(టి.లక్ష్మీనారాయణ)
దుర్భిణీతో వెతికినా ఆంధ్రప్రదేశ్ పాలనలో పారదర్శకత కనపడడం లేదు. జీ.ఓ.లన్నీ రహస్యమే. ఆర్.టి.ఐ. క్రింద దరఖాస్తులు చేస్తున్న వారికి వాస్తవాల ఆధారంగా సమాధానాలు ఇచ్చే పరిస్థితి లేదు.
శాసనసభ ఆమోదించే వార్షిక బడ్జెట్ కు ప్రభుత్వం చేసే ఖర్చులకు పొంతన ఉండడం లేదు. కడకు తెచ్చిన అప్పులు, రాష్ట్రంపై నేడున్న బుణ భారానికి సంబంధించి ప్రభుత్వం చెబుతున్న గణాంకాలపై ఏ మాత్రం విశ్వాసం లేదు.
రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన దాదాపు యాభై వేల కోట్ల రూపాయలకు బిల్లులే లేవన్న అత్యంత తీవ్రమైన ఆరోపణలను ప్రభుత్వం ఎదుర్కొంటున్నది. ఎందుకు లేవన్న ప్రశ్నకు, అవన్నీ “స్పెషల్ బిల్స్, బుక్ అడ్జెస్ట్ మెంట్స్, అకౌంటింగ్ కు – ఆడిటింగ్” కు తేడా తెలియకుండా విమర్శలు చేస్తున్నారని బుగ్గన బుకాయిస్తున్నారు. ఆర్థిక వ్యవహారాలలో నిష్ణాతుడైన అపర”మేథావి” బుగ్గనకు ఉన్న తెలివితేటలు విమర్శకులకు లేవని అంగికరిద్ధాం! “కాగ్”కు కూడా ఆ పరిజ్ఞానం లేదా?
సి.ఎఫ్.ఏం.ఎస్.(కాంప్రహెన్సివ్ పైనాన్సియల్ మేనేజ్మెంట్ సిస్టమ్) లోపభూయిష్టంగా పని చేయడమే సమస్యకు మూలమట! ఆ వ్యవస్థ సవ్యంగా పని చేయకుండా ప్రభుత్వమే నిర్వీర్యం చేసి, ఇప్పుడు ఆ సాంకేతిక వ్యవస్థపై నెపం నెట్టేస్తున్నట్లు అనుమానాలు రావడం సహజమే కదా! కడకు ప్రభుత్వ ఉద్యోగులు తమ నెలసరి వేతన స్లిప్పులను కూడా సి.ఎఫ్.ఏం.ఎస్. ద్వారా “డౌన్ లోడ్” చేసుకోలేని దుస్థితి నెలకొన్నదంటే ఆ వ్యవస్థ నేడు ఎలా పని చేస్తుందో! ఎవరికైనా బోధపడుతుంది.
ఆర్థిక వ్యవస్థలో క్రమశిక్షణ రాహిత్యం, అరాచకత్వం ప్రబలితే మొత్తం వ్యవస్థ కుప్పకూలుతుంది. ఆ ప్రమాదపుటంచున ఆంధ్రప్రదేశ్ ఉన్నదా! అన్న ఆందోళన మనసును తొలిచేస్తున్నది.
(టి.లక్ష్మీనారాయణ, సామాజిక ఉద్యమకారుడు)