పశ్చిమ బెంగాల్ కు చెందిన తెలుగు ఐపిఎస్ అధికారి రఘువంశితో సీనియర్ ఐఎఎస్ అధికారి డాక్టర్ ఎం.వి రావు చేసిన ఆసక్తికరమయిన ఇంటర్వ్యూ
పోలీసుల గురించి ప్రజలకున్న అభిప్రాయాలన్నీ కూడా మీడియా సృష్టియే. మీడియా మన భావాలకు ఆకారం ఇస్తుంది. మీడియా లెక్క ప్రకారం పోలీసులంటే రెండే రకాలు. ఒకటి సూపర్ స్టార్. రెండోది క్రూరమయిన విలన్. మధ్యలో మరొక అవతారానికి వీలులేకుండా చేసింది మీడియా. మీడియా అంటే సినిమా దగ్గిర నుంచి ఇప్పటి సోషల్ మీడియా దాకా.
ఇలాంటి సూపర్ స్టార్ ఇమేజ్ తోనే చాలా మంది పోలీసు ఉద్యోగం కోరుకుంటుంటారు. అలా ఐపిఎస్ వెళ్లిన వాడే తెలంగాణ సంగారెడ్డికి చెందిన రఘవంశి. రఘువంశి సంగారెడ్డి పట్టణంలోనే టెన్త్ దాకా చదివారు. ఇంటర్ హైదరాబాద్ నలందా లో చదివారు. తర్వాత ఆయన ఖరగ్ పూర్ ఐఐటిలో సివిల్స్ బిటెక్ పూర్తి చేశారు. మూడేళ్లు ఉద్యోగం చేశాక సివిల్స్ పాస్ అయ్యారు. 2013 ఐపిఎస్ బ్యాచ్ కు ఎంపికయ్యారు. పశ్చిమబెంగాల్ క్యాడర్ కు కేటాయించారు. ఇపుడాయన అలీపూర్ దువార్ (Alipurduar) ఎస్ పిగా ఉంటున్నారు.
ఐపిఎస్ లో చేరి, ఉద్యోగ బాధ్యతలు స్వీకరించాక పోలీసు అధికారి చుట్టూ మీడియా సృష్టించిన భ్రమలేమిటో ఆయనకు తెలిసివచ్చింది. పోలీసు అధికారి కూడా మానవమాత్రుడే. వారికి కుటుంబం ఉంటుంది. అపుడపుడు ఇంటి పనులు చేయాలి, కూరలు తేవాలి. అవసరమయితే వంటా చేయాలి.పిల్లలను స్కూళ్లకి పంపాలి. ఆపైన ఉద్యోగం. ఉద్యోగంలో కింది స్థాయి వారిని ఎపుడూ మోటివేట్ చేస్తుండాలి, పొలైట్ గా ఉండాలి, ఇవన్నీ కూడా సవాళ్లే. వీటితో ముందుకు పోతూ ఉండాలి.దీన్నంతా దాచి కేవలం గ్లామరస్ పోలీసు ఉద్యోగాన్ని ఆకాశానికెత్తడమో లేదా హీనస్థాయికి తోసేడమో జరుగుతూ ఉందని ఆయన గమనించారు. అందుకే పోలీసు ఉద్యోగాన్ని ఆయన చాలా చక్కగా డిఫైన్ చేశారు, ఈ ఇంటర్వ్యూలో. ఇన్ని సవాళ్లున్నా భారతదేశంలో పోలీసు వ్యవస్థ వండర్ ఫుల్ గా పనిచేస్తున్నదని రఘువంశి అన్నారు.
“పోలీసుని సూపర్ స్టార్ గా చూస్తుంటారు కాబట్టి ప్రజలు పోలీసుల నుంచి మంత్ర శక్తులు ఆశిస్తారు. పోలీసుల దగ్గిరకు వస్తే అన్నీ వెంటనే టఫీ మని పరిష్కారం కావాలనుకుంటారు. అందుకే పోలీసు కు చాలా సవాళ్లు ఎదురువుతుంటాయి. ప్రజలు ఆశించే దానికంటే ఎక్కువ సవాళ్లుఎదుర్కోవాలి. ఫలితంగా ఒక చిన్న పని విజయవంతంగా పూర్తి చేసినా పెద్దగా పొంగిపోతారు. పెద్ద పెద్ద సాయం అవసరం లేదు, పొగొట్టుకున్న మొబైల్ ను కనిపెట్టి ఇచ్చినా ఉబ్బితబ్బిబ్బవుతారు. పోలీసులు ప్రజలను ఎపుడూ ఇలా సంతోష పెట్టేందుకే ప్రయత్నిస్తుంటారు. ఈ విషయం మర్చిపోరాదు,” అని రఘువంశి తన ఉద్యోగం సారాంశాన్ని నాలుగు ముక్కల్లో గొప్పగా డిఫైన్ చేశారు.
రఘవంశి భార్యపేరు అపరాజితా రాయ్. ఆమె కూడా 2013 బ్యాచ్ ఐపిఎస్ అధికారియే. ఆమె సిక్కిం నుంచి వచ్చారు. మరొక విశేషమేమిటంటే, సిక్కిం నుంచి ఐపిఎస్ కు ఎంపిక తొలి మహిళ ఆమెయే. వారిద్దరు హైదరాబాద్ లో సర్దార్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ఉన్నపుడు పరిచయమయ్యారు. ప్రజా సేవ విషయంలో ఆమె తనకంటే చాలా కమిట్ మెంటు ఉన్న అధికారి అని రఘువంశి కితాబు ఇచ్చారు. ఆమె ఇపుడు కలింపాంగ్ జిల్లా ఎస్ పిగా ఉంటున్నారు. ఆయన ఎనిమిదేళ్లఇంటర్వ్యూలో మంచి పేరు తెచ్చుకున్నారు.
విశేషమేమిటంటే ఐపిఎస్ ఉద్యోగం గురించి, ఇంకా స్పష్టంగా చెబితే పోలీసు ఉద్యోగం గురించి చాలా బాగా వివరించడం రఘువంశి విశేషం. అలతి అలతి మాటల్లో ఆయన పోలీసు ఉద్యోగం చుట్టూర మిడియా సృష్టించిన భ్రమలను వొలిచేసి పోలీసు కూడా ఎట్లా సాధారణ మనిషో చాలా కన్విన్సింగ్ గా చెప్పారు. తన చేస్తున్న పని మీద ఆయన చాలా స్పష్టత ఉంది.
రఘువంశి ఇంటర్వ్యూ క్లుప్తంగానే ఉన్నా, సివిల్స్ ఔత్సాహికులకు మంచి ప్రేరణ ఇస్తుంది. కచ్చితంగా ఐపిఎస్ ధ్యేయంగా సివిల్స్ కు ప్రిపేరవుతున్న వారికి బాగా ఉపయోగపడుతుంది.
రఘువంశి ఐపిఎస్ తో ఇంటర్వ్యూ
అన్నట్లు, రఘువంశి గురించి మరొక మాట.
ఆయన తండ్రి స్టేట్ గవర్నంటులో టైపిస్ గా పనిచేశారు. తర్వాత సీనియర్ అసిస్టెంట్ అయ్యారు. అమ్మ ప్రయివేటు స్కూల్లో తెలుగు పండిట్. ఇపుడయితే వాళ్లు రఘువంశితోనే బెంగాల్ లో ఉంటున్నారు.
పశ్చిమబెంగాల్ కు చెందిన సీనియర్ ఐఎఎస్ అధికారి ఎమ్ వి రావు చేసిన మరొక అద్భుతమయిన ఇంటర్వ్యూ ఇది. రావు గురించి ఎంతయిన చెప్పవచ్చు.
అసలు ఇలాంటి ఇంటర్వ్యూలు చేయాలన్న ఆలోచనే ప్రశంసించదగ్గది. ఉద్యోగంలో చేరింది ప్రజాసేవకే, అది మినహా మరొక వ్యాపకం ఏముంటుందనేది డాక్టర్ రావు తాత్వికత. అందుకే ఆయన ప్రజలకు పనికొచ్చే పనుల గురించే ఎపుడూ ఆలోచిస్తుంటారు. ఇపుడు ఆయన చేస్తున్న సివిల్స్ విజేతల ఇంటర్వ్యూలు దీని కొనసాగింపే. డా. రావు పదహారాణాల పేదల పక్షపాతి. వారి జీవన ప్రమాణాలు పెంచేందుకు ఎన్ని విధాలుగా యోచిస్తారో, ఎన్ని ప్రయోగాలు చేస్తారో లెక్కేలేదు. ఇన్నొవేషన్ డాక్టర్ రావు కు పర్యాయపదం.