ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని అమెరికా ఏలు పెట్టిన చోట, కాలుమోపిన నేల మీద యుద్ధజ్వాలలు వినాశం మాత్రమే ఉంటాయి. యుక్రెయిన్ లో 2014 లో అమెరికా ఏలు పెట్టింది, అంతే … ఇపుడీ పరిస్థితి దాపురించింది.
ఉక్రెయిన్ సంక్షోభం: అంతర్జాతీయ ద్వంద్వ వైఖరి మీద డాక్టర్ జతిన్ కుమార్ విశ్లేషణ
డాక్టర్. యస్. జతిన్ కుమార్
నాటో కూటమి ప్రోద్బలంతో ఉక్రెయిన్ రష్యాతో చేస్తున్నయుద్ధంలో పరిస్థితులు అతి వేగంగా మారిపోతున్నాయి. రష్యన్ దళాలు ప్రధాన ఉక్రెయిన్ నగరాల్లో ముందుకు సాగుతున్నాయి. కొన్నినాటో దేశాలు ఉక్రెయిన్ దళాలకు, కిరాయి సైనికులకు ఆయుధాలు, డబ్బును పంపనున్నట్లు ప్రకటించాయి, ఉక్రెయిన్ జాతీయవాద సమూహాలకు మద్దతుగాకొన్ని పశ్చిమ ప్రాంతాల నుండి మద్దతు వస్తున్నది. అబద్ధాలు, వక్రీకరణలతో రష్యా వ్యతిరేక ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. మీడియా యుద్ధం కూడా కొనసాగుతున్నది.
అనేక నకిలీ చిత్రాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రచారమయ్యాయి. అమెరికాతో పాటు ఈ.యూ (EU) తీవ్రమైన ఆంక్షలు జారీచేయడాన్ని, తమపై నాటో దేశాలు ప్రకటించిన యుద్ధచర్యగా భావిస్తున్నట్లు రష్యా అధికారులు తెలిపారు.
రెండు వారాలలో ఉక్రెయిన్ అధ్యక్షుడు మాత్రం నాటోకూటమి, ఐరోపా యూనియన్ దేశాల సంఘీభావం సహకారం పట్ల ఏర్పరచుకున్న భ్రమలనుండి తేరుకుని రష్యాతో సంధి ప్రయత్నాలకు సిద్ధమవుతున్నాడు.
ఉక్రెయిన్ లో ఘర్షణ ప్రారంభమైనప్పటి నుండి పాశ్చాత్య ప్రజలు దాదాపు ఏకగ్రీవంగా ఒక ఆగ్రహాన్ని ప్రదర్శించారు. పుతిన్ రష్యా, నైతికంగా తప్పుచేస్తోందని, అన్యాయంగా యుద్ధాన్ని రుద్దింది అని వారు భావిస్తున్నారు. ఆ దేశాల నాయకులేమో రష్యాకు వ్యతిరేకంగా కఠినమైన ఆర్ధిక ఆంక్షలు విధిస్తున్నారు. ఇది ఆచరణలో పాశ్చాత్య వ్యాపారా ల మూసివేతకు దారితీసింది.
రష్యా వార్తాసంస్థలు రష్యా టుడే (ఆర్ టి), స్పుత్నిక్ లను ప్రభుత్వ ప్రచార బాకాలు గా ముద్రవేసి, నిషేధించారు. అదే సమయంలో అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో మాస్కోపై కేసు దాఖలు చేయడంతో పాటు, రష్యన్ వార్తా వనరులకు వ్యతిరేకంగా పాశ్చాత్య దేశాలు పెద్ద ఎత్తున సెన్సార్షిప్ లో నిమగ్నమయ్యాయి . ఇవన్నీ మంచి వెర్సస్, చెడు, లేదా ప్రజాస్వామ్యం వెర్సస్ నిరంకుశత్వాల ప్రపంచ పోరాటంగా చిత్రిస్తున్నారు. నీతివంతమైన దేశాల సమూహం వ్యక్తపరుస్తున్ననిరసనగా సాంప్రదాయ పాశ్చాత్య కథనాలు రూపొందించారు.
రష్యాకు వ్యతిరేకంగా ఇటువంటి పాశ్చాత్య భావాలు చెలరేగుతున్నప్పుడు, గతంలోనూ, వర్తమానంలోనూ ఆ పాశ్చాత్య దేశాలు అవలంబించిన విధానాలు, వారి వారసత్వం,గుర్తుకొస్తాయి. గత రెండు దశాబ్దాలలో అమెరికా, దాని మిత్రదేశాలు నాశనం చేసిన దేశాల గురించి వారిలో ఎలాంటి పశ్చాత్తాపమూ కనిపించదు.
ఉక్రెయిన్ ఒక విషాదంగా భావించబడుతోంది, నిజమే వారికి న్యాయం జరగాలి. అయితే ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, సిరియా లో పశ్చిమ దేశాలు చేసిందేమిటి? యెమెన్ లో కొనసాగుతున్న సంఘర్షణ పట్ల వారి సామూహిక ఉదాసీనతకు కారణమేమిటి? అటువంటి దేశాలలో ఈ సంఘటనలు “సాధారణమైనవి ” అనే నిర్ధారణకు ఎందుకు వచ్చారు?
ప్రపంచ దక్షిణాదిలో తూర్పులో తాము దీర్ఘకాలం అమలు చేసిన క్రూరమైన వలసవాదం పై, పాశ్చాత్య దేశాలు ఎన్నటికైనా క్షమాపణ చెబుతాయా? పశ్చాత్తాపం ప్రకటిస్తాయా? కాకపోగా తాము ఆ వలసదేశాలకు “మేలు చేశామని” నమ్మిస్తారు. పాశ్చాత్య విదేశాంగ విధానం భారీ స్థాయిలో ఒక తప్పుడు చైతన్యానికి లోబడి ఉంది.వారిసామ్రాజ్యవాద వారసత్వం,ముఖ్యంగా ఆంగ్లం మాట్లా డే దేశాల వారసత్వం, ప్రపంచ వ్యాప్తంగా సాంస్కృతిక, ఆర్థిక, సైనిక ఆధిపత్యాన్ని దీర్ఘకాలం కొనసాగించింది. వారి విపరీతమైన ఆధిక్యత కింద,అణచివేత కింద అనేక దేశాలు క్రుంగిపోయేలా చేసింది. తమ సామ్రాజ్యకాంక్ష, దురాక్ర మణ, ఆధిపత్య చర్యల భౌతిక వాస్తవికతను మరుగు పరిచి, తమ అసమానమైన పవిత్రమైన నైతిక ఆధిపత్యం వల్ల తమకీ ప్రపంచ ఆధిపత్య స్థానం లభించిందని వారు చెప్పుకుంటారు.
ఈ విశేష అధికారం వల్ల స్వంత జాతి ఆత్మ గౌరవ ప్రపత్తులు పెరిగేటట్లు చూసుకున్నారు. ఉదారవాద ప్రజాస్వామ్యం ద్వారా అనేక దేశాల పై నైతిక ఆధిక్యతను సాధించామని తమ పాలక వర్గాల ద్వారా ప్రచారం చేయబడుతున్న స్వంత పురాణాన్ని పాశ్చాత్య ప్రజానీకం, బలం గా నమ్ముతుంది. వెనుకబడిన అనాగరిక జాతులపై తమ అధిపత్యం నెలకొల్పి వారిని నాగరికులుగా చేయటం తమ పవిత్ర కర్తవ్యంగా వారు భావిస్తారు. మానవ జాతి పై తమకు ఆ అధికారం, హక్కు వుందని విశ్వసిస్తారు.
అంతేకాదు తమకు భిన్నమైన జాతులను పూర్తిగా శత్రువులుగా భావిస్తూ, వారిని అతి దుర్మార్గులుగాను, శాంతివిఘాతకులు గాను పరిగణిస్తారు. తాము మాత్రమే సత్యానికి, నాగరికతకు ప్రతినిధుల మన్నట్లు వ్యవహరిస్తారు. తమ గురించి ఏర్పరచుకున్న ఈ ఊహాత్మక గొప్పలవల్ల వారికి ఈ ప్రపంచంలో న్యాయం కూడా రెండు అంచెలుగా కనిపిస్తుంది, నాగరికు లైన తమకో న్యాయం, అనాగరిక జాతులకు మరో న్యాయం సహజమని అనుకుంటారు
ఈ భావజాలం వల్ల ప్రజాస్వామ్యం, మానవ హక్కుల పేరిట ఒక దేశాన్ని నాశనం చేయడం, లక్షలాది మంది పౌరుల ను చంపడం, వారిని చెప్పలేని బాధలకు గురిచేయడం వారికి తప్పుగా అనిపించదు. ఆ రాజకీయ రంగం, మీడియా అలాటి భావనా ప్రపంచం సృష్టించి పెట్టాయి. వారికి ఈ అక్రమాలు పూర్తి ఆమోదయోగ్యంగా వుంటాయి.
2003లో యుకె, యుఎస్ లు ఇరాక్ పై వాళ్లదగ్గర “సామూహిక వినాశన ఆయుధాలు” వున్నాయనే అబద్ధపు ఆరోపణలు చేసి, ఆ ముసుగులో దాడి చేసినప్పుడు, ప్రపంచ ఖండన వినిపించకుండా చేశారు. ప్రధాన స్రవంతి మీడియా దానిని అక్రమమని అన లేదు, నేరస్థులు అధికారికంగా యుద్ధ నేరాల ఆరోపణలను ఎదుర్కోలేదు,యుద్ధా నికి గురయి బాధపడుతున్న వారిస్వరం వినిపించలేదు. వారికి సంఘీభావం లేదా మద్దతు తెలుపలేదు. గత ఆగస్టు లో, ఆఫ్ఘనిస్తాన్ లోని కాబూల్ లో అమెరికా డ్రోన్ దాడిలో అనేక మంది పిల్లలు మరణించారు. ప్రపంచం కనీ సం కనురెప్ప విప్పి చూడలేదు. ఈ దేశాల ప్రజల ప్రాణాలకు ఏమీ విలువ లేదన్నమాట. వాళ్ళ జీవితాలకు ఐరోపా లోని ప్రజల జీవితాల కున్నవిలువ లేదన్నమాట. వారికీ, వీరికీ సమానమైన విలువ లేనట్లుగా ఉంది. పాశ్చాత్య ఆధిపత్య౦, పాశ్చాత్యుల కున్నాయనుకుంటున్న ప్రత్యేకహక్కుల వల్ల యుకె గానీ, అమెరికా గానీ “దురాక్రమణ రాజ్యాలు” అని ప్రకటి౦చబడలేదు.
ఇప్పుడు కూడా యుకె, యుఎస్ లు యెమెన్ లో క్రూరమైన యుద్ధానికి మద్ద తు ఇస్తున్నాయి, అక్కడ పౌరులపై విచక్షణారహితంగా బాంబు దాడి జరుగుతోంది. మరో వైపు, దేశాన్ని దిగ్బంధం చేసి ఆకలి చావులు,వ్యాధులు, మానవ కల్పిత సంక్షోభాలను ప్రేరేపించారు. వీటి గురించి పల్లెత్తు మాట అనని వారు ఉక్రెయిన్ విషయంలో భావోద్వేగం, దుఃఖం, కోపం అమితంగా ప్రదర్శిస్తున్నారు. పాశ్చాత్య దేశాలు తమ భావజాలాన్ని, విలువలను, జ్ఞానాన్ని తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి మాత్రమే వినియోగిస్తున్నాయి. అసమాన మైన, అన్యాయమైన ప్రపంచాన్ని సృష్టించడానికి సాధనాలుగా మాత్రమే ఉపయోగించు కుంటున్నాయి.
అమెరికా జోక్యం చేసు కున్న ప్రతి చోట
కేవలం గందరగోళం,
యుద్ధజ్వాలలు మాత్రమే ఉన్నాయి.
ఉక్రెయిన్ లో ఘర్షణ పెచ్చరిల్లడానికి, ఆ దేశపు, తూర్పు-పడమర ప్రాంతాల మధ్య వున్న వివాదం మాత్రమే కారణం కాదు, రష్యా ఉక్రెయిన్ల మధ్య ఘర్షణ, రష్యా- అమెరికాల మధ్య వివాదం కూడా కారణమే. ఉక్రెయిన్ లో చట్టబద్ధంగా ఎన్నికైన అధ్యక్షుడిని పడగొట్టిన 2014 వర్ణవిప్లవం అమెరికా ప్రేరేపించినదే. ఈ కారణంగా ఏర్పడిన అంతర్గత విభజ నల వల్ల యుద్ధం జరుగుతున్నట్లు కనిపిస్తున్నది. కానీ ఇది రష్యా అమెరికాల మధ్య ప్రాక్సీ యుద్ధంగా మారింది.
ఉక్రెయిన్ యుద్ధానికి ముందు, ఆదేశం సాయుధం చేయబడింది. కొంతకాలంగా చైనా, రష్యాల పట్ల కోపావేశాలు రెచ్చగొట్టి వుంచారు. పాలకులు అబడ్డాలు చెప్పినప్పుడు, నిజాలు తారుమారు చేసినప్పుడు, పాశ్చాత్య ప్రజలకు వాటిని గుర్తించే సామర్థ్యం లేనట్లుగా కనిపిస్తుంది, ఎందుకంటే “వెనుకబడిన, అనాగరికమైన, క్రూరమైన తూర్పు దేశాల కన్నా పాశ్చాత్యులు విశిష్టమైనవారనే పురాణం వారు నిరభ్యంతరంగా నమ్ముతున్నారు. అందువల్ల, పాశ్చా త్య దేశమైన ఉక్రెయిన్లో యుద్ధం కొనసాగుతున్నంతకాలం, పాశ్చాత్య ప్రజలు నిరంతరం ఒక భావోద్వేగానికి లోబడి ఉండేలా, ఈ యుద్ధం మానవాళి పట్లనే అపహాస్యమనీ, గొప్ప అవమానమనీ పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నారు. .
ఖచ్చితంగా యుద్ధం ఒక భయంకరమైన విషయమే.అయినప్పటికీ యుద్ధం ఎవరు చేస్తున్నారు? బాధితులు ఎవరు? అనే ప్రశ్నల చుట్టూనే ప్రజల ఆలోచనలు తిప్పి వారి చైతన్యాన్ని, అభిప్రాయాన్ని కట్టడి చేస్తున్నారు. బ్రిటన్, అమెరి కాలు కొనసాగించిన కసాయి చర్యలను బట్టి చూస్తే, రష్యా యుద్ధ నేరాలకు పాల్పడినట్లు ఆరోపించడం వారి కపటత్వాన్ని, మోసకారితనాన్ని వెల్లడి చేస్తోంది. ఇది దక్షిణాది ప్రపంచం పాశ్చాత్య దేశాల దురహంకార భ్రమల నుండి బయట పడటానికి దారి తీస్తుంది.
రష్యాకు వ్యతిరేకంగా ఆర్థిక ఆంక్షలను విధించడం, వాటిని విస్తరించడం కఠినతరం చేయడం వెనుక ఈ దురహంకారం, ప్రపంచాన్ని తాము శాసించాలనే, శాసించగలమనే ఆధిపత్య స్వభావం వుంది. అమెరికా తోపాటు ఇ.యు. దేశాలు కూడా భౌగోళిక-ఆర్థిక విన్యాసాలకు తలపడ్డాయి. అయితే ఈ ఆంక్షలు ఇప్పటికే తడబడుతున్న, బలహీన పడుతున్నఐరోపా ఆర్ధిక వ్యవస్థలను దెబ్బతీస్తున్నాయి. అందువల్ల ఈ కూటమిలో విభజ నలు కానవస్తున్నాయి. తాము కోలుకోవడానికి, వాషింగ్టన్ యొక్క ఆదేశాలను బానిసల్లాగా అనుసరించకూడదు అనే అభిప్రాయం పెరుగుతోంది. వారు చైనా, రష్యా ఇతర ఆసియా ఆఫ్రికన్ దేశాలతో మరింత సహకరించి, సమతుల్యత ,వాస్తవికతలను మేళవించి యురేషియన్ సమస్యలను పరిష్కరించుకోవాలి.
ఇటీవలి దశాబ్దాల్లో, అమెరికా ఏకపక్షత, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో దాని పాత్ర క్రమంగా క్షీణిస్తున్నా యి. దాని ఆధిపత్య వ్యూహాలు అంతర్జాతీయ విశ్వసనీయతను, చట్టబద్ధతను కోల్పోయాయి. ప్రపంచ వ్యవస్థ ఇప్ప టికే బహుళ ధ్రువ ప్రభావితంగా మారింది. 1990 లలోవున్నయుఎస్ ఆధిపత్యం ఈనాడు లేదు. క్లుప్తంగా చెప్పా లంటే, యుఎస్ వ్యూహకర్తల యొక్క చెత్త పీడకలలు నిజమవుతున్నాయని మరింత స్పష్టంగా కనిపిస్తుంది.
చైనా,రష్యాలకు కూడా ఆర్థిక ప్రయోజనాలకు మించిన ఉమ్మడి వ్యూహాత్మక అవసరాలు ఉన్నాయి కాబట్టి, రెండు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా ఆర్థిక స్థాయిలో పరస్పర ప్రయోజనం,ఆచరణాత్మక సహకారానికి విస్తరించాయి. అమెరికా నేతృత్వంలో కూటమి గట్టిన సంయుక్త శక్తులను తూర్పు ఆసియాలోనూ, ఐరోపాలోనూ- చైనా, రష్యాలు- ఎదుర్కొంటున్నాయి. తూర్పు చైనా సముద్రం, దక్షిణ చైనా సముద్రం ఉక్రెయిన్ లలో సంఘర్షణలు ఆ పోరాటానికి నిర్దిష్ట ఉదాహరణలు మాత్రమే. కేంద్ర సమస్య ఏమిటంటే – సుదీర్ఘ చరిత్ర ,నాగరికత కలిగిన గొప్ప సైనిక శక్తులుగా – చైనా లేదా రష్యా తమ సొంత అంతర్గత వ్యవహారాలలో, విదేశీ విధానాలలో అమెరికా లేదా పాశ్చాత్య దేశాలు నిర్దేశిం చిన మార్గాన్ని అంగీకరించలేవు.
గత రెండు దశాబ్దాలుగా, ప్రపంచ శాంతి శ్రేయస్సుకోసం తగిన పరిస్థితులను సృష్టించే సామర్థ్యాన్ని,సుముఖతను అమెరికా క్రమంగా కోల్పోయింది. అంతే కాదు స్థితిని దిగజార్చే సంఘర్షణలను సృష్టించింది. ఆసియా ఐరోపాల లో వివాదాలకు ఆజ్యం పోయడానికి, ఐరోపాలో వరుసగా వర్ణ తిరుగుబాటులు , మధ్య ప్రాచ్యం, పశ్చిమాసియా ఉత్తర ఆఫ్రికాలలో “అరబ్ స్ప్రింగ్స్” ప్రారంభం కావటానికి అమెరికా ప్రతిచోటా జోక్యం చేసుకున్నది. అది స్వయంగా సృష్టించిన సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యింది. ఆఫ్ఘనిస్థాన్ దీనికి పెద్ద ఉదాహరణ. పది సంవత్సరాలు యుద్ధం చేసి కూడా పరిస్థితిని పరిష్కరించ లేకపోయింది. అమెరికా జోక్యం చేసు కున్న ప్రతి చోట కేవలం గందరగోళం, యుద్ధజ్వాలలు మాత్రమే ఉన్నాయి.
ఈనాటి ప్రపంచంలో, సామాజిక-ఆర్థిక, రాజకీయ వ్యవస్థలు,అభివృద్ధి మార్గాలు, విధానాల పరంగా విభిన్న మార్గాలు వున్నాయి. అమెరికా వాటి మధ్య విభజన సృష్టించడానికి, వివాదాలు పెంచటానికి ప్రయత్నిస్తోంది కానీ, చైనా అంతర్జాతీయ వ్యవస్థను రెండు వైరుధ్య శిబిరాల యుద్ధభూమిగా పరిగణించదు. చైనా ఒక “బాధ్యతాయుతమైన ప్రధాన దేశం” గా అభివృద్ధి చెందుతున్న పరిస్థితిలో. అది బహుళపక్ష ప్రపంచాన్ని సమర్థించడానికి ప్రత్యేక ప్రాధాన్యత ను ఇస్తోంది . చైనా “మరింత ఆత్మవిశ్వాసం తో, స్వీయ-ఆధారితంగా, బహిరంగ, సమ్మిళిత దౌత్య కార్యక్రమాలలో పాల్గొనే దేశంగా వ్యవహరిస్తోంది. ఇది అమెరికా,దాని మిత్రదేశాల ద్వారా సృష్టించబడుతున్న అన్ని”రాజకీయ ప్రేరేపిత అడ్డంకులను,విధ్వంసక ప్రయత్నాలను” తిప్పికొడుతుంది.
ఉక్రెయిన్ పై, వివిధ సంక్లిష్ట కారణాలు ప్రస్తుత పరిస్థితిని ప్రేరేపించాయని చైనా నొక్కి చెప్పింది. తన స్వతంత్ర అంచనాల ఆధారంగా, “సమస్య యొక్క యోగ్యతల” ఆధారంగా “ఒక లక్ష్యంతో నిష్పాక్షిక వైఖరిని” అవలంబి స్తున్నది. రష్యా వెలిబుచ్చిన “చట్టబద్ధమైన భద్రతా ఆందోళనలు,అవిభాజ్య భద్రత సూత్రం” ఇంతవరకు విస్మరించ బడ్డాయి , అయితే, “సమతుల్యమైన, సమర్థవంతమైన, స్థిరమైన యూరోపియన్ భద్రతా నిర్మాణాన్ని”అమలు చేయ డం దీర్ఘకాలిక స్థిరత్వానికి కీలకం. వాస్తవానికి, ఇది రష్యన్ విధానానికి ప్రాతిపదిక కూడా. అందువల్ల, చైనా యూరోపి యన్లను రష్యాతో సయోధ్య వారధులను నిర్మించడానికి ప్రోత్సహిస్తుంది. ఇది యూరోప్ తన సొంతవ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిని, స్వతంత్రతని నిలబెట్టుకునే దిశలో ముందుకు సాగాలని కోరుతుంది. ఉక్రేయి న్ సంక్షోభం పై ఐరాసలో ఇటీవల జరిగిన ఓటింగులో -ప్రపంచ జనాభాలో కనీసం సగం మంది సమాన దూరాన్ని పాటించడానికి, ప్రాంతీయ గ్రూపులను తిరస్కరించడానికి సిద్ధమవుతున్నట్లు సూచిస్తున్నాయి. ఈ సంక్షోభం యొక్క మూలకారణా లను గుర్తించే సంకల్పం, విభిన్న చట్టబద్ధమైన ప్రయోజనాలు, భద్రతా కారణాలను సమతుల్యం చేయడానికి అంగీక రించడం అవసరం. అలా చేయడానికి ప్రధాన ప్రాంతీయ,అంతర్జాతీయ శక్తుల సంస్థల సహాయం అవసరం, వీరు యుద్ధ జ్వాలలకు గాలులు తోడవ్వకుండా నివారించాలి
రష్యా ఐరోపాల మధ్య వైరుధ్యాన్ని పెంపొందించడానికి అమెరికా ఉక్రెయిన్ ను వాడుకుంటోంది.ఐరోపాను ఉపయోగి స్తోంది. ఒక నిర్దిష్ట నాయకత్వం గాని, లేదా సైన్యం గాని లేని యూరప్ దేశాల యూనియన్ ద్వారా రష్యాను బల హీనపరచడానికి ప్రయత్నిస్తోంది. నిజానికి ఇ.యు లోని కొన్ని దేశాలు క్రెమ్లిన్ తో మంచి సంబంధాలపై ఆసక్తి కలిగి ఉన్నాయి.
అయితే రష్యాకు అనుకూలమైన రాజకీయ ఒప్పందంతో ఉక్రేయిన్ సంక్షోభాన్ని పరిష్కరించడానికి అమెరికా ఒప్పుకోదు.ఈ స్థితిలో,చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా జర్మనీ ఈ యూరోపియన్ సమస్యలో చైనా మధ్యవర్తిత్వాన్ని కోరినట్లు సమాచారం. దీనికి ఫ్రాన్స్ మద్దతుకూడా ఉంది! “అవసరమైన మధ్యవర్తిత్వాన్ని నిర్వ హించడానికి” చైనా సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. రష్యా చైనాలమధ్య సహకారం ద్వైపాక్షికచర్యలకు మాత్రమే పరిమితం కాకుండా, భారత దేశం, బ్రెజిల్, దక్షిణాఫ్రికా వంటి ప్రాంతీయ శక్తులను మరింత ఏకం చేయాలి. అనేక స్వతంత్ర దేశాల సహకారంతో గణనీయమైన పాత్ర పోషించాలి. పడమటి గాలిని తిప్పికొట్టే తూర్పు గాలులని మార్పు సంకేతాలనీ పశ్చిమ దేశాలు గుర్తిస్తున్నట్లు ఈ గమనం సూచిస్తున్నది.
గత శతాబ్దాలలో సామ్రాజ్యాలు అనుసరించిన వలసవాద, విస్తరణవాద, ఆధిపత్య ధోరణులకు కాలం చెల్లిపోయింది. ఒకరి జాత్యహంకారం, పెత్తనాలను మరో జాతి సహించి, ఎల్ల కాలమూ లొంగి వుండే కాలం మారిపోయింది. అందరికీ భాగస్వామ్యమున్న ఉమ్మడి భవిష్యత్తుకోసం, శాంతి అభ్యుదయాలకోసం, ఉమ్మడి సహకారంగల సామరస్య పూర్వక సమాజ నిర్మాణంకోసం మానవాళి కంకణ బద్ధమైవుంది.
సమాచారం &ఆధారాలు :
1. Ukraine crisis shows two tiers of international justice By James Smith on Mar 06, 2022; in GT:
2. Ukraine crisis: Stumbling and the ineffective US continues to divide Europe By Fabio Massimo Parenti on Mar 06, 2022, in GT;
3. Ukraine faces defeat, by M.K.Bhadra Kumar on 8th March and
4. China’s signposts post-Ukraine by M.K. Bhadra Kumar on 9th march 2022 in Indian punchline.
(డా. జతిన్ కుమార్, హైదరాబాద్ లో ఆర్థోపెడిక్ సర్జన్. సామాజిక ఉద్యమ కారుడు.