రాయలసీమ మీద అంత పెద్దగా సాహిత్యం రావడం లేదనే చెప్పాలి. ఈ ప్రాంతాంలో చాలా మంది మేధావులు పరిశోధకులు ఉన్నా, ఏ రంగంలోనూ ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోకపోయినా దాని మీద అడపాదడపా చర్చలు జరగడం, చిన్న పాటి సమావేశాలు,రౌండు టేబళ్లు జరగుడే తప్ప లోతైన పరిశోధనతో వచ్చే పుస్తకాలు తక్కువే. కొంతవరకయినా ఈ కొరతనుతీర్చే పుస్తకం ఇపుడు వస్తున్నది. దాని పేరు ‘నిప్పు కణికలు సీమ కన్నీళ్లు’. రచయిత విశ్రాంత పత్రికా రచయిత వి.శంకరయ్య.
శంకరయ్య జర్నలిజం ఆదర్శ ప్రాయమయిన వృత్తిగా ఉన్న రోజుల్లో విశాలాంధ్ర పత్రికలో పనిచేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు రాయలసీమ ప్రాంతీయ వేదనని పరిశీలిస్తూ వస్తున్నారు. ఉద్యమాలలో పాల్గొన్నారు. సమస్యలను కూలంకషంగా చర్చించారు. అనేక విశ్లేషాణాత్మక వ్యాసాలు రాశారు.
ఆయన పాతతరం జర్నలిస్టు. ఆవేశానికి లోనుకాకుండా,నిమ్మళంగా సమస్యను అందరికి అర్థమయ్యేలాచెప్పడం శంకరయ్య గొప్పతనం. వూరికే గొంతుచించుకుని, చొక్కాలు చించుకుని, నలుగురి కంట పడాలని తాపత్రయపడే మనిషి కాదు. నికార్సయిన మేధావి. ఎవరు విన్నా వినకపోయినా తన వాదన బలంగా వినిపిస్తాడు. రాయలసీమ పట్ల చాలా అంకితభావమున్నవాడు. అలసట ఎరుగని కలం ఆయనది. గత అయిదు దశాబ్దాలలో చాలా రాయలసీమ గొంతులు వచ్చాయి. మూగబోయాయి. కొంత మంది ఎడ్రసు లేకుండా పోయారు. అలాకాకుండా నిలకడగా రాయలసీమ వాణి వినిపిస్తున్నవారెవరయినా ఉంట వాళ్లలో మొదట చెప్పుకోవలసిన పేరు ఆయనది. ఆయనకు ఎవరి ప్రశంసలు, లైకులు, షేర్లు అవసరం లేదు. నిర్మొహమటాంగా, నిర్ధాక్షిణ్యంగా సూటిగా చెప్పడం ఆయన అలవాటు. వింటే వినండి, పోతే పోండి. ఇలా ఆయన చెప్పాలనుకున్నది చెప్పితీరిన వ్యాసాల సమాహారమే ఈ పుస్తకం. ఈ వ్యాసాలను కొన్ని వ్యాసానాలను కొంత మంది చదివి ఉండవచ్చు. ఇవన్నీ రకరకాల ప్రతికల్లో వెబ్ సైట్ లో వచ్చయి కాబట్టి అన్నింటిని అంతా చదివే అవకాశం వచ్చిఉండదు. అందువల్ల ఈ పుస్తకం మంచి ప్రయత్నం. ఎందుకంటే, ఎక్కడ అచ్చయినా వెదికి చదవాల్సిన వ్యాసాలు శంకరయ్యవి.
నీటిపారుదల రంగం మీద ఆయనకు పట్టు చాలా ఎక్కువ. ఊరికే ఊకదంపుడు కాకుండా, తన వాదనకు అంకెల సాక్ష్యం చూపిస్తారు. చారిత్ర నేపథ్యం వివరిస్తారు. ప్రభుత్వాలు మారినపుడు గొంతుమార్చడం ఆయనకు చేత కాదు. ఆయన ఆగ్రహం గమ్యం చేరే దాకా అరనిది. అందుకే ఈ ఆయన వ్యాసాల సంకలనానికి ‘నిప్పు కణికలు సీమ కన్నీళ్లు’ అని పెట్టడం సబబుగా ఉంది.
ఈ పుస్తకంలో 35 ఆర్టికల్ లు వున్నాయి. ఆంధ్ర జ్యోతి, విశాలాంధ్ర, ప్రజాశక్తి, వార్త దినపత్రికతో పాటు ట్రెండింగ్ తెలుగు న్యూస్ వెబ్ సైట్ లలో రాయలసీమకు, అక్కడి ప్రాజెక్టులకు జరుగుతున్న అన్యాయం మీద రాసిన సమాచార సాంద్రత ఉన్న వ్యాసాలు,లోతైన విశ్లేషణలు. అంతర్ రాష్ట్ర జల వివాదాలతో రాష్ట్రంతో పాటు మెట్ట ప్రాంతాలైన రాయలసీమ ప్రాజెక్టులకు ఎదురౌతున్న ఇక్కట్లుకు చెందిన బలమయిన వాదనలు ఇందులో ఆయన వినిపించారు.
మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే పుస్తకానికి భూమన్ పరిచయం రాశారు.
పుస్తకాన్ని ఉగాది రోజున కాళహస్తిలో ధూర్జటి రసజ్ఞ సమాఖ్య సాహితీ కళావేదిక ఆధ్వర్యంలో ఆవిష్కరిస్తున్నారు. సభకు రాయలసీమ రైతాంగ సమస్యల మీద అలుపెరగకుండా పోరాడుతున్న బొజ్జా దశరథ రామిరెడ్డి అధ్యక్షత వహిస్తున్నారు. కాళహస్తి శాసన సభ్యుడు బియ్యపు మధుసూదన రెడ్డి, సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ నారాయణ, మాజీ ఎమ్మెల్యే ఎస్ సి వి నాయుడు, జర్నలిస్టు మునిసురేష్ పిళ్లే తదితరులు పాల్గొంటారు.
పుస్తకం 132 పేజీలతో ధర 130. రూపాయలు. మార్చి నెలాఖరు కల్లా పుస్తకం బయటికి వస్తుంది. నవోదయ బుక్ హౌస్ హైదరాబాద్ వారి వద్ద లభ్యమౌతాయి.