టర్కీ రాజధాని ఇస్తాంబుల్లో జరిగిన ఏషియన్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ పోటీల్లో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్న అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ క్రీడాకారిణి సాదియా అల్మస్ కు స్వస్థలంలో అపూర్వ స్వాగతం లభించింది. గురువారం సాయంత్రం స్వస్థలం మంగళగిరికి విచ్చేసిన స్ట్రాంగ్ గరల్, మంగళగిరి యూత్ ఐకాన్ సాదియాకు వీజే కళాశాల వద్ద సాదర స్వాగతం లభించింది. టర్కీలో జరిగిన ఏషియన్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ పోటీల్లో 57 కేజీల విభాగంలో స్క్వాట్- 167.5 కేజీలు, బెంచ్ ప్రెస్- 70 కేజీలు, డెడ్ లిఫ్ట్ 162.5 కేజీలు మొత్తంగా 400 కేజీలు బరువు ఎత్తి ఓవరాల్ బంగారు పతకాన్ని సాధించిన విషయం విదితమే.
ఫిట్ జోన్ ప్రతినిధులు, పవర్ లిఫ్టింగ్ అభిమానులు, క్రీడాభిమానులు, విద్యార్థులు, మైనార్టీ సంఘాల ప్రతినిధులు స్వర్ణ పతక విజేత సాదియాకు ఘన స్వాగతం పలికి ర్యాలీగా మంగళగిరి విచ్చేశారు. వడ్లపూడి సెంటర్, మిద్దె సెంటర్ మీదుగా గౌతమ బుద్దా రోడ్ గుండా అంబేద్కర్ సెంటర్ కు ర్యాలీగా బయలుదేరారు.
అంతర్జాతీయ స్థాయిలో మంగళగిరి ఖ్యాతిని ఇనుమడింపజేసిన సాదియాకు నగర ప్రజలు ఆత్మీయ స్వాగతం పలికారు.
మంగళగిరి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీ లో రోటరీ అసిస్టెంట్ గవర్నర్ అనిల్ చక్రవర్తి, ప్రతినిధులు డా. వంశీకృష్ణ మాజేటి, ఎస్.ఏ. శిలార్, గాజుల శ్రీనివాసరావు, ప్రతినిధులు పాల్గొన్నారు
ఆమె తండ్రి, ఫిట్ జోన్ అధినేత సందాని, గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ కార్యదర్శి గుమ్మడి పుల్లేశ్వరరావులకు అభినందనలు తెలిపారు.
సాదియాను సత్కరిస్తున్న టీడీపీ నాయకులు, మైనార్టీ నాయకులు