తరిగొండ వెంగమాంబ అడుగులో అడుగు వేస్తూ…

(భూమన్)
ఈ ట్రెక్ ప్రత్యేకమయింది.   తరిగొండ వెంగమాంబ శేషాచలం అడవుల్లోకి చేరుకుని మొగిలిపెంట కోనవద్ద తపస్సు చేసిన ప్రాంతాన్ని,  ఆమె గీచిన  ఆంజనేయుడి బొమ్మను, నా భార్య ప్రొఫెసర్ కుసుమకుమారికి చూపించాలని చాన్నాళ్లుగా అనుకుంటున్నా. ఈ ప్రయత్నం నిన్నటికి పూర్తయింది.
తరిగొండ వెంగమాంబ
తరిగొండ వెంగమాంబ
తరిగొండ వెంగమాంబ తరిగొండను చిన్న ప్రాయంలోనే వదిలి తలకోన గుండా దట్టమయిన శేషాచలం అడవుల్లోకి ప్రవేశించి తులేరుగుండ మార్గం ద్వారా దాదాపు 25 కి.మీ ప్రయాణించి మొగలి పెంటకోన చేరుకున్నట్లు చెబుతారు.  అక్కడ  కొన్నేళ్లు ధ్యానం చేసి తర్వాత తిరుమల చేరుకున్నట్లుగా  కథనం.
వెంగమాంబ గీచిన ఆంజనేయ స్వామి
వెంగమాంబ గీచిన ఆంజనేయ స్వామి
ఆమె తపస్సు చేసిన ప్రాంతంలో ఇప్పటికీ ఆంజనేయుడి చెదిరిన బొమ్మ వుంది. ఆ ప్రాంతాన్ని యుద్ధగళం, రుద్రగళం అని కూడాపిలుస్తారు.  ఈ ప్రాంతం జలపాతపు హొయళ్ల మధ్య అత్యంత ప్రశాంతంగా ఉంటుంది. 25 కి.మీ అవతల 2500 సంవత్సరాల క్రితం నాటి ఆదిమ మానవుడి చిత్రకళ కూడా ఇక్కడ ఉండటం గొప్ప విశేషం. సింధూ హరప్ప, మొహంజోదారో నాగరికతల నాటి బొమ్మలను చూసి ఉంటాము. అలాంటి ఎద్దుల శివంగుల ఏనుగల గుర్రాల బాణాల ఈటెల బొమ్మలు ఇక్కడ ఉన్నాయి. నేనింతకు మునుపు కూడా వీటిని చూశాను.

కాని, నిన్న పోలేకపోయాను. ఎందుకంటే, మా నడకకు గంట ముందుగా ఏనుగులు అక్కడ సంచిరించినట్లుగా వాటి లద్దెలను చూసి తెలుసుకుని వెనక్కి వచ్చేశాము.
ఇంతకు మునుపు, తలకోన నుంచి అరభాగం చూశాము. ఇపుడు పూర్తిగా తరిగొండ వెంగమాంబ వేసిన అడుగులో అడుగు వేసి ఆమె ఉన్న ప్రాంతాన్ని చూసి చాలా సంతోషించినాము.
నేను  తిరుమల తిరుపతి దేవస్థానంలో తరిగొండ వెంగమాంబ ప్రాజక్టుప్రథమ సంచాలకుడిగా ఉండి ఆమె పుస్తకాలెన్నింటినో ప్రచురింపచేసినా  ఈ మార్గాన్ని చూడటం ఇదే ప్రథమం. ఆమె తుంబురుకోనలో ధ్యానం చేసిన ప్రదేశాన్ని కూడా చాలా సార్లు చూశాను.
తరిగొండ వెంగమాంబ ముత్యాల హారతి, అన్నమయ్య లాలితోనే వేంకటేశ్వర స్వామి నిత్య కార్యాలన్నీ ముగిసి  తలుపులు వేయబడతాయి.
 ఇంత  విశేషమయిన ప్రాంతాన్ని దర్శించడం మహదానందంగా ఉంది. మేము వేదపాఠశాల దగ్గిర నుంచిఅన్నదమ్ముల బండ, దానికి ముందుగా  కుమార ధార, పసుపుధార ప్రాజక్టులను చూస్తూ, వై జంక్షన్ మీదుగా దాదాపు 25 కిమీ 3 గంటల సేపుప్రయాణించి యుద్ధగళం చేరుకున్నాం. రహదారులన్నీ పోయిన వానలకు ధ్వంసంకావడం వల్ల ప్రయాణం  బాగా ఇబ్బందిగా ఉండింది.
అన్నదమ్ముల బండ
అన్నదమ్ముల బండ
అన్నదమ్ముల బండలు ప్రకృతి ప్రేమికులకు అద్భతమయిన దర్శనీయ స్థలం. జొన్న రాతి కుప్ప నుంచి  ఆ విశాలమయిన లోయ సన్నటి జలపాతం చూసినంత దూరం కొండల శిఖరాలు, అహో, అదొక మధురానుభూతి. ఆహ్లాదకరమయిన ఉల్లాసం.
Chamala Kona
చామల కోన
దారెంటా మోగిచెట్టు అధికంగా ఉన్నాయి గనక, దీనిని మొగిలి పెంట అన్నారు. ఇక్కడెక్కడ  ఎర్రచందనం చెట్లు లేవు. మొత్తం కొండల శిఖరాలు, నక్షత్ర తాబేళ్లు ఎక్కువ. తిరుమల కొండలు నలుదిక్కుల కాదు, పలుదిక్కులా ఉన్నాయి. తిరుమల చేరుకోవడానికి అలిపిరి, శ్రీవారి మెట్లు, అన్నమయ్య మార్గం, పుల్లుట్ల మార్గం, తలకోన మార్గం, రంగంపేట మార్గం, చాకలోడి కోన మార్గం, తుమ్మచేలు గుండా మరొక మార్గం, వై.కోట మీదుగా గుండాల కోనగుండా మరొక మార్గం లాంటి ఎన్నో దారులున్నాయి. నేను ఇవన్నీ చూడగలిగాను. నడవగలిగాను.
మొగిలిపెంట
మొగిలిపెంట నుంచి మూడేళ్ల కురవ, కంగుమడుగు, సిద్ధిపేట మీదుగాబాలపల్లి చేరుకోవాలనుకున్న. ఏనుగులు మాకు PILOTS  గా ఉండే ప్రమాదం ఉందని పసిగట్టి వెనుదిరిగాం.

ప్రస్తుతం శేషాచలం అడవుల్లో రక్త చందనం దొంగలకు, ఏనుగులకు భయపడవలసిన పరిస్థితి. దాదాపు ఇరవై నాలుగు ఏనుగులు తిరుగుతున్నట్లు లెక్క వేశారు. ఏదిఏమయిన ఈ ట్రెక్ మాకు మరుపు రానిది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *