(యనమల రామకృష్ణుడు)
సిఎం జగన్ రెడ్డి పరిపాలనలో బడ్జెట్, బడ్జెట్ కేటాయింపులు అనే మాటలకు అర్థమే లేదు. బడ్జెట్ లో కేటాయింపులకు, చేస్తున్న ఖర్చులకు పొంతనే ఉండట్లేదు. బడ్జెట్ కేటాయింపులను పక్కనపెట్టి ముఖ్యమంత్రి తనకు తోచిన విధంగా ఖర్చు చేస్తున్నారు. దీనితో చట్టసభల్లో ఆమోదం పొందిన బడ్జెట్ కు విలువ లేకుండా పోయింది.
ఈ తరహా వ్యవహారశైలి కేవలం బడ్జెట్ ఉల్లంఘనే కాదు, చట్టసభలను అగౌరవ పర్చడం, ప్రజాస్వామ్యాన్ని ధిక్కరించడం, ప్రజలను అవమానించడం కూడా.
కేవలం ఒక్క రోజులో బడ్జెట్ పాస్ చేసుకోవడం రాజ్యాంగానికి వ్యతిరేకం, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం. శాసన సభ మంజూరుచేసిన కేటాయింపులను తోసిరాజనడం అసెంబ్లీని అవమానించడమే.
ఈ తరహా నిర్ణయాలు సప్లిమెంటరీ గ్రాంట్స్, ఒరిజనల్ బడ్జెట్ అలోకేషన్స్ ను మించిపోయే ప్రమాదం ఉంది.
ఈ ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టిన ఎఫ్ ఆర్ బిఎం రివ్యూ కమిటీ ప్రతి రాష్ట్రానికి ఫిస్కల్ కౌన్సిల్ (Fiscal Council) ఉండాలని సిఫారసు చేసింది. స్టేట్ ఫిస్కల్ కౌన్సిల్ ఉంటే ఇలాంటి ప్రమాదకర నిర్ణయాలకు ఆదిలోనే అడ్డుకట్ట వేయొచ్చు.
అసెంబ్లీ ఆమోదించిన కేటాయింపులకు అనుగుణంగా ఖర్చులు జరిపేలా కౌన్సిల్ పర్యవేక్షిస్తుంది. బడ్జెట్ ఉల్లంఘనలను నియంత్రిస్తుంది. అభివృద్ది చెందిన దేశాలు, వర్ధమాన ఆర్ధిక వ్యవస్థలు దీనిని అత్యావశ్యకమని ఇప్పటికే తేల్చాయి.
జగన్ రెడ్డి ప్రభుత్వం గత 32నెలల్లో అనేక ఉల్లంఘనలకు పాల్పడింది. బడ్జెట్ రూల్స్ ఉల్లంఘించారు. బడ్జెట్ నిధులను దారి మళ్లించారు. బడ్జెట్ నిబంధనలు గాల్లో కలిపేశారు. బడ్జెట్ మాన్యువల్ ను ధిక్కరించారు. ఎఫ్ ఆర్ బిఎం మార్గదర్శకాలను అధిగమించారు. రాజ్యాంగ మౌలిక సూత్రాలకు పాతరేశారు. సప్లిమెంటరీ గ్రాంట్స్ 10% టార్గెట్ కన్నా మించకూడదన్న సూత్రాన్ని తుంగలో తొక్కారు.
రెండున్నరేళ్ల వైసీపీ పాలనలో అవినీతి కుంభకోణాలు, ప్రజాధనం దుర్వినియోగం తప్పించి అభివృద్ధే లేదు. సమాజంలో ఆస్తుల కల్పనకు దోహదపడే మూలధన వ్యయం అడుగంటింది. 2020-21బడ్జెట్ తొలి 6 నెలల్లో 4వ వంతు కూడా మూలధనం ఖర్చు చేయలేదు. రూ 31,198కోట్లకు గాను రూ 6,711కోట్లు కూడా ఖర్చుపెట్టలేదు. రెవెన్యూ వ్యయం సగం కూడా చేయలేదు.
జలవనరులు, వైద్య ఆరోగ్య రంగాల్లో ఖర్చు నామమాత్రమే..సాగునీటి ప్రాజెక్టులకు రూ 13,237కోట్లు కేటాయించి 6నెలల్లో చేసిన ఖర్చు కేవలం రూ 1,729కోట్లు మాత్రమే. అత్యంత ప్రాధాన్యమైన జలవనరుల రంగంపై 15% కూడా ఖర్చుపెట్టలేదు. వ్యవసాయం అనుబంధ రంగాలకు కేటాయించిన మొత్తంలో 25%మాత్రమే ఖర్చుపెట్టారు. జగన్ రెడ్డి అనాలోచిత చర్యలతో రైతాంగానికి తీవ్రనష్టం చేస్తున్నారు.
వైద్య ఆరోగ్య శాఖకు కేటాయించిన రూ 2,464కోట్లలో రూ 400కోట్లు కూడా ఖర్చుచేయలేదు. ప్రజారోగ్యానికి వైసిపి ప్రభుత్వం ఎంత ప్రాధాన్యం ఇస్తుందో దీనిని బట్టే తెలుస్తోంది.
నికర రుణంలో 64% మూలధన వ్యయంపై ఖర్చుచేయాలని కేంద్రం రాసిన మార్గదర్శకాల లేఖను బుట్టదాఖలు చేశారు. కేంద్రం పేర్కొన్నప్రకారం 2020-21లో మూలధన వ్యయం రూ 49,280 కోట్లు చేయాల్సి ఉండగా రూ 19 వేల కోట్లు కూడా చేయలేదు.
రెవెన్యూ వ్యయాన్ని అదుపు చేయలేకపోయారు(132%)..దుబారా ఖర్చులు పెరిగిపోయాయి. పేదలకు ఇచ్చేది గోరంత అయితే సాక్షికిచ్చే ప్రకటనల ఖర్చు కొండంత. ఇప్పటికే ద్రవ్యలోటు 13%, జిఎస్ డిపిలో అప్పుల నిష్పత్తి 35.6%కు చేరాయి. తలసరి ఆదాయంలో వృద్దిని 15% నుంచి 1.03%కు దిగజార్చారు. తన మొండితనం, అహంభావం, అనాలోచిత చర్యలతో ఆంధ్రప్రదేశ్ ను ఆర్ధిక సంక్షోభంలోకి నెట్టారు, రాష్ట్రాన్ని దివాలా తీయించారు.
ప్రపంచంలో ప్రతిదేశం, రాష్ట్రమూ బడ్జెటరీ రూల్స్ అనుసరిస్తాయి, చిత్తశుద్దితో పాటిస్తాయి. ‘‘ఊరంతా ఒకదారి అయితే ఉలిపికట్టెదో దారి’’ అన్నట్లు జగన్ రెడ్డి పాలన ఉంది. ఎవరు చెప్పినా వినకూడదనే మొండివైఖరి ఆంధ్రప్రదేశ్ పాలిట శాపమైంది. ‘‘తాను పట్టినదానికి మూడేకాళ్లనే నైజం’’ భావితరాలకు తీరని కీడుచేస్తోంది. మొండివాడు రాజుకన్నా బలవంతుడు అన్నారు, జగమొండి రాజయితే సమాజానికి కలిగే చేటుకు ఏపిలో ప్రస్తుత పరిస్థితులే అద్దం పట్టాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత 32నెలల్లో తీవ్ర ఆర్ధిక క్రమశిక్షణా రాహిత్యా(Fiscal Indiscipline)నికి పాల్పడింది. రాష్ట్రప్రభుత్వం తెస్తున్న అప్పులు, చేస్తున్న ఖర్చుల నియంత్రణకు ఒక మెకానిజం ఏర్పాటు తక్షణమే అవసరం. ఆంధ్ర ప్రదేశ్ ఆర్ధిక వ్యవస్థ భవిష్యత్ లో బాగుచేయలేనంత అధ:పాతాళానికి దిగజారక ముందే కేంద్రం మేల్కొనాలి.
జగన్ రెడ్డి ప్రభుత్వ తప్పిదాలపై అత్యున్నత స్థాయి సమీక్ష జరపాలి. బడ్జెట్ ఉల్లంఘనలకు అడ్డుకట్ట వేయాలి. అవినీతి కుంభకోణాలు, నిధుల దుర్వినియోగాన్ని అరికట్టాలి. తక్షణమే ఆంధ్రప్రదేశ్ లో ‘‘ ఫిస్కల్ కౌన్సిల్ ’’ ఏర్పాటు చేయాలని, దారితప్పిన ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టాలని, బడ్జెట్ రూల్స్ నిక్కచ్చిగా అమలుచేసేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం.
(యనమల రామకృష్ణుడు, మాజీ ఆర్ధికమంత్రి, శాసనమండలి ప్రధాన ప్రతిపక్షనేత)