అంతర్జాతీయ గుర్తింపుతెచ్చిన పవర్ లిఫ్టర్ సందానిది
సాధారణ కుటుంబ నేపథ్యం అయినా అసాధారణ విజయాలు
టర్కీలో సత్తా చాటిన సందాని కుమార్తె సాదియా
స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్న స్ట్రాంగ్ గరల్
క్రీడాభిమానుల్లో అధికశాతం క్రికెట్ అంటే ముచ్చట పడతారు. క్రికెట్ కు కేంద్ర బిందువుగా ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం మంగళగిరిలో రూపుదిద్దుకుంటోంది.
క్రికెట్ సంబరం ఎప్పుడు మొదలవుతుందోగాని.. క్రీడారంగంలో ప్రత్యేకించి మంగళగిరి పవర్ లిఫ్టింగ్ లో మణిహారంగా నిలుస్తోంది.
ఈ విషయంలో ఇద్దరు పవర్ లిప్టర్లు విశేషంగా పాటుపడ్డారు. ఒకరు గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ కార్యదర్శి గుమ్మడి పుల్లేశ్వరరావు కాగా, మరొకరు కోచ్ షేక్ సందాని. పవర్ లిఫ్టింగ్ కు మంగళగిరి కేరాఫ్ అడ్రసుగా నిలవడం వెనుక ఈ పవర్ ఫుల్ పర్సన్స్ కృషి ఎంతో ఉంది. సందాని స్వయంకృషితో పవర్ లిఫ్టింగ్ లో అంతర్జాతీయంగా గుర్తింపు పొందడమేకాకుండా నేడు తన కుమార్తె సాదియా అల్మస్ అంతర్జాతీయ పోటీల్లో స్వర్ణ పతకంతో మెరిసేలా తీర్చిదిద్దాడు.
అంతర్జాతీయ పవర్ లిఫ్టర్ గా పది హేను సంవత్సరాల క్రితమే షేక్ సందాని జంషెడ్ పూర్ లో జరిగిన ఏషియన్ బెంచ్ ప్రెస్ చాంపియన్ షిప్ లో రజత పతకంతో మెరవగా… నేడు ఆయన తనయ సాదియా అల్మస్ టర్కీ రాజధాని ఇస్తాంబుల్ లో శనివారం రాత్రి (25-12-2021) జరిగిన ఏషియన్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ పోటీల్లో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. 57 కేజీల విభాగంలో జరిగిన ఈ పోటీల్లో స్క్వాట్- 167.5 కేజీలు, బెంచ్ ప్రెస్- 70 కేజీలు, డెడ్ లిఫ్ట్ 162.5 కేజీలు మొత్తంగా 400 కేజీలు బరువు ఎత్తి స్వర్ణ భేరి మోగించింది. స్క్వాట్, డెడ్ లిఫ్ట్ లలో రెండు స్వర్ణాలు, బెంచ్ ప్రెస్ లో రజత పతకం సాధించిన సాదియా అల్మస్ ఓవరాల్ గా స్వర్ణ పతకాన్ని చేజిక్కించుకుంది. సాదియా అంతర్జాతీ స్థాయిలో విశేష ప్రతిభాపాఠవాలను కనబరచడంలో ప్రత్యేకించి ఆమె తండ్రి, పవర్ లిఫ్టింగ్ కోచ్ సందాని కృషి ఎంతో ఉంది.
సందాని నేపథ్యం ఏమిటంటే…
1981 డిసెంబర్ 10న జన్మించిన సందానిది అత్యంత సాధారణ కుటుంబ నేపథ్యం. నాన్న అబ్దుల్ రజాక్ సైకిల్ షాపు నడిపేవారు. ఎనిమిది మంది సంతానంలో నాలుగోవాడు. తర్వాత కాలంలో టెంట్ హౌస్, ఎండుచేపల వ్యాపారం చేస్తున్నారు. ప్రాథమిక విద్య వరకే చదువు సాగించిన సందాని తన 18వ ఏట స్నేహితుల ప్రోత్సాహంతో స్థానికంగా ఉన్న రమణగారి జిమ్ కు ఉదయాన్నే వెళ్లడం అలవాటు చేసుకున్నాడు. తొలినాళ్లలో బాడీ బిల్డింగ్, వెయిట్ లిఫ్టింగ్ లో జిల్లాస్థాయిలో రాణిస్తున్న క్రమంలో గుంటూరుకు చెందిన నేషనల్ వెయిట్ లిఫ్టర్ కె.విజయభాస్కర్… తన ప్రదర్శన చూసి పవర్ లిఫ్టింగ్ రాణిస్తావని చెప్పి ఆ దిశగా ప్రోత్సహించారంటారు సందాని.
నేషనల్ పవర్ లిఫ్టర్, గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ కార్యదర్శి గుమ్మడి పుల్లేశ్వరరావు మంగళగిరిలో ఉండడంతో సందాని ఆ దిశగా సాధన చేశాడు. 2000 సంవత్సరంలో యూత్ జిమ్ అండ్ ఫిట్ నెస్ సెంటర్ నెలకొల్పి (2010లో ఫిట్ జోన్) సాధన చేస్తూ ఇప్పటివరకు 150 మంది పవర్ లిఫ్టర్లను తీర్చిదిద్దాడు సందాని.
2001 నుంచి జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటున్న సందాని ప్రతిసారి (2012 వరకు) ఏదొక పతకం సాధించడం విశేషం! 2004లో ఝార్ఖండ్ రాష్ట్రంలోని జంషెడ్ పూర్ లో జరిగిన ఏషియన్ బెంచ్ ప్రెస్ చాంపియన్ షిప్ 90 కేజీల జూనియర్స్ విభాగంలో ఇరాన్ పవర్ లిఫ్టర్ 187.5 కేజీలు ఎత్తి స్వర్ణం సాధించగా… సందాని 185 కేజీలతో రజత పతకంతో అంతర్జాతీయ పవర్ లిఫర్ గా గుర్తింపు పొందాడు. పవర్ లిఫ్టింగ్ లో 850 కేజీలు ( స్క్వాట్ -340, బెంచ్ ప్రెస్- 200, డెడ్ లిఫ్ట్- 310) అత్యుత్తమ ప్రదర్శన సందానీది.
క్రీడారంగంలో ఇప్పుడు పవర్ లిఫ్టింగ్ అనగానే మంగళగిరి పేరు మార్మోగేలా చేయడంలో గుమ్మడి పుల్లేశ్వరరావు, షేక్ సందానిల కృషి చెప్పకతప్పదు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో మంగళగిరి, పరిసర ప్రాంతాల పవర్ లిఫ్టర్లు గుర్తింపు పొందడం వెనుక వీరి కృషి ఉంది. అంతర్జాతీయ స్థాయిలో సందాని, వి.మల్లేశ్వరరావు, బొల్లినేని చంద్రిక రాణించగా… జాతీయస్థాయిలో మహిళల విభాగంలో నాగశిరీష, కుంబా గౌతమి, షేక్ నగీనా, మట్టుకొయ్య సలోమి, ఎం.భాగ్యలక్ష్మి, పురుషుల విభాగంలో ఎండీ సైదా, నంబూరు సతీష్ బాబు, షేక్ హిదాయతుల్లా, షేక్ సుభాని గుర్తింపు పొందడంలో సందాని శిక్షణ ప్ర స్తావించాల్సిందే.