*గాంధీ రాజ్యంలో జిన్నా విగ్రహ విధ్వంస రాజకీయ సంస్కృతి
*జిన్నా రాజ్యంలో గాంధీ మత సహజీవన రాజకీయ సంస్కృతి!
*ఇటు మన గుంటూరు అటు పాకిస్థాన్ లో తేరి గ్రామ ఘటనల మధ్య తులనాత్మక విశ్లేషణ కోసం ఓ ప్రయత్నం
ఇఫ్టూ ప్రసాద్ (పిపి)
స్వాతంత్ర్యోద్యమంలో బలపడ్డ మత సహజీవన సంస్కృతికి అద్దం పట్టే ప్రతీకలు (సింబల్స్) దేశ వ్యాప్తంగా కనిపిస్థాయి. అందులో గుంటూరు *జిన్నా టవర్* ఒకటి! దానిపై గత కొద్ది కాలంగా బిజెపి నేతలు చేస్తున్న ఆందోళనలు తెల్సిందే! *కూల్చుతారా? లేదా కూల్చామంటారా?* అంటూ విధ్వంసకర రాజకీయ వికృత చేష్టలకి దిగడం చూస్తున్నదే!
1947కి ముందు మత సహ జీవన లౌకికవాద రాజకీయ సంస్కృతికి ప్రతీకగా గుంటూరులో జిన్నా టవర్ ఉనికిలోకి వచ్చింది. అది సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరిగింది. అది గుంటూరు కేంద్రంగా ప్రగతిశీల, లౌకికశక్తులు ప్రతిభావంతంగా మత విద్వేష శక్తులకి కౌంటర్ ప్రచారం చేస్తున్నాయి. వాటిలోకి వెళ్లడం లేదు.
నేడు మనదేశంలో హిందూమతతత్వం, పాకిస్థాన్ లో ముస్లిం మతతత్వం వెర్రితలలు వేస్తుండటం ఓ భౌతిక సత్యం! వాటిపై ఆ రెండు దేశాల్లోని లౌకిక శక్తులు సాగిస్తున్న కృషి కూడా మరో భౌతిక సత్యం! రెండు పొరుగు దేశాల ప్రజల మధ్య, ముఖ్యంగా లౌకికవాద శక్తుల మధ్య పరస్పర ప్రోత్సాహం, సహకారాలు అవసరం. జిన్నా టవర్ ఉదంతం వెలుగులో భారతదేశ లౌకిక శక్తులకు స్ఫూర్తిని ఇచ్చే ఓ సానుకూల సంఘటన గత శనివారం (జనవరి ఫస్ట్) పాకిస్థాన్ లో జరిగింది. భారతదేశ లౌకికవాద శక్తులకు బలం చేకూర్చే ఆ ఘటనను గుర్తు చేసుకొని లౌకిక స్ఫూర్తిని పొందుదాం.
పై సంఘటన పాకిస్థాన్ లో ఇండియాకి సరిహద్దు ప్రాంతంలో జరగలేదు. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులోని ఫక్తునిస్థాన్ రాష్ట్రంలో జరగడం గమనార్హం!
భారతదేశంతో సహా మధ్యప్రాచ్య దేశాలు, అమెరికా నుండి 200 మంది ప్రముఖ హిందు మత గురువులు మొన్న జనవరి ఒకటిన పాకిస్థాన్ చేరారు. వీరిలో అత్యధిక మంది ఇండియా నుండి పాకిస్థాన్ అనుమతితో వాఘా సరిహద్దు గుండా వెళ్లారు. వారు పాక్ లోని ఖైబర్ పక్తుంక్వా(KHYBER PAKHTUNKHWA) రాష్ట్రంలోని కరక్ జిల్లా, తేరి గ్రామం చేరారు. ఆ ఊరిలో హిందూ మత సత్సంగ గురువు ఆలయ పునర్నిర్మాణ సంరంభం వైభవోపేతంగా జరిగింది.
పాకిస్థాన్ హిందువులకి నిరుడు జనవరి ఫస్ట్ ఓ విషాద దినం! ఈ ఏడాది జనవరి ఫస్ట్ ఓ సంబర దినం! ఈ ఏడాదిలోనే అంత మార్పు ఏమిటి?
నిరుడు జనవరి ఒకటికి ముందురోజే ఓ హిందూ ఆలయాన్ని కూల్చితే, ఈ ఏడాది జనవరి ఒకటిన ఆలయ పునర్నిర్మాణం జరిగి, దాని పునప్రారంభ వేడుక జరిగింది. ఆ సందర్బంగా వెల్లివిరిసిన మతసామరస్యం, మత సహజీవన సంస్కృతి ఆదర్శప్రాయమైనవి.
దేశ విభజనకు ముందు నాటి బ్రిటీష్ ఇండియాకి చెందిన వివిధ రాష్ట్రాల్లో వాయవ్య సరిహద్దు రాష్ట్రం (NORTH WEST FRONTIER PROVINCE) ఒకటి! అది వాడుకలో NWFP! సరిహద్దు గాంధీగా పేరొందిన ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ పేరు వింటే NWFP రాష్ట్రం గుర్తు వస్తుంది. పాకిస్తాన్ లో నాలుగు ప్రధాన రాష్ట్రాల్లో ఒకటి. పై దుర్ఘటన ఆ రాష్ట్రంలోనే జరిగింది.
మరికొంత నేపథ్యంలోకి వెళదాం. ఆఫ్ఘనిస్తాన్ లో సాహసోపేత పఠానీ జాతి ప్రతిఘటన ఎదుట బ్రిటన్ మూడుసార్లు ఓడింది. అలా బెంబేలెత్తిన బ్రిటన్ ఆ వీర జాతిని 1893లో చీల్చింది. అలా చీల్చిన ప్రాంతాన్ని అది బ్రిటీష్ ఇండియా లో చేర్చింది. అదే వాయవ్య రాష్ట్రం!
అమెరికా దురాక్రమణ వ్యతిరేక ఆఫ్ఘనిస్తాన్ ప్రజా ప్రతిఘటనకు పాకిస్థాన్ లోని ఆ ప్రాంతం అండగా నిలిచింది. నేడు ప్రపంచ దురాక్రమణ దార్లకు దడ పుట్టించే ప్రాంతమది. ఆ వీర పఠానీ జాతీయుల సంఖ్య నేడు ఆఫ్ఘనిస్తాన్ లో కంటే, పాకిస్తాన్ లో రెట్టింపు! ఆఫ్ఘనిస్తాన్ పై అమెరికా చేపట్టిన కుహనా ఉగ్రవ్యతిరేక యుద్ధ కూటమిలో పాక్ చేరి, వెయ్యుకి పైగా తన సైనికుల్ని అదే రాష్ట్రంలో కోల్పోయింది. ఆ పఠానీ వీరజాతి ప్రతిఘటానా ప్రాంతం దురాక్రమణ దార్లకు శ్మశాన వాటికగా మారింది. ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికా దురాక్రమణ వ్యతిరేక ప్రతిఘటన చేసే స్వజాతికి అండగా పాక్ లోని పఠానీ జాతి తమ రక్తం దారపోసింది. అశేష త్యాగాలు చేసింది. ఆ ప్రాంతాన్ని సామ్రాజ్యవాద వ్యతిరేక రాజకీయశక్తులు ఆదర్శంగా తీసుకోవాలి. నేడు సాధారణ సింబాలిక్ ప్రదర్శనలకే పరిమితమైన సంఘీభావాల సరళిని చూస్తున్నాం. తద్భిన్నంగా తమ పొరుగుదేశం మీద దురాక్రమణ యుద్ధం చేస్తే స్వజాతి చైతన్యంతో రక్తం దారపోసిన ఘన చరిత్ర పఠానీ వీరజాతిది. అట్టి జాతికి ప్రపంచ పీడిత జనం పిడికిళ్ళెత్తి జేజేలు చెప్పాలి. సామ్రాజ్యవాద మీడియా పాక్ లోని ఆ రాష్ట్రాన్ని *ప్రపంచ మతోన్మాద ఉగ్రవాద కేంద్రం* గా ప్రపంచ ప్రజ మనస్సులో చిత్రించింది. అది ముస్లిం మతతత్వం వెర్రితలలు వేసే ప్రాంతం గా గత ఇరవై ఏళ్లుగా సామ్రాజ్యవాద మీడియా రొచ్చుకుంట ప్రచారం చేస్తోంది. మొన్న జనవరి ఫస్ట్ రోజు వెల్లివిరిసిన లౌకిక, మత సామరస్య సంస్కృతి అక్కడిదే! దాన్ని తెలుసుకుందాం.
ఓ శతాబ్ది క్రితం అదే చోట *గురుపరమహన్ దయాల్* అనే ప్రముఖ హిందు మతగురువు ఉండేవారు. ఆయనకు వేలాది మంది హిందూ మత శిష్యులున్నారు. 1919లో మరణించారు. తేరి గ్రామంలోనే భక్తులు సమాధి చేశారు. శ్రీకృష్ణ ద్వార మందిరాన్ని కూడా నిర్మించారు. 1919 నుండి 1947 వరకు హిందువుల పవిత్ర యాత్రాస్థలిగా అది వర్ధిల్లింది. దేశవిభజనతో మూత పడింది. కాశ్మీర్ ముస్లిమ్స్ పై దాడులకి ప్రతీకారంగా 97లో ఆ శిథిలాలయం పై దాడి జరిగింది. పాక్ సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. అది సమాధి & శ్రీకృష్ణ మందిర పునరుద్ధరణ జరగాలని ఆదేశించింది. ఆ దాడికి సారధ్యం వహించిన స్థానిక ముస్లిం మత గురువుతో సహా 26 మందిని అరెస్ట్ చేసారు.
2020 డిసెంబర్ 30న 1500మందితో మరోసారి అదే ఆలయంపై దాడి జరిగింది. ఆరోజు దాడిని ఊహించి హిందువులు చేసిన పిర్యాదుతో భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఐనా మత పెద్ద మౌల్వీ అహ్మద్ నేతృత్వంలో జరిగే దాడి ని నియంత్రించడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమైనది.
ఈసారి హిందూ ఆలయ విధ్వంసం పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గుల్జార్ అహ్మద్ విశేష చొరవ ప్రదర్శించారు. పాక్ సుప్రీం కోర్టు సువో మోటో కేసును నమోదు చేసింది. 5-2-2021న విచారణని చేపట్టింది. (రేపటికి ఏడాది) రెండు వారాల్లో ఆలయ పునరుద్ధరణ జరగాలనే తాత్కాలిక ఆదేశం ఇచ్చింది. అలాగే పూర్తి స్థాయి విచారణను కూడా చేపట్టింది.
*పాకిస్తాన్ ప్రభుత్వం కూడా కదిలింది. కరక్ జిల్లా SP, ఒక DSP, కొందరు స్థానిక పోలీసు అధికార్లతో సహా 109 మంది పోలీసు సిబ్బంది ని సస్పెండ్ చేసింది. మత పెద్ద మౌల్వీ అహ్మద్ సహా నేరస్తుల్ని అరెస్ట్ చేసింది.*
పాకిస్థాన్ సుప్రీంకోర్టు 2021 అక్టోబర్ లో తుది తీర్పును కూడా ఇచ్చింది.
పాకిస్థాన్ సుప్రీంకోర్టు తాత్కాలిక తీర్పు; తుది తీర్పు రెండింటినీ చూస్తే, రెండు విశిష్టతలున్నట్లు అర్ధమవుతుంది.
*హిందూ ఆలయాన్ని ముస్లిం మతోన్మాదులు కూల్చినచోట ఏడాదిలో పునర్నిర్మాణం జరిగింది. పునప్రారంభ వేడుక జరిగే సానుకూల భౌతిక స్థితిని సుప్రీం కోర్టు సృష్టించడం విశేషం!*
*హిందు ఆలయాన్ని కూల్చిన మతోన్మాద ముద్దాయిల నుండి 33 మిలియన్ల రూపాయల్ని (2,94,161 అమెరికా డాలర్లతో సమానం) నష్టపరిహారంగా కోర్టు నిర్ణయించింది. ఆ భారీ జరిమానా సొమ్ముని హిందువుల ఆలయ పునర్నిర్మాణానికి ఖర్చు చేయాలని కూడా కోర్టు ఆదేశించింది.*
*ఆలయ నిర్మాణాన్ని త్వరలో పూర్తిచేసి, హిందువులు పూజలు చేసుకునే స్వేచ్చాయుత పరిస్థితిని కల్పించాలని ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది.*
*భారతదేశంలో లౌకిక, గణతంత్ర, ప్రజాతంత్ర రాజ్యాంగం అమలులో వుంది. అట్టి రాజ్యాంగం పాక్ లో ఉనికిలో లేదు. రెండు దేశాల న్యాయ వ్యవస్థల మధ్య తేడాల్ని చూద్దాం.
*బాబ్రీ మసీదు కూల్చిన మతోన్మాద శక్తులకే మెజార్టీ ప్రజల మనోభావాల పేరిట భారత న్యాయ వ్యవస్థ స్థలాన్ని అప్పగించింది. పాక్ న్యాయ వ్యవస్థ తద్భిన్నంగా మెజార్టీ ప్రజల మనోభావాల్ని పట్టించుకోకుండా, హిందువుల ఆలయ స్థలాన్ని హిందువులకే అప్పగించింది. పైగా కూల్చిన మతోన్మాదుల నుండి నష్ట పరిహారం రికవరీకి ఆదేశించింది. బాబ్రీ మసీదు కూల్చిన నేరం పై భారత్ న్యాయ వ్యవస్థ పాతికేళ్లకి పైగా విచారణ చేపట్టింది. పాక్ న్యాయ వ్యవస్థ ఏడాదిలో పూర్తి చేసింది. ఇలాంటి తేడాలు గమనార్హం!*
మైనార్టీ హిందువుల్లో విశ్వాసాన్ని కలిగించే మరికొన్ని చర్యల్ని పాక్ సుప్రీంకోర్టు చేపట్టింది. అందులో భాగంగా భారత్ లో వుండే *పరమహన్ దయాల్* ఐదో వారసత్వ గురువు నేతృత్వంలో 50 మంది ప్రముఖ హిందూ మతపెద్దల బృందం నిరుడు ఇండియా నుండి పాక్ వెళ్ళి ఆలయ ప్రాంతాన్ని సందర్శించి స్థానిక హిందువుల్లో విశ్వసం కలిగించింది.
అంతటితో పరిమితం కాలేదు. పాక్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పౌర సమాజంలో సైతం మత సామరస్యతను పెంపొందే పలు చర్యల్ని చేపట్టారు. గత దీపావళి రోజు తానే స్వయంగా తేరి గ్రామం వెళ్లారు. హిందువులతో దీపావళి ఉత్సవంలో ఆ రోజంతా గడిపారు. స్థానిక ముస్లిం ప్రజల్ని భాగస్వామ్యం చేసారు. మత సహజీవన ఆవశ్యకతని ముస్లింలచే గుర్తింప జేసే చొరవను ప్రదర్శించారు. అక్కడితో కూడా పరిమితం కాలేదు. ఆలయ పునర్నిర్మాణం తర్వాత ప్రారంభోత్సవ వేడుకకు ప్రపంచ దేశాల హిందు మత పెద్దల్ని ఆహ్వానించే విధంగా ఐదారు వారాల ముందే సంకేతాన్ని ఇచ్చారు. ఆ వెలుగులోనే ఇండియా సహా ప్రపంచ దేశాల హిందూ మత పెద్దలకు ఆహ్వానం లభించింది. ఫలితమే మొన్న జనవరి ఫస్ట్ తేరిలో భారీస్థాయిలో హిందూ మేళా జరిగింది.
మరో ముఖ్యాంశం ఉంది. సుప్రీంకోర్టు చొరవ వల్ల స్థానిక ప్రజల్లో మత సామరస్య వాతావరణం ఏర్పడింది. హిందువులకి అండగా వారు నిలిచే స్థితి ఏర్పడింది. *మందిర్ బనావో* నినాదంతో ముస్లింలు ఉద్యమాన్ని చేపట్టారు. యువత సైతం సోషల్ మీడియాలో బాగా స్పందించింది. నెటిజెన్ల నుండి బహుళ ఆదరణ లభించడం విశేషం!
సాంప్రదాయ లౌకికవాద సంస్కృతి వెల్లివిరిసే ఈ సంఘటనపై కార్పొరేట్ మీడియా స్పందించలేదు. హిందుత్వ రాజనీతితో దేశాన్ని ఫాసిస్టు భారత్ గా మార్చే రాజకీయ కుట్ర బడా కార్పొరేట్ వ్యవస్థది. దాని ప్రయోజనాల కోసం ప్రజల్ని మతవిద్వేషంతో విభజించాలి. దానికి మత సమరస్యత, సహజీవనం గిట్టవు. బడా కార్పొరేట్ వ్యవస్థ తన పెంపుడు మీడియా ద్వారా ఈ మత సామరస్య సంఘటన వార్తని కప్పిపెడుతుంది. భారతదేశ ప్రజాతంత్ర, ప్రగతిశీల, గణతంత్ర, లౌకిక, సామ్యవాద రాజకీయ శక్తులు వీటికి గరిష్టస్థాయిలో ప్రాచుర్యం కల్పించాల్సి వుంది.
మతసామరస్యం ప్రబోధించి, హిందుత్వ శక్తుల చేతుల్లో గాంధీ బలయ్యాడు. అట్టి గాంధీ ప్రాతినిధ్యం వహించేదే లౌకిక, ప్రజాతంత్ర, గణతంత్ర భారతదేశం! అట్టి భారతదేశంలో *తొలిజిన్నా* స్మారక చిహ్నం పై నేడు దాడికి ప్రయత్నం జరుగుతోంది. అది స్వాతంత్ర్య ఉద్యమ ప్రియులు గుంటూరులో నిర్మించిన జిన్నా టవర్!
మరోవైపు దృశ్యం చూద్దాం. దేశ విభజనకు ప్రధాన కారకుల్లో *మలిజిన్నా* ఒకరు! ఆయనే పాకిస్థాన్ జాతిపిత కూడా! ఆయన స్థాపించిన మత రాజ్యమే పాకిస్థాన్! నేడు ఇక్కడ గుంటూరులో; అక్కడ తేరిలో ఏం జరుగుతోందో తులనాత్మక పరిశీలన చేయడం మన కర్తవ్యం! ఎంతటి వైచిత్రం యిది!!!
*తొలిజిన్నా* భారతదేశ మతసహజీవన, మత సామరస్య వాదాలకు ప్రతీక! *మలిజిన్నా* దేశవిభజన, మతవిద్వేష రాజనీతికి ప్రతీక! తొలి జిన్నా పట్ల ప్రేమతో నాటి గుంటూరు స్వాతంత్ర్య ఉద్యమ ప్రియులు *జిన్నా టవర్* నిర్మాణం చేసుకున్నారు. *తమ కష్ట ఫలితం నుండి పైసాపైసా సేకరించుకొని ప్రేమతో నిర్మించుకున్న చారిత్రక కట్టడమది.* ఔను, *తొలి సావర్కార్* స్వాతంత్ర్య భారతాత్మ కాగా, *మలి సావర్కార్* హిందుత్వ రాజకీయాత్మ! జిన్నా రాజకీయ జీవితం కూడా రెండుగా చూడాలి. నాటి మన గుంటూరు స్వాతంత్ర్య ప్రియులు *మలిజిన్నా* కి స్మారక చిహ్నం నిర్మించలేదు. *తొలిజిన్నా* చిహ్నం పై దాడి, లౌకిక, గణతంత్ర విధానం పై దాడి!
*నాడు జిన్నా టవర్ నిర్మించిన ప్రజలు మన తాతలు, అమ్మమ్మలు, ముత్తాతలు, బామ్మలే! జిన్నాటవర్ కూల్చివేత కి దిగడమంటే, దాన్ని తమ చెమట చుక్కల ఫలం నుండి నిర్మాణం చేసిన మన పూర్వ తరాలపై దాడి! వారి చెమటపై దాడి! వారి రక్తమాంసాలపై దాడి! వారి నిష్కళంకమైన స్వాతంత్ర్య రాజకీయ ఆత్మలపై దాడి! వారి విశాల లౌకిక సంస్కృతి పై దాడి! వారు ప్రేమతో నిర్మించుకున్న చారిత్రక కట్టడాల పరిరక్షణే నేడు వారికి మనమిచ్చే నిజమైన నివాళి! అది నేటి తరాల కర్తవ్యం! నిజానికి ఇది జిన్నా సమస్య కాదు. మనని కనిపెంచిన పూర్వ తరాల త్యాగశీల తరానికి రాజకీయ వారసత్వం మనం వహించాలా? లేదా? అనేదే సమస్య!*
సామ్రాజ్యవాద వ్యతిరేక దృష్ఠితో చరిత్ర గర్భాన్ని పరిశోధిస్తే మతతత్వాన్ని గూర్చి పలు దిగ్భ్రాంతికర నిజాలు అర్దమవుతాయి. ఈ మతతత్వం, అసహన ధోరణి సామాన్య ప్రజల్లో లేదనే నిజం తెలుస్తుంది.
అత్యధిక శాతం ముస్లిం జనాభా గల వాయవ్య రాష్ట్రానికి (NWFP) 1937 ఎన్నికల్లో 50 సీట్లు కేటాయిస్తే, దేశ విభజన కోరే ముస్లిం లీగ్ కి ఒక్క సీటు కూడా రాలేదు. కానీ హిందువులు అధికంగా నివసించే UP లో 27; బొంబాయిలో 20; మద్రాస్ లో 11 సీట్లను ముస్లిం లీగ్ గెలిచింది. ఏ ఫాక్తూనిస్తాన్ *మత ఫండమెంటలిజానికీ, ఉగ్రవాదానికీ కేంద్రం* గా సామ్రాజ్యవాద మీడియా చేత భారీ పబ్లిసిటీ జరిగి, ప్రపంచ పీడిత ప్రజల మనస్సుల్లో “విలన్” గా చిత్రించబడుతుందో; ఆ పఠానీ నేల తల్లి బిడ్డలే నాడు మతసామరస్య వైఖరితో ముస్లిం లీగ్ ని ఓడించి, కాంగ్రెస్ ని గెలిపించారు. అదే ప్రజలు నేడు హిందు ఆలయ పునర్నిర్మాణo కోసం *మందిర్ బనావో* ఉద్యమం చేపట్టారు.
తొమ్మిదేళ్ల తర్వాత తిరిగి 1946లో జరిగిన ఎన్నికల్లో కూడా NWFP రాష్ట్రంలో జనరల్ స్థానాల్లోనే కాకుండా ముస్లిమ్స్ కి కేటాయించిన స్థానాల్లో కూడా ముస్లిం లీగ్ విఫలమైనది. నాటికి దేశ సమైక్యతకు కట్టుబడ్డ భా.జా. కాంగ్రెస్ మెజార్టీ స్థానాల్ని గెలిచింది. నాడు పఠానీ జాతి ప్రదర్శించిన చైతన్యం ఎంత గొప్పది!!
1946లో సిమ్లా లో వైస్రాయ్ వేవర్లీ ఆహ్వానం పై నలుగురితో కూడిన భారత జాతీయ కాంగ్రెస్ ప్రతినిధివర్గంలో ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ ఒకరు. సిమ్లా చర్చల్లో దేశ విభజన ప్రతిపాదనని నెహ్రూ, పటేల్, మౌలానా కన్న గఫార్ ఖాన్ తీవ్ర ఆగ్రహమే ప్రదర్శించారు. ఆయనే NWFP రాష్ట్ర స్వాతంత్ర్య ఉద్యమ నేత, నిర్మాత! అట్టి చరిత్రాత్మక లౌకిక పాత్రను పోషించిన ఆ ప్రజలపై నేడు నిందా ప్రచారం జరగడానికి వారు మతోన్మాదులైన కారణంగా కాదు. వారి సహజ సామ్రాజ్యవాద వ్యతిరేక దేశభక్తియుత వీరోచిత సాంప్రదాయ చరిత్ర కొనసాగింపు కై సరైన ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి నేడు లేదు. బ్రిటీష్ ఇండియాలో కనీసం గాంధీ, నెహ్రూ వంటి పరిమిత లౌకిక నేతల నేతృత్వం ఉండేది. నేడు ఆ ప్రత్యామ్నాయ స్థితి కూడా లేదు. అట్టి ప్రతికూల భౌతిక స్థితిలో మతం, దేవుణ్ణి ఆసరా చేసుకుని సామ్రాజ్యవాద వ్యతిరేక, దురాక్రమణ వ్యతిరేక దేశభక్తియుత వీరోచిత వారసత్వాన్ని నేటికీ కొనసాగిస్తున్నారు. వారు స్వతసిద్దంగా మతోన్మాదులు కారు. పై హిందూ మేళా నిరూపించే వాస్తవమిది.
పై చారిత్రక, రాజకీయ, సాంస్కృతిక వాస్తవాల వెలుగులో తులనాత్మక దృక్కోణంతో గుంటూరు జిన్నా టవర్ ఉదంతం పై విస్తృత ప్రచారోద్యమాన్ని చేపడదాం. హిందుత్వ మతోన్మాద శక్తుల్ని రాజకీయంగా ఓడిద్దాం.
ఇక్కడ హిందుత్వ మతోన్మాదమైనా; అక్కడి ముస్లిం మతతత్వమైనా మానవత్వాన్ని ధ్వంసించే అమానుష రాజకీయ ప్రక్రియలే! ఐతే ఇవేవీ వాటికి అవే ఆయా మతాలకు చెందిన సామాన్య ప్రజల నుండి పెరిగేవి కాదు. ప్రజల శ్రమశక్తిని ఏ బడా ధనస్వామ్య వ్యవస్థ పీడిస్తుందో, అదే ప్రజల్ని మతాల పేరిట విభజించి కొల్లగుడుతుంది. అట్టి శ్రమదోపిడీ వ్యతిరేక, సామ్రాజ్యవాద వ్యతిరేక రాజకీయ ప్రక్రియతో సంబంధం లేకుండా వీటిని ఓడించలేము. గుంటూరు జిన్నా టవర్ ఉదంతం పై కూడా బీజేపీ ప్రజా న్యాయ స్థానంలో నిలబెట్టే విధానాన్ని చేపట్టాల్సి ఉంటుంది. ఈ వివాదం కేవలం జిన్నా టవర్ చుట్టూ తిరిగితే ఆచరణలో ఫాసిస్టు రాజకీయ శక్తులకే లాబిస్తుంది. హిందుత్వ రాజకీయ శక్తుల్ని ప్రజా న్యాయస్థానపు బోనులో నిలబెట్టి వెనక్కి కొడదాం.
One thought on “గాంధీ రాజ్యంలో జిన్నా విగ్రహ విధ్వంస రాజకీయ సంస్కృతి”
మీ విశ్లేషణ చాలా బాగుంది