(రాఘవశర్మ)
ఒక చిన్న రాతి కొండ రాక్షసిలా నోరు తెరుచుకుంది.
రుషుల జటాజూటాల్లా దాని నెత్తిన వేలాడుతున్నచెట్ల ఊడలు.
ఆ బిలంగుహ నోట్లోకి ప్రవేశిస్తే అంతా చీకటే!
దాని గోడలకు తలకిందుల వేలాడుతున్న గబ్బిలాల గుంపు.
అలికిడి వినగానే ఎటుపోవాలో అంతుచిక్కక, టపటపా మని రెక్కలు కొట్టుకుంటూ తిరుగాడాయి.
ఆ చీకట్లో మౌన మునుల్లా ఉన్న రాళ్ళు!
నేలంతా ఎగుడు దిగుడుగా, గబ్బిలాల రెట్టలతో మెత్తటి మట్టిలా తయారైంది.
నల్లమల అడవుల్లో బిలంగుహ నక్కి ఉంది.
గుహను చూడ్డానికి రమ్మని అక్కడి మిత్రులు పిలుపునిచ్చారు.
భూమన్ అటవీ శాఖ అనుమతులు తీసుకున్నారు.
అనేక ప్రాంతాల నుంచి వివిధ వృత్తుల వారు.
ఒకరా ఇద్దరా! 75 మంది వచ్చేశారు.
ఒక్క తిరుపతి నుంచే 12 మందిమి వెళ్ళాము.
కడప జిల్లాలో మైదుకూరు-పోరుమామిళ్ళ మధ్య ఉన్న మల్లెపల్లె నుంచి అడవిలోకి వెళ్ళాలి.
మార్చి 6వ తేదీ, ఆదివారం ఉదయం 10 గంటలకు నల్లమలలోకి ప్రవేశించాం.
జీపుల్లో, ట్రాక్టర్లలో, మోటారు సైకిళ్ళలో ప్రయాణం.
అంతా మట్టి రోడ్డు. ఇరు వైపులా చెట్లు.
మార్చి వచ్చేసింది. వేసవి మొదలవుతోంది.
పచ్చని చెట్లు ఎండుముఖం పట్టాయి.
దారంతా మెలికలు తిరిగి, దుమ్ము రేగుతోంది.
కిలోమీటరున్నర వెళ్ళగానే దూదెమ్మ కోన వచ్చేసింది.
కొండల్లోంచి వస్తున్న ఏర్లు రోడ్డుకు అడ్డంగా ప్రవహిస్తున్నాయి.
అడవిలోకి ప్రవేశిస్తున్న కొద్దీ దట్టంగా పెరిగిన చెట్లు పచ్చదనం సంతరించుకున్నాయి.
ఇరువైపులా వెదురు పొదలు అల్లుకుపోయాయి.
అడవిలో ఎన్ని రకాల తీగలో!
లోనికి పోయిన కొద్దీ చెట్లు మరింత దట్టంగా పెరిగి, ఆకాశాన్నికమ్మేశాయి.
పదిహేను కిలో మీటర్లు ప్రయాణించాక పురాత కాలం నాటి కోనేరు.
చుట్టూ రాతి కట్టడం. నీళ్ళు ఎంత స్వచ్చంగా ఉన్నా యో!
ఈ నీళ్ళు తాగితే ఆకలివేస్తుందని ఇక్కడ ప్రజల అనుభవం.
అక్కడే ఆంకాళమ్మ విగ్రహం.
విస్తరాకుల కోసం వాడే మాడపాక చెట్టు.
చుట్టూ చెట్లతో కొండపైకి సన్నని నడకదారి.
పావు గంటలో పైకి ఎక్కగలిగాం.
యువకుల్లో ఉత్సాహం, పెద్దల్లో ఆనందం.
ఎదురుగా రాతి కొండ.
పొలుసులు పొలుసులుగా ఉన్న ఆ రాతి కొండలో ఇనుప ఖనిజం ఇమిడి ఉంది.
టీటీడీ అటవీ రేంజర్ వెంకటసుబ్బయ్య ఈ విషయాన్ని గమనించారు.
ఇనుప ఖనిజం గాలిలో కలిసి రసాయనిక చర్య జరగడంతో కొండ అంచులు పలకలుగా ఏర్పడింది.
ఒక్క సారిగా ఇంత మందిని చూసి బిలం గుహ నోరెళ్ళబెట్టింది.
దాని నోరు అడ్డంగా చీలింది.
కింద పెదవి బిగబట్టి, పై పెదవి తెరుచుకుంది.
గ్రామస్తులు ఏర్పాటుచేసుకున్న చిన్న మెట్లదారిలో లోపలికి ప్రవేశించాం.
విశాలంగా చదునైన ప్రాంతం అంతా యాగాలు చేసిన బూడిద నిండి ఉంది.
మహాశివభక్తుడు మహబూబ్ బాషా పెద్ద బ్యాటరీ లైట్ వెలుగులో మమ్మల్ని లోనికి తీసుకువెళుతున్నాడు.
శివనామస్మరణతో నినాదాలిస్తున్నాడు.
లోపలకు దిగుతున్న కొద్దీ అంతా చిమ్మ చీకటి.
ఎన్ని మెలికలో!
ఏటవాలుగా లోనికి దిగుతున్నాం.
అంతా బూడిద మయం.
గుండ్రటి బండల పైన గబ్బిలాల రెట్టలు.
అడుగు వేస్తుంటే దుమ్ము రేగుతోంది.
జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాం.
ఏ మాత్రం తప్పటడుగు పడినా పడిపోతాం.
పట్టుకోడానికి పక్కనేమీ లేదు.
తాడుపైన నడుస్తూ సర్కస్ చేస్తున్నట్టు అడుగులు పడుతున్నాయి.
మెత్తటి బూడిద కమ్మిన రాళ్ళ గుట్టల్లోంది దిగుతున్నాం.
ఆ రాళ్ళలో ఎన్ని రూపాలో!
పది అడుగుల శివలింగాకారపు రాయి కనిపించింది.
కళ్ళు , ముక్కు, నోరు వంటి రూపాలతో సహజసిద్దంగా ఏర్పడిన శిరస్సు వంటి రూపం.
ఈ రాళ్ళన్నీ గుహలో తపస్సు చేసుకుంటున్న రుషులని ఇక్కడి భక్తుల విశ్వాసం.
ఇక్కడ అనేక మంది రుషులు మనకు కనిపించకుండా ఇప్పటికీ తపస్సు చేసుకుంటున్నారని వారి నమ్మకం.
లోపల కనిపించే రాళ్ళన్నీ రుషులేనంటారు.
అందుకే లోనికి చెప్పులతో అనుమతించరు.
ఈ గుహలో చెప్పులు లేకుండా నడక చాలా ఇబ్బంది.
బూడిదలో ఉన్న సన్నని రాళ్ళు కాళ్ళలో గుచ్చుకుంటున్నాయి.
ఆ గుహలో అలా ఎంత దూరం వెళ్ళామో మాకే తెలియదు.
చిమ్మ చీకటి . బ్యాటరీ వెలుగులో ముందుకు సాగుతున్నాం.
దిగుడు అయిపోయింది. ఎదురుగా ఎక్కాలి.
కొంత ఎక్కాక ఎదురుగా మరొక బిలం.
ఆ బిలంలోకి ప్రవేశించడం సాధ్యం కాదు.
ఆ ప్రాంతానికి చెందిన కొందరు మాత్రమే ఆ సాహసం చేయగలిగారు.
లోపల ఒక చదునైన ప్రాంతం ఉందట.
అప్పటికే చెమటలతో బట్టలన్నీ తడిసిపోయాయి.
గబ్బిలాలు వేసిన రెట్టల వాసన.
బిలం గుహలో పడిన గబ్బిలాల రెట్టలు ఎరువుగా ఉపయగపడుతోంది.
రైతులు బస్తాలలో నింపుకుని తీసుకు వెళతారు.
అయినా తరగని గని.
పైకెక్కడం మొదలు పెట్టాం.
దిగడం ఎంత కష్టమో ఎక్కడం మరింత కష్టం.
లోపల ఆక్సీజన్ సరిగా అందడం లేదు.
బిలం గుహ బైటికి వచ్చి గట్టిగా ఊపిరి పీల్చుకున్నాం.
గుహ ముందు రాళ్ళపైన కూర్చుని సేదదీరాం.
రాయలసీమలో ప్రముఖ రచయిత సన్నపురెడ్డి వెంక్రటామిరెడ్డి తొలిసారిగా మూడు దశాబ్దల క్రితం ఈ బిలం గురించి రాసే వరకు బైట ప్రపంచానికి పెద్దగా తెలియదు.
వచ్చినవారందరికీ కోనేరు వద్దే వంటలు చేశారు.
కొండ దిగాక అడవిలో భోజనం చేసి సాయంత్రం తిరుగుప్రయాణమయ్యాం.
బిలం గుహ ఒక అపురూపం.
ఈ అపురూపాన్ని పదుగురికీ పంచాలని ఇక్కడి ప్రజల ఉత్సాహం.
(ఆలూరు రాఘవశర్మ, రచయిత, ట్రెకర్, జర్నలిస్టు, తిరుపతి)