RRR మీద కర్నాటకలో ఆగ్రహం!

ఏదో తెలుగు సినిమాలో కమేడియన్ రఘుబాబు ప్రతిదానికి ఏసేస్తానా కొడుకుని అంటుంటాడు. అంటే వాడిని నరికేస్తానని. నరికింది లేదు,చేసిందిలేదు. ఎపుడు నరకాలి,ఎందుకు నరకాలి అనే సోయి లేకుండా ఏసేస్తా అంటుంటాడు.

అట్లాగే  కర్నాటక సినిమా అభిమానులు అయినదానికి కాని దానికి కన్నడ  సెంటిమెంట్ తెస్తున్నారు. భారత దేశంలోని గొప్ప భాషల్లో కన్నడం ఒకటి. అది  నాలుగు ప్రధాన ద్రవిడ భాషల్లో ఒకటి. తెలుగుతో బాగా అనుబంధం ఉన్న భాష.  ఎంతమధురమయిన భాష కన్నడం. కర్నాటకలో భాషకు , సాహిత్యానికి, కవులకు చాలా ప్రాధన్యమిస్తారు. వాళ్లకు రాజ్యకవి కువెంపు ఫోటోలు ఆర్టీసి బస్టాండ్ లలో ప్రదర్శించడం  నేను చూశాను. కన్నడం సాహిత్యం పూర్వం, నేడు కూడా గొప్ప రచయితలను సృష్టించింది.  గొప్ప కళాకారులను సృష్టించింది. కన్నడ సినిమా  గొప్ప కళాఖండాలను తీసుకువచ్చింది. దేనికోసం నెట్ లో వెదుకుతూ ఉంటే ‘ది హిందూ’ లో  1971లో వీరమాచనేని మధుసూదన రావు (విఎంఆర్) తీసిని సూపర్ హిట్  చిత్రం ‘కల్యాణ మండపం’ గురించి రివ్యూ కనిపించింది. చదివాను. కథా పరంగా, సాంకేతికంగా, సంగీత పరంగా, కళాకారుల పరంగా ఇది గొప్ప చిత్రం అని ప్రఖ్యాత చిత్రసీమ పండితుడు ఎంఎల్ నరసింహం రాశారు.

నరసింహం సర్టిఫికేట్ ఆశామాషి కాదు. అంతకుముందు ‘మనుషలు మారాలి’ సూపర్ హిట్ తీసి ఉత్సాహంతో ఉన్న విఎంఆర్ మరొక కొత్త తరహా కథ కోసం చూస్తున్నపుడు ఒక దేవదాసి చుట్టూ తిరగే  కథ దొరికింది. ఆయన సినిమాగా తీసేశారు. ఇంతకీ ఈ గొప్పచిత్రానికి మూలం ఏందో తెలుసా? కన్నడ చిత్రం గెజ్జె పూజె. గెజ్జె అంటే గజ్జలు, పూజ అర్థం పూజం. గెజ్జె పూజె చిత్రాన్ని 1969లో పుట్టన్న కనగళ్ నిర్మించారు. అదే పేరుతో ఉన్న ఎంకె ఇందిర రాసిన నవలని ఆయన సెల్యూలాయిడ్ కు మలిచారు. ఈ నవలకూడా గొప్పగా పేరొచ్చిన నవల. కన్నడ చిత్రానికి జాతీయ, బెస్ట్ స్క్రీన్ ప్లే  అవార్డు వచ్చింది. ఇదే సినిమాని తర్వాత తమిళంలో తాళై సాలంగైయ, హిందీలో అహిస్తా అహిస్తా గా వచ్చింది.తెలుగు లో అది ‘కల్యాణ మండపం’ అయింది.తెలుగు వాళ్లు గర్వపడాల్సిన పొరుగు భాష కన్నడం.  ఇలాంటి కన్నడ భావోద్వేగాన్ని సినిమా టికెట్లకోసం, సినిమా రిలీజ్ కోసం ప్రదర్శించడం బాగుండదు. కాని అదే జరుగుతూఉంది.

రాజామౌళి తీసిన RRR చిత్రానికి కన్నడ వర్షన్ బుకింగ్ వోపెన్ కాలేదని  చిత్రాన్ని బాయ్ కాట్ చేయాలని పిలుపు ఇచ్చారు ట్విట్టర్ లో . అది ట్రెండ్ అవుతూ ఉంది కొందరు కన్నడ భాషకు అవమానం అంటున్నారు. ఇది తెలుగు భాష పెత్తనం అని మరి కొందరు విమర్శిస్తున్నారు. ట్రెయిలర్ మంచి రిస్పాన్స్ వచ్చినా కన్నడ డబ్బింగ్ బుకింగ్ వోపెన్ చేయకపోవడం విడ్డూరం అని కొందరు విమర్శిస్తున్నారు. హిందీ, తమిళం, తెలుగు చిత్రాలకు  బుకింగ్ 22న ఓపెన్అయింది.దాదాపు అన్ని ధియోటర్లలో అడ్వాన్స్ బుకింగ్ పూర్తయింది. ఇదే కన్నడ చిత్రాభిమానులకు నచ్చలేదు. కన్నడ గురించి ఎపుడూ గొప్పగా మాట్లాడతావు. కన్నడ మూలాలగురించి గొప్పగా చెప్పుకుంటావు. కన్నడ చిత్రం దగ్గిరకు వచ్చే సరికి వెనకడుగు వేస్తావ్. ఒక్క కన్నడ వర్షన్ కూడా లేదు. నువ్వు కన్నడను కించపరుస్తున్నావ్, నిర్లక్ష్యం చేస్తున్నావ్ అని వ్యక్తి ట్విట్టర్ లో బోరు మన్నాడు.

ఈ చిత్రం మార్చి 25 న రిలీజ్ అవుతూ ఉంది. సినిమా ప్రమోషన్ కోసం బెంగుళూరులో ఏర్పాటు చేసిన సభకు కర్నాటక ముఖ్యమంత్రి రావడం  ఇపుడు తప్పంటున్నారు. సమావేశంలో పాల్గొన్న కన్నడ స్టార్ శివ్ రాజ్ కుమార్ ఈ సభలో కన్నడ వర్షన్ కూడా విడుదలచేయండని కోరారు. అయినా సరే, రాజమౌళి పట్టించుకోలేదని ఇది కన్నడ ఆత్మాభిమానానికి దెబ్బఅని, కన్నడిగులను అవమాన పరిచారని ట్విట్టర్ లో కొందరు గగ్గోలు పెడుతున్నారు. హిందీ, తెలుగు, తమిళ వర్షన్ లకు అడ్వాన్స్ బుకింగ్ వోపెన్ చేసి కన్నడానికి చేయరా అని వాపోతున్నారు. ఈ ఆగ్రహంతో #LetsBoycottRRR అని పిలుపునిచ్చారు. ఇది ట్విట్టర్ లో ట్రెండ్ అవుతూ ఉంది.

 

ఇదెక్కడి గోడు. ట్విట్టర్ ఒక్కొక్కరు ఎలా కన్నడాగ్రహం వెలిబుచ్చుతున్నారో చూడండి.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *