తిరుపతి జ్ఞాపకాలు-51
గిలితీగె ఈ కోన అద్భుతం. నాలుగైదు కిమీ దాకా వ్యాపించి మెలికలు తిరిగి తోరణాల లాగా వేలాడుతూ ఉంటుంది.
వేలాడే తీగల పైన కూర్చుని ఉయ్యాలలూగాం. తీగ మొదలెక్కడో చివర ఎక్కడో తెలియదు
(రాఘవ శర్మ)
ఒక రాతి కొండ నిట్టనిలువునా చీలింది.
రెండు కొండలను చేసిన ఆ చీలిక మధ్యలో ద్వారం లాంటి దారి ఏర్పడింది.
రెండు రాతి కొండలు చేతులు కలుపుతున్నట్టు, ఒక పెద్ద బండరాయి ఆ రెంటి మధ్య ఇరుక్కు పోయింది.
కింద నీటి మడుగులో కనిపిస్తున్న గులకరాళ్ళు.
ఆ నీటిలో వెనుక మరొక కొండ చీలిక
అక్కడ కూడా చీలిన కొండల మధ్య ఇరుక్కుపోయిన బండ రాయి.
ఆ బండ రాయి కింద ఏర్పడిన ద్రోణి నుంచి ఉధృతంగా దుముకుతున్న జలధార.
గుండం నుంచి నీళ్ళు ముందుకు సాగడం లేదు.
ఆ గులక రాళ్ళ కింద నుంచే అంతర్లీనంగా ప్రవహిస్తున్నాయి.
తలకోనకు సమీపంలో తుంబురు తీర్థాన్ని తలపించేలా ఉన్న నెలకోన.
మానస తీర్థం, తల కోన చూశాక, తిరుగు ప్రయాణంలోఅక్కడే ఉన్న నెలకోనను సందర్శించాం.
నేను, భూమన్, శ్రీనివాస్, వెంకటరెడ్డి, నరేష్ కలిసి నెలకోనలోకి ప్రవేశించాం.
తల కోన లోని సిద్దేశ్వరాలయానికి ఈవల కుడి వైపున నెలకోన వెళ్ళే దారి కనిపిస్తుంది.
నిజానికి దారి కాదు, అదొక పెద్ద ఏరు.
వర్షాకాలంలో ఈ ఏరు ఉధృతంగా ప్రవహిస్తుంది.
రెండు కొండలమధ్య ఏర్పడిన ఆ ఏటిలో ఎన్నెన్ని రూపాలో!
ఏటికి ఇరువైపులా ఎత్తైన వృక్షాలు.
మధ్యలో నీటి ఉధృతికి కొట్టుకొచ్చి నునుపు తేలిన బండ రాళ్ళు.
ఆ రాళ్ళను ఎక్కుతూ, దిగుతూ ముందుకు సాగాం.
పెద్ద పెద్ద లావాటి తోరణాలలాగా మెలికలు తిరిగిన గిల్లితీగ.
వేలాడుతున్న గిల్లి తీగపైన కూర్చుని ఉయ్యాలలూగాం.
ఆ తీగ మొదలెక్కడో తెలియదు, చివర ఎక్కడో తెలియదు.
అది అయిదు కిలోమీటర్లు పాకుతుంది!
ఆ ఏటిలో రాళ్ళను ఎక్కుతూ, దిగుతూ, చెట్ల తీగలను దాటుకుంటూ తీర్థానికి చేరేసరికి అరగంట పట్టింది.
కొండల మధ్య నెలకొన్న సౌందర్యాల వెన్నెలకోన ఈ నెలకోన.
నెలకోనలోదుముకుతున్నజల ధార శబ్దం దూరం నుంచే వినిపించింది.
దానికి సమీపిస్తున్న కొద్దీ ఆ శబ్దం మరింత ఇంపుగా ఉంది.
కొండల పై నుంచి బొట్టు బొట్టుగా నీళ్ళు జారిపడుతున్నాయి.
ఆ కొండలు తమని తామే ఇలా అభిషేకించుకున్నట్టున్నాయి .
కొండ అంచుల్లో ఒక్కో దగ్గర ఒక్కో రూపం!
లేత గులాబీ రంగులో కొండ అంచులు.
ఇరువైపులా ఉన్న ఆ కొండ రూపాలు శేష తీర్థం, తుంబురు తీర్థాన్ని పోలి ఉన్నాయి.
లోపల ఉన్న జలధారవద్దకు ఈదుకుంటూ వెళ్ళవచ్చు.
ప్రారంభంలోనే ప్రమాద హెచ్చరికలూ ఉన్నాయి.
సమయాభావంతో ఆ సాహసం చేయలేకపోయాం.
తలకోన, మానసకోన చూశాక నెలకోన ఒక బోనస్.
శేషాచలం కొండల్లో దేని అందం దానిది, దేని రూపం దానిది, దేని సోయగందానిది.
తలకోన: చిత్తూరు జిల్లా యెర్రవారి పాళెంలో ఉన్న ఆద్భుత మయిన పర్యాటక కేంద్రం. తిరుపతి నుంచి 50 కి.మీ దూరాన ఉంటుంది. అక్కడి చేరుకోవడం సులభం. తిరుపతి నుంచి నేరుగా బస్ ఉంది. లేదా తిరుపతి నుంచి భాకరాపేట కు వచ్చి అక్కడి నుంచి నెరబైలు మార్గంలో కొంతదూరం వెళితే తలకోన వస్తుంది.
(ఆలూరు రాఘవశర్మ, రచయిత, జర్నలిస్టు, ట్రెకర్, తిరుపతి)