లోయలోకి వెళ్లామా, ఎదురుగా ఒక మహాద్భుత దృశ్యం ఆవిష్కృతం. పచ్చని లోయను అన్ని వైపులా కొండలు కమ్మేశాయి, బాహువుల్లో భద్రంగా దాచుకున్నట్లు…
(రాఘవశర్మ*)
నిట్ట నిలువుగా ఎత్తైన రాతి కొండ.
ఎర్రటి కొండ కొస నుంచి జాలువారుతున్న సన్నని జలధార.
కొండ అంచుల రాతి సితారపై స్వరాలు మీటుతోంది.
దాని సానువుల్లో కొలువుదీరిన విశాలమైన లంకమల గుండంలోకి జారిపోతూ, కూనిరాగాలు తీస్తోంది.
ఎదురుగా ఏటిలో నునుపుదేలిన పెద్ద పెద్ద బండ రాళ్ళలోంచి ముందుకు సాగిపోతోంది.
ఆ పక్కనే కొండ పైన మరో జలధార.
కొండ పైనుంచి జాలువారుతూ ఎన్ని మెలికలు తిరిగిందో!
ఎన్ని హొయలు పోతోందో! ఎన్ని రాగాలు పలుకుతోందో! ఎన్ని గారాలు పోతోందో!
అది కూడా లోతైన పసల గుండంలోకి జారిపోతోంది.
ఎత్తైన కొండ నుంచి, నునుపు దేలిన బండ రాళ్ళపై నుంచి ముందుకు సాగిపోతోంది. లంకమల గుండం ముందున్న ఏటిలోకి సంగమిస్తోంది.
కడప జిల్లా బద్వేలుకు సమీపంలోని లంకమల కొండల్లో కొలువుదీరిన ఒక మహాద్భుత ప్రకృతి సోయగం.
నల్లమల కొండల్లోని బిలం గుహను సందర్శించాలని తిరుపతి నుంచి బయలు దేరినమేం, ముందగా లంకమల కొండలను దర్శించాం.
గత శనివారం, మార్చి 6వ తేదీ మధ్యాహ్నం బద్వేలు సమీపంలో ఉన్ననందిపల్లెకు చేరాం.
‘అరణ్యవాసం’ సినిమా స్క్రీన్‌ప్లే, కథారచయిత వివేక్ తన ఇంట్లో రాగి సంకటి, ఊరుబిండితో చక్కని ఆతిథ్యమిచ్చారు.
తిరుపతి నుంచి వచ్చిన మా పన్నెండు మందితోపాటు మరికొందరు చేరారు. నందిపల్లె నుంచి లంకమల అడవుల్లోకి 16 కిలోమీటర్లు ప్రయాణం.
చుట్టూ రకరకాల చెట్లు, మధ్యలో మట్టి రోడ్డు.
దుమ్ము రేపుకుంటూ మా వాహనాలు ముందుకు సాగిపోతున్నాయి.
కొంత దూరాన కుడివైపున బోదబోడు వంక.
ఏటువాలు కొండ పైనుంచి వర్షపు నీళ్ళు ఈ ఏటిలోకి జారిన ఆనవాళ్ళు.
నీటి ప్రవాహానికి కొట్టుకు వచ్చిన గుండ్రటి గులక రాళ్ళతో, బండ రాళ్ళతో ఇప్పుడా వంక నిండి ఉంది.
ఈ బోదబోడు వంక అసలు రూపాన్ని వర్షాకాలంలో చూడాలి.
పెన్నకు ఈవల లంకమల కొండలు, ఆవల నల్లమల కొండలు.
లంకమలలో నల్లమలంత దట్టమైన అడవి లేకపోయినా, ఇవి వాటికంటే ఎత్తైన కొండలు. ఎక్కువగా పాచి ఉన్న చోటుకు పాచిబండలని పేరొచ్చింది. అలాగే కొన్ని ప్రాంతాలకు రెడ్డి చాలు, తురకల సరి అంటూ పేర్లున్నాయి.ఆ పేర్ల వెనుక జన వ్యవహారంలో అనేక కథలున్నాయి.
మద్దిమడుగు అనే ఒక పెద్ద లోతైన ఏరు.
బస్సుల రాకకోసం ఆ ఏటిని పూడ్చేశారు.
ముందుకు సాగుతున్న కొద్దీ రకరకాల చెట్లతో దట్టమైన అడవి.
చుట్టూ ఎత్తైన కొండలు కమ్మేస్తున్నాయి.
శతాబ్దాల నాటి మరింత ఎత్తైన వృక్షాలు.
ఏటి ప్రవాహానికి కొట్టుకొచ్చిన గుండ్రటి గులకరాళ్ళతో, బండ రాళ్ళతోనిండిన ఏరు. ఎక్కడో దూరం నుంచి చెవులకు తాకుతున్న జలసంగీతం.
ముందుకు సాగుతున్నాం.
ఎదురుగా ఒక మహాద్భుత దృశ్యం.
ఒక పచ్చని లోయను మూడువైపులా కొండలు కమ్మేశాయి. తమ బాహువుల్లో భద్రంగా దాచుకున్నట్టున్నాయి.
ఎత్తైన చెట్ల కొమ్మలు ఆకాశాన్నికప్పేశాయి.
మోకరిల్లి బతకడం చేతకాదన్నట్టు, ఎత్తైన ఎర్రని కొండ నిటారుగా నిలబడింది.
ఆకాశాన్ని తాకాలని చూస్తోంది.
కొండ కొస నుంచి సన్నని జలధార విశాలమైన లంకమల గుండంలోకి జారిపోతోంది.
గుండంలో అలల చిరునవ్వులు కదలాడుతున్నాయి.
మురిపెంగా ఉన్న గుండంలోకి మావాళ్ళంతా మునకలేశారు.
దాని అలల సవ్వడులు పెరిగాయి.
ఎవరి కోసమూ అది ఆగడం లేదు.
గులకరాళ్ళ నుంచి, బండ రాళ్ళ కింద నుంచి ఆ జలధార సాగిపోతోంది. ఎంత చూసినా తనివి తీరదు.
లంకమల గుండం ముందు లంకమల్లేశ్వరాలయం.
పక్కనే కొండపైనున్న మరో గుండాన్ని చీకటి పడకముందే చూడాలి.
అక్కడి జలపాతాన్నీ పలకరించాలి.
ఆ అడవిలో కుడివైపున కొండ పైకి బయలుదేరాం.
పై నుంచి వస్తున్న ఏటి వెంట రాళ్ళపైన నడుచుకుంటూ ముందుకు సాగాం.
ఏటి పక్కన రకరకాల చెట్లు, ఊయలలూగే తీగలు.
శతాబ్దాల నాటి వృక్షాల్లో ఉట్టిపడుతున్న వార్ధక్యపు సౌందర్యం.
ఆ ఏరు ఎన్ని మెలికలు తిరిగిందో, అన్ని మెలికలూ తిరుగుతూ ఎక్కాం. జలపాతానికి దరి చేరుతున్నమన్నసంకేతంగా దూరంగా జలసంగీతం.
ఎత్తైన కొండ పైన లోతైన పసల గుండం.
ఆ గుండాన్ని చుట్టుముట్టిన రాతి కొండ పైనుంచి ఏటవాలుగా దుముకుతున్న జలధార.
అంచలంచెలుగా రాతి కొండ పైనుంచి జాలువారుతూ, పసల గుండంలోకి పడిపోతోంది.
జలధారకు అదే హోరు, నిత్యం అదే పోరు.
నీటి గుండం కనిపిస్తే చాలు దూకేయాలనిపిస్తుంది.
ఈదుకుంటూ, ఈదుకుంటూ జలపాతం కిందకు వెళ్ళాం.
తలంతా నీటి ముత్యాలు రాలాయి.
జలపాతం జాలువారే కొండ అంచుపట్టుకుని పైకి పాకాం.
ఓహ్..ఈ జలపాతం ముందుకు ఏ షవర్ పనికొస్తుంది!?
ఎంతసేపైనా అలా ఉండిపోవాలనిపించింది.
కానీ, కాలం వెంటాడుతోంది.
చీకటి పడడితే రాళ్ళలో దిగడం కష్టం.
చీకటి పడకముందే కొండదిగిపోవాలి.
భారంగా, అయిష్టంగా గుండం నుంచి బైటికొచ్చాం.
మరొక్కసారి ఆ జలపాతాన్ని వీక్షించి, పసలగుండాన్ని పరిపరివిధాలా చూసి వెనుతిరిగాం. కొండ పైనుంచి కిందకుజాలువారుతున్న ఏటి వెంటే నడుచుకుంటూ కిందకు దిగేశాం.
కొండ ఎక్కుతున్నప్పుడు చూసినదాని అందాలన్నిటిన దిగుతున్నప్పుడూ చూశాం. ఆ అందాలను, అనుభూతులను మనసులో భ్రదరపరుచుకున్నాం.
తిరుగు ప్రయాణమయ్యాం.
ఆ రాత్రికి అడవిలోనే నిద్రించాలని సిద్దమై వచ్చాం.
శివరాత్రి కి వచ్చిన భక్తులు పోతూ పోతూ కాలుష్యాన్నివదిలి వెళ్ళారు.
ఇష్టం లేకపోయినా తిరుగు ప్రయాణం కాకతప్పలేదు.
లంకమల గుండాన్ని, ఆ జలపాతాన్ని మరొకసారివీక్షించాం. చీకటిపడబోతోంది. భారంగా లంకమలకు వీడ్కోలు పలికాం.
(*ఆలూరు రాఘవ శర్మ, రచయిత, ట్రెక్కర్, జర్నలిస్ట్, తిరుపతి