*భాషకోసం ప్రపంచ కమ్యూనిస్టు పార్టీల వేదిక శ్రద్దతీసుకుందా? ప్రజలకు అర్ధంకాని భాష వాడే కమ్యూనిస్టులపై డిమిట్రావ్ విమర్శ మనకీ వర్తిస్తుంది.
-ఇఫ్టూ ప్రసాద్ (పిపి)
*మన రాజకీయాలు మంచివైతే ప్రజలు మన వైపే వస్తారు.*
*మన ఆచరణ మంచిదైతే మనల్నే అనుసరిస్తారు.*
*మనలో నిజాయితీ, నీతి, నిస్వార్ధత, నిరాడంబరత, త్యాగశీలతలు ఉంటే మననే విశ్వసిస్తారు.*
ఇలాంటి వ్యాఖ్యలు కమ్యూనిస్టు ఉద్యమంలో తరచుగా వినిపిస్తాయి. అవే కాకుండా, మరెన్నో విప్లవాదర్శల్ని, రాజకీయ ధర్మాల్ని కూడా కలిగి ఉండాలి. అందులో భాషా ప్రయోగ కూడా ఒకటి! దానికి అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమం ఎంతటి ప్రాధాన్యత ఇచ్చిందో తెలిస్తే విస్మయం కలిగిస్తుంది. ముఖ్యంగా భాష వాడే పద్దతిపై ఫాసిస్టుల నుండి కమ్యూనిస్టులు నేర్చుకోవాల్సింది పాఠాలు ఉన్నాయని కమ్యూనిస్టు పార్టీలే బహిరంగ సభా వేదిక నుండి ప్రకటించిన విషయం తెలిస్తే మనం దిగ్భ్రాంతికి గురౌతాం. ఆ అనుభవాన్ని విందాం.
*కమ్యూనిస్టులకు సిద్ధాంత బలం ఉంటే చాలదు. రాజకీయ నిబద్దత చాలదు. విప్లవాచరణ వున్నా సరిపోదు. ప్రాణత్యాగం చేసే విప్లవ దీక్ష ఉంటే సరిపోదు. ముఖ్యంగా పీడిత, తాడిత జనం తో కమ్యూనిస్టులు మమేకం కాగలగాలి. వారి మనసుల్ని గెల్చుకోవాలి. అందుకై కమ్యూనిస్టులు చేపట్టి తీరాల్సిన రాజకీయ ధర్మాలు ఉన్నాయి. వాటిలో భాషాధర్మం కూడా ఒకటి. అంటే భాషను సైతం వారు ఎలా సద్వినియోగం చేసుకోవాలో అనేది.*
కమ్యూనిస్టులకు భాష పై పట్టు ఉండాలి. ప్రజల భాషలో ప్రజల్ని చైతన్య పరిచే నైపుణ్యం ఉండాలి. ప్రజలకు అర్ధంకాని భాష ద్వారా ప్రజలకు చేరువ కాలేరు. ఈ విషయంలో ఫాసిస్టుల నుండి సైతం కమ్యూనిస్టులు చాలా నేర్చుకోవాలి. ఈ మాట నేనడం లేదు. ఇది జార్జి డిమిట్రావ్ మాట! అది ఏ సందర్భంలో చెప్పిన మాటో చూద్దాం.
వివిధ దేశాల కమ్యూనిస్టు పార్టీలతో ఏర్పడిందే కొమింటర్న్! Communist international అనే పదాలలోని comm మరియు intern కలిపి commintern అనే సంక్షిప్త పేరు వాడుకలోకి వచ్చింది.
ఇటలీ, జర్మనీలలో ఫాసిజం అధికారంలోకి వచ్చింది. అనేక యూరోప్ దేశాల్లో ఫాసిస్టు శక్తులు పెట్రేగే కాలం. ఫాసిస్టు వ్యతిరేక రాజకీయ కృషి, కర్తవ్యాల దిశలో ఆనాటి కమ్యూనిస్టు పార్టీలు కదులుతున్నాయి. వాటి మధ్య సమన్వయం కూడా ఉంది. ముఖ్యంగా 1933 జనవరిలో హిట్లర్ అధికారానికి వచ్చాక ముమ్మరమైనది. ఆ క్రమంలో మాస్కోలో చరిత్రాత్మక ఏడవ కొమింటర్న్ మహాసభ జరిగింది. అదే ఈ వ్యాస సందర్భం! (హిందుత్వ శక్తుల నుండి నేర్చుకునే పాఠాలపై 14-2-2022 నాటి నా వ్యాసంలో పేర్కొన్నదే.)
*అది మాస్కో నగరం! 1935 జులై 25 వ తేదీ! చరిత్రాత్మక కొమింటర్న్ ఏడవ మహాసభ వేదిక! వివిధ దేశాలకు చెందిన 65 కొమింటర్న్ అనుబంధ పార్టీలకూ, అనుబంధం లేని భావ సారూప్యత గల మరో 19 పార్టీలకూ అందులో ప్రాతినిధ్యం ఉంది. ఓటింగ్ హక్కు గల 371 మంది, ఓటింగ్ హక్కు లేని మరో 142 మంది ప్రతినిధులు కలిపి మొత్తం 513 మంది పాల్గొన్నారు. (భారత కమ్యూనిస్టు పార్టీకి కూడా ఆహ్వానం ఉంది. నాటి పార్టీ కార్యదర్శి మిరాజ్ కర్ మరొకరు బ్రిటీష్ ప్రభుత్వ కళ్ళు కప్పి వెళ్తుండగా దారి మధ్యలో సింగపూర్ లో అరెస్టై హాజరుకాలేక పోయారు) 1935 జులై 25న ప్రారంభమై ఆగస్టు 20 వరకూ 27 రోజులు సాగిన చరిత్రాత్మక మహాసభ అది. ఐతే కమ్యూనిస్టు రాజకీయ ప్రచారకులు మాట్లాడే భాష ఆ సభలో ఒక రాజకీయ అంశమైనది. దానిపై ఓ ప్రబోదాత్మక సందేశాన్ని ఇచ్చింది. ఇది నమ్మశక్యం కాదు. ఔను! అది నూటికి నూరుపాళ్లు నిజం!
25-7-1935వ తేదీ సాయంత్రం మాస్కో లోని HOUSE OF THE UNIONS హాల్ లో సభ అత్యంత ఉత్తేజకరంగా ప్రారంభమైనది. ప్రారంభ వేడుకలతో పాటు కీ నోట్ పై సుదీర్ఘ చర్చని పూర్తి చేసుకొని ఆగస్టు 2వ తేదీ కొమింటర్న్ రిపోర్ట్ ప్రవేశ పెట్టడం జరిగింది.
*కొమింటర్న్ కార్యదర్శి డిమిట్రావ్ ఆరోజు చేతిలో నివేదికతో వేదికపైకి వచ్చాడు. దేశదేశాల కమ్యూనిస్టు పార్టీల మహానేతలు సహా ప్రతినిధులంతా గౌరవ సూచకంగా లేచి నిలబడ్డారు. చప్పట్లు, జయజయ నినాదాల తో స్వాగతం పలికారు
*ఔనుమరి, డిమిట్రావ్ బల్గేరియా లో నిరుపేద కార్మిక కుటుంబంలో పుట్టి, పొట్ట పోషణకై బాల్యంలోనే ప్రింటిగ్ ప్రెస్ కార్మికుడిగా చేరాడు. కార్మిక సంస్థ ద్వారా కమ్యూనిస్టు పార్టీలో చేరాడు. ఒక సోదరుణ్ణి పోలీసు కాల్పుల్లో కోల్పోయాడు. దేశ బహిష్కృతుడై, మరో సోదరుణ్ణి కోల్పోయాడు. దేశభక్తియుత యుద్ధంలో ఇంకో సోదరుణ్ణి కూడా కోల్పోయాడు. ఇద్దరు చెల్లెళ్ళు విప్లవోద్యమంలో బాధల్ని అనుభవించారు. సర్వం కోల్పోయినా తాను విప్లవపధంలో ఏమాత్రం చలించలేదు. బల్గేరియా కమ్యూనిస్టు పార్టీ నుంచి పార్లమెంట్ సభ్యునిగా గెలిచాడు. ఫాసిస్టు నిర్బంధం వల్ల దేశం విడిచి జర్మనీలో అజ్ఞాతం జీవితం సాగించాడు. హిట్లర్ గద్దె ఎక్కాక బెర్లిన్ పార్లమెంట్ భవనాన్ని తానే తగలబెట్టుకొని క్రూర నిర్బందానికి దిగింది. డిమిట్రావ్ 1933 మార్చిలో అరెస్టుచేసి నాజీ జైళ్లల్లో సంకెళ్లతో నిర్బందించారు. కోర్టులో విచారణ చేపట్టారు. చరిత్రలో నాజీ సర్కార్ సమాచార మంత్రి గోబెల్స్ ని క్రాస్ ఎగ్జామ్ చేసి, చెమటలు పట్టించిన చరిత్ర డిమిట్రావ్ కి దక్కింది.
నాజీ నిర్బంధం నుండి ఆయన ప్రాణంతో బ్రతికి వస్తాడని ఆనాడు ఎవరూ ఊహించలేదు. ప్రపంచ కమ్యూనిస్టు పార్టీలు, ముఖ్యంగా సోవియట్ యూనియన్ పార్టీ చేపట్టిన భారీ ప్రచారోద్యమంతో పాటు డిమిట్రావ్ అద్భుత వాదనా పటిమ వల్ల తుదకు హిట్లర్ ప్రభుత్వం 1934 ఫిబ్రవరి 13న విడుదల చేసింది. తాను మాస్కో చేరినపుడు యావత్తు రష్యా ప్రజలు అఖండ విప్లవ స్వాగతం పలికారు. మాస్కో ఎర్ర సముద్రాన్ని తలపించింది. చరిత్రలో ఆయన్ని ఒక మృత్యుoజయునిగా భావించి అంతర్జాతీయ శ్రామికవర్గం ఆయనకు విప్లవ జేజేలు పలికింది. స్టాలిన్ నేతృత్వంలోని కొమింటర్న్ సభ్య దేశాల కార్యవర్గం ఆయన్ని కొమింటర్న్ కార్యదర్శి గా ఎన్నిక చేయడం విశేషం! ఆ విశేష నేపధ్యం గల డిమిట్రావ్ ఆరోజు వేదిక పైకి ఎక్కిన సందర్భమది. నాటి జయాజయధ్వాల చారిత్రక, రాజకీయ నేపద్యమది.
కార్యదర్శి డిమిట్రావ్ నేతృత్వంలో 1934 చివరలో EXECUTIVE COMITTEE OF COMMUNIST INTERNATIONAL (ECCI) సమావేశం జరిగి పై సభలో ప్రవేశపెట్టే ముసాయిదా నివేదికను రూపొందించే పనిని చేపట్టింది. దానిపై 8 రోజుల చర్చ తర్వాత డిమిట్రావ్ సమప్ చేశారు. ఆ సందర్భంగా ఆయన కమ్యూనిస్టుల భాష ఎలా ఉండాలో ఒక ఉదాహరణ చెప్పాడు. నాటి ప్రపంచ కమ్యూనిస్టు పార్టీల హేమాహేమీల వంటి నేతలందరి ఎదుట డిమిట్రావ్ తన స్వంత అనుభవాన్ని వ్యంగ్య రూపంలో ఉదాహరణగా కూడా పేర్కొన్నారు. అది ఏమిటో ఇంకోసారి చూద్దాం.