కొనవూపరితో ఉన్న 68 సంవత్సరాల బాయిడ్ రష్ ని కొద్దిసేపటి కిందట ఆసుపత్రికి తీసుకువచ్చారు.
అపుడు ఈ పేషంట్ కోసం ‘అకడమిక్ సర్జన్’ డాక్టర్ జేమ్స్ హార్డీఎదురుచూస్తున్నారు. ఆసమయంలో ఆసుపత్రిలో ఎక్కువ మంది లేరు. బాయిడ్ రష్ పరిస్థితిని డాక్టర్ జేమ్స్ హార్డీ గమనించారు. పరిస్థితి క్రిటికల్ గా ఉంది. పేషంట్ ను బతికించాలంటే గుండెను మార్చాల్సిందే. అంతకు మంచి మరొక మార్గం లేదు.
అపుడు సాయంకాలం ఆరుగంటలవుతూ ఉంది. ఆ క్షణంలో బాయిడ్ రష్ టర్మినల్ షాక్ కు గురయ్యారు. బిపి 70కి పడిపోయింది.వూపిరాడటం లేదు. మెకానికల్ రెస్సిరేషన్ ద్వారా మాత్రమే రష్ బతుకుతున్నాడు.
డాక్టర్ జేమ్స్ హార్డీ కళ్ల ముందు పేషెంట్ చావు కనబడుతూ ఉంది. గుండెను మారిస్తే తప్ప అతను బతకడు. పేషంట్ చావుకి బతుక్కి మధ్య కొన్ని నిమిషాల దూరంలో కొట్టుమిట్టాడుతుంటే, డాక్టర్ గుండు మార్పిడి ఆశ నిరాశల మధ్య నలిగిపోతున్నాడు.
ఎలా? ఆక్షణంలో ఇదిగొ ఈ గుండె తీసుకో అని ఎవరు ముందుకొస్తారు. మనిషిలో ఒక్కటి మాత్రమే గుండెని దానం చేసేందుకు ఎవరూ చేస్తారు?
అప్పటికింకా బ్రెయిన్ డెత్ (brain death) అనే విధానం గుర్తింపుకి రాలేదు.అందువల్ల బ్రెయిన్ డెడ్ పేషంట్ నుంచి ఇంకా కొట్టుకుంటునే ఉన్న గుండెను కోసి బయటకు తీయడమనేది జరగదు.
మరొక మనిషి గుండెని తెచ్చి బాయిడ్ రష్ కు అమర్చడం అయ్యేపనికాదు. అది నైతిక విలువల సమస్య. మతం అంగీకరించదు, సమాజం అంగీకరించదు. సహచరులు అంగీకరించరు. ప్రభుత్వం, చట్టాలు కూడా అంగీకరించవు. అలాంటి ప్రయత్నం చేస్తే భూమి బద్ధలవుతుంది. మరేమిటి? మార్గం. డాక్టర్ గుండె వేగంగా కొట్టుకుంటూ ఉంది. వెంటనే నిర్ణయం తీసుకోవాలి, పేషంట్ కు ఆపరేషన్ జరగాలి.లేదా ఒక చావును కళ్లారా చూడాలి.
మరేమిటి మార్గం?
డాక్టర్ జేమ్స్ లో గుండె దడ పెరిగింది. తను ప్రశాంత చిత్తంతో నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయానికి పేషెంట్ నుంచి ఆమోదం సంపాదించాలి. ఇదంతా నిమిషాల్లో పూర్తికావాలి. ఆపరేషన్ మొదలు కావాలి. ఏదో ఒక గుండెను అమర్చితే తప్ప బాయిడ్ రష్ బతకడు.
“Death was clearly imminent and it was obvious that if heart transplant was to be performed , it had to be done at once,”అని డాక్టర్ జేమ్స్ తన జ్ఞాపకాలలో రాసుకున్నారు.
బాయిడ్ రష్ ను ఆపరేషన్ ధియోటర్ లోకి నడిపించమన్నాడు. ఆయన సర్జికల్ టీమ్ తప్ప అక్కడ ఎవరూ లేరు. తాను ఏంచేయబోతున్నాడో అక్కడున్న వారి ముందు ప్రకటించాడు. తన దగ్గిరఉన్న ఒక చింపాంజీ గుండెను రష్ కు అమర్చబోతున్నట్లు చెప్పాడు. అంతా నిర్ఘాంత పోయారు.
వెంటనే వాళ్ల మధ్య పోల్ కండక్ట్ చేశాడు, పేషంట్ కు చింపాంజీ హార్టు ను అమర్చాలా వద్దా అనే విషయం మీద. అందులో నలుగురు చింపాంజీ గుండెకు ఆమోదం చెప్పారు.ఒక్కరు మాత్రం ఓటింగ్ లో పాల్గొనలేదు. ఈ విషయాన్ని డాక్టర్ జేమ్స్ తన రికార్డులో నమోదు చేశారు.
చింపాంజీ ఎందుకు గుర్తుకు వచ్చింది?
ఉన్నట్లుండి డాక్టర్ జేమ్స్ కు చింపాంజీ గుర్తుకురావడానికి కారణం ఏమిటి? ఆయన గత పదేళ్లుగా అవయవాల మార్పిడి మీద పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ విషయాలు ప్రపంచానికి పెద్దగా తెలియవు. ఆయన నాలుగు చింపాంజీలను కొన్నారు. వీటిని అవసరయినపుడు గుండె మార్పిడికి వాడాలనే ఉద్దేశంతోనే కొన్నాడు. మనుషులెవరూ గుండెదానం చేసే పరిస్థితి లేదుకాబట్టి, ఒక మనిషికి ప్రాణం పోసేందుకు ఆయన జంతువును వాడాలనుకున్నాడు. ఇదొక పెద్ద నైతిక సమస్యే. మనిషి ప్రాణం, జంతువుల జీవన హక్కులు అనేవి పెద్ద నైతిక సమస్యలే. కాని డాక్టర్ సోషియాలజిస్టు లాగానో, హక్కుల కార్యకర్తలానో ఆలోచించేందుకు వీలేలేదు. డాక్టర్ మనిషి ప్రాణం గురించే ఆలోచించాలి. చింపాంజీ మనిషికి సమీప బంధువే కాబట్టి వాటి అవయవాలను మనిషికి మార్చవచ్చా అనేదాని మీద ప్రయోగాలు చేస్తూ వస్తున్నారు. ల్యాబొరేటరీలో తాను సాధించిన ప్రక్రియను ఆపరేషన్ ధియోటర్ లో ప్రయోగించాలి. ల్యాబ్ నుంచి ఆపరేషన్ ధియోటర్ కి రావాలి. అది చాలా గతుకులబాట. కీకారణ్యం. ప్రయాణం సాహస కృత్యం.అందునా తొలిసారి ప్రయాణం మరీ జటిలమయింది.
ఎంతకష్టమయినా సరే ముందుకు పోక తప్పని విషమ పరిస్థితి డాక్టర్ జేమ్స్ హార్డీకి ఎదురయింది. తన దగ్గిర ఉన్న నాలుగింటిలో పెద్దదైన చింపాంజీని ఆయన ఎన్నుకున్నారు. దాని బరువు 45 కెజీలు. ఎనస్తీసియా ఇచ్చినపుడు ఈ చింపాంజీ కార్డియాక్ అవుట్ పుట్ నిమిషానికి నాలుగు లీటర్లు (4L/min.) ఈ చింపాంజీ పేరు బినో(Bino). గుండె మార్పిడి అనుకూలంగా ఉంది,
జాప్యం చేయకుండా ఆయన బాయిడ్ రష్ కు చింపాంజీ గుండెను అమర్చారు.
అపరేషన్ జరుగుతున్నంత సేపు అందరి మనసుల్లో ఆందోళన ఉంది. ఎందుకంటే, ఆక్కడ జరుగుతున్నది కేవలం మనిషి గుండె మార్పిడి కాదు. ఒక జంతువు గుండెను మనిషికి అమర్చడం (We had not transplanted merely a human eart; we had transplanted a subhuman heart.”). ఈ ఆపరేషన్ తర్వాత ఏం జరగబోతున్నదో అందరికి అర్థమవుతూనే ఉంది. మనిషికి చింపాంజీ గుండెను బిగిస్తే ఎంత సంచలనం, విమర్శలు, బరద చల్లడం, విద్వేషం, విషం ఎదురువుతాయో వాళ్ల కు తెలుసు. అయితే, అంతా ప్రశాంతంగా అపరేషన్ జరగాలి అనుకున్నారు.
బాయిడ్ రష్ కు అమర్చిన చింపాంజీ గుండె 90 నిమిషాలపాటు తనంతకు తాను కొట్టుకుంది. అయితే, ఆ తర్వాత పేషంట్ చనిపోయాడు. అదే విషాదం.
అయితే, డాక్టర్ జేమ్స్ హార్డీ ప్రయోగం మానవ నాగరికతలో, మనిషి ఆరోగ్యం చరిత్రలో ఒక అధ్యాయం ఆవిష్కరించింది. మనిషికి ఇతర జంతువుల అవయవాలను అమర్చవచ్చు అనే శాస్త్రీయ విశ్వాసం మొదలయింది.
చింపాంజీ గుండె చాలా చిన్నది కావడంతో, దానికి మనిషికి అవసరమయిన విధంగా పనిచేసేంత శక్తి లేదు. ఆపరేషన్ పూర్తిఅయిన కొద్ది సేపటిలోనే పేషంట్ చనిపోయాడు. బాయిడ్ రష్ బాడీ ఈ కొత్త గుండెను రిజెక్ట్ చేయలేదని, ఆపరేషన్ విజయవంతమని, మరేవో కారణాలతో ఆయన చనిపోయాడని కొంతమంది డాక్టర్లు చెబుతున్నారు. అదంతా పాఠకుల అర్థం కాని పరిభాషలో సాగే చర్చ. మనకిిక్కడ అవసరం లేదు.
బాయిడ్ రష్ కు చింపాంజీ గుండె అమర్చారనే వార్త బయటకు పొక్కగానే విమర్శలు వచ్చాయి. దీని గురించి ఆయన ఒకచోట్ ఇలా రాశాడు. “… precipiatated intense ethical, moral, social, religious, financial, governmental and even legal concerns.”
డాక్టర్ జేమ్స్ హార్డీ ప్రయోగం తర్వాత మనుషులకు జంతువుల అవయవాలను అమర్చానే ఆత్రుత ప్రపంచ వ్యాపితంగా డాక్టర్లలో మొదలయింది. చింపాంజీ గుండె అమర్చిన వెంటనే పేషెంట్ బాయిడ్ రష్ చనిపోయినా 1964 -1977 మధ్య మనిషికి గొర్రె, బాబూన్, చింపాంజీ అవయవాలను అమర్చేందుకు నాలుగయిదుసార్లు ప్రయత్నాలు జరిగాయి. ఈ అవయవాలు అమర్చిన తర్వాత మూడున్నర రోజుల్లనే అవయవ స్వీకర్తలుచనిపోయారు.
ఆ తర్వాత మరొక గొప్ప ప్రయోగం 1984లో జరిగింది. ఈ సారి సదరన్ క్యాలిఫోర్నియా , లోమా లిండా యూనివర్శిటీ మెడికల్ సెంటర్ లో ఒక చిన్న పాపకు బాబూన్ గుండెను అమర్చి బతికించే ప్రయత్నం జరిగింది.
మెడికల్ హిస్టరీలో ఇదొక మైలు రాయి
ఆ పాప పేరు స్టెఫనీ ఫే బ్యూక్లెయిర్ , సింపుల్ బేబీ ఫే గా చరిత్రలో మిగిలిపోయింది. పాప మూడువారాలా ప్రిమెచ్చూర్ బేబీ. పాపకి హైపోప్లాస్టిక్ లెఫ్ట్ హార్ట్ సిండ్రోమ్ (Hypoplastic Left Heart Syndrome) అనే లోపం ఉంది. అంటే, పాప గుండె ఎడమవైపు అభివృద్ధి కాలేదు. ఇలాంటి శిశువులు రెండు మూడు వారాలు మించి బతకరు. ఫే తల్లికి ఒకటే చాయస్. శిశువు ఆసుపత్రిలో కళ్ల ముందు చనిపోడానికి అంగీకరించడం. మరొక ప్రత్యామ్నాయం లేదు. అపుడు అక్కడి చిన్న పిల్లల హృద్రోగ శస్త్ర చికిత్స నిపుణుడు ఆమెకు ఒక కొత్త వూహించని అవకాశం ఇచ్చారు. ఎందుకంటే, గుండె జబ్బు తప్ప మిగతా ఆరోగ్యం బాగుంది ఆపాపకు. అందువల్ల గుండెమార్పిడి సమస్యను పరిష్కరిస్తుంది. మొదటి గుండె మార్పిడి (1967) జరిగిన ఒకటిదన్నర దశాబ్దం కావస్తున్నా, చిన్న పిల్లల్లో గుండె మార్పిడి జరగలేదు. మొదటి గుండెమార్పిడి 1967లో డాక్టర్ క్రిష్టియన్ బెర్నార్డ్ , దక్షిణాఫ్రికా లో జరిపారు.) డాక్టర్ బెయిలీ చిన్నపిల్లల్లో గుండె మార్పిడి చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే,శిశు గుండె దాతలు దొరకడం చాలా కష్టం. అందువల్ల మరొక ప్రత్యామ్నాయం వెదకాల్సి వచ్చింది. ఈ కారణంతో ఇతర జంతువుల గుండెలను పిల్లలకు అమర్చవచ్చా అనే దాని మీద క్యాలిఫోర్నియా లోమా లిండా యూనివర్శిటీ మెడికల్ సెంటర్ లో డాక్టర్ బెయిలీ ఈ పరిశోధనలు చేస్తూ వస్తున్నారు. ఇతర జంతుజాతుల గుండెలను అమర్చడం (Xenograft) మీద ఆయన దాదాపు ఏడేళ్లుగా ప్రయోగాలు చేశారు.
బేబీ ఫే సమస్య ఎదరుయినపుడు మరణం తప్ప మరొక మార్గం లేపుడు డాక్టర్ బెయిలీ జంతువు గుండె అమర్చి బేబీ ఫేని బతికించ వచ్చేమో చూడాలనిపించింది. ఈ ఆపరేషన్ చేయడం బెయిలీకి పెద్ద పనికాదు, టైమ్ పత్రిక (Time) రిపోర్ట్ ప్రకారం ఆయన గొర్రెలు,మేకలు, బాబూన్ల గుండె మార్పిడులను కనీసం 150 సార్లుప్రయోగాత్మకంగా చేశారు. నిజానికి మొదటి సారి ఒక పేషంట్ కి వానర గుండెను అమర్చిన ప్రయోగం 1964లోనే జరిగింది.అయితే, ఈ గుండె అమర్చిన కొద్ది గంటల్లోనే పేషంట్ చనిపోయాడు. తర్వాత కొన్ని ప్రయత్నాలు జరిగాయిగాని ఏవీ విజయవంతం కాలేదు. ఇపుడు బేబీ ఫే మీద మరొక ప్రయత్నం చేసేందుకు అవకాశం వచ్చింది. బేబీ ఫే మరణశయ్య మీద ఉంది కాబట్టి పాపికి బాబూన్ గుండె అమర్చే అపరేషన్ కు అనుమతి దొరికింది.
ఆపరేషన్ కు తేదీని అక్టోబర్ 26,1984గా డాక్టర్ నిర్ణయించారు. ఆ రోజుకి బేబీ వయసు 12 రోజులు. గుండె దాత బాబూన్ ఎంపిక చేసుకున్నారు. అపరేషన్ ఉదయం 11.35 కి పూర్తయింది. బేబీ ఫే శరీరంలో బాబూన్ గుండె స్పందించడం మొదలయింది. ఆ క్షణంలో భయం, ఆందోళన, ఆనందం కలగసిన భావోద్వేగం అందరిని ఆవరించి ఉందని శాండ్రా నేల్ సెన్-కనరెల్లా అనే ట్రాన్స్ పాంటేషన్ ఇమ్యూనాలజిస్టు చెప్పారు. బేబీ ఫే మీడియా సంచలనఅయింది. వూరు పేరు వయసు చెప్పకుండా పాప టివి లలో హెడ్ లైన్ అయింది. వేలాది మంది ప్రజలు బేబీ ఫే కోలుకోవాలని, బతకాలని గ్రీటింగ్స్ పంపించారు. డబ్బు సాయం చేశారు. పూలు పంపించి శుభాకాంక్షలు తెలిపారు. అయితే, మరొక వైపు చీత్కారం కూడా మొదలయింది. మనిషికేమిటీ, బాబూన్ జంతు గుండెను అమర్చడమేమిటి?అపవిత్రం కార్యం,పోయే కాలం, నైతిక పతనం అని గగ్గోలు పెడుతున్న వాళ్లూ ఉన్నారు.
అంతా కోరుకున్నట్లే … మొదట్లో బేబీ ఫే కోలుకోవడం మొదలుపెట్టింది. 14 రోజుల తర్వాత ఆరోగ్యం పతనం కావడం మొదలయింది. 1984 నవంబర్ 16న బేబీ ఫే చనిపోయింది. దీని మీద టైమ్ ఏం రాసిందంటే… “ So ended an extraordinary experiment that had captured the attention of the world and made medical history. For three weeks the 5-lb. infant had survived with the heart of a baboon- more than two weeks longer than any previous recipient of an animal heart.”
చిత్రమేమిటంటే…
బాయిడ్ రష్ బేబీ ఫే ల ప్రయోగాలు విఫలం కావడంతో సర్వత్రా నిరాశ ఎదురయింది. జంతువుల అవయవాలను మార్చడం ఇక సాధ్యం కాకపోవచ్చని అనుకున్నారు. అంతేకాదు, సైక్లో స్పోరిన్ వంటి యాంటి రిజెక్షన్ ఔషధాలు అందబాటులోకి వచ్చినా ఇలాంటి మనిషికి జంతు అవయవ మార్పడి సాధ్యం కాదని భావించారు. ఇలాంటపుడు పందుల నుంచి సేకరించిన అవయవాలు ఏలా అమర్చగలరు అని ప్రశ్నించారు. ల్యాబోరేటరీ ప్రయోగాలకు క్లినికల్ అప్లికేషన్ కష్టమన్నారు. 2003లో డాక్టర్ జేమ్స్ డి హార్డీ చనిపోయినపుడు డాక్టర్ డెంటన్ ఎ కూలే (Dr Denton A Cooley) నివాళి అర్పిస్తూ ఇదే అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఇది టెక్సాస్ హార్ట్ ఇన్ స్టిట్యూట్ జర్నల్ లో అచ్చయింది. డాక్టర కూలే ఏమన్నారోచూడండి.
Today, heterograft or xenograft procedures are not considered feasible and are seldom attempted, despite the availability of anti-rejection drugs such as cyclosporine. Most research in the field involves attempts at genetic modification and complex breeding techniques using pigs. Clinical application is still remote.
అయితే, జనవరి 7, 2022న అమెరికా యూనివర్శిటీ ఆఫ్ మేరీ ల్యాండ్ మెడికల్ సెంటర్లో ఏమి జరిగింది. ఎనిమిది గంటల ఆపరేషన్ తర్వాత డేవిడ్ బెన్నెట్ అనే 57 సంవత్సరాలో రోగికి డాక్టర్ జన్యూమార్పి డి చేసిన పంది గుండెను అమర్చారు. డాక్టర్ కూలే ఏ అనుమానాలను వ్యక్తం చేశారో వాటన్నిమటిని అధిగమించి ఒక పంది గుండెను అమర్చారు. జీన్ ఎడిటింగ్, క్లోనింగ్ పద్ధతులను ఉపయోగించి,ఇమ్యూని రిజెక్షన్ కు సంబంధించిన కొన్ని పంది జీన్స్ ను తొలగించి, మనిషికి సంబంధించినవి కొన్ని ఎక్కింది, పంది గుండెను పదిలంగా మనిషికి అమర్చారు. అది చక్కగా పనిచేస్తూ ఉంది. ఇపుడు బెన్నెట్ కు అమర్చిన యంత్రాలను కూడా తీసేశారు.
ఈ మహత్తర సైన్స్ విజయం సమయంలో ఎందరో డాక్టర్ జేమ్స్ హార్డీ, డాక్టర్ బెయిలీలతో ఎందరో అజ్ఞాతడాక్టర్లు గుర్తుకొస్తాయి. అందుకే ఐజాక్ న్యూటన్ చెప్పిన మాట అక్షరాల నిజం.
“If I have seen further, it is by standing upon the shoulders of giants”