వార్ లో పటపట రాలుతున్న రష్యా సైనికులు…

షాకింగ్ న్యూస్. మృతుల సంఖ్యని వెల్లడించి మరుసటి రోజునే డెలీట్ చేసిన పుతిన్ అనుకూల వార్తా పత్రిక వెబ్ సైట్.

నెలరోజులుగా కొనసాగుతున్న రష్యా- యుక్రెయిన్ యుద్ధంలో రష్యా సైనికులు ఎంత చనిపోయారు. సాధారణంగా యుద్దమరణాలను ఏదేశమూ బయటపెట్టదు.అయితే,రష్యా నుంచి ఈ సంఖ్య లీక్ అయింది. ప్రభుత్వ అనుకూల న్యూస్ పేపరొకటి వెబ్ సైట్ ఈ సంఖ్య వెల్లడించింది. అంతలోనే నాలుక్కరుచుకుని ఆ వార్తని డెలీట్ చేసేసింది.

ఆదివారం నాడు కామ్సోమోల్స్కాయా ప్రావ్దా (Komsomolskaya Pravda) లో ఆదివారం నాడు ఉన్నట్లుండి పోస్టుచేసిన ఒక వార్త ప్రకారం  యుక్రెయిన్ యుద్ధంలో  9,861 మంది రష్యా సైనికులు చనిపోయారు. మరొక 16,153 మంది గాయపడ్డారు. మాస్కో  ఇంతవరకు యుద్ధంలో చనిపోయిన వారు కేవలం 498 మంది మాత్రమే అని బుకాయిస్తూ వచ్చింది. సోమవారంనాడు ఆన్ లైన్ పత్రిక అర్కైవ్స్ లో కూడా కనిపించింది. అయితే, కొద్ది గంటల్లోనే Komsomolskaya Pravda దానిని కూడా డెలీట్ చేసిందని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ (South China Morning Post) రాసింది.

వార్త ఎలా పోస్టయింది, ఎందుకు డెలీట్ అయిందనే దాని మీద ప్రతిక నుంచి ఎలాంటి వివరణ లేదు. ఎందుకంటే,  ఈ పత్రిక రక్షణ శాఖ వర్గాలను ఉటంకిస్తూ ఈ వార్త రాసింది. అయితే,   ఆదివారం నాడు జరిగిన రక్షణ శాఖ మీడియా సమావేశంలో మృతుల సమాచారం అందించలేదు. ఈ మృతుల సంఖ్య ఎలా వచ్చిఉంటుంది.

వాల్ స్ట్రీట్ జర్నల్ చెందిన జర్నలిస్టు యరస్లావ్  ట్రోఫిమావ్ దీనికి రెండు కారణాలు చూపిస్తున్నారు. 1. ఎవరో న్యూస్ పేపర్ వెబ్ సైట్  kp.ru  ను హ్యాక్ చేసి ఈ మృతుల సంఖ్య వివరాలను పోస్టు చేసి ఉండాలి.  2. రక్షణ శాఖ నుంచి ఎవరో మృతుల సంఖ్యను లీక్ చేసి ఉండాలి.  దానిని పత్రిక ఆన్ లైన్ వర్షన్ లో పోస్టు చేసి ఉండాలి.

 


ఈ వార్త నిజమయితే, నెల రోజుల యుద్ధ కాలంలో దాదాపు పదివేల మంది సైనికులు మరణించారని అనుకోవాలి.  1980 దశకంలో ఆప్గనిస్తాన్ తో జరిగిన 9 సంవత్సరాల యుద్ధంలో  చనిపోయిన సోవియట్ సైనికులు 15,000 మంది అని ప్రకటించారు. ఈ లెక్కన నెలరోజుల్లో పదివేల మంది చనిపోయారంటే రష్యాకు గట్టి దెబ్బ తగిలినట్లే.

యుక్రెయిన్ ప్రభుత్వం  నుంచి వస్తున్న సమాచారం ప్రకారం రష్యాకు చెందిన అనేక మంది జనరల్స్, కమాండర్స్ కూడా యుద్ధంలో చనిపోయారు. ఇప్పటి వరకు ఒకే జనరల్ చనిపోయాడని రష్యా అధ్యక్షుడు వ్లదిమీర్ పుతిన్ అంగీకరిస్తే, నేటో వర్గాలు (NATO) మాత్రం ఎక్కువ మంది జనరల్స్ చనిపోయినట్లు చెబుతున్నాయి.

అమెరికా నిఘావర్గాలేమో యుక్రెయిన్ కు పంపించిన 15 వేల మందిలో  ఏడు వేల మంది రష్యన్ సైనికులు చనిపోయారని చెబుతూ యుక్రెయిన్ అధ్యక్షు వొలొదిమీర్ జెలెన్ స్కీ   రష్యాన్ మృతులు 14 వేల  మంది దాకా ఉంటారని ప్రకటించారు. ఈ  సంఖ్యను ధృవకరించుకునే మార్గం  లేదు.

మరి యుక్రెయిన్ సైనికులు ఎందరు చనిపోయారు?

ఈ విషయాన్ని యుక్రెయిన్ వెల్లడించడం లేదు. మార్చి 13 నాటి లెక్కల ప్రకారం  1300 మంది సైనికులు  చనిపోయినట్లు చెప్పారు. ప్రజలకు సంబంధించి 902 మంది చనిపోయారని యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ హ్యూమన్ రైట్స్ ఆదివారం నాడు ప్రకటించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *