* ప్రత్యేక హాదా – ఆంధ్రుల హక్కు, హోదా కోసం మోడీ ప్రభుత్వం పై ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అవిశ్వాస తీర్మానం పెట్టాలి : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్
అమరావతి : ప్రత్యేక హోదా సాధన కోసం మోడీ ప్రభుత్వం పై ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అవిశ్వాస తీర్మానం పెట్టాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా సాధనలో ప్రాంతీయ పార్టీ లు పూర్తిగా విఫలమయ్యాయని, కేంద్రాన్ని నిలదీసే దమ్ము, ధైర్యం లేని దద్దమ్మ పార్టీలతో అఖండ ఆంధ్ర ప్రదేశ్ గా వెలుగొందాల్సిన రాష్ట్రం శూన్య ఆంధ్ర ప్రదేశ్ గా మారిందని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే కేంద్రం మెడలు వంచుతామని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రకటనలు చేసి ఇప్పుడు రాష్ట్ర ప్రయాజనాలను కాలదన్ని ఆ పార్టీ ఎంపీలు మోడీ వద్ద మోకరిల్లడాన్ని చూస్తుంటే జాలి కలుగుతోందని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హాదా – ఆంధ్రుల హక్కు అని, అది కాంగ్రెస్ పేటెంట్ అని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా సాధన కోసం అలుపెరగని పోరాటం చేశామని, హోదా వచ్చేవరకు పోరాటం చేస్తామని అన్నారు. శుక్రవారం ఆయన ఈ మేరకు విజయవాడ ఆంధ్ర రత్న భవన్ నుంచి ఒక ఒక ప్రకటన విడుదల చేశారు.
ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ పేరుతో రాయల సీమకు, ఉత్తరాంధ్రకు బుందేల్ ఖండ్ తరహా ప్రత్యేక అభివృద్ధి నిధులు కేంద్రం ఇవ్వాలని చట్టంలో సెక్షన్ 46(3)లో స్పష్టంగా పేర్కొన్నా రూ. 24,350 కోట్లతో ప్రతిపాదనలు పంపితే పిల్లికి బిచ్చం వేసిన చందంగా రూ. 1050 కోట్లు మాత్రమే ఇచ్చిందని వివరించారు. విభజన చట్టంలోని 108 సెక్షన్లు 13 షెడ్యూళ్ల కింద దాదాపు రూ. 5 లక్షల కోట్ల ప్రయోజనాలు రాష్ట్రానికి అందించాలని, అందులో 2014-15 రెవిన్యూ లోటు భర్తీ రూ. 16,078.7 కోట్లకు గాను రూ. 3,979.50 కోట్లు మాత్రమే ఇచ్చిందని వెల్లడించారు. అలాగే పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేందుకు దాదాపు రూ. 40 వేల కోట్లు కావాలని, కేంద్రం రూ. 11,921 కోట్లు మాత్రమే ఇచ్చిందని, రాజధానికి రూ. 1,500 కోట్లు ఇచ్చారని గుర్తు చేశారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు కాలేదని, పెట్రో కెమికల్ కాంప్లెక్స్ మొదలు పెట్టలేదని, ముఖ్యమంత్రి స్వంత జిల్లా కడప లో ఎస్ఎఐఎల్ ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ మొదలు పెట్టలేదని, దుగరాజ పట్నం ఓడ రేవు మొదలు కాకున్నా పార్లమెంట్ లో వైసీపీ ఎంపీలు ఎందుకు నోరు విప్పడంలేదని శైలజనాథ్ ప్రశ్నించారు. విజయవాడ, విశాఖ మెట్రో పనులు మొదలు పెట్టలేదని, రూ. 5 లక్షల కోట్లకు గాను ఏడున్నర సంవత్సరాలు అవుతున్నా కేవలం రూ. 20,166 కోట్లు మాత్రమే ఇచ్చారని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసినా వైసీపీ ఎంపీలు గాంధారి పాత్ర పోషిస్తున్నారని ధ్వజమెత్తారు.
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అంశం పై పోరాడకుండా వెనక్కి వెళ్లిపోయిన వైసీపీ నేతలకు చీమ కుట్టినట్లు కూడా లేకపోవడం శోచనీయమని విమర్శించారు. సంజీవని లాంటి ప్రత్యేక హోదాను నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తే దానిని అమలు చేయడంలో బీజేపీ ప్రభుత్వం గత ఏడున్నర సంవత్సరాలుగా చేస్తున్న మోసాన్ని ప్రజలు గమనిస్తున్నారని శైలజనాథ్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని, వైసీపీ ఎంపీలు ప్రజల సొమ్మును దిగమింగడానికి పార్లమెంట్ సమావేశాలకు హాజరవుతున్నారు తప్ప వీళ్ళ వలన రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం లేదని శైలజనాథ్ ఆరోపించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తో పోరాడి చట్టబద్ధంగా, న్యాయంగా మన రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులను రాబట్టాలని శైలజనాథ్ డిమాండ్ చేశారు.