ఓటు బ్యాంకు ఎత్తుగడలతో వికేంద్రీకరణ జపం చేస్తే సరిపోదు. 73, 74 రాజ్యాంగ సవరణలను అమలు చేసి, చిత్తశుద్ధి ప్రదర్శించాలి. ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టతకు పరిపాలనా వ్యవస్థ – అధికార వ్యవస్థ వికేంద్రీకరణ, విధులు – నిధుల పంపిణీ రాజ్యాంగబద్ధంగా జరగాలి.
(టి లక్ష్మినారాయణ)
కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాలలాగే స్థానిక సంస్థలైన గ్రామ పంచాయతీలు – మండలాలు – జిల్లా పరిషత్తుల వ్యవస్థను స్థానిక ప్రభుత్వాలుగా గుర్తించి 1993లో భారత రాజ్యాంగానికి 73, 74 సవరణల ద్వారా అధికారాలను – విధులను – నిధులను బదలాయించాలని ఆదేశించడం జరిగింది. దశాబ్దాలు గడిచినా రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయలేదు. వికేంద్రీకరణ గురించి పదేపదే మాట్లాడుతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముందు రాజ్యాంగ సవరణలు 73, 74 లను చిత్తశుద్ధితో అమలు చేయాలి.
కేంద్రంలో ప్రధాన మంత్రి, రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేతుల్లో అధికారం కేంద్రీకరించబడి, పెత్తందారీ పోకడలతో, అప్రజాస్వామిక పరిపాలన సాగించినంత కాలం పాలనా వికేంద్రీకరణ ఎండమావే. ఆంధ్రప్రదేశ్ లో నెలకొల్పబడిన సచివాలయ వ్యవస్థను ప్రజల చేత ఎన్నుకోబడిన స్థానిక ప్రభుత్వాలకు సమాంతర వ్యవస్థగా పనిచేయిస్తే అది రాజ్యాంగ సవరణలు 73, 74కు వ్యతిరేకం.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలోనే పెద్ద జిల్లాలను విభజించి, కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలన్న పలు డిమాండ్లు ప్రజల నుండి ఉండేవి. రాష్ట్ర విభజన తర్వాత జిల్లాల పునర్విభజన అనివార్యంగా చేపట్టాల్సిన చర్య. ఆ పని గత ప్రభుత్వం చేయలేదు. ఈ ప్రభుత్వం చేసింది. స్థూలంగా మంచి పనే. కానీ, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం -2014 ప్రకారం శాసన సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను ముందు పూర్తి చేసిన మీదట శాసన సభ నియోజకవర్గాన్ని ప్రామాణికంగా తీసుకొని జిల్లాల పునర్విభజన చేసి ఉంటే హేతుబద్ధంగా ఉండేది. అందులో ఎలాంటి సందేహమూ లేదు.
మన పరిపాలనా వ్యవస్థ స్వరూపం: గ్రామ పంచాయితీ/పురపాలక సంఘం/నగర పాలక సంస్థ, మండలం, జిల్లా, రాష్ట్రం, దేశం. పాలనా వ్యవస్థలు దేనికది ఒకే కేంద్రం నుండి సాగిస్తున్నాయి, సాగించాలి. జగన్మోహన్ రెడ్డి వికేంద్రీకరణ ముసుగులో విచ్ఛిన్నకర, వినాశకరమైన ఆలోచన చేస్తూ, రాష్ట్ర రాజధానిని మూడు ముక్కలు చేయాలని పరితపిస్తూ, రాష్ట్ర భవిష్యత్తును ప్రశ్నార్థకం చేశారు.
జిల్లాల పునర్విభజన వేరు. రాష్ట్ర రాజధానిని మూడు ముక్కలు చేయాలన్న దుష్ట ఆలోచన వేరు. రెండూ ఒకటి కాదు. పాలనా వికేంద్రీకరణ – అభివృద్ధి వికేంద్రీకరణలో రెండూ భాగమేనంటూ, అదే మా విధానమని జగన్మోహన్ రెడ్డి పునరుద్ఘాటించడం అత్యంత గర్హనీయం, వినాశనకర విధానం. ఈ దుష్ట ఆలోచనకు తక్షణం స్వస్తి చెప్పాలి.
(టి.లక్ష్మీనారాయణ, సామాజిక ఉద్యమకారుడు)