తిరుపతి జ్ఞాపకాలు-50
శేషాచలం కొండల్లో ప్రతి గుండానికీ ఒక పేరుంది.
ప్రతి జలపాతానికీ ఒక పేరుంది. ఇంత అందమైన జలపాతానికి ఇప్పటి వరకు పేరు పెట్ట లేదు! ఆ పేరు లేని తీర్థానికి పాదయాత్ర…
(రాఘవ శర్మ)
నీలాకాశాన్ని తనలో ఇముడ్చుకుంది!
చుట్టూ ఉన్న పచ్చని చెట్లనూ ప్రతిబింబిస్తోంది!
నిత్యం రొద చేస్తూ , తన సొదలు వినిపిస్తోంది.
కొండపై నుంచి ఆ జలపాతం సువిశాలమైన నీటి గుండంలోకి జాలువారుతోంది!
శేషాచలం కొండల్లో ప్రతి గుండానికీ ఒక పేరుంది.
ప్రతి జలపాతానికీ ఒక పేరుంది.
ఇంత అందమైన జలపాతానికి ఇప్పటి వరకు పేరు పెట్ట లేదు!
గుడ్డిగా దీన్ని గుండమనే అంటున్నారు!
ఈ గుండంలోంచి వచ్చిన జలధారే తలకోన జలపాతంగా మనల్ని మైమరపించి తన్మయులను చ
చేస్తోంది.
ఇది తల కోనకు తల్లి లాంటిది!
నిండు కుండలా నిండైన నీటి గుండం, నిత్యం దూకే జలపాతంలో మానవ భావనలన్నింటిని దర్శించగలిగాం.
అందుకే దీనికి మానస తీర్థమని నామకరణం చేశాం.
ఈ తీర్థం సమీపానున్న విశాలమైన బండలపై ఒక రాత్రంతా గడిపాం.
తల కోన కొండపై రెండు పగళ్ళు తిరుగాడాం.
ముచ్చటగా మూడు జలపాతాలను చూశాం.
శని, ఆదివారాలలో మా మానస తీర్థ సందర్శన ఇలా సాగింది.
చెన్నైకి చెందిన భక్తి ట్రెక్కర్ శ్రీరాం ఆధ్వర్యంలో 33 మంది అడవిలోకి కదిలాం.
వీరిలో పాతికమంది సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లే!
కొందరు శ్రీకాళహస్తి నుంచి, మరి కొందరు తిరుపతి నుంచి వచ్చారు.
భూమన్ అటవీ శాఖ అనుమతి పొందారు.తిరుపతి నుంచి తలకోన వరకు దాదాపు 70 కిలోమీటర్లు.
శేషాచలం కొండలు తూర్పున ఏర్పేడు నుంచి పడమరన తల కోన వరకు విస్తరించాయి.
శేషాచలం కొండలకు ఎత్తైన ఈ కొండ తల లాంటిది. అందుకే దీనికి తలకోన అనే పేరొచ్చింది. తలకోన కొండ ఎక్కడానికి రెండు మార్గాలున్నాయి.
జలపాతం ఎడమ పక్క నుంచి ఒక మెట్ల మార్గం.
పద్నాలుగేళ్ళ క్రితం ఈ మెట్ల మార్గంలోనే యుద్ధగళ తీర్థానికి వెళ్ళాం.
జలపాతానికి, సిద్దేశ్వరాలయానికి ఈవలనే కుడిపక్కన అటవీ మార్గంలో మొన్న శనివారం మధ్యాహ్నం కొండ ఎక్కడం మొదలు పెట్టాం.
మిట్ట మధ్యాహ్నం.
అంతా దట్టమైన అడవి.
అనేక వృక్షాలు.
అక్కడక్కడా చేమంతి లాంటి చిన్న చిన్న గరిక పూలు, అడవి గోగులు.
దట్టంగా ఈత చెట్లు.
ట్రెక్కింగ్‌లో కులాలు, మతాలు, హోదాలు లేవు.
వాటిని నగరాలలోనే వదిలేసి వచ్చారు.
సామాజిక స్థితిగతులను పక్కన పెట్టేశారు.
చిన్న, పెద్ద తేడాలేదు. అంతా సమానమే.
పరస్పర ప్రేమ, గౌరవం, సహకారం ట్రెక్కింగ్ అసలు సారం. అంతా సమానమన్న భావన చోటుచేసుకొంటుంది.
ఒక పెద్ద రావి చెట్టు, ఊడలు దిగిన మర్రి చెట్టులా ఉంది.
అనేక మొదళ్ళతో శాఖోపశాఖలుగా విస్తరించింది.
తల్లిని బిడ్డ వాటేసుకున్నట్టు, దానిలో మొలిచిన మర్రిచెట్టును రావి చెట్టు పెనవేసుకుంది. రెండూ కలిసి ఆకాశానికి ఎగబాకుతున్నట్టు ఎంత విస్తరించాయో!
ఇంకా చేవ రాని ఎర్రచందనం వృక్షాలు, వాటి మధ్యలో ఈత చెట్లు, రకరకాల చెట్లు.
చెట్ల మధ్యలో దట్టంగా ఏపుగా పెరిగిన గరిక.
కాస్త ఏటవాలుగా ఉన్న కొండపైకి పురాతన కాలంలో మెట్లుగా పరిచిన కొండ రాళ్ళు.
మెట్లపైకి వాలిపోయిన గరికపై కాలు వేస్తే జారుతోంది.
జాగ్రత్తగా అడుగులు వేస్తూ ఎక్కాలి.
ముందుకు పోయిన కొద్దీ కొండ అంచునే మార్గం.
ఒకరి వెనుక ఒకరు వెళ్ళగలిగే సన్నని దారి.
కొండ అంచునే నడుస్తున్నాం.
దూరంగా ఎత్తైన మరో కొండ
రెండు కొండల నడుమ లోతైన లోయ.
దారి ఎన్ని మెలికలు తిరుగుతోందో!
కొండ అంచునే నడుస్తుంటే పక్కనే లోయ.
జాగ్రత్తగా అడుగులు వేయాలి.
ఎదురుగా మరొక ఎత్తుపైకి ఎక్కితే , అమ్మో..కింద లోతైన లోయ .
కాస్త ముందుకు వెళ్ళగానే రెండు కొండల నడుమ పరుచుకున్న విశాలమైన రాతి బండలు.
కొండ అంచును ఒరుసుకుంటూ సాగుతున్న పెద్ద సెల ఏరు. గలగలా ప్రవహిస్తోంది.
కొండ అంచులు ఎన్ని మెలికలు తిరిగాయో, ఆ సెల ఏరూ అన్ని మెలికలూ తిరిగింది . ఒక్కొక్కచోట ఒక్కో శబ్దం చేస్తూ సాగుతోంది.
సెల యేరు కొండ అంచు నుంచి కాస్త మధ్యలో కొచ్చింది.
చిన్నచిన్ననీటి గుండాలుగా ఏర్పడి, ఒక నీటి గుండం నుంచి మరో నీటి గుండంలోకి రొద చేస్తూ దుముకుతోంది.
మధ్యలో లోతైన కాలువలా ఏర్పడింది.
దాని అందాలను వీక్షిస్తూ కాలువ ఆవలకు చేరాం.
ఆ కాలువ మధ్యలో ఏర్పడిన పెద్ద బండరాయిని ఇరువైపుల నుంచి దాటుకుంటూ కిందకు దుముకుతోంది.
అదే తలకోన జలపాతం!
సెల ఏరు దూకే కొండ చివరికికెళ్ళాం.
అదే చివరి అంచు. ఎదురుగా లోతైన లోయ.
కిందకు చూస్తే కళ్ళు తిరుగుతాయి! బలమైన భూమ్యాకర్షణ శక్తి కాళ్ళకు కరెంటు లా తగిలి జిల్లున లాగుతోంది.
చల్లని గాలి వీస్తోంది.
గాలి కాస్త గట్టిగా వీస్తే మనమూ తల కోన జలపాతమైపోతాం.
ఆదమరిస్తే అంతే సంగతులు!
ఆ సెల ఏరు వస్తున్న వేపు దాని వెంటే వెనక్కు కదిలాం.
దట్టమైన అడవి, ఆకాశాన్ని తాకుతున్నట్టున్న ఎత్తైన మామిడి.
నింగి కనపడకుండా చెట్ల కొమ్మలు కమ్మేశాయి.
దట్టమైన అడవిలో మెలికలు తిరిగిన కొండ చిలువలా, వేలాడుతున్న గిల్లి తీగ.
ఆ అడవి రాళ్లమీద ఎక్కుతూ దిగుతూ ముందుకు సాగుతుంటే విన సొంపుగా జలపాతపు హోరు. ఆ హోరును దరిచేరితే కళ్ళ ముందు ఒక మహాద్భుత దృశ్యం.
అర్ధ చంద్రాకారపు కొండ పై నుంచి నీటి గుండంలోకి దుముకుతున్న జలపాతం.
గుండంలో నీళ్ళు ఎంత స్వచ్చంగా ఉన్నాయో!
అందులోని గులకరాళ్ళు కూడా కనిపిస్తున్నాయి!
జలపాతం కింద ఎంత లోతుందో తెలియదు!
గుండాల్లోకి దిగితే మొదటి మునకే సమస్య.
నీళ్ళలోకి దిగితే వెచ్చగా ఉంటుంది. పైకి రాబుద్ది కాదు.
నిట్ట మధ్యహ్నం కూడా నీళ్ళలో ఈ చలేమిటో!
నీళ్ళు జిల్లు మంటున్నాయి.
ఆ నీటి గుండంలో జలకాలాడాక సేదదీరడానికే అన్నట్టు నీటి మధ్యలో కాస్త ఏటవాలుగా ఒక బండరాయి!ఆ బండపై పడుకుంటే పడక్కుర్చీలో పడుకున్నట్టుగా ఉంది.
అర్ధ్ర చంద్రాకారపు కొండ పై నుంచి దిగిన ఊడల ద్వారా సన్నగా కారుతున్న నీటి ధార.
దీనిపైన మరో నీటి గుండమూ లేదు, జలపాతమూ లేదు.
కురిసిన వర్షాలు కొండపైన మట్టిలోకి ఇంకి ,
ఊటలూరి, దాని కింద ఉన్న గుండంలోకి దుముకుతుతున్నాయి.
ఏడాది పొడవునా ఈ జలపాతం గుండంలోకి జాలువారుతూనే ఉంటుంది.
మేం పేరుపెట్టిన మానస తీర్థం నుంచి వెనుదిరగాలనిపించలేదు.
కానీ తప్పదు. ఎంత సేపుంటాం.
వచ్చిన దారినే వెనక్కిమళ్ళాం.
వచ్చే దారిలోనే గుహలున్నాయని సుబ్బరాయుడు చెపితే చూడ్డానికి బయలుదేరాం.
కొంత దూరం వెనక్కి వెళ్ళాక అదే కొండ అంచు, అదే ఏటవాలు.
దారి పొడవునా రాళ్ళు పరిచి ఉన్నాయి.
తల కోనకు ఇదే పురాతనమైన దారి.
ఎడమ వైపున లోయ, కుడి వైపున కొండ అంచు లోనికి చొచ్చుకు పోయింది.
ముందుకు వెళ్ళిన కొద్దీ వింత వింత రూపాలు.
ఎలుగు బంట్లు తిరుగాడిన ఆనవాళ్ళు.
వర్షాకాలంలో ఈ గుహలు ఎలుగు బంట్ల నివాసాలు.
వాటికివి ఎంత భద్రమైన ప్రాంతాలో!
ఆ అంచులను చూస్తూ ముందుకు ఏటవాలుగా దిగుతున్నాం.
దూరంగా తలకోన జలపాతపు హోరు.
270 అడుగుల ఎత్తైన శిఖరం నుంచి కిందికి జాలువారుతున్న తలకోన జలపాతం.
జలపాతానికి ఎడమ వైపునుంచి వచ్చిన వారు దాని కింద కేరింతలు కొడుతున్నారు.
కుడి వైపు నుంచి జలపాతానికి సమీపిస్తున్నా, దరిచేరలేం.
అంతా పాకుడు, జారిపడిపోతాం.
చుట్టూ నీటి ముత్యాలు విరజిమ్ముకుంటూ ఎంత ఎత్తు నుంచి పడుతోందో !
ఎంత హోరుమంటోందీ జలపాతం!
తలకోన జలపాతానికి ఇది పురాతనమైన దహదారి .
సాయంత్రమవుతోంది.
మానస తీర్థం నుంచి సెల ఏరు ప్రవహించే విశాలమైన బండలవైపు సాగాం.
శ్రీరాం బృందం వంటలు మొదలు పెట్టింది.
చీకటి పడింది. చలిమొదలైంది.
చెన్నైలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లే ఇక్కడ నలభీములు
రాత్రి వేడి వేడి అన్నం , సాంబారు, బంగాళాదుంపల కూర, ఒడియాలు, బోండాం.పెరుగు.
ఏ హోటలుకూ తీసిపోని వంటకాలు.
అలసి సొలసిన శరీరాలకు అది విందు భోజనమే.
చలి చంపుతోంది. నాలుగు చోట్ల చలిమంటలు వేశారు.
మంటల చుట్టూ చేరి కబుర్లు.
శేషాచలం అణువణువు తెలిసిన వాళ్ళు ఇద్దరే ఇద్దరు; చిరుతపులి ఈశ్వరయ్య, సుబ్బరాయుడు.
ఈశ్వరయ్య మరణించాడు.
సుబ్బరాయుడు చిన్నతనం నుంచి వచ్చిన వేటను నలబై ఏళ్ళ క్రితం వదిలేశాడు. అతని జీవితం అడవితో పెనవేసుకుపోయింది.
అలుపు సొలుపు లేకుండా తన అటవీ అనుభవాలన్నిటని చెపుతున్నాడు.
అడవికిసంబంధిచినంతమటుకు అతనొక మాటల మూట
అడవి కుక్కలు ఎలా వేటాడతాయి?
ఒంటరిగా దొరికిన పులిని చుట్టుముట్టి ఎలా చంపేస్తాయి?
ఎలుగు బంటు ఎలా దాడి చేస్తుంది?
వేట కుక్కల నుంచి అడవి పిల్లులు ఎలా తప్పించుకుంటాయి?
అడవిలో ఏ జంతువు మనుగడ ఎలా సాగుతుంది?
మంటల చుట్టూ చలి కాచుకుంటూ, వేడి వేడి వేట కథలు వింటుంటే నిద్ర పట్టనేలేదు.
కొందరు చలిమంటచుట్టూ పక్కలేసుకుని, పడుకుని మరీ వేట కథలు వింటున్నారు.
మరి కొందరు నిద్రలోకి జారుకుంటున్నారు.
సుబ్బరాయుడు తెల్లారే వరకు వేట కథలు చెపుతూనే ఉన్నాడు.
సుబ్బరాయుడు తరువాత అడవి గురించి తెలిసిన వ్యక్తి, విగ్రహాల శిల్పి రాదయ్య.
రాధయ్యది తాతల కాలంలో నేతులు తాగిన వంశం.
వారి గొప్పధనం తాతయ్య తోనే ముగిసింది.
రాధయ్య తాత లింగమనాయుడుపాలెగార్, రెండు చిరుత పులులను చంపాడట!
ఇతర జంతువుల వేటకు లెక్కే లేదు.
మంట వేపు కాళ్లు పెట్టుకుని చుట్టూ పక్కలేసుకుని పడుకున్నాం.
చలి మంటకు పాదాలు వేడెక్కి మంటపుడుతున్నాయి.
మిగతా పై భాగం చలితో వణికిపోతోంది.
రాత్రంతా సెల ఏటి రొద వినిపిస్తూనే ఉంది.
చిమ్మ చీకటి . ఆకాశ మంతా చుక్కలు పరుచుకున్నాయి.
చందమామ ఎక్కడా కనిపించడంలేదు.
తెల్లవారు జామున నెల వంక మా వైపు తొంగి చూసింది.
నెల వంక ఆ రాత్రంతా ఎవరి స్వప్న సీమకు వెళ్ళి వచ్చిందో!
తెల్లతెలవారుతోంది.
వేడి వేడి టీ తాగి అందరి వద్ద సెలవు తీసుకున్నాం.
మిగతా వారంతా టిఫిన్లు చేసి తలకోనకు కుడివైపున వచ్చే మెట్ల దారిలో బయలుదేరుతారు.
ఒక అయిదుగురం మాత్రం వచ్చిన దారిలో తిరుగు ప్రయాణమయ్యాం.
తల కోన కొండ దిగాక , పక్కనే ఉన్న నెలకోనను కూడా పలకరించి వచ్చాం.
(రాఘవశర్మ రచయిత, సీనియర్ జర్నలిస్ట్, తిరుపతి)