మంగళగిరికి చెందిన అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ క్రీడాకారిణి సాదియా అల్మస్ టర్కీ రాజధాని ఇస్తాంబుల్లో కొద్దిసేపటి క్రితం జరిగిన ఏషియన్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ పోటీల్లో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది.
57 కేజీల విభాగంలో జరిగిన ఈ పోటీల్లో స్క్వాడ్- 167.5 కేజీలు, బెంచ్ ప్రెస్- 70 కేజీలు, డెడ్ లిఫ్ట్ 157.5 కేజీలు మొత్తంగా 395 కేజీలు బరువు ఎత్తి ఓవరాల్ బంగారు పతకాన్ని సాధించింది. స్క్వాడ్, డెడ్ లిఫ్ట్ లలో రెండు స్వర్ణాలు, బెంచ్ ప్రెస్ లో రజత పతకం సాధించిన సాదియా అల్మస్ ఓవరాల్ గా స్వర్ణాన్ని చేజిక్కించుకుంది.
మంగళగిరికి చెందిన షేక్ సంధాని 2004లో జంషెడ్ పూర్ లో జరిగిన ఏషియన్ బెంచ్ ప్రెస్ చాంపియన్ షిప్ 90 కేజీల విభాగంలో సిల్వర్ మెడల్ సాధించగా.. ఆయన తనయ సాదియా అల్మస్ రికార్డులను తిరగరాసి నేడు టర్కీ దేశంలో జరిగిన ఏషియన్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ లో అత్యుత్తమంగా రాణించి మూడు స్వర్ణాలు, ఒక రజత పతకం సహా ఓవరాల్ స్వర్ణ విజేతగా నిలవడం విశేషం.
స్ట్రాంగ్ గరల్ ఆఫ్ ఇండియా(Strong Girl of India) అవార్డులు సొంతం చేసుకున్న సాదియా
2017 డిసెంబరులో కేరళ రాష్ట్రంలోని అలెప్పీలో జరిగిన ఏషియన్ పవర్ లిఫ్టింగ్ సబ్ జూనియర్ విభాగం 52 కేజీల విభాగంలో 242.5 కేజీలు ( మూడు అంశాలు కలిపి) కాంస్య పతకం సాధించిన సాదియా 57 కేజీల విభాగంలో తన కెరీర్లోనే అత్యుత్తమంగా నేడు ఇస్తాంబుల్లో 400 కేజీలు (మూడు అంశాల్లో కలిపి) బరువు ఎత్తి తన పవర్ ఏంటో చూపించింది
మంగళగిరి అంటేనే పవర్ లిఫ్టింగ్ కు పెట్టింది పేరు.. స్థానికంగా ప్రముఖ పవర్ లిఫ్టర్లు, పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గుమ్మడి పుల్లేశ్వరరావు, కోచ్ షేక్ సందాని ల కృషి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.
రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ డెక్కన్ అందించిన రూ.2లక్షల ఆర్థిక సహాయంతో టర్కీ వెళ్లిన పవర్ లిఫ్టర్ సాదియా అల్మస్ స్వర్ణ పతకం సాధించడంతో రోటరీ క్లబ్ ప్రతినిధులు హర్షాతిరేకం వ్యక్తం చేశారు.
రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ అనిల్ చక్రవర్తి ఇసునూరి, రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి అధ్యక్షుడు డాక్టర్ వంశీకృష్ణ మాజేటి, ప్రతినిధులు ఎస్ఏ సిలార్, గాజుల శ్రీనివాసరావు తదితర ప్రతినిధులు తమ రోటరీ క్లబ్ సభ్యుడు, పవర్ లిఫ్టింగ్ కోచ్ సందానికి అభినందనలు తెలిపారు.
పవర్ లిఫ్టింగ్ లో అంతర్జాతీయ స్థాయిలో స్వర్ణపతకాన్ని సాధించిన సాదియా అల్మస్ కేఎల్ యూనివర్సిటీలో డిగ్రీ చదువుతోంది. భవిష్యత్తులో సాదియా మరిన్ని రికార్డులు సాధించాలని ఆశిద్దాం..
(ఆవ్వారు శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, మంగళగిరి)