కరిష్మా వైద్య విద్య ఖర్చంతా భరిస్తానన్న ఎమ్మెల్యే

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం గుడ్లబోరి గ్రామానికి చెందిన చహరే జనార్దన్ -రేఖ దంపతుల మూడో సంతానం కరిష్మా. ఆమె  ఆల్ ఇండియా మెడికల్ ఎంట్రెన్స్ లో  1,11,479 ర్యాంకు సాధించింది.. హైదరాబాద్ లోని అపోలో మెడికల్ కాలేజీలో సీటు సాధించింది. అయితే, సంవత్సరానికి మూడులక్షల ఫీజు కట్టాలి. అంత ఫీజు భరించేస్థితిలో , అందునా ప్రతి సంవత్సరం భరించే స్థితిలో కుటుంబం లేదు.

కరిష్మా

 ఫిజులు కట్టలేని కరిష్మా దీన పరిస్థితి  సిరిపూర్ కాగజ్ నగర్  ఎమ్మెల్యే కోనేరు కోనప్పకి తెలిసింది. అంతే, ఆయన కరిష్మా ను పలిపించికుని, తాను అండగా ఉంటానని, మెడిసిన్ లో చేరేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని హామీ ఇచ్చారు.   కరిష్మా  మెడిసిన్ పూర్తయ్యే  వారి కుటుంబానికి అండగా ఉంటానని హా మీ ఇస్తూ, మెడిసిన్ సీటు సంపాదించినందుకు  కరిష్మాను  సన్మానించారు. తనే స్వయంగా కరిష్మాను కాలేజీకి  వెంట తీసుకువెళ్లి పీజులు కట్టి కళాశాలలో చేర్పిస్తానని కూడా చెప్పారు.
కోణప్ప రాజకీయాలు
కోనేరు కోనప్ప తెలంగాణలో  ఒక ఎమ్మెల్యే. రాజకీయ నాయకుడు. రూలింగ్ టిఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే. అయితే, ఆయన  రోజూ వారీ రాజకీయాల్లో వార్తల్లో కనిపించదు.  ఆవేశపూరిత రాజకీయ ప్రకటనల్లో వినిపించడు. రెచ్చిపోతూ స్వయంగా రాజకీయ వివాదాల్లో చొరబడడు. ఒక్కమాటలో చెబితే, రాజకీయాలకు దూరంగా ఉండే రాజకీయనాయకుడాయన.
మరి ఆయనేం చేస్తుంటారనే ప్రశ్న వస్తుంది.
కోనప్ప ఎపుడూ ప్రజల్లో ఉంటారు. కష్టాల్లో ఉన్న ప్రజలకుఎపుడూ అండగా ఉండాలనుకోవడం ఆయన రాజకీయం. తన నియోజకవర్గంంలోని జూనియర్ కాలేజీల్లో సుదూరప్రాంతాలనుంచి వచ్చే పేద విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం అందుబాటులో ఉండని విషయాన్ని ఒక సారి కళ్లారా చూసి అన్ని జూనియర్ కాలేజీలకు మధ్యాహ్న భోజన ఏర్పాటు చేశారు. ఇలా దాదాపు 2500 మందికి రోజూ మధ్యాహ్న భోజనం పథకం తానే స్వయంగా ఖర్చు భరిస్తూ అమలుచేస్తున్నారు.మరొక విషయం ఏంటంటే, మొదట్లో ఈ పథకానికి భోజనం స్వయంగా కుటుంబ సభ్యులే ఇంట్లోను పెద్ద కిచెన్ ఏర్పాటు చేసి పంపించేవారు. ఇది మూడేళ్లుగా నడుస్తూనే ఉంది. ఇక  కరోనా పాండెమిక్ సమయంలో కష్టాల్లో ఉన్న వారందరికి బైక్ భోజనం ఏర్పాటు చేశారు. బైకో భోజనం అంటే,  ఇంట్లో తయారుచేసిన భోజనాన్ని ఆయన అనుచరులు బైకుల మీద కరోనా రోగుల ఇళ్లకు సప్లే చేయడం. ఒక్కొక్క సారి 25 కి.మీదూరం ఉన్న పల్లెలకు కూడా భోజనం క్యారియర్లు వెల్లాయి. నాలుగు ఫోన్ నెంబర్ లు ప్రజలకు విడుదల చేసి వాటికి కాల్ చేస్తే చాలు భోజనం అందేలా ఏర్పాటు చేశారు.
Midday meals for students
ఒక జూనియర్ కాలేజీలో మధ్యాహ్న భోజనం
అంతేనా, లాక్ డౌన్ కాలంలో, పట్టణంలో హోటళ్లు లేనిసమయంలో, పనుల మీద కాగజ్ నగర్ వచ్చే కూలీలకు, చిరుద్యోగులకు, నిరుద్యోగులకు, విద్యార్థులకు భోజనం అందబాటుల్లోకి తెచ్చేందుకు నిత్యాన్న దాన సత్రం ఏర్పాటు చేశారు. ఇది ఆషామాషీ వ్యవహారం కాదు. ఏ దేవాలయానికి తీసి పోని విధంగా శుచిగా, శుభ్రంగా, వేడిగా భోజనం వడ్డించే అన్నసత్రం ఇది.దేవాయలాకు బయట ఒక ప్రైవేటు వ్యక్తి ఇంత భారీ కిచెన్ ఏర్పాటు చేయడం ఎక్కడ ఉండదేమో. కోనప్ప నిత్యాన్న దాన సత్రం చాలా పాపులర్ అయింది. ఇలాంటి వాటిని నడపడం ఎలా సాధ్యం అని చూసేందుకు రాష్ట్రంలోని అనేక ప్రాంతాలనుంచి సందర్శకులు వస్తున్నారు. అనేక మంది ఈ నిత్యాన్న దాన సత్ర నిర్వహణలో పాలుపంచుకుంటున్నారు. విశేషమేమిటంటే, కోనప్ప భోజన సత్రం ప్రజా ఉద్యమం లాగా సాగుతూఉంది.
 కోనప్ప చేపట్టిన మరొక మహత్తర మయిన కార్యక్రమం సామూహిక వివాహాలు. ఏదో పబ్లిసిటీ కోసం, ఎవరి జ్ఞాపకార్థమే చేపట్టే మొక్కుబడి వార్షిక తంతులాగా కాకుండా, మనస్ఫూర్తిగా దగ్గిర నుంచి జరిపించే కార్యక్రమం. ఇందులో ఆయన కుటుంబ సభ్యులంతా పాల్గొంటారు. కూతురు కొడుకు పెళ్లి చేసే పెద్ద మనిషి లా కోనప్ప ఈ వివాహాలను ప్రతియేడాది జరిపిస్తూ ఉంటారు. వివాహాలు జరపడమే కాదు,కొత్త సంసారానికి అవసరమయిన కానుకలనుకూడా కొత్త దంపతులకు అందించి సాగనంపుతూ ఉంటారు.
తాజాగా…
కొమరం భీమ్ అసిఫాబాద్ జిల్లా పెంచికల్ పెట్ మండల కేంద్రము లోని భద్రకాళి దేవాలయం ఆవరణంలో ఆదివారం సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అద్వర్వలో 111 సామూహిక వివాహాలు జరిపించారు.

కాగజ్ నగర్ కు చెందిన వేద పండితులు బాచంపల్లి కమలాకర్ శర్మ బృందంచే వేద మంత్రాలతో,
భాజాభజంత్రీ లతో, వేద పండితుల సమక్షంలో ఉదయం 12.05 నిముషాలు అభిజిత్ లగ్నంలో సుముహూర్తం లో కల్యాణాన్ని వేద పండితులు ప్రారంభించారు.

దహాగాం, పెంచికల్ పేట, బెజ్జురు, చింతలమానపల్లి 4 మండలాలకు చెందిన
111 జంటలకు వివాహానికి అవసరమైన వస్త్రాలు, బంగారు ఆభరణాలు, తాళి, మట్టెలు, ఇంటి
సామగ్రి ఇచ్చి  ఎమ్మెల్యే కోనప్ప దంపతులు వధూవరలను సాగనంపారు.

వివాహాలు చేసుకున్న జంటలను కలెక్టర్ రాహుల్ రాజ్, రాష్ట్ర ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్, అసిఫాబాద్ జడ్పీ చైర్మన్ కోవ లక్ష్మి, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, లు అసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, వివిధ మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీ లు, సర్పంచులు, ప్రముఖ లు దాతలు తెరాస నాయకులు ప్రజలు హాజరు అయ్యారు.

 

 ఎపుడూ ప్రజల మధ్య ఉండేందుకు ఎమ్మెల్యే కోనప్ప ఎంచుకున్నుమంచి రాజకీయాలు,సంక్షేమ రాజకీయాలు ఇదే…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *