(జువ్వాల బాబ్జీ)
ఆది నుండి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తొందర పాటు చర్యల ద్వారా పనుల కుపక్రమించింది. 2004 సంవత్సరం లో అప్పటి ముఖ్య మంత్రిగా ఉన్న వై. ఎస్ రాజశేఖర రెడ్డి కేంద్ర ప్రభుత్వం నుండి అనుమతులు లేకుండా నే కుడికాలువ నిర్మాణం కోసం భూమి పూజ చేసారు.
అప్పటి నుండి ఇప్పటి వరకూ అన్ని చర్యలూ చట్ట విరుద్ధం గా అనేక రకాల పనులు చేస్తూ వచ్చారు.
కేంద్ర పర్యావరణ అనుమతులు 2009 సం. లో మంజూరు అయ్యాయి.
పోలవరం ప్రాజెక్టు ఆసియాలోనే అతిపెద్ద ప్రాజెక్ట్ గా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీని వలన పర్యావరణ విద్వంసం తో పాటు, జీవవైవిధ్యం దెబ్బ తినే పరిస్థితులు ఉన్నట్లు పర్యావరణ వేత్తలు చాలా సందర్భాల్లో ఆందోళన వ్యక్తం చేశారు.
పోలవరం ప్రాజెక్టు బహుళార్థ సాధక ప్రాజెక్టుగా రాష్ట్ర ప్రభుత్వం చెపుతుంది. అప్పటి నుండి అనగా 2005 నుండీ 2010 వరకూ అన్ని ప్రధాన పత్రిక లకు పోలవరం ప్రాజెక్టు వార్తలు మొదటి పేజీ లో ఉండేవి. తర్వాత మీడియా కు అవి చివరి పేజి కి పరిమితం అయ్యాయి.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వలన 373 గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి.
ఈ ప్రాంతం 5వ, షెడ్యూల్ ప్రాంతం లో ఉంది.గిరిజనుల కు స్వయం పాలన కోసం” పిసా” చట్టం 1996 ఉంది. దీని ప్రకారం ఈ ప్రాంతం లో నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మించాలంటే ముందుగా గిరిజనుల తో కూడిన గ్రామ సభ ఆమోదం పొందిన తర్వాత నే పనులు ప్రారంభించాలి. కానీ, ఇవేమీ పట్టని ప్రభుత్వం తొందర తొందర గా పనులు చేస్తూ వచ్చారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వలన ముంపుకు గురవు తున్న కుటుంబాల లో 59 శాతం మంది గిరిజనులు ఉన్నారు. వీరంతా తమ ఓట్లు వేసి కాంగ్రెస్ ను అధికారం లోకి తెచ్చుకున్నారు. పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు. గెలిచిన తర్వాత అదే ఎమ్మెల్యే వారిని ఇలా నిర్వాసితుల ను చేస్తారని ఊహించ లేదు. ఇటీవల పోలవరం , దేవిపట్నం మండలాల పరిధిలోని గిరిజన, గిరిజనేతెర నిర్వాసిత కుటుంబాలకు చెందిన వారు నిరసన దీక్ష కార్య క్రమాలు చేపట్టారు.
కారణాలు ఇవీ…
కాఫ ర్ డ్యామ్ నిర్మాణం వలన,41.5 కాంటూరు పరిధిలో ఉన్న గ్రామాల నుండి బయటకు పంపించారు కానీ, భూసేఖరణ చట్ట ప్రకారం కనీస చర్యలు తీసుకోలేదని ,
1. పునరావాస కాలనీలలో త్రాగు నీరు లేదనీ,
2. బాత్ రూమ్ లు కట్టారు కానీ, సెప్టిక్ ట్యాంకు లు లేవనీ,
3. పిల్లల కు స్కూల్స్ లేవనీ, దానితో చదువుకు దూరమయ్యారు
4. రోడ్లు లేవు.
5. ఉపాధి లేదనీ,
6. స్మశాన వాటికకు స్థలాలు లేవనీ.
ఈ పరిస్థితుల్లో మమ్ముల ను నమ్మించి పునరావాస కాలనీల కు తరలించారని వాపోతున్నారు. కాబట్టి , చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని వాటిని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ దీక్ష లు చేశారు.
41 రోజుల పాటు పోలవరం మండల పరిధిలోని నిర్వాసితు లు దీక్ష చేసి విరమించారు. దేవీ పట్నం లో మాత్రం కొనసాగిస్తూ ఉన్నారు.
నిర్వాసితుల డిమాండ్స్
- ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ పెంచి రూ. పది లక్షలు ఇవ్వాలని.(దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం 244 జీ. ఓ. ను తేవడమే కాకుండా,500 కోట్లు విడుదల చేస్తున్న ట్లుగా ప్రకటించింది.)
- ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కి అర్హులుగా గుర్తించి సర్వే లో ఉన్న వారు మరణించి నట్లయితే ఆ సొమ్మును వారి కుటుంబ సభ్యులకు ఇవ్వాలని.
- సర్వే రిపోర్టు లో ఉన్న 18 సం. లు నిండిన ఆడ పిల్లల పేర్లు పెండ్లి చేసుకున్నారని తొలగించారని, వారికి కూడా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
- ఆర్ ఓ ఎఫ్ ఆర్ చట్ట ప్రకారం గిరిజనులు సాగు చేస్తున్న పోడు భూములకు, భూమి కి భూమి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
- ఇంకా చాలా మంది గిరిజనులు నుండి సేకరించిన భూమికి భూమి, నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
- పునరావాస కాలనీలలో చాలా సమస్యలు అసంపూర్తి గా ఉన్నాయి. చట్ట ప్రకారం 25 రకాల సౌకర్యాలు పూర్తి చేయాలనీ డిమాండ్ చేస్తున్నారు.
ఈ నిరసన కార్యక్రమాలు ముందుగా నాన్ ట్రైబల్ నిర్వాసితులు ప్రారంభించారు. దానికి సరైన స్పందన రాలేదు. వెంటనే వారు గిరిజన నిర్వాసితులను సంప్రదించారు.
దీనితో ఉద్యమం ఊపందు కుంది.అధికారులు చర్చలు జరిపారు, నిర్వాసితులు ఒప్పు కోలేదు. నిర్వాసితులలో అధికార పార్టీకి చెందిన వారు, ప్రతిపక్ష పార్టీల వారు ఉండటం తో ఉద్యమం రాజకీయ పార్టీ నేతల ను ఆకర్షించింది. దానితో, తెలుగు దేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని ప్రసంగించారు.
దీనితో వై ఎస్ ఆర్ పార్టీ నాయకులు, పాల్గొని ప్రసంగించారు. ఎమ్మెల్యే తెల్లం బాలరాజు కూడా పాల్గొని నిర్వాసితుల డిమాండ్స్ పై అధికారుల తో మాట్లాడారు.
చివరకి ప్రభుత్వం పోలవరం మండల పరిధిలోని నిర్వాసితులు 1100 మందికి ప్యాకేజీ ఇస్తామని చెప్పి, కొంత మంది బ్యాంక్ అకౌంట్ లలో సొమ్ము లు వేసారు. ఇంకా 300 మంది కి వేయాలని చెపుతున్నారు. దీనితో ఉద్యమం నిలిపి వేశారు. ఇది పూర్తిగా గిరిజనుల ను నాన్ ట్రైబల్స్ వాడుకొని మోసం చేశారని ప్రభుత్వం తో చర్చల కు గిరిజనుల ను తీసుకు వెళ్లలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మాటల పై నమ్మకం లేని పోలవరం మండల పరిధిలోని 7 గ్రామాల గోదావరికి భయపడకుండా అక్కడే కొండల మీద గుడిసెలు వేసుకుని ఉన్నారు.
ప్రభుత్వం, అధికార పార్టీ నాయకులు చెప్పిన మాటలు విని పునరావాస కాలనీల కు వచ్చిన వారు ఇప్పుడు, తర తరాలుగా పొడుకొట్టి పెంచుకున్న జీడితోట ఫలసాయం ఏరుకుందామని, కనీసం తమ పశువు లను బతికించు కుందామని, తిరుగు ప్రయాణం కట్టారు.
ఇప్పుడు చాలా మంది గిరిజనులు మరలా తిరిగి వచ్చిన దారినే తమతమ పాత గ్రామాల కు పయనం కట్టారు. ముఖ్యంగా వీరిలో కొందరు తమ పశువు లను, మేకలు గొర్రెలు తక్కువ ధరకు అమ్మి వచ్చిన సొమ్ముతో పునరావాస కాలనీల కు వచ్చారు. కొందరైతే అమ్మకుండా వచ్చి ఇక్కడ వాటికి మేత భూములు లేక నానా రకాల అవస్థలు పడ్డారు. అర కొర సదుపాయాల తో అక్కడ ఉండ లేమని మూట ముల్లు సర్దుకొని తమ స్వంత గ్రామాలకు తరలి పోతున్నారు.
ఈ వాదన లో వాస్తవం ఎంత?
గత సంవత్సరం జాతీయ ఎస్టీ కమీషన్ సభ్యులు, శ్రీ అనంత్ నాయక్ ముంపు గ్రామాలను ది;24/8/2021 నుండి 28/8/2021 వరకూ సందర్శ్చించి గిరిజన నిర్వాసితుల నుండి ఫిర్యాదులు స్వీకరించి తదనుగుణంగా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు.
ఈ పర్యటనలో భాగంగా ప్రభుత్వం కమీషన్ సభ్యుల కు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం,
ముంపుకు గురయ్యే గ్రామాలు,373 గానూ, ఇప్పటికి కేవలం 25 ఆవాస గ్రామాలను తరలించి నట్లు పేర్కొన్నారు.
ఇంకా 213 గ్రామాలు కు గానూ 26 కాలనీలు పూర్తి చేసినట్లూ, మిగతా 187 నిర్మాణ దశలో ఉన్నట్లు నివేదించారు.
ఇప్పటి వరకూ నిర్వాసితులు, ప్రాజెక్ట్ కోసం అవసరమైన భూమి, మొత్తం 1,67,339.13 ఎకరాలు గానూ, ఇప్పటి వరకూ 1,12,555.13 సేకరించి నట్లు గానూ,ఇంకా సేకరించాల్సి న భూమి 54, 226.51 ఎకరాలు గా పేర్కొన్నారు.
గమనిక
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చెపుతుంది,2022 డిసెంబర్ నాటికి ప్రాజెక్ట్ పూర్తి చేయాలనీ.
ఈ మాటలు నమ్మ సఖ్యంగా లేవు.
కమీషన్ గిరిజన నిర్వాసితుల కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని సిఫార్సులు చేసింది. అవి;
నిర్వాసితుల సమస్యలు పరిష్కారం చేసి దాని నివేదిక ఏ. పి. ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ 4 వారాల్లోగా కమీషన్ కు నివేదించాలని ఆదేశించింది.
వాటిలో కొన్ని
1.ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ రూ;10 లక్షలు ఇవ్వాలని
2. పునరావాస కాలనీలలో క్వాలిటీ నిర్మాణం. ముఖ్యంగా ఇండ్ల కు వెంటిలేషన్, డోర్స్, కిటికీలు, గోడల పగుళ్లు, రూఫ్ ల ద్వార వర్షపు నీరు కారటం, లాంటి వాటిని వెంటనే నివారణ చర్యలు తీసుకోవాలని సిఫార్సులు చేసింది.
3. త్రాగు నీరు, డ్రైనేజీ లాంటి వాటిని 10 రోజుల్లో పరిష్కరించాలని స్పష్టం చేశారు.
4. కమీషన్ రిపోర్ట్ లో10 పేరాలో ఆర్. ఓ. ఎఫ్.గురించి చాలా స్పష్టంగా పేర్కొన్నారు.
కొసమెరుపు ఏమిటంటే…
పునరావాస కాలనీలలో సదుపాయాలు పరిశీలన కోసం కేంద్రం నుండి ఎవరైనా ఉన్నత స్థాయి అధికారులు వస్తే వారిని బుట్టాయ గూడెం మండలం లోని పల్లపూరు గ్రామం కు మాత్రమే తీసుకు వెళతారు. ఎందుకంటే, అది గుడ్డిలో మెల్లగా కొంచెం మెరుగుగా చెప్పు కోవ టానికి ఉంది. ఇప్పుడు ఆ గ్రామస్తులే పాత గ్రామా నికి వెళుతున్నారు.
పోలవరం ప్రాజెక్టు లో వేలాది ఎకరాలు అటవీ భూమిని గిరిజనులు సాగు చేస్తున్నారు. వీటికి 2009 సం. లో అటవీ హక్కుల గుర్తింపు చట్టం ప్రకారం ఉమ్మడి హక్కు పత్రాలు ఇచ్చారు. వాటికి కూడా నష్ట పరిహారం చెల్లించాలని భూసేకరణ చట్టం 2013 స్పష్టం చేసింది.కానీ ఇవేమీ పట్టని ప్రభుత్వం తొందర తొందర గా గిరిజనులను పునరావాస కాలనీలకు తరలిస్తుంది.
గిరిజనుల కోసం సేకరించిన భూముల ను వారికి ఇవ్వకుండా, దళారీలు, రెవెన్యూ అధికారులు కుమ్మక్కైఒక్కో ఎకరా రూ 25000 కౌలు కు ఇచ్చి డబ్బులు దండు కుంటున్నారు. ఇది పూర్తిగా రెవెన్యూ అధికారులు, అధికార పార్టీ నాయకులు కలసి కట్టుగా చేస్తున్నారు. ఇటువంటి అనుభవాలు ఇక్కడ కోకొల్లలు.
ఉదా. జీలుగుమిల్లి మండలం, పి. నారాయణ పురం , పి. అంకం పాలెం, (270 ఎకరాలు ఈ రెండు గ్రామాల లో ఉన్నాయి.) ఇంకా,దర్భ గూడెం, స్వర్ణ వారిగుడెం, రాచన్న గూడెం లాంటి గ్రామాల్లో ఈ అక్రమ కౌలు సాగు చేస్తున్నారు. దీనిపైన ఇటీవల ఎమ్మెల్యే తెల్లం బాలరాజు జీలుగుమిల్లి మండల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్. ఆర్. ఓ. జి. ఎలీషాతో అటువంటి భూముల్లో బోర్డు లు పెట్టాలని, ఆ భూములను స్వాధీనం చేసుకుని గిరిజనులకు ఇవ్వాలని లేదంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఏదైతేనేం, నిర్వాసితుల పరిస్థితి అంతా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల మధ్య బంతాట ల ఉందనీ, రాజకీయ పార్టీ లకు వారి ఓట్లు కావాలని నిర్వాసితుల సమస్య ల పరిష్కారం కోసం ఏ ఒక్క పార్టీ చిత్త శుద్ధితో పనిచేయటం లేదని ప్రజలు అర్థం చేసుకోవాలి. చట్ట ప్రకారం కోర్టుల్లో కేసులు వేసి న్యాయ పోరాటానికి సిద్ధం కావాలి.
(జువ్వాల బాబ్జీ, అడ్వకేట్, పోలవరం ప్రాజెక్టు దళిత నిర్వాసితుల జాయింట్ యాక్షన్ కమిటీ. ఫోన్: 9963323968,)