ముస్లిమ్ స్త్రీల భుజాల పై తుపాకీ పెట్టి హిందూ జనావళిపై గుళ్లుపేల్చేదే హిజాబ్ రాజకీయం!
ఇఫ్టూ ప్రసాద్ (పిపి)
ప్రజల కళ్ళకి తూర్పు దిక్కు చూపిస్తూ, వారి కాళ్లని పడమర వైపు నడిపించే వంకర నడకలు చరిత్రలో ఏన్నో! నరకాన్నే “స్వర్గం” గా చూపి, నరక దారిన నడిపే కుట్రలెన్నో! అదే హిజాబ్ రాజకీయం.
విద్యా రంగంపై మోడీ సర్కార్ ముప్పేట దాడికి దిగింది. అదే 1-కేంద్రీకృత 2-కార్పొరేటీకరణ 3-కాషాయూకరణ అనే పద్ధతుల్లో త్రిముఖదాడి! దానినుండి ప్రజల దృష్టిని దారి మళ్లించేదే హిజాబ్ వివాదం. దానిపై వచ్చిందే కర్ణాటక హైకోర్టు తీర్పు!
తొలి ప్రక్రియకి వద్దాం. ఏకత్వంలో భిన్నత్వం, భిన్నత్వంలో ఏకత్వం పునాది పై రాజ్యాంగం ఏర్పడింది. ఆ ప్రకారమే విద్యపై కేంద్ర, రాష్ట్రాలకి అధికారం ఉంది. రాష్ట్రాల అధికారాన్ని నియంత్రించే పనిలో కేంద్రం ఉంది. కొత్త జాతీయ విద్యా చట్టమదే. అదే centrelisation of education system!
రెండో ప్రక్రియకి వద్దాం. ప్రభుత్వ విద్యకి ప్రైవేటు విద్య సమాంతరంగా ఎప్పటి నుంచో ఉన్నదే. అదే వ్యాపారీకరణ! అది కార్పొరేటీకరణ దశలోకి మారుతోంది. విద్యారంగం ప్రైవేటీకరణ దశ నుండి కార్పొరేటీకరణ దశలోకి నేడు మారుతోంది. అదే Corporatisation of education system!
మూడో ప్రక్రియకి వద్దాం. దేవుడి బిడ్డల పేర తమది దైవాoశ సంభూత పాలన అని ప్రభువర్గం చెప్పుకునే రాచరిక కాలం పోయింది. అంటు వ్యాధులు, కరవు, ఆకలితో లక్షలాది మంది మరణించినా ప్రజల ప్రాణ సంరక్షణ బాధ్యత నాటి సర్కార్లకి లేదు. బ్రతుకైనా చావైనా దేవుని పై భారం మోపడమే ప్రజలకి నాడు శరణ్యం. దాని స్థానంలో ఆధునిక పాలన వచ్చింది.
సుదీర్ఘ బ్రిటీష్ వ్యతిరేక స్వాతంత్ర్య పోరాటం దేశ ప్రజలకు కొత్త చైతన్యాన్ని ఇచ్చింది. ఓ రాజ్యాంగాన్ని ఇచ్చింది. అది పాలకులు ప్రజలకు జవాబుదారీని చేసింది. ప్రజల బాధలకి దేవుడు కారణం కాదనే కాలమిది. ప్రజలకి తమ పాలకుల్ని ప్రశ్నించేహక్కు ఉందనేది నేటి యుగనీతి. దేవుడిపై భారంవేసి బ్రతికే స్థితి పోయి అదో వ్యక్తిగత నమ్మకంగా మారింది.
విద్య, వైద్యం, ఆరోగ్యం, సంక్షేమ, ప్రభుత్వ రంగాల నిర్వాహణ రాజ్యాంగం ప్రకారం సర్కార్ బాధ్యత. అవి నేడు బడా కార్పొరేట్ల విశృంఖల లూటీకి అడ్డంకి గా మారాయి. వాటి రద్దు వాటి కొత్త కర్తవ్యమైనది. రాజ్యాంగం రద్దు వాటికి తప్పదు. ప్రజల దృష్టిని మళ్లించకుండా వాటికది సాధ్యం కాదు. దానికి ఒక సాధనమే హిజాబ్!
కార్పొరేట్ విద్య పూర్తిగా వర్ధిల్లాలంటే విద్యా రంగ బాధ్యత అధికారికంగా రద్దు కావాలి. ప్రభుత్వ రంగ పరిశ్రమలు, వైద్యం, ఆరోగ్యం వంటివి రద్దుతో పాటు ఇదీ జరగాలి. అవి రాజ్యాంగం రద్దు కాకుండా సాధ్యం కాదు. వాటి రద్దు ద్వారానే పాలకవర్గాలు ప్రజలకి బాధ్యత వహించే పాత దశ ముగుస్తుంది. కార్పొరేట్ వ్యవస్థ పక్షాన అణచివేతకి ప్రాతినిధ్య శాఖగా సర్కార్ మారేస్థితి వస్తుంది. ఐతే రేపు ప్రజల కష్టాలకి బాధ్యులెవరు?
ప్రజల బ్రతుక్కి దేవుణ్ణి కర్తనిచేసే కర్మ సిద్ధాంతమే కొత్త రాజ్యాంగం కావాలి. మతం, దేవుడు వ్యక్తిగత విశ్వాసం కాక, ప్రజలకు ఏకైక ఆధారంగా మారాలి. అందుకే మతతత్వం పెరగాలి. అల్లా, ఏసు భక్తులపట్ల రామ భక్తుల్లో ద్వేషం పెంచాలి. రామ భక్తుల పట్ల అల్లా, క్రీస్తు భక్తుల్లో ద్వేషం పెంచాలి. “మా దేవుడే గొప్ప” “మా మతమే గొప్ప” అంటూ విద్వేషాల్ని పెంచి మత యుద్దాలు చేయించాలి. ఆ రక్తప్రవాహాలే కార్పొరేట్ల కి లాభించేది. అందుకే Communalisation of education system!
క్రింది మూడు ప్రక్రియల్ని విద్యా రంగంలో మోడీ సర్కార్ చేపట్టిన కొత్త దశ.
1-Centrelisation.
2-Corporatisation.
3-Comunalisation.
ఇది విద్యని మూడు “C” ప్రక్రియలకు గురిచేసే దశ.
పై మూడు “C” లకి మరో “C” తోడవుతోంది. అదే Criminalisation of education system. ఔను, హిజాబ్ ధరించిన ఓ బాలికపై జై శ్రీరామ్ నినాదాలతో వెంటాడిన పిల్లలు స్వతహా నేరస్తులు కారు. విద్యా సంస్తే నేర ప్రవృత్తికి గురి చేస్తున్నది.
మోడీ సర్కార్ ఫాసిస్టు ఎజెండాకి రేపు బలయ్యే బాధితుల్లో 80 శాతం పైన హిందువులే! హిజాబ్ కొద్దిశాతం ముస్లిం స్త్రీల వ్యక్తిగత మతవిశ్వాసమే. వారికంటే హిందు విద్యార్థి లోకం పొందే భావి నష్టం నూరు రేట్లు ఎక్కువ.
సోషల్ మీడియాలో లౌకిక, ప్రజాతంత్ర శక్తుల పై నేడు ఆర్.ఎస్.ఎస్. దుష్ప్రచారం తెల్సిందే. నిజానికి దేవుడు, మతం వంటి వ్యక్తిగత విశ్వాసాల కోవకి లౌకిక, ప్రజాతంత్ర వాదాలు రావు. ప్రజల భౌతిక అవసరాల్ని తీర్చే విధానమది. విద్య, వైద్య, ఆరోగ్య, ప్రజా పంపిణీ, ప్రభుత్వ రంగ సంస్థలు, సంక్షేమం రూపాల్లో అవి ప్రజలకి మేలు చేస్థాయి. ప్రజల భౌతిక అవసరాల్ని తీర్చే ప్రభుత్వ బాధ్యతని లేకుండా చేసి, ఆధ్యాత్మిక దేవుణ్ణి ప్రజలకు దిక్కుగా మార్చే కొత్త ప్రక్రియ యిది. పాతబావిలో చప్పటినీరు త్రాగే అవకాశాన్ని రద్దు చేసి, ఎండమావిలో నీటికై కడవ పట్టించడమే యిది.
ఇది ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మిక వర్గాల ఉద్యోగ భద్రత, హక్కుల రక్షణ, పింఛన్లు, గ్రాట్యుటీ సౌకర్యాలకీ; వికలాంగ, వితంతు, వృద్దాప్య పింఛన్లు సహా సబ్సిడీ, సంక్షేమ పథకాల భద్రతకీ స్వస్తిపలికే పరివర్తన దశ! అందుకై విద్యార్థుల్ని బ్రెయిన్ వాష్ చెసే దశ! ఆ జాతీయ విధ్యా బోధనని సుసాధ్యం చేసే క్రమంలో హిజాబ్ ఫాసిస్టు శక్తులకి ఓ వరం. హిందువులకి ఓర్పుతో వివరించాలి.
పై సంక్షేమ, సంరక్షణలు సర్కార్ నుండి అక్కర్లేదనే భావజాలంతో నూతన తరాన్ని సృష్టించాలి. అది కార్పొరేట్ వ్యవస్థ లక్ష్యం. దానికే మోడీ ప్రభుత్వం కొత్తగా తెచ్చిన జాతీయ విద్యావిధాన చట్టం. దాని వెర్రిపోకడే తాజా హిజాబ్!
ఈ దేశంలో మెజారిటీ ప్రజలు మత విశ్వాసాల రీత్యా హిందువులే! అట్టి హిందువుల్ని అత్యధిక స్థాయిలో కొల్లగొట్టకుండా ఫాసిజానికి మనుగడే లేదు. వారి ఎజెండాకు తక్షణ భౌతిక గురి కొద్ది శాతం ముస్లిం స్త్రీలే! దీర్ఘకాలిక వ్యవస్థీకృత దాడికి టార్గెట్ మెజార్టీ హిందువులే! ఈ స్పష్టత లౌకిక శక్తులకి ఉండాలి.
హిందువులకి జరిగే భావి నష్టాల్ని సరళ భాషలో వివరించి ఒప్పించే విధి లౌకిక శక్తులది. భాషని సరళీకరించి హిందువుల మనసుల్ని ఒప్పించే ప్రచార పద్ధతిని చేపట్టాలి. ఇది లౌకిక, ప్రజాతంత్ర, ప్రగతిశీల శక్తుల బాధ్యత.
ప్రజల్లో అత్యధిక శాతం మంది హిందువులే! వారి మనసుల్ని నొప్పించే భాష దొర్లితే ఫాసిస్టు శక్తులు లౌకికశక్తులపై తీవ్ర నిందా ప్రచారానికి దిగుతాయి. కార్పొరేట్ మీడియా సహా సోషల్ మీడియా ప్రచార సామర్ధ్యం తెల్సిందే.
హిందుత్వ శక్తుల నుంచి హిందువుల్ని వేరు చేసే లక్ష్యం ప్రజాతంత్ర, లౌకిక, ప్రగతిశీల శక్తులకి విధిగా ఉండాలి. ఆ మెలకువని పాటిస్తాయని ఆశిద్దాం.
(ఇందులో వ్యక్త పరచినవన్నీ రచయిత వ్యక్తిగత అభిప్రాయాలే)