మద్యం రాబడి తాకట్టు పెట్టినపుడు నిషేధం సాధ్యమా?

OPINION

మద్యం ఆదాయాన్ని 20 ఏళ్ళ పాటు తనఖా పెట్టి ఏకంగా అప్పులు తెచ్చుకొన్నపుడు నిషేధం సాధ్యమా. మద్యం ఉండాలి అప్పులు రావాలి. అందువల్ల జగన్ మద్యపాన నిషేధం ఒక జోక్…

 

(టి. లక్ష్మీనారాయణ)

ఎన్నికల ప్రణాళికలో మద్యపాన నిషేధం అన్నారు. తర్వాత దశల వారి నిషేధం అన్నారు. మద్యం దుకాణాలను ప్రభుత్వమే నిర్వహించడం ద్వారా బెల్టు షాపులను రద్దు చేసి, మద్యం వ్యాపారాన్ని నియంత్రిస్తామన్నారు. మద్యం నియంత్రణ, దశల వారి నిషేధంపై ఒక అడుగన్నా ముందుకు పడుతుందని ప్రజలు ఆశ పడ్డారు.

 

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన మాటను బహిరంగంగా వెనక్కి తీసుకోకుండానే, ఆచరణలో మద్యపాన నిషేధంపై “రివర్స్ గేర్” వేసింది. సొంత “బ్రాండ్స్”ను మార్కెట్ లోకి తెచ్చింది. మద్యం ధరలను పెంచింది. “ఏం రా పడ్డావ్! అంటే అదొక లగువులే!” అన్నట్లు మద్యం వినియోగాన్ని తగ్గించండం కోసమే ధరలను పెంచామన్నారు. అటుపై మద్యం ఆదాయాన్ని 20 ఏళ్ళ పాటు తనఖా పెట్టి ఏకంగా అప్పులు తెచ్చుకొన్నది. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఈ పని చేయలేదు. దేశంలోనే ఇదొక వింత. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రు.16,500 కోట్లు ఆదాయాన్ని మద్యం ద్వారా ఆర్జించడానికి లక్ష్యాన్ని నిర్దేశించుకొన్నది.

 

రాష్ట్ర ప్రభుత్వం, అధికార పార్టీ నేతలు మద్యం వ్యాపారాన్ని లాభసాటి వ్యాపారంగా అందిపుచ్చుకొన్నారు. మద్యం మాఫియా పెట్రేగి పోతున్నది. ప్రభుత్వం అమ్మే “ఛీప్ లిక్కర్” కంటే ఎక్కువ “కిక్కిచ్చే” దొంగ సారాను ఉత్పత్తి చేసి, విచ్చలవిడిగా అమ్ముతూ, అక్రమార్జనకు పాల్పడుతున్నారు. ఎక్సైజ్, రెవెన్యూ, రవాణా శాఖాధికారులు, పోలీసులు, అధికార పార్టీ నాయకులు కుమ్మకైతే తప్ప ఈ అక్రమ సారాయి వ్యాపారం చేయడం అసాధ్యం. పైపెచ్చు ఈ ప్రభుత్వం నెలకొల్పిన వాలంటిర్స్ వ్యవస్థ కూడా ఉన్నది. ఇన్ని వ్యవస్థల కన్నుగప్పి మద్యం మాఫియా తన వ్యాపారాన్ని విచ్చలవిడిగా కొనసాగిస్తుంటే ప్రభుత్వ పెద్దలు ఏం చేస్తున్నట్టు!

 

పశ్చిమ గోదావరి జిల్లా, జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా సేవించి, 26 మందికిపైగా మరణిస్తే, అవి సహజ మరణాలేనని రాష్ట్ర ముఖ్యమంత్రే స్వయంగా వక్రీకరించడం అత్యంత గర్హనీయం, హేయమైన చర్య. అవి సహజ మరణాలేనని బాధిత కుటుంబాలకు చెందిన మహిళలపై అధికార యంత్రాంగం వత్తిడి చేసి, తెల్లకాగితాలపై సంతకాలు చేయించుకొన్నట్లు ప్రసారమాధ్యమాల్లో వార్తలొచ్చాయి. ఇది అత్యంత జుగుప్సాకరమైన దిగజారుడు చర్య. ఇంత జరిగాక ఈ ప్రభుత్వానికి అసలు అధికారంలో కొనసాగే నైతిక హక్కు ఉన్నదా?

 

ప్రాణాలను బలిగొంటున్నా, మద్యం వ్యసనపరుల ఆరోగ్యం పాడవుతున్నా, కుటుంబాలు రోడ్డున పడుతున్నా, పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకమతున్నా, సమాజంపై వివిధ రూపాలలో దుష్ఫలితాలు పడుతున్నా, మద్యంపై వచ్చే ఆదాయమే ప్రభుత్వానికి, పాలక వర్గాలకు ముఖ్యమని బహిర్గతమవుతున్నది. సమాజహితాన్ని కోరుకొనే ప్రజలారా! ఆలోచించండి.

 

T Lakshminarayana
T Lakshminarayana

(టి.లక్ష్మీనారాయణ, సామాజిక ఉద్యమకారుడు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *