక ఫ్యాన్ మూవ్‌మెంట్ అని, లోలోపల ఎగిరి గంతేసినట్టు తెలిపారు. ఆ అనుభూతిని ఎప్పటికీ మర్చిపోలేనని వెల్లడించారు. అంతేకాదు `దబాంగ్ 3` ప్రమోషన్ కోసం హైదరాబాద్‌కి వచ్చినప్పుడు రామ్‌చరణ్‌ని కలవడం గొప్ప ఫీలింగ్‌నిచ్చిందని తెలిపారు. ఆ సమయంలో నేను తెలుగు సినిమాలు చేస్తానని అస్సలు ఊహించ లేదని చెప్పారు. తాను అన్నిరకాల పాత్రలు చేయాలనుకుంటున్నట్టు చెప్పారు. తెలుగు, హిందీలోనే కాదు సౌత్‌లో అన్ని భాషల్లోనూ నటించాలని ఉందని, తనకు ఎలాంటి లిమిట్స్ లేవని చెప్పారు. అదే సమయంలో ఎలాంటి కెరీర్ ప్లానింగ్ కూడా లేదని, వచ్చిన ఆఫర్స్ లో మంచి ప్రాజెక్ట్ లు చేసుకుంటూ వెళ్తానని పేర్కొంది. గ్లామర్ షో విషయంలో తాను సిద్ధమే అని, పాత్ర డిమాండ్ మేరకు, కథ డిమాండ్ మేరకు చేస్తానని వెల్లడించారు. అలియాభట్ తనకు ఫేవరేట్ యాక్ట్రెస్ అని, ఆమె నుంచి ఇన్‌స్పైర్ అవుతానని తెలిపారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందని, వరుణ్ ఓ మంచి కోస్టార్ అని అన్నారు. `గని` సినిమాపై హోప్స్ తో ఉన్నానని, ప్రస్తుతం `మేజర్` సినిమాలో నటిస్తున్నానని పేర్కొన్నారు సయీ మంజ్రేకర్.