మొత్తం రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాలకు పరిహారం దక్కేవరకూ ఐక్యంగా పోరాడదాం. బాధిత కుటుంబాలకు, ప్రజలకు వేదిక పిలుపు
(రైతు స్వరాజ్య వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ )
తెలంగాణా రాష్ట్రంలో బలవన్మరణాలకు పాల్పడిన 133 రైతు కుటుంబాలకు పరిహారం క్రింద 7.95 కోట్లు మంజూరు చేస్తూ డిసెంబర్ 24 న రాష్ట్ర ప్రభుత్వం జీవో 37 విడుదల చేసింది . ఇది తప్పకుండా ఆయా కుటుంబాలకు ఊరట ఇచ్చే విషయం . ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యను మేము స్వాగతిస్తున్నాం .
గత ఏడేళ్లుగా ఆయా బాధిత కుటుంబాల నిరంతర ప్రయత్నం, ఈ కుటుంబాల పక్షాన రైతు స్వరాజ్య వేదిక నిరంతరం చేసిన కృషి, ఈ కృషికి వివిధ ప్రజా సంఘాలు అందించిన సహకారం, మరీ ముఖ్యంగా రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర హై కోర్టు లో ధాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం, ఇటీవల డిసెంబర్ 16 న హైదారాబాద్ లో బాధిత కుటుంబాలతో జరిగిన పబ్లిక్ హియరింగ్ , ధర్నా, మీడియాలో విస్తృతంగా ఈ కుటుంబాల గురించి వచ్చిన కథనాలు, దేశ వ్యాపితంగా అనేక మండి ప్రముఖులు ట్విట్టర్ ద్వారా ఈ కుటుంబాల దుస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకు రావడం లాంటి అనేక పరిణామాలు ఈ జీవో వెలువడడానికి ముఖ్య కారణం .
ఈ కృషిలో భాగం పంచుకున్న అందరికీ పేరు పేరునా రైతు స్వరాజ్య వేదిక ధన్యవాదాలు, అభినందనలు తెలియ చేస్తున్నది .
తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక సుమారు 7000 మంది రైతులు బలవన్మరణాలకు పాలపడ్డారు. మహిళా రైతుల ఆత్మహత్యలు , వ్యవసాయ కూలీ ఆత్మహత్యలు వీటికి అదనం .
రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాలకు ఎక్స్గ్రేషియా (పరిహారం) ఇవ్వడానికి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 421 జీవో ఉండేది . ఈ జీవో ప్రకారం ప్రతి బాధిత కుటుంబానికి ఒక లక్ష రూపాయల పరిహారం, మరో 50,000 రూపాయలు , ఒన్ టైమ్ సెటిల్ మెంట్ క్రింద ఆ కుటుంబ అప్పుల చెల్లింపుకు అందించే వారు . మండల రెవెన్యూ అధికారి ( ఎంఆర్‌ఓ ) ఈ ఒన్ టైమ్ సెటిల్ మెంట్ బాధ్యత నిర్వర్తించాని జీవో లో స్పష్టం గా పేర్కొన్నారు .
కానీ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణా ప్రాంతంలో 25,000 మందికి పైగా రైతులు బలవన్మరణాలకు పాల్పడితే కనీసం 10,000 మందికి కూడా పరిహారం అందలేదు. అధికారులు ఒన్ టైమ్ సెటిల్ మెంట్ అమలు చేయలేదు . ఫలితంగా ఆ కుటుంబాలు తమకు వచ్చిన పరిహారం డబ్బులను కూడా అప్పుల చెల్లింపుకు వెచ్చించవలసి వచ్చేది . ఆ కుటుంబాలు సంక్షోభంలోనే కొనసాగేవి.
తెలంగాణా రాష్ట్రం ఏర్పడ్డాక రాష్ట్ర ప్రభుత్వం 2015 లో జీవో 173, 194 ఈ కుటుంబాలను ఆదుకోవడానికి తీసుకు వచ్చింది . ఈ జీవోల ప్రకారం 2014 జూన్ 2 నుండీ బలవన్మరణాలకు పాల్పడిన రైతు కుటుంబాలకు 5 లక్షల రూపాయల పరిహారం, ఆ కుటుంబ అప్పులను ఒన్ టైమ్ సెటిల్ మెంట్ చేయడానికి మరో లక్ష రూపాయలు చెల్లించాల్సి ఉంది . బాధిత కుటుంబానికి అంత్యోదయ రేషన్ కార్డ్, పిల్లల చదువుకు సహాయం, పెన్షన్ , ప్రభుత్వ పథకాలలో ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది .
కానీ రాష్ట్ర ప్రభుత్వం జీవోలు అయితే తెచ్చింది కానీ ఈ జీవో లను వాటి స్పూర్తితో అమలు చేయడం లేదు . ఆయా కుటుంబాలకు పరిహారం చెల్లించడం లేదు . జీవో 421 లో పేర్కొన్నట్లు గా, మండల స్థాయి ముగ్గురు అధికారుల కమిటీ ఈ ప్రక్రియ వేగంగా కొనసాగించాలి. కానీ ఎంతో ఒత్తిడి చేస్తే తప్ప, అధికారులు వాళ్ళంతట వాళ్ళు ఆ కుటుంబాన్ని కల్సీ మాట్లాడడం లేదు . ఆ కుటుంబానికి తక్షణమే అంత్య క్రియల కోసం ఇవ్వాల్సిన 5000 రూపాయలను కూడా ఇవ్వడం లేదు. అలాగే జాతీయ కుటుంబ లబ్ధి పథకం ( NFBS) క్రింద ఇవ్వాల్సిన 20,000 రూపాయలు కూడా ఇవ్వడం లేదు . 2018 నుండి తెలంగాణ రాష్ట్రం లో 85000 మంది మహిళలకు ఆసరా పెన్షన్లు ఇవ్వకుండా ప్రభుత్వం పెండింగ్ లో ఉంచింది; సంవత్సరాలు గడుస్తున్నా కనీసం అంత్యోదయ రేషన్ కార్డ్, వితంతు పెన్షన్ కూడా ఇవ్వడం లేదు. బాధిత కుటుంబాల సభ్యులు ఆఫీసుల చుట్టూ తిరుగుతూ అలసి పోతున్నారు తప్ప పని కావడం లేదు.
మరీ ముఖ్యంగా 2018 ఆగస్ట్ 15 నుండీ రైతు బీమా పథకం ప్రారంభించాక , జీవో 173, 194 లను అమలు చేయడం రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా మానేసింది . రాష్ట్రంలో ఇప్పటి వరకూ 7000 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడితే కేవలం 1600 మందికి మాత్రమే పరిహారం అందించడానికి అంగీకరించారు . ఈ 1600 మందిలో కూడా 250 మందికి ప్రొసీడింగ్స్ లేఖలు ఇచ్చి కూడా డబ్బులు చేల్లించలేదు. ఇప్పుడు రాష్ట్ర ప్రబుత్వం విడుదల చేసిన డబ్బులు కూడా కేవలం 133 కుటుంబాలకే .మిగిలిన కుటుంబాలకు ఇంకా డబ్బులు అందాల్సి ఉంది. రైతు బీమా మార్గదర్శకాలలో ఉన్న లోపాల వల్ల భూమి లేని కౌలు రైతులకు, పోడు రైతులకు , మహిళా రైతులకు రైతు బీమా కూడా రావడం లేదు .
ఈ నేపధ్యంలో మేము ఈ క్రింది నిర్ధిష్ట డిమాండ్లను ప్రభుత్వం ముందు పెడుతున్నాం .
2014 జూన్ 2 నుండీ రాష్ట్రంలో జరిగిన మొత్తం రైతు ఆత్మహత్యలను ప్రభుత్వం గుర్తించి , ఆయా కుటుంబాలకు 5,00,000 రూపాయల పరిహారం అందించాలి . ఈ ప్రక్రియ 3 నెలల లోపు పూర్తి చేయాలి. ఇందు కోసం సంభంధిత ఎఫ్‌ఐఆర్ ను మాత్రమే ప్రాతిపదికగా పెట్టుకోవాలి .
జీవో లో చెప్పినట్లుగా అధికారులు బాధ్యత తీసుకుని మరో లక్ష రూపాయలతో ఆయా కుటుంబాల అప్పులను ఒన్ టైమ్ సెటిల్ మెంట్ చేయాలి . ఆ కుటుంబాలను పూర్తి ఋణ విముక్తులను చేయాలి .
కేవలం భూమి యజమానులుగా ఉన్న వారినే కాకుండా మొత్తం గ్రామీణ కుటుంబాలను రైతు బీమా పరిధిలోకి తీసుకు రావాలి. కుటుంబాన్ని యూనిట్ గా భావించి, ఆ కుటుంబంలో 18 సంవత్సరాలు దాటిన వారు ఎవరు చనిపోయినా, ఆ కుటుంబానికి ఐదు లక్షల రూపాయల పరిహారం అందించాలి . బీమా వయో పరిమితిని 75 సంవత్సరాలకు పెంచాలి .
రైతు ఆత్మహత్య బాధిత కుటుంబంలో సంభంధిత వ్యక్తి వాటా భూమిని, ఇతర ఆస్తులను భార్య పేరుకు భూమి బదలాయించడానికి తక్షణమే చర్యలు చేపట్టేలా రెవెన్యూ శాఖను ఆదేశించాలి.
ప్రతి గ్రామీణ కుటుంబానికి రైతు బీమా పథకం అమలు చేయడం తో పాటు, రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాల కోసం జీవో 173,194 జీవో లను కూడా అదనంగా అమలు చేసి, ఆ కుటుంబాలకు పరిహారం అదనంగా అందించాలి, ఆ జీవో లో పేర్కొన్న అన్ని రకాల మద్ధతులను ఆయా కుటుంబాలకు అందించాలి .
రైతు ఆత్మహత్య బాధిత కుటుంబం తిరిగి వ్యవసాయంలో నిలదొక్కుకునేలా , కనీసం మూడు సంవత్సరాల పాటు , వారి వ్యవసాయానికి మద్ధతు అందించాలి, ఇతర జీవనోపాధులను కల్పించడం ద్వారా ఆ కుటుంబ ఆదాయానికి గ్యారంటీ ఇవ్వాలి.
బాధిత కుటుంబంలోని పిల్లల చదువులు ఆగిపోకుండా చర్యలు చేపట్టాలి. కుటుంబం , ఆమోదం తెలిపిన సమయంలో పిల్లలను ప్రత్యేక కోటాలో వారి సామాజిక నేపధ్యాన్ని బట్టి వివిధ గురు కులాలలో చేర్చుకోవాలి. ఉన్నత విద్యా, సాంకేతిక విద్యా , ఏది చదివినా పూర్తి చదువు ఉచితంగా చెప్పించాలి.
రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాలలోని అర్హులైన మహిళలకు వెంటనే ఆసరా పెన్షన్లు మంజూరు చేయాలి.
రాష్ట్రంలో జరుగుతున్న రైతు ఆత్మహత్యలలో 80 శాతం కౌలు రైతులవే. రైతుల బలవన్మరణాలు ఆగాలంటే కౌలు రైతులను గుర్తించి, వారికి రైతు బంధు సహాయం సహా, అన్ని రకాల మద్ధతు అందించాలి.
పోడు రైతులకు అటవీ హక్కుల చట్టం క్రింద వెంటనే పట్టాలు ఇవ్వాలి .
గ్రామీణ మహిళలను రైతులుగా గుర్తించాలి. వారి వ్యవసాయానికి అవసరమైన మద్ధతు అందించాలి .
రైతు కుటుంబాలలో మహిళల ఆత్మహత్యలు జరిగినప్పుడు వాటిని రైతు ఆత్మహత్యలు గా గుర్తించి పరిహారం అందించాలి .
ప్రకృతి వైపరీత్యాలు పెరుగుతున్న సమయంలో రాష్ట్రంలో పంటల బీమా పథకాలు అమలు చేసి , రైతులను అప్పుల పాలు కాకుండా ఆదుకోవాలి.
మొత్తం గ్రామీణ రైతు కుటుంబాలకు సంస్థాగత రుణాలు అందించడానికి వీలుగా చర్యలు చేపట్టాలి. అప్పుడే ప్రైవేట్ రుణాల ఊబి నుండి ఆ కుటుంబాలు బయట పడతాయి . తక్షణమే ఋణ మాఫీ హామీని అమలు చేసి ఒకే విడతలో రుణాలను మాఫీ చేయాలి .
పంటలకు కనీస మద్ధతు ధరలు అందేలా చర్యలు చేపట్టాలి. వారికి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసినప్పుడు ప్రభుత్వం ఎంఎస్‌పి తో వాటిని కొనుగోలు చేయాలి .
-బి ,కొండల్, కన్నెగంటి రవి, విస్సా కిరణ్ కుమార్, ఆశాలత (రైతు స్వరాజ్య వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ)