*ఉక్రెయిన్ పై రష్యా సాగిస్తున్న యుద్ధాన్ని ఆపాలని కోరుతూ, 7-3-2022న సాయంత్రం 5 గంటలకు, ఏలూరు, మర్చంట్ ఛాంబర్ కళ్యాణ మండపంలో
***
ఉక్రెయిన్ పై యుద్ధం జరుగుతుంటే, ఇండియా లో నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతున్నాయి. కీవ్ లో బాంబులు పడితే, ముంబై స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. అక్కడ కర్ణాటక విద్యార్థి ప్రాణం కొల్పితే, ఇక్కడ మన ప్రజల హృదయాలు
తల్లడిల్లిపోతున్నాయి. ఈ విషాధకరమైన యుద్ధాన్ని మనం గొంతెత్తి నిరసిద్దాం.
ఉక్రెయిన్ పై యుద్ధంలో మృతి చెందేది ఉక్రెయిన్ పౌరులే కాదు. రష్యా చేసే యుద్ధంలో మృతి చెందేది సైనికులే కాదు. ఎవరు ఎవరిపై యుద్ధం చేసినా, ప్రపంచ ప్రజలందరూ నష్టపోతారు. నిజానికిదే ప్రపంచీకరణ ప్రక్రియ!
ప్రపంచీకరణ ప్రక్రియతో పరిస్థితి మరింతమారింది. ఉక్రెయిన్ పై బాంబులు పడితే, మన వంటగదుల పై కూడా ధరల బాంబులు పడ్డట్లే! ముడి చమురు ధర పెంపుదలని చూశాం. ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధర జానెడుంటే, మోడీ సర్కార్ మూరెడు పెంచేది. అది యుద్ధంతో బారెడుకు చేరింది. ఐతే ఐదు రాష్ట్రాల ఎన్నికల వల్ల ఇప్పటికిప్పుడే ధర పెరగలేదు. అది ఎన్నికల ఫలితం వస్తే బారన్నరకి కూడా పెరగవచ్చు. ఒక్క పెట్రోల్ ధర పెంపు వల్ల రవాణా ఖర్చులు పెరిగి, నిత్యావసర సరుకుల ధరలన్నీ పెరిగే ప్రమాదం ఉంది. ప్రపంచీకరణకి ముందు కంటే, తర్వాతే యుద్దాలకి వ్యతిరేకంగా ఎక్కువ నిరసనోద్యమాన్ని చేపట్టాలి. నేడు యుద్ధ వ్యతిరేక ఉద్యమాల్ని కూడా ప్రపంచీకరించాలి.
భారత ప్రజల శాంతి ప్రపంచ ప్రజల శాంతిలో భాగమే. ప్రపంచ ప్రజలకు శాంతి లేకుండా భారత ప్రజలకు ప్రశాంతత లేదు. ఉక్రెయిన్ ప్రజలకు శాంతి లేకుండా మనకు కునుకు పట్టదు. వారు బాంబుల్లో మరణిస్తుంటే, మనకు ప్రశాంతత, భద్రతలు వుండవు. అటు ఉక్రెయిన్ ప్రజలైనా; ఇటు రష్యా, ఉక్రెయిన్ ల సైనికులైనా మనుషులే! మానవ ప్రాణాల కంటే మించినవి ప్రపంచంలో ఏవీ లేవు. ప్రాణం లేని సరుకులకై ప్రాణమున్న మనుషుల పై చేసే దుర్మార్గ యుద్ధమిది. సరుకుల మార్కెట్ల మీద పట్టుకోసమే మనుషుల పై అమానుష యుద్దాల్ని వ్యతిరేకిద్దాం. మనల్ని మనం మనుషులుగా నిరూపించుకుందాం.
చరిత్రలో ప్రతి యుద్దానికి కారణాలు వుంటాయి. అవి ఏమిటో అడిగితే చరిత్ర చెబుతుంది. ఈ యుద్దానికి కారణాల్ని కూడా తెల్సుకుందాం.
ప్రపంచ వ్యాప్తంగా నేటి వరకు నూరు అమానుష యుద్ధాలు చేసిన దుష్ట చరిత్ర అమెరికాకి వుంది. నూటా ఒకటో యుద్ధానికి అది నేడు సిద్ధపడింది. ఉక్రెయిన్ ని నాటో యుద్ధ కూటమిలో చేర్చుకునే నిర్ణయమే యుద్దానికి సిద్ధం కావడం! అమెరికా దూకుడుకి అడ్డుకట్ట వరకే రష్యా పరిమితం కాలేదు. ఇరాక్ దురాక్రమణ నుండి కువైట్ ఆత్మరక్షణ పేరిట మొదటి గల్ఫ్ యుద్దాన్ని అమెరికా చేపట్టింది. నాటి *ఆత్మరక్షణ* యుద్ధం ఆచరణలో *పరభక్షణ* యుద్ధంగా మారడం తెల్సిందే! నేడు అవకాశం వచ్చిందని రష్యా కూడా దూకుడువైఖరి చేపట్టింది. ఆత్మరక్షణ పేర రష్యా ప్రారంభించిన యుద్ధం నేటికి ఆరవ రోజుకు చేరింది. అది ఇంకెన్నాళ్లు సాగిస్తుంది? ఇంకెందరు మరణించాలి? ఇంకెంత విధ్వంసకాండ జరగాలి? ఎక్కడి వరకో ఏదైనా గీత గీసుకుందా? ముహూర్తం పెట్టుకుందా? ఆత్మరక్షణకే అది యుద్ధం చేస్తుందని నమ్ముతున్న వారిని సైతం ఆలోచింపజేసే ప్రశ్నలివి.
నాటో కూటమిలో ఉక్రెయిన్ ని చేర్చుతానన్న జెలెన్స్కీ సర్కార్ ని ఏం చేయాలో ఆ దేశ ప్రజలకి వదలాలి. వారే నిజమైన న్యాయ నిర్ణేతలు! ఐతే సామ్రాజ్యవాద రాజ్యాలకి ప్రజల చొరవ నచ్చదు. తమ కీలుబొమ్మ సర్కార్ ని ఏర్పరిచి ప్రయోజనం పొందే సామ్రాజ్యవాద దేశాలకు ప్రజల చొరవ, భాగస్వామ్యం నచ్చదు. నేడు రష్యా చేసేది యిదే! అది ఏ సమర్ధనకి దిగినా, దాని తర్కంలో పాక్షిక నిజాలు వున్నా, అది కొనసాగించే యుద్ధం వెనక వాస్తవ లక్ష్యాలు సుస్పష్టమే. రష్యా నేడు ఏ మాటలు చెప్పినా దాని లక్ష్యం అమెరికా వదిలేసే యుద్ధ బూట్లలో కాళ్ళు పెట్టడమే! అది నిన్నటి అమెరికా అడుగు జాడల్లో నడవడానికే!
భారత ప్రభుత్వంపై ప్రత్యేక బాధ్యత ఉంది. ఉక్రెయిన్ లో భారతదేశ విద్యార్థులు, పౌరుల్ని క్షేమంగా మన దేశానికి రప్పించాలి. యుద్ధం పేర ప్రజలపై ధరల భారాన్ని
పడనివ్వరాదు. యుద్ధం ఆపాలని UNOలో భారత్ డిమాండ్ చేయాలి. ఈ యుద్దాన్ని ఆపాలని కోరే హక్కు అమెరికాకి లేదని ఖండిస్తూనే, బేషరతుగా ఆపాలని రష్యాని భారత్ డిమాండ్ చేయాలి. ఉక్రెయిన్ ని నాటోలో చేర్చుకోబోమని అమెరికా ప్రకటించాలని కోరుతూనే, అన్ని యుద్ధ కూటాల రద్దు కై భారత్ గొంతెత్తి ఖండించాలి. UNO ద్వారా ప్రపంచ దేశాల్ని కూడగట్టాలి.
*నాటో విస్తరణను అమెరికా ఆపాలి.
*యుద్దభారాల సాకుతో ధరల పెంపు విధానాన్ని నిరసిద్దాం.
*పొంచివున్న పెట్రో, గ్యాస్ ధరల బాంబు పై అప్రమత్తంగా ఉందాం.
పై విషయాలపై ప్రజల్ని చైతన్యపరిచేందుకు ది. 7.3.2022 సోమవారం సాయంత్రం 5 గంటలకు ఏలూరు, మర్చంట్ ఛాంబర్ కళ్యాణ మండపంలో యుద్ధ వ్యతిరేక నిరసన సభ ఉంది. జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము.
సభాధ్యక్షులు :
– బద్దా వెంకట్రావు,
CPI (ML) న్యూడెమోసీ నగర నాయకులు
వక్తలు :
– పి. ప్రసాద్,
CPI (ML) న్యూడెమోక్రసీ
రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు
– యు.వి
CPI (ML) న్యూడెమోక్రసీ జిల్లా అధికార ప్రతినిధి