–నేడు కామ్రెడ్ రావుల ప్రథమ వర్ధంతి. నూతక్కిలో ఘన నివాళులర్పించిని సీపీఐ నేతలు
మంగళగిరి మండలం నూతక్కిలోని మధ్యతరగతి రైతు కుటుంబంలో 1937లో జన్మించిన శివారెడ్డి యుక్త వయసులోనే గ్రామ యువజన నాట్యమండలి నాటకాలకు ఆకర్షితులై “ఎన్.జీ.ఓ., కీర్తిశేషులు, అన్నాచెల్లెలు, ఏరువాక లాంటి నాటకాలలో నటించి ప్రేక్షకుల మన్ననలు పొంది కమ్యూనిస్టు సిద్ధాంతల వైపు ఆకర్షితులయ్యారు. చిన్ననాటి నుంచి వ్యవసాయంపై మక్కువ కలిగి ఇష్టంగా పొలం పనులు చేసుకుంటూ ఆదర్శ రైతుగా గుర్తింపు పొందారు. గ్రామస్థాయిలో భీమిరెడ్డి వెంకట్రామిరెడ్డి, భీమిరెడ్డి కోటిరెడ్డి, షేక్ చినగాలి షరీఫ్, షేక్ హాజీ అహమ్మద్ లతోనూ, తాలూకాస్థాయిలో నాగళ్ళ రామకృష్ణయ్య, యార్లగడ్డ సుబ్బారావు, చిమ్మన నాగభూషణం, ఆకుల శివరామకృష్ణయ్య, కోట శ్రీరామమూర్తి, జంజనం నాగేశ్వరరావు, అందె నరసింహారావు, చిన్ని పిచ్చయ్య, జాలాది ప్రసాద్ తదితరులతో కలిసి సీపీఐ నిర్మాణంలో శివారెడ్డి తన వంతు పాత్ర పోషించారు.
విద్యార్థి రాజకీయ పాఠశాల నిర్వహణలో మేటి..
ఉమ్మడి రాష్ట్ర పార్టీ ఆదేశం మేరకు 1971లో రాష్ట్రస్థాయి విద్యార్థి రాజకీయ పాఠశాలను విజయవంతంగా నిర్వహించటంలో శివారెడ్డి విశేష కృషి చేశారు. అనేక మందికి నూతక్కి విద్యార్థి శిబిరం పునాదిగా నిలిచింది. అనంతరం 15 రోజులపాటు రాష్ట్రస్థాయి జన సేవాదళ్ క్యాంపు నూతక్కిలోనే నిర్వహించి వందలాది జనసేవాదళ్ వలంటీర్లను తీర్చిదిద్దడంలో తోడ్పడ్డారు. నూతక్కి గ్రామం పలుసార్లు రాష్ట్రస్థాయి యువజన విద్యార్థి శిక్షణ తరగతులకు కేంద్రంగా ఉండటంలో శివారెడ్డి నాయకత్వం ఎంతగానో తోడ్పడింది. సి.పి.ఐ. జాతీయ అగ్ర నాయకులు, మాజీ ప్రధాన కార్యదర్శి చండ్ర రాజేశ్వరరావు, కేంద్ర నాయకులు నీలం రాజశేఖరరెడ్డి, ఎన్.కె. కృష్ణన్, నల్లమల గిరిప్రసాద్, తమ్మారెడ్డి, దాసరి నాగభూషణరావు తదితరులను పలు సందర్భాలలో నూతక్కి గ్రామానికి రప్పించటంలో శివారెడ్డి చొరవ చెప్పక తప్పదు.
నూతక్కికి అగ్రనేతల రాకలో శివారెడ్డి కృషి ఎనలేనిది..
మంగళగిరి నుంచి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన వేములపల్లి శ్రీకృష్ణకు గ్రామంలోని ప్రతి కార్యకర్తతో అనుబంధముండేది. ఇటీవల వరకు జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సురవరం సుధాకర్ రెడ్డి, జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ, పువ్వాడ నాగేశ్వరరావు, ఈడ్పుగంటి నాగేశ్వరరావులతోపాటు పలువురు కేంద్ర, రాష్ట్ర నాయకులు నూతక్కిలో జరిగిన సభల్లో పాల్గొనటంలో శివారెడ్డి కృషి ఎనలేనిది.
ఉన్నత విద్య అభ్యసించకపోయినా అనుభవపూర్వకంగా అనేక విషయాల్లో శివారెడ్డి సాధించిన పరిజ్ఞానం, పార్టీ పట్ల ఆయనకున్న అంకితభావం ఎనలేనిది. చరమాంకంలో ఆరోగ్యం క్షీణిస్తున్నా పార్టీ నిర్మాణం కోసం పరితపించారాయన. జిల్లాలో పార్టీ పురోభివృద్ధి కోసం సీపీఐ జిల్లా కార్యదర్శి అజయ్ కుమార్ తోపాటు సీనియర్ నాయకులు సి.ఆర్.మోహన్, మారుతి, హుస్సేన్ రాధాకృష్ణమూర్తి, మాల్యాద్రి లాంటి వారికి పలు సూచనలు, సలహాలు ఇస్తూ ప్రోత్సహించారు.
నూతక్కి గ్రామాభివృద్ధిలో మమేకం…
నూతక్కి గ్రామాభివృద్ధితోపాటు గ్రామ చుట్టుపక్కల డొంకరోడ్ల నిర్మాణం, మురుగు కాల్వల అభివృద్ధి, వంతెనల నిర్మాణం, శ్మశాన వాటిక అభివృద్ధిలో శివారెడ్డి ఎంతో పాటుపడ్డారు. శివారెడ్డి 20 సంవత్సరాల పాటు మంగళగిరి నియోజకవర్గ కార్యదర్శిగా, జిల్లా కమిటీ సభ్యుడిగా, రాష్ట్ర సమితి సభ్యుడిగా పార్టీ నిర్మాణం కోసం విశేష కృషిచేశారు.
మంగళగిరి మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఐ ప్రాతినిద్యం పొందడంలో రావుల శివారెడ్డి ప్రధాన పాత్ర వహించారు. శివారెడ్డి పలు జాతీయ మహాసభలకు ప్రతినిధిగాపాల్గొనడమే కాదు… సీపీఐ మంగళగిరి నియోజకవర్గ పార్టీ కార్యాలయం నిర్మాణంలో సహచరుల తోడ్పాటుతో అన్నీ తానై నడిపించారు. రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితుల్లో అననుకూల పరిస్థితులు వెంటాడినా తనదైన శైలిలో పార్టీ నిర్మాణాన్ని నిలబెట్టడంలో విశేషంగా పాటుపడ్డారు. మాట కఠినంగా వున్నా, ఇబ్బందుల్లో వున్న పార్టీ కార్యకర్తలను ఆదుకొని ప్రోత్సహించడంలో ముందున్నారు. మంగళగిరి రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న రావుల శివారెడ్డి 2021 జనవరి 15న తుదిశ్వాస విడిచినా.. ఆయన జ్ఞాపకాలు మాత్రం ఈ గడ్డపై పదిలంగానే ఉంటాయి.
రావుల శివారెడ్డికి నివాళులు అర్పిస్తున్న ముప్పాళ్ల నాగేశ్వరరావు, జంగాల అజయ్ కుమార్ తదితరులు