భూమన్ చెబుతున్న‘అడవి కథ’

(భూమన్)

శేషాచలానికి కొన్నాళ్ళు సెలవు ప్రకటించి నల్లమల అడవికి పోవాలని చాలా కాలంగా అనుకుంటున్నా.  అడవి,  అదొక  విచిత్రం.  ఎన్ని జీవరాశులు?  ఎంత   వైవిధ్యం,  ఎన్నెన్ని  వింత వింత సొగసులు… అడవంటే నాకు తొలి నుంచి ఒక ప్రత్యేకాభిమానం. అడవి వైవిధ్యం నన్నెంతగానో ఆకర్షించింది. ఒక్కోచోటున ఒక్కోతీరున ప్రకృతి అబ్బుర పరుస్తూనే ఉంటుంది అడవి. ఇలాంటి అడవి ప్రకృతిలో ప్రయాణమంటే మనిషి తనలోనే తాను ప్రయాణించటమే. ఎన్నెన్ని అనుభూతులు,  ఎన్నెన్నో సత్యాలు ఈ అడవి తన ఇముడ్చుకుంది.  మనిషి పయనం అడవి  నుంచే మొదలయింది. అందుకే   తీర్థయాత్ర అనో, విహార రాత్రిఅనో,  ట్రెకింగ్ అనో మనిషి ఎపుడూ   మనిషి కాంక్షఎపుడూ అడవి వైపు మళ్లుతూ ఉంటుంది. ఇలాంటి అడవులు మాయమయితే… మనిషి మానసికంగా కూడా సంక్షోభంలో పడిపోతాడేమో అని భయం కలుగుతుంది.

నామట్టుకు నాకు అడవిలో అలసట తెలియదు, ఎన్ని కిలో మీటర్లు నడిచినా, ఎత్తైన కొండలెన్ని ఎక్కినా అలసి పోయిందెపుడు? కొన్ని సార్లు, ఒక  భారమయిన ట్రెక్ తర్వాత, మరుసటి రోజు పొద్దునే మరొ ట్రెక్ కోసం అడవుల్లోని పరిగెత్తిన సందర్బాలున్నాయి. అడవి అనే మాట ఎంత ఎనర్జీ ఇస్తుంది.

 

మా యాత్ర కూడ ఆ తెగన  మనిషి-అటవీ  అనుబంధ పర్యవసానమేనేమో… లేదంటే అడవిలోకి వెళ్లామనగానే ఎంతమంది యువకులు ఉబలాటంగా ముందుకొస్తున్నారో? ఇదిగో  ఈ ఫోటోయే సాక్ష్యం.

ఈ మారు యువ మిత్రులు వివేక్, చంద్ర శేఖర్ రెడ్డి పూనిక వల్ల నా అడవి  యాత్ర  శేషాచలం నుంచి నల్లమల వైపు మల్లింది.  వాళ్ళిద్దరిలో  తాము చూసింది, కన్నది,  కనుగొన్నది, అనుభూతించింది పదిమందికి తెలియజేయాలని ఉత్సుకత అబ్బురం. నిజానికి వాళ్ళిద్దరి పిలుపే మా యాత్ర. బిలం గుహలలో ఒక రోజండాలి.  అంత దూరం వస్తున్నాం కదా లంకమల జలపాతాలు చూడకుండా తిరుగురావడమెలా? అందువల్ల ముందు రోజే తిరుపతి మిత్రులను 13 మందిని పోగుజేసుకున్నాం.  మామండూరు ‘చింత చెట్టు టిఫిన్’  ఆస్వాదించి సిద్ధవటం కోట ఔన్నత్యపు ముచ్చట్లు మనసారా చెప్పుకుని,  నందిపల్లె ఇంట్లో రుచికరమైన రాగి ముద్ద, చెనిగ్గింజల ఊరిబిండి వివేక్ మనసంత ఇష్టంగా ఆరగించి, లంకమల అడవుల్లోకి  పయనమయినాము.

 

బిలం గుహలో అద్భుతం… ఏ మునిశ్వరుడిదీ శిరస్సు

 

 

లంకమల అడవులు అటు మా శేషాచలానికి నల్లమలకు వారధి లాంటివి. మా అడవుల మాదిరిగానే ఎక్కడ చూసినా ఎర్రచందనం. లంకమల రెండు జలపాతాల్లో మా తనివితీరా మునిగి, కొందరికే కనిపించిన ఎలుగుబంటి రాక, పోక ముచ్చటించుకుంటూ వెనుతిరిగినాము.

మరుసటి రోజున బిలం గుహ యాత్ర. దాదాపు 80 మంది గుంపయింది.  అంతా మల్లేపల్లెలో గుమికూడినాము. అంతకు మునుపే మా తిరుపతి బృందం బ్రహ్మంగారిమఠం, బ్రహ్మంసాగర్ చూసొచ్చినాము.

కాశి నాయన మండలంలోని నల్లమల అడవుల్లో సావి శెట్టిపల్లె- ఆకునారాయణ పల్లె మధ్యలో ప్రధాన రహదారి నుండి పడమటి దిశగా 10 కిలోమీటర్ల దూరం పోతే,  మునీశ్వరుని కోనలో ఈ బిలం గుహ ఉంటుంది. కొందరు ట్రాక్టర్లల్లో, కార్లల్లో, ద్విచక్ర వాహనాల్లో ఉల్లాసంగా, ఉత్సాహంగా దూసుకొచ్చారు.  దూదెమ్మ కోన, బుగ్గ భైరవ స్వామి క్షేత్రం మీదుగా ఆ ప్రాంతానికి చేరుకున్నాము.

అడవి గొప్పదనమేంటంటే…ప్రజలు అమాయకంగా అడవిని ఎపుడూ సొంతంచేసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు.  ఎంతకీకారణ్యమయినా సరే, కాలుమోపాడడంటే చాలు అక్కడొక దేవుడో దేవతో ప్రత్యక్ష మవుతాడు.

మాతో వచ్చిన అటవీ ఉద్యోగి ఒక ఆసక్తికరమైన సంగతి చెప్పినాడు. వాళ్ల శిక్షణలో భాగంగా వీళ్ళని జంతువుల బోనుల్లో ఉంచి జంతువుల కదలికలను, వాటి మనస్తత్వాన్ని అధ్యయనం చేయమంటారట. ఇదేదో చాలా బాగుంది కదా. నల్లమల పులులు, ఇతర జంతువులు, పక్షులతో పాటు అక్కడి స్వాముల గురించి చాలానే వివరించినాడు.

 

కడప జిల్లా మఠాలకు, స్వాములకు, అవధూతలకు, సన్యాసులకు చాలా ప్రసిద్ధి. ఎక్కడా చూడు వీళ్ళ ప్రభావమే. మనిషిని ప్రకృతిని పూజించే పరాకాష్ట కడప జిల్లాలో బాగా గమనించవచ్చు. వారి నమ్మకాలు వారివి.

 

ఏ అడవిలోనయినా, కొండమీద నయినా తొలిసారి అనుకుని మీరు నానా కాష్టాలు పడి చేరకుంటే, మన కంటే మందు అక్కడికొచ్చిన సాధు, గోసాయో కనబడతాడు. ఈ గుహ దగ్గిర ఈ సాధువు కనిపించాడు. అంతేకాదు, ఇక్కడికి అపుడపుడు సాధులు వచ్చి పూజలు చేసేవారట.

అడవంతా అల్లికి జిగిబిగి, ఛేదించుకుంటూ పోవలసిందే…

ఇక్కడ మరొక విశేషం చప్పుకోవాలి.  బిలం గుహ వద్ద కొన్నేళ్లుగా  ఒక సాయిబు    శివున్ని కొలుస్తున్నాడు. ఇపుడాయన మాకు ఫారెస్ట్ గైడ్.  మాతో  పాటు వచ్చి గుహ గురించి పరిపరివిధాల వివరించి అంతా ముక్కున వేలేసుకునేలా చేశాడు.  సాయిబు అనుభవాలన్నీ అబ్బురాలే.

కొండ అంచున  మధ్యభాగం చీలి వడ్డాణం లాగా ఈ గుహ మొదలయ్యింది. ఇంతకు మునుపెన్నడూ ఇట్టాంటి దాన్ని చూడలేదు.  ఆ గుహ   చాలా చాాలా పెద్దది. Mammath cave, బెలుం గుహలు, అరకు గుహలు, మేఘాలయ గుహలు, చైనా గుహలు చూసినాను గాని ఇలాంటిది  చూడటం తొలిసారే.

అడవి కొద్ది సేపు విరామం

మేము 1986లో పోతిరెడ్డిపాడు పాదయాత్ర చేసినప్పుడు ఒక పొలంలో ఉండే బెలుం గుహలను చూసినాము. నేను, YSR దాదాపు పర్లాంగు దూరం పోయి వచ్చినాము. ఆ తరువాత ఎంత బాగా అభివృద్ధయిందో కళ్ళారా చూసినాను. ఈ బిలం గుహ కూడా అట్లు అభివృద్ధి కావాలని దీన్ని గురించి పది మందికీ దండోరా వేసి చాటిచెప్పాలని వివేక్, చంద్రశేఖర్ రెడ్డి ల తాపత్రయం ఎంత అర్థవంతమైందో తెలిసొచ్చింది.

గుహ గబ్బిలాల అభయారణ్యం.  మేము అడుగు పెట్టడంతో… ఎవరో  బయటిప్రాణి తమ కీకారణ్యంలోకి వచ్చి అలజడి సృష్టిస్తున్నాయని  గబ్బిలాలు అనుకున్నాయా?  ఆ గబ్బిలాల  హోరు గొప్ప సంగీత ప్రవాహంలా అలముకుంది. పైన గబ్బిలాలు, మధ్య సంగీత హోరు. కింద , మోకాళ్ళ లోతు మట్టి, గబ్బిలాల పెంట. ఘాటైన్ కాలిన భాస్వరం,అమ్మోనియాల వాసన. అయినా సరే, లెక్క చేయకుండా,   దారి లేని దారిలో ఆ సాయిబు ఉత్సాహంగా వేస్తున్న అడుగుల శబ్దాల మధ్య చిట్ట చివరి దాకా పోయి వచ్చినాము.

ఆ గుహ మార్మికత, ఆ సాయిబు ఆధ్యాత్మిక సౌరభం వెలకట్టేటివి కావు.

వడ్డాణపు బాట

ప్రకృతిలోని ఆ కొండల మధ్యన ఈ బిలం గుహల ఔన్నత్యం గురించి వాటి కథా కమామీషు మిత్రుడు సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి చాలా గొప్పగా వర్ణించి ఉన్నాడు.

మళ్లీ అది చెప్పటం కాదు గాని, ఈ బిలం గుహను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయవలసిన కర్తవ్యం మనందరిదీ. ఈ పేరున బిలం గుహే కాకుండా 15 కిలోమీటర్ల దారిపొడవునా అటవీ సౌందర్యాన్ని, నీటి సొగసుల్ని, పక్షుల కిలకిలారావాల్ని, రకరకాల చెట్టుల్ని, చేవల్ని, అదృష్టం దాపురిస్తే పెద్దపులి ఆనవాల్ని పసిగట్టవచ్చు.

అంతేకాకాకుండా, దగ్గరగా ఉండే బ్రహ్మంసాగర్ ను చూసి, శ్రీ రామ కృష్ణయ్య గారికి నమస్కరిస్తూ, కాలజ్ఞానపు జ్ఞాపకాలను నెమరేసుకుంటూ, దగ్గర్లోనే జ్యోతి క్షేత్రాన్ని దర్శిస్తూ ఒక గొప్ప పర్యాటక సర్క్యూట్ ను తయారు చేసుకోవచ్చు.

ఇంత గొప్ప కార్యానికి పూనిక వహించిన ప్రకృతి ప్రియులు, అటవీ సౌందర్యారాధకులు చంద్రశేఖర్ రెడ్డి ని (అరణ్య శేఖర్), వివేకానంద రెడ్డి (వివేక్ లంకమల) లను మనస్ఫూర్తిగా అభినందిస్తూ నల్లమల యాత్రకు సంసిద్ధులవ్వమని కోరుతున్నా..

(భూమన్, చరిత్ర పరిశోధకుడు, రచయిత, ప్రకృతి ప్రేమికుడు, ట్రెక్కర్)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *