-ఇఫ్టూ ప్రసాద్ (పిపి)
అది అగ్రరాజ్యమే కాదు ఉగ్రరాజ్యం కూడా! పైగా విధ్వంస రాజ్యం కూడా! అదే అమెరికా ప్రత్యేకత! దాని వికృత, వినాశనకర, విచ్చినకర, విధ్వంసకర విపరీత బుద్ది మరోసారి వెల్లడి చేసే ఓ వైనం గూర్చి రైటప్ యిది.
తాను కాండకావరంతో విర్రవీగి దురాక్రమణకు దిగి తుదకి చలిచీమల చేత ఓటమి పొంది, బ్రతుకు జీవుడా ఆఫ్ఘన్ గడ్డ నుండి గత ఆగస్టులో అమెరికా పారిపోయింది. అది నేడు ఆఫ్ఘనిస్తాన్ లో కొత్తనాటకం ఆడుతోంది. అదే ఆఫ్ఘనిస్తాన్ ప్రజల కన్నీటి బాధలకి స్పందించి మానవీయ సాయం చేసే కపట రాజకీయ నాటకం!
ఇరవై ఏళ్ళ అమెరికా దురాక్రమణ ఫలితంగా ఆఫ్ఘనిస్తాన్ దేశ ప్రజలు నేడు దుర్భర దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నారు. వారికి తక్షణ ఉపశమనం కోసం ఐదు బిలియన్ డాలర్ల సాయం అవసరమని UNO చెప్పడం తెల్సిందే! ఆ నేపథ్యంలో నిన్న వైట్ హౌస్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. అది ఆఫ్ఘన్ కి 30.8 కోట్ల డాలర్ల సాయం ప్రకటించింది. ఆ ముప్ఫై కోట్ల డాలర్ల “మానవీయ” సాయానికి ఆడుతున్న ఆటవిక, అనాగరిక, అమానవీయ నాటకం ఏమిటో చూద్దాం.
నిజానికి ఆఫ్ఘనిస్తాన్ సార్వభౌమాధికారాన్ని గుర్తించి, నేడు ఆ దేశాన్ని పాలిస్తున్న ప్రభుత్వం ద్వారా ఇలాంటి సాయం అందించాలి. అది అలా చేయడం లేదు.
పోనీ, బలిసిన సంపన్న రాజ్యాల కొమ్ముకాసే దుష్ట చరిత్ర గల UNO ద్వారా అధికారికంగా సాయాన్ని అందించాలి. నిజానికి పై పిలుపు ఇచ్చింది UNO యే! తన సాయం దాని ద్వారా కూడా కాదట!
US ఎయిడ్ సంస్థగా పేరిట ఉనికిలో ఉన్న US AGENCY FOR INTERNATIONAL DEVELOPMENT (USAID) ద్వారా తన సాయాన్ని అందిస్తుందట! అది కూడా కుహనా స్వతంత్ర స్వచ్ఛంద సంస్థల ద్వారా ఆఫ్ఘన్ లో బాధిత ప్రజల్ని ఎంపిక చేసి సాయం చేస్తుందట!
ఈ సందర్భంగా వైట్ హౌస్ ప్రతినిధి ఎమిలీ హోర్న్ నిన్న మంగళవారం మాట్లాడుతూ పై పద్ధతి లోనే ఆఫ్ఘన్ బాధిత ప్రజలకు తమ మానవీయ సాయం అందిస్తామని నిస్సిగ్గుగా ప్రకటించారు.
ఈ సందర్భంగా ఆఫ్ఘన్ ని పాలిస్తున్న తాలిబన్లని ఉద్దేశించి USAID క్రింది బరితెగింపు ప్రకటనను కూడా చేసింది.
*స్వతంత్రంగా బాధిత ప్రజలకి మానవతా సాయం చేసేందుకు మేం పంపే ఎయిడ్ వర్కర్లని, ముఖ్యంగా మహిళా ఎయిడ్ వర్కర్లని అనుమతించి, వారికి రక్షణ కల్పించే బాధ్యత మీమీదే వుంది.*
ఇది ఆఫ్ఘనిస్తాన్ దేశ సార్వభౌమాధికారం పై దాడి! దేశ స్వాతంత్య్రం పై దాడి! UNO పై దాడి!
ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్ నుండి వెళ్లిపోతూ తాను చేయని వెర్రి చేష్టలు లేవు. ఆఫ్ఘనిస్తాన్ దేశ ప్రజలకు చెందిన 950 కోట్ల డాలర్ల డబ్బు ఖాతాల్ని అమెరికా సీజ్ చేసింది. తమ డబ్బు తమకు ఇవ్వాలని దేశ ప్రజలు వరసగా నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. ఆ వార్తల్ని మీడియా తొక్కిపడుతోంది. ఓవైపు 950 కోట్ల ఆఫ్ఘన్ దేశస్తుల ప్రజాధనాన్ని దొంగిలించిన నేరానికి పాల్పడి, మరో వైపు ముచ్చటగా ముప్ఫై కోట్ల డాలర్ల సాయంతో ఆఫ్ఘనిస్తాన్ బాధిత ప్రజల కన్నీళ్ళల్లో రాజకీయ చేపల వేటకు అమెరికా కుట్ర పన్నుతోంది.
*ఆఫ్ఘనిస్తాన్ నుండి పారిపోతూ నిస్సిగ్గుగా ఆఫ్ఘనిస్తాన్ నుండి తాను తరలించలేని సమస్త వస్తుసామగ్రిని అమెరికా విధ్వంసం చేసింది. అది చివరకు దేశ రాజధాని కాబూల్ లో ఎయిర్ పోర్ట్ లో సాంకేతిక వ్యవస్థను సైతం ధ్వంసం చేసింది. సమీప భవిష్యత్తులో విమానయాన సర్వీసుల పునరుద్ధరణకు వీలు లేకుండా చేసి తన బుద్దిని చాటుకుంది. అది నేడు కుహనా మానవతా సాయం పేరిట కొత్త కుట్రలకు పాల్పడుతోంది*
1990 వ దశకం చివరలో ఇరాక్ కి సాయం పై ఇలాంటి షరతుల్నే అమెరికా విధించింది. నాటి సద్దాం హుస్సేన్ ప్రభుత్వం ఇరాక్ కన్నీటి బాధిత ప్రజల నుండి అభిప్రాయ సేకరణ చేపట్టింది. *ఆకలితోనైనా చస్తాం, తమ మాతృదేశ స్వేచ్ఛ, స్వాతంత్య్రం, సార్వభౌమాధికారాల్ని బలిపెట్టి దురాక్రమణ దారీ దేశాల విషమ షరతులకు లొంగి కుహనా మానవీయ సాయం పొందే ప్రసక్తే లేదని నాడు ఇరాక్ ప్రజలు నిష్కర్షగా ప్రకటించారు.* ఈ గత గొప్ప చరిత్రను గుర్తు చేసుకోవాల్సిన సరైన సందర్భమిది.
ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం ఈ సాయాన్ని తిరస్కరిస్తే, ఆ దేశ ప్రజలకు సాయం చేసే మానవతా సాయాన్ని వ్యతిరేకించిన కర్కోటక ప్రభుత్వంగా మీడియా ప్రచారం చేసే పనిని చేపడుతుంది.
ఒకవేళ అనుమతిస్తే, ఈ కుహనా ఎయిడ్ మహిళా వర్కర్లు అక్కడ వాస్తవ బాధిత ప్రజలకు ఒక్క డాలర్ సాయం కూడా చేయకుండా, గత ఇరవై ఏళ్ళగా అమెరికా దురాక్రమణకు అండగా దేశద్రోహకర పాత్రను పోషించి, దేశభక్తియుత ప్రజల ఆగ్రహానికి అర్హత గల వ్యక్తులకు సాయం చేస్తారు. అట్టి కుహనా ఎయిడ్ మహిళా వర్కర్లని బాధిత ప్రజలు ఆయా గ్రామాల్లో, వార్డుల్లో, పేటల్లో ప్రశ్నిస్తే, స్త్రీలపై తాలిబన్ల అరాజకం చేస్తున్నారంటూ ప్రపంచ ప్రజల్లో దుష్ప్రచారం చేస్తారు.
*ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం ఎదుట నేడు ముందు గొయ్యు వెనక నుయ్యు వంటి పరిస్థితి ఏర్పడింది. అది విషమ షరతులతో కూడిన అమెరికా తాజా మానవీయ కపట నాటక సాయాన్ని ఎత్తుగడల రీత్యా అనుమతిస్తుందా? లేదంటే వ్యూహాత్మకంగా తిరస్కరిస్తుందా? అనేది ఆ ప్రభుత్వ ఇష్టం! కానీ అది రేపు ఏది చేసినా, సామ్రాజ్యవాద మీడియా నిందా ప్రచారం భారీ ఎత్తున చేసి తీరుతుంది. దాని పట్ల అప్రమత్తంగా ఉందాం.*