వడ్డేపల్లి మల్లేశము
భారతదేశంలో గుజరాత్ తో సహా కొన్ని రాష్ట్రాలలో మినహాయిస్తే దేశవ్యాప్తంగా మద్యపానం అమలవుతూ నే ఉన్నది. మద్యపానం యొక్క వికృత రూపాలను అవగాహన చేసుకొని నిర్మూలించే దిశగా ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోక పోవడం విచారకరం.
గుజరాత్ రాష్ట్రానికి చెందిన నేటి భారత ప్రధాని ఏనాడు కూడా అలాంటి ఆలోచన చేయకపోవడం మరి విడ్డూరమే. మద్యపానాన్ని ఆదాయ వనరుగా భావించిన ఏ ప్రభుత్వమైనా ప్రజలకు ముఖ్యంగా యువతకు ద్రోహం చేసినట్లే. నిరంతరము ప్రజలు జాగరూకులై ఉండవలసిన ప్రజాస్వామిక వ్యవస్థలో మత్తులో ముంచి చైతన్యవంతులు కాకుండా చేయడం ప్రభుత్వ కుట్రలో భాగమే కదా!
మద్యపానంపై ఎందుకింత ప్రేమ:
నీళ్లు, నిధులు ,నియామకాలు, ఆత్మగౌరవం ప్రధానంగా కలిగిన తెలంగాణ ఉద్యమ ప్రస్థానం రాష్ట్ర ఆవిర్భావం తర్వాత లక్ష్యాలను మరిచి ప్రకృతి విధ్వంసాన్ని కొనసాగిస్తూ, గుట్టల విధ్వంసాన్ని అనుమతిస్తూ, మద్యపానాన్ని ప్రోత్సహిస్తూ దుకాణాల సంఖ్య మరింతగా రెట్టింపు చేసిన ఘనత తెలంగాణ రాష్ట్రానికి దక్కింది.
గమ్మత్తేమిటంటే ఇటీవలికాలంలో మద్యం దుకాణాలను కూడా ఎస్సీ, ఎస్టీ, గౌడ కులస్తులకు రిజర్వు చేయడం బహుశా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా చేయనటువంటి పని అని చెప్పక తప్పదు. మద్యాన్ని తాగమని ప్రోత్సహిస్తున్న ప్రభుత్వమే త్రాగి వాహనాన్ని నడుపుతుంటే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో అరెస్టు చేసి వేల రూపాయలు జరిమానా విధిస్తున్న ధోరణి ప్రభుత్వ ద్వంద వైఖరి కాదా! బార్లలో మద్యం తాగిన వ్యక్తి ఇంటికి వెళ్లకుండా ఉంటాడా! ఒక దశలో వాహనాన్ని నడుపుతున్న మద్యం తాగిన వ్యక్తిని పోలీసు అధికారులు ప్రశ్నించినపుడు ప్రజలు తాగిన మద్యం ద్వారా వచ్చిన ఆదాయంతో ప్రభుత్వాన్ని నడపడం మాత్రము న్యాయమేనా? అని ఆ ప్రయాణికుడు ప్రశ్నించిన ధోరణి ప్రభుత్వానికి గుణపాఠం కలిగించేలా ఉన్నది.
భారతదేశంలోని నంబర్ వన్ రాష్ట్రంగా ఉన్నదని ప్రభుత్వం పదేపదే చెబుతున్న వేళ 37 వేల కోట్ల రూపాయల ఆదాయం కోసం అర్రులు చాస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ధోరణి బంగారు తెలంగాణకు సంకేతమా? యువత భవితను నాశనం చేస్తున్న ప్రభుత్వ మద్యం విధానం, ధరలు పెంచడం ద్వారా తాగే వారి సంఖ్యను తగ్గించాలనే ఎక్సైజ్ మంత్రి ఆలోచన ఎంత అసంభద్దమో ఊహిస్తే గాని అర్థం కాదు.
రాష్ట్ర అసెంబ్లీలో చర్చ
11 మార్చి 2022 శుక్రవారం రోజున ఎక్సైజ్ శాఖ పద్దులపై జరిగిన చర్చలో మంత్రి జోక్యం చేసుకుంటూ మద్యం ధరలు పెంచడం ద్వారా తాగే వారి సంఖ్యను తగ్గించవచ్చునని అందుకే ధరలు పెంచుతున్నామని చట్టసభలో ప్రకటించడం ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చడమే అవుతుంది.
కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు శ్రీధర్ బాబు, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఈ సందర్భంగా మాట్లాడుతూ 37 వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని ఘాటుగా విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం చెందే నాటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యొక్క మద్యం ద్వారా వచ్చే ఆదాయం 10 వేల కోట్లు ఉన్నట్టుగా తెలుస్తోంది.
అయితే తెలంగాణ ఏర్పడి ఏడు సంవత్సరాల తర్వాత 37 వేల కోట్లకు చేరడం నిజంగా దేశంలో నంబర్ వన్ అని అనుకుందామా? ఆదాయం కోసం ఇబ్బడిముబ్బడిగా ధరలను పెంచుతూ ప్రజలను ముఖ్యంగా యువతను బానిసలుగా తయారు చేస్తున్న ప్రభుత్వ ధోరణిని వారు ఖండించారు.
మంత్రి సమాధానం వింటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మద్యానికి ప్రజలు చాలా మంది అలవాటు పడిన కారణంగా ఆ సంఖ్యను తగ్గించడం కోసం మాత్రమే ధరలను విపరీతంగా పెంచుతున్నామని మంత్రి సమాధానం ఇవ్వడం ప్రజలను తాగుబోతులుగా తయారు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం విధానానికి ప్రత్యక్ష సాక్ష్యం.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ధరలను తగ్గించడం ద్వారా 30 రూపాయలకే మద్యాన్ని అందిస్తే టీ, కాఫీలు తాగినట్లు గా ప్రజలు నిరంతరం తాగుతూనే ఉంటారని దానిని అడ్డుకోవడానికే ధరలు పెంచడం ద్వారా కొద్ది మందికి మాత్రమే అందుబాటులో ఉంచే ప్రయత్నం చేస్తున్నామని సమాధానమిచ్చారు. కానీ ప్రజలను ముఖ్యంగా యువతను మద్యానికి బానిసలుగా చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వ విధానం గత ఎనిమిది సంవత్సరాలుగా మద్యం లేకుండా ఉండలేని పరిస్థితికి తీసుకు రావడం ఆందోళనకరం .
ప్రపంచము నివ్వెరపోయే స్థాయిలో పరిపాలన చేస్తాము అని హామీ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి ప్రజల యొక్క చైతన్యాన్ని నీరుగార్చే విధంగా నిరంతరం మత్తులో ఉండడానికి బహుశా మద్యం విధానాన్ని రూపకల్పన చేసినారా??? రాత్రి పగలు తేడా లేకుండా మద్యం షాపుల వద్ద వందలాది వాహనాలు జనంతో కిక్కిరిసి పోతుంటే ఆదాయం మించి వస్తుందని ప్రభుత్వం సంతోషపడుతుంది కదా!
హేతుబద్ధత, శాస్త్రీయత సామాజిక చింతన, ప్రజల ఆరోగ్యం అనే అంశాలు ఏవి పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం గత పాలకుల మాదిరిగానే మద్యాన్ని కొనసాగిస్తూ మరింతగా పెంచి పోషిస్తే ఉమ్మడి రాష్ట్రం కంటే తెలంగాణ రాష్ట్రంలో సాధించిన ఘనత ఏమిటో పాలకులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతగానో ఉన్నది.
ఉమ్మడి కార్యాచరణకు ప్రతిపక్షాలు సిద్ధపడాలి:
ఇప్పటికీ ప్రతిపక్షాలకు మద్యపానం మీద స్పష్టమైన అవగాహన లేకపోగా ఏదో ప్రశ్నించాలి కనుక ప్రతిఘటిస్తూ ఉన్నామని చెప్పడమే కానీ ఏనాడు కూడా మద్యపానం పైన అన్ని రాజకీయ పార్టీలు సుదీర్ఘ చర్చ చేసిన దాఖలా లేదు. మద్యపానం యొక్క పర్యవసానాలు, పరిణామాలు, యువతను సామాన్య ప్రజానీకాన్ని ముఖ్యంగా పేదలను ఏరకంగా దిగజార్చు ఏదో ఒకనాడు కూడా ప్రతిపక్షాలు ఆలోచించైనా సందర్భం లేదు.
రాజకీయ పార్టీల నాయకులు ,ప్రభుత్వ పెద్దలే మద్యపానానికి సిద్ధపడి కాంట్రాక్టర్ల ద్వారా కోట్లాది రూపాయలను తమ అనుచరులకు కట్టబెట్టడానికి పూనుకున్న సందర్భంలో మద్యపానాన్ని రాష్ట్రంలో ఏ విధంగా నిషేధిస్తారు? ఇప్పటికైనా ప్రతిపక్షాలకు చిత్తశుద్ధి ఉంటే, ప్రజల పక్షాన పోరాడే సామాజిక బాధ్యతను కలిగి ఉంటె ప్రభుత్వం మీద ఉమ్మడి కార్యాచరణ ద్వారా ప్రజలను కలుపుకొని ప్రజా సంఘాలు ప్రజా ఉద్యమాన్ని నిర్మించడం ద్వారా తెలంగాణ రాష్ట్రానికి ఒక ప్రత్యేకతను తీసుకురావడానికి ప్రయత్నం చేయవచ్చు కదా!
తెలంగాణ ఏర్పడితే సమసమాజ స్థాపన జరుగుతుంది అని ఎంతోమంది ఆశపడిన టువంటి వాళ్ళ ఆకాంక్షలపై నీళ్లు చల్లి ప్రజలను తాగుబోతులుగా తయారు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏ రకంగా దేశంలో నంబర్ వన్ అనాలో ప్రజలు, మేధావులు ,బుద్ధిజీవులు, కార్మికులు, కర్షకులు, ప్రజాస్వామిక వాదులు, చివరికి అఖిలపక్షాలు అందరూ కూడా ఆలోచించాలి. కేంద్ర ప్రభుత్వ విధానాల మీద, థర్డ్ ఫ్రంట్ నిర్మాణం పైన, భారతదేశాన్ని బంగారుమయం చేస్తామనే ఆలోచనతో ప్రయత్నం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ముందుగా మన రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలు, ప్రజాపోరాటాలకు ఏ రకంగా స్పందిస్తుందో అవగాహన చేసుకోవాలి.
ఉద్యోగులు, కార్మికులు, విభిన్న వర్గాల వారు ఒకవైపు పోరాట కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటే వారి సమస్యలను పక్కనపెట్టి విద్యా వైద్య రంగాల ను ప్రైవేటు పరం చేసి నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించడానికి థర్డ్ ఫ్రంట్ పేరుతో కేంద్ర పథకాలను కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే పేరుతో కొనసాగుతున్న రాష్ట్ర ప్రభుత్వం దానికి బదులుగా వెంటనే మద్యపానం పైన స్పష్టమైన ప్రకటన చేసి తన చిత్తశుద్ధిని చాటుకోవాలి.
(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకులు సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నేత హుస్నాబాద్( చౌటపల్లి). జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)