“ఈ భారం భరించండి. మళ్ళీ పెంచం. కరెంటు చార్జీలు పెరిగేందుకు కారణం గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే.”
తాడేపల్లి వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం ప్రెస్‌మీట్ లో ప్రభుత్వ సలహాదారు (ప్రభుత్వ వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి
“గత ప్రభుత్వం వదిలిపెట్టిన అప్పుల భారం
ఈ మూడేళ్లలో గణనీయంగా పెరిగిన వ్యయం
అందువల్లే అనివార్యంగా కొంత ఛార్జీల పెంచాము.
అదీ విద్యుత్ ఎక్కువ వినియోగించేవారిపైనే.
ఈ క్లిష్ట పరిస్థితుల్లో పెద్దగా భారం వేయడం లేదు
భవిష్యత్తులో మళ్లీ భారం పడకుండా చూస్తున్నాం
వీలైతే తగ్గించేలా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది,” సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకా ఏమన్నారంటే..:
విద్యుత్ ఛార్జీలు కొన్ని తరగతులకు స్వల్పంగా పెంచుతూ, దాదాపు రూ.1400 కోట్ల భారం. నిన్న ఈఆర్‌సీ అనుమతి ఇచ్చిన మేరకు పెంచడం జరిగింది. అయితే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఛార్జీలు పెంచలేదు. గత ప్రభుత్వం వదిలిపెట్టిన బకాయిలు చెల్లిస్తున్నాం. కానీ ఇప్పుడు పెరిగిన వ్యయం వల్ల అనివార్యంగా స్వల్పంగా ఛార్జీలు పెంచాల్సి వస్తోంది. అది కూడా ఎక్కువ విద్యుత్ వినియోగించే వారిపైనే భారం వేసే విధంగా టారిఫ్ నిర్ణయించడం జరిగింది.
సీఎం వైయస్ జగన్ నిత్యం ప్రజల కోసం ఆలోచిస్తారు. వారి మేలు కోసమే పని చేస్తారు.
నిజం చెప్పాలంటే ఆనాడు టీడీపీ హయాంలో ఇష్టారాజ్యంగా పీపీఏలు చేసుకున్నారు. ఒకవైపు అప్పులు, మరోవైపు బకాయిలూ పెంచి, అడ్డగోలుగా విద్యుత్ సంస్థలను నడిపారు. అలాగే ఛార్జీలు కూడా పెంచారు. కానీ ఇప్పుడు టీడీపీ ఆందోళన చేస్తూ, ఉద్యమానికి సిద్ధమవుతోంది. మరోవైపు వామపక్షాలు, బీజేపీ కూడా దానికి మద్దతు పలుకుతున్నాయి.
ఇవాళ చంద్రబాబు మాట్లాడుతూ, ఈ మూడేళ్లలో ప్రజలపై రూ.42,172 కోట్ల విద్యుత్ భారం మోపామని అన్నారు. దానికి ఏదైనా ఆధారం ఉందా? ఈ ప్రభుత్వం ఎక్కడ అంత భారం మోపింది. నిజానికి ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచలేదు. ఇవాళే తొలిసారిగా ఛార్జీలు పెంచడం జరిగింది.
అది కూడా గత సంవత్సరం వాడిన విద్యుత్ ఆధారంగా కాకుండా, ఎప్పటికప్పుడు వాస్తవ వినియోగాన్ని బట్టి మాత్రమే ఛార్జీలు వసూలు చేయడం జరుగుతోంది. దీని వల్ల వినియోగదారులకు చాలా మేలు జరుగుతోంది.
డిస్కమ్‌లకు ఆర్థికంగా అండగా నిలుస్తూ, దీర్ఘకాల ప్రయోజనాలు కాపాడడం కోసం జగన్‌గారి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అందుకే అనివార్యంగా ఎక్కువ విద్యుత్ వినియోగించే వారిపై కొంత భారం మోపాల్సి వస్తోంది.
వ్యవసాయానికి సరఫరా చేస్తున్న విద్యుత్‌కు ఏటా దాదాపు రూ.10 వేల కోట్ల భారం పడుతోంది కాబట్టి, దాన్ని తగ్గించడంపైనా దృష్టి పెట్టారు. అంతేతప్ప, ఏకపక్షంగా ఛార్జీలు పెంచాలని యోచించలేదు. వ్యవసాయానికి దీర్ఘకాలం విద్యుత్ తక్కువ ఖర్చుకే సరఫరా చేసేలా సౌర విద్యుత్ ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టి పెట్టారు.
ఇవాళ్టికి కూడా 30 యూనిట్లు, 50 యూనిట్ల వరకు విద్యుత్ వినియోగదారులపై వేస్తున్న ఛార్జీ దేశంలోనే చాలా తక్కువ.
ఇప్పుడున్న క్లిష్ట పరిస్థితుల్లో కూడా పెద్దగా భారం వేయకుండా, భవిష్యత్తులో మళ్లీ భారం పడకుండా, వీలైతే తగ్గించేలా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.