గ్రంథ సేకరణకూ, అధ్యయనానికీ మధ్య వైరుధ్యం

-ఇప్టూ ప్రసాద్ పిపి
గ్రంథ సేకరణకూ, వాటి అధ్యయనానికీ మధ్య వైరుధ్యం లో సాగే పుస్తక ప్రదర్శన శాలకి (బుక్ ఫెయిర్) ఉల్లాసం, ఉత్సాహాలతో వెల్లువెత్తే పుస్తక ప్రియుల వార్తలు సంతోషంగా ఉన్నాయి. ఆన్ లైన్ యుగంలో గ్రంథ పఠనం క్షీణించే వదంతిని కొట్టి పారేసే శుభవార్త! దానికి పుస్తక ప్రియుల పరవళ్లపై ఆంధ్రజ్యోతి మొన్న సంపాదకీయమే రాసింది. పుస్తక ప్రియుల హోరుకు అదో సూచిక! నేడు హైదరాబాద్ లో, రేపు జనవరి 1 నుండి విజయవాడలో తెలుగు సాహితీలోకపు ఆదరణ, అండలతో వర్ధిల్లే పుస్తక ప్రదర్శన శాలలకి జేజేలు!
సాహిత్యం ప్రశ్నల్ని పుట్టిస్తుంది. ఆ ప్రశ్నలు ఎవరికి శత్రువైతే, వారికి పుస్తకం శత్రువే! ఫాసిజం ప్రశ్నను సహించదు. బుక్ ఫెయిర్స్ దానికి శత్రువే! ఆధునిక వైమానిక విద్య పుష్పక విమానంలో, సర్జరీ జ్ఞానం వినాయకుడి మొఖం మార్పిడిలో చూసే ప్రతీఘాతుక శక్తులకి ఖగోళ, భూగోళ, భౌతిక, రసాయన, జంతు, వృక్ష శాస్త్రాలన్నీ గిట్టనివే! ఒక్క మార్క్సిజమే కాకుండా పై విజ్ఞాన శాస్త్రాలన్నీ నేడు వర్ధిల్లితే పాసిజంపై రేపటి పోరుకు పదునుపెట్టే సానరాళ్ళు వర్ధిల్లడమే! ఫాసిజం నశించాలి. సాహిత్యం వర్ధిల్లాలి. బుక్ ఫెయిర్స్ జిందాబాద్!
గతంలో ఉరకలు వేస్తూ పుస్తక సేకరణ చేసే కాలం వుంది. శ్రామికవర్గ విప్లవ వృత్తి రాజకీయాలైనా, నా ప్రవృత్తి అంతకంటే విశాలమైనది. భూగోళ, ఖగోళ, జంతు, వృక్ష, రసాయన, భౌతిక, పౌర, అర్ధశాస్త్రాలను సేకరణే కాక, చదివిన కాలమది. కాలగమనం మార్పును తెచ్చింది. గత విశృంఖల పుస్తక సేకరణ, పఠనాలకి అది నిర్దిష్ట, నిర్ణీత గీతల్ని గీసింది. పుస్తక సేకరణ ప్రక్రియకి పరిమితుల్ని విధించింది. గీతల మధ్య అధ్యయనం చేయాలనీ; పరిమితికి లోబడి పుస్తక సేకరణ చేపట్టాలనీ కొత్త భౌతిక స్థితి సూచించింది.
విభిన్న దృక్కోణాలకి చెందిన పుస్తకాలు వీటిలో లభిస్థాయి. అందులో మార్క్సిస్టు సాహిత్యం ఒకటి. దానికే పరిమితమై ప్రతిస్పందిస్తున్నాను.
*ప్రపంచమొక పద్మవ్యూహం, కవిత్వం తీరని దాహం* అనే శ్రీశ్రీ సూక్తికి పేరడీగా మనం
*మార్క్సిస్టు సిద్ధాంతం ఓ మహా సముద్రం, అధ్యయనం దరిచేరని గజఈత* గా చెప్పొచ్చు. బీచ్ లో విహరిస్తే సముద్ర లోతు తెలీదు. ఐతే కొన్ని అడుగులు లోపలకు వేసి సరదాగా జలక్రీడ ఆడి *సముద్రమంటే ఇదేనా* అనే తేలిక కామెంట్ చేసే అవకాశమూ ఉందేమో! మార్క్సిస్టు సైద్ధాంతిక సముద్రంలోకి దిగకుండా, బీచ్ లో విహరిస్తూ అదో సమగ్ర సముద్ర దర్శనంగా భావించే లేదా భ్రమించే స్థితి శ్రామికవర్గ విప్లవ సంస్థల నేతల జీవితాల్లో ఉంటుందేమో! ఎవరి మాట ఎందుకు? నా దశాబ్దాల అధ్యయనంలో అదో స్వానుభవమే!
మార్క్సిస్టు సారస్వతం బహుముఖమైనది. దాని రాజకీయ సాహిత్యం కన్న సిద్ధాంత సాహిత్యం మిన్న. దానికంటే తాత్విక సాహిత్యం మిన్న. ఇది దశాబ్దాల అధ్యయనం ద్వారా నేనెరిగిన చేదు నిజం! దాస్ కాపిటల్, జర్మన్ ఐడియాలజీ, హొలీ ఫ్యామిలీ, పావర్టీ ఆఫ్ ఫిలాసఫీ, ఆంటీ డూరింగ్, గోదా ప్రోగ్రాం వంటి పలు మార్క్సిస్టు తాత్విక గ్రంధాల విశిష్టత పై ప్రాధమిక పరిచయ జ్ఞానం కలిగేందుకు కొన్ని దశాబ్దాలు పట్టింది. ఇవి ఎప్పటి నుంచో తెలుసు. బీరువాల్లో దాచినవే! ఆంగ్ల భాషలో పరిమితి వల్ల చదవకుండా దాచిన గతం ఉంది. తెలుగులోకి వచ్చాక అది కుంటి సాకే! తెలుగులో ముద్రించాక నేటికీ వాటిని లోతైన అధ్యయనం చేయలేక పోయా. ఇదే నన్ను నా అంతరాత్మ ప్రశ్నిస్తోంది.
*బీరువాల్లో గ్రంధపూజ కోసమే పుస్తక సేకరణ ఎందుకు చేస్తావు* అని అంతరాత్మ వెక్కిరిస్తోంది. పుస్తకసేకరణ సిగ్గేస్తోంది. నిర్ణీత అధ్యయన కర్తవ్యం ఉండగా, దాన్ని వదిలేసి పుస్తక సేకరణ పై దృష్టి పెట్టడం హిపోక్రసీ అని అంతరాత్మ నిలదీస్తోంది. ఇది పుస్తక సేకరణ చేసే మిత్రుల్ని బాధ పెట్టేది కాదు. నా బలహీనతల్ని చెప్పుకునే సందర్భమిది.
నా పూర్వ అధ్యయనం నిరాకృతితో నిరాకారంగా సాగేది. అధ్యయన క్రమం ఓ ఆకృతిని అందించింది. ఆకారాన్ని సైతం ఇచ్చింది. నిజానికి ఈ కొత్తభౌతిక స్థితే అధ్యయన తీరులో పరిమితుణ్ణి చేసింది. ఐతే సిద్ధాంతపరంగా అది గత పరిధి నుండి బయటకు లాగి విశాలుణ్ణి చేసింది. పఠించే సిద్ధాంత గ్రంధాల ప్రాధమ్యత మారింది. నా అధ్యయనంలో నిరాకార, నిరాకృతి దశని దాటాను. నిర్ణీత ఆకృతి, సాకారత ఏర్పడ్డాయి. ఫీజీషియన్ స్పెషలిస్టుగా మారడం వంటిదే! గతంలో తొంగి చూడని సిద్ధాంత స్థలాల్ని సందర్శించే ప్రయోగమే!
గడిచిన నా రాజకీయ జీవితం బారెడు! మిగిలిన జీవితం మూరెడు! గత బారెడు జీవితంలో చేసిన నా అధ్యయనం బీచ్ లో ప్రారంభమై, సముద్రపు అంచుల్లో కొన్ని అడుగుల లోతు వరకు సాగేది. అది నిజానికి సిద్ధాంత సముద్ర మధనం కాదు. మిగిలిన మూరెడు జీవిత కాలంలో చదివే సమయం ఏది? ఏకంగా కూర్చొని చదివితే సాధ్యమా? కార్యాచరణ, నిర్మాణాల్ని విడనాడాలా? ఇవి కొత్త ప్రశ్నలు! శ్రీశ్రీ వద్ద జవాబు అరువు తెస్తా.
కొంపెల్లకు అక్షర నివాళి లో శ్రీశ్రీ ఇలా అంటాడు.
“సాహిత్యమే సమస్తమూ అనుకొని,
ఆకలీ, నిద్రా లేక,
ఎక్కడ ఉన్నామో,
ఎక్కడకు పోతామో
తెలియని ఆవేశంతో,
చుక్కలలో ఆదర్శాల్ని లెక్కిస్తూ
ఎక్కడికో పోతున్న మనల్ని
రెక్కపట్టి నిలబెట్టి లోకం
ఎన్నెన్ని దుస్సహ దృశ్యాల్ని చూపించి,
ఎన్నెన్ని దుస్తర విఘ్నాలు కల్పించి,
కలలకు పొగలనూ,
కాటుకలనూ కప్పి,
శపించిందో, శఠీoచిందో మనల్ని!”
ఔనుమరి! సాహిత్యమే సర్వంగా బ్రతికే వారిని అలా బ్రతకనివ్వకుండా రెక్కబట్టి నిలబెట్టే పాడు లోకం ఉంది. శ్రీశ్రీ కొంపెల్లి అమరాత్మతో అంటాడు.
“కావున ఈ నిరాశామయ
లోకంలో కదనశంఖం
పూరిస్తున్నాను.
ఇక్కడ నిలబడి నిన్ను
అవగాహన చేస్తున్నాను”
కొంపెల్లి(తో)లో అవాహన అంటే *ఆచరణ* తో సంలీనమే! కేవల సాహితీ వేత్తగా వుండే శ్రీశ్రీని సైతం లోకం కాలర్ కొట్టుకొని నిగ్గదీసి కార్యరంగంలోకి దింపి *మరో ప్రపంచం* వైపు నడిపించింది.
వినుతించే, విరుతించే,
వినిపించే నవీన గీతికి,
విరచించే నవీన రీతికి
సహస్ర శ్రమ వృత్తుల సకల చిహ్నాలు భావంగా,
భాగ్యంగా, ప్రాణంగా, ప్రణవంగా చెలరేగి అగ్ని సరస్సులో వికసించే వజ్రాలకై అన్వేషణకు దిగాడు శ్రీశ్రీ! ప్రపంచ విప్లవాగ్నికి ఓ సమిధగా మారతానన్నాడు శ్రీశ్రీ! ప్రపంచాబ్జపు తెల్ల రేకై,
విశ్వవీణకు ఓ తంత్రియై,
భువన భవనపు బావుటై
ముందుకు సాగుతానని
ప్రతిన చేసాడు శ్రీశ్రీ!
జ్ఞాన మార్గీయుడు సైతం
విప్లవ కర్మచారులకు
దారిదీపమై వెలుగొంది
దౌర్జన్య రాజ్యంపై పర్జన్య
శంఖం పూరించి ఊరేగి,
ఊగి, ఊగించాడు శ్రీశ్రీ!
నాటి పాడుకాలమూ నేటి పాడుకాలమూ ఇచ్చే
సమర సందేశం ఒకటే! ఫాసిస్టు ముప్పు పొంచిన నేటి స్థితిలో విప్లవాచరణ చారిత్రిక ఆవశ్యకత అని!
విప్లవాచరణ నుండి పరాయూకరణకు దారి తీసే అధ్యయనం గుడ్డెద్దు మేసినట్లే! అధ్యయనం లేని ఆచరణ దిక్సూచిలేని నౌకాయానం వంటిదే! వీటిలో దేని పాత్ర ఎంత?
ఆయా శ్రామికవర్గ విప్లవ సంస్థల నిర్మాణాల్లో నేడు *అధ్యయనం* లోప భూయిష్టంగా ఉంది. ఇది నా విమర్శ కాదు. ఆయా సంస్థలే చెప్పే మాట! దాని దిద్దుబాటు ఆవశ్యకత ఉందని అవే సమీక్షిస్తున్న చేదునిజం. ఆచరణను దిద్దుబాటు చేసుకొని ముందుకు సాగాలని శ్రామికవర్గ విప్లవ సంస్థల్ని ‘వర్తమాన చరిత్ర’ ఎప్పటి కంటే ఎక్కువగా డిమాండ్ చేస్తోంది. అధ్యయనం అవసరమే గానీ ఆచరణ దానికంటే అత్యవసరమే!
ఆచరణ ఓ నావ గా, సిద్ధాంతం ఓ దిక్సూచి గా పోల్చిచెప్పేది సరైందే! ఐతే దిక్సూచి దొరక లేదని చేపల వేటని మత్యకార్లు ఆపలేరు. వారిని ‘ఆకలి’ వేటకు దింపుతుంది. దిక్సూచి లేకుండా సాగే వేటవృత్తే దాని అవసరం గుర్తింప జేసి అందిస్తుంది. వీటిలో దేని పాత్ర ఎంతనే సంవాదం నేటిది కాదు. ఇలాంటి సందర్భంలోనే ‘PRACTICE IS GREEN, THEORY IS GREY’ అంటాడు లెనిన్. “విప్లవాచరణ నిగనిగ, విప్లవ సిద్ధాంతం విలవిల” అని అర్ధం. శ్రామికవర్గ విప్లవాచరణకి సిద్ధాంత ఆవశ్యకతను గుర్తించి, అవసరాల్ని బట్టి విస్తృత రచనలు చేసి 48వ ఏటనే తూటా తగిలి ఓ ఆరేళ్ళు రచనా సామర్థ్యం తగ్గినా, 54వ ఏట మృతి నాటికే 45 సంపుటాల సిద్ధాంత ఆవిష్కర్త లెనిన్! ఆ గొప్ప సిద్ధాంతి విప్లవ సిద్ధాంతం కంటే విప్లవాచరణయే నిర్ణయాత్మక అంశమని చెప్పాడు. అధ్యయనం, ఆచరణ విప్లవయానంలో జోడు గుర్రాలే! కానీ కీలక సమయంలో థియరీ అనే గుర్రం కంటే, ప్రాక్టీస్ అనే గుర్రం కీలకమని చరిత్ర నిరూపించింది. అలాంటి విప్లవాచరణ నాకు కొన్ని హద్దుల్ని గీసింది. పుస్తక సేకరణ, అధ్యయనాల పై పరిమితుల్ని విధించింది.
కొన్ని దశాబ్దాలుగా మార్క్సిస్టు సాహిత్య అధ్యయనం చేసా. ఐనా మార్క్సిస్టు మౌలిక గ్రంథ రచనల పైకి తగు దృష్టిని మళ్లించ లేదు. ఉపరితల రచనలనే మార్క్సిజంగా భావించి అధ్యయనం చేసిన కాలమే ఎక్కువ! పదేళ్ల నుండే మార్క్సిస్టు సిద్ధాంత మూలాల్లోకి అడుగులు వేస్తున్నా. అదే నా కళ్ళు తెరిపించింది. ఫలితమే మార్క్సిజంలో ఆవ గింజంత చదవలేదని గ్రహింపజేసింది. ఇదే నేటి నా *జ్ఞానోదయం!*
మార్క్సిస్టు సైద్ధాంతిక అధ్యయనం ఎంత చేస్తే, అంతకంటే తెలిసినట్లుగా భావించుకునేది తొలిదశ! అధ్యయనం చేసే కొద్దీ, చదివిన సిద్ధాంతం కంటే చదవాల్సింది ఎక్కువ అని గుర్తిస్తూ పోయేది మలిదశ! సముద్ర మేధో మధనం పూర్తి చేస్తే తుది దశ! నా దృష్టిలో తొలిదశ నుండి మలిదశకు చేరితే కలిగేదే *జ్ఞానోదయం!* (అనన్య, అనితర సాధ్యం తుది దశ! దాని ప్రస్తావన ఇక్కడ చేయడం లేదు)
నా దృష్టిలో జ్ఞానోదయం అంటే పూర్తి మార్క్సిస్టు జ్ఞానం పొందడం కాదు. దాని విస్తృతి, గాఢత, సాంద్రత, లోతుల్ని గుర్తించడం మాత్రమే!
నండూరి రామ్మోహన్ రావు గారి *విశ్వరూపం* పుస్తకాన్ని నాలుగున్నర దశాబ్దాల క్రితం చదివి మెదడు దిమ్మ తిరిగింది. భూమితో మొదలై, గ్రహ గతులు దాటి, నక్షత్రాలు, నక్షత్ర మండలాలు, కాంతి సంవత్సరాలు… ఎన్నో దిగ్భ్రాంతికర నిజాలతో మెదడు ఉక్కిరిబిక్కిరై పోయింది. ఐదు మహా సముద్రాల, ఆరు ఖండాల బ్రహ్మాండ భూగోళం సైతం చీమ కంటే చిన్నదనే *జ్ఞానోదయం* కలిగింది. దశాబ్దాల అధ్యయనం చీమతో సమానమని నేటి జ్ఞానోదయం తేల్చివేసింది. బాగా చదివిన అహం ఏదైనా నాలో ఎంతో కొంత ఉంటే, గింటే ఎగరగొట్టేదే తాజా జ్ఞానోదయం!
జ్ఞానోదయం కలిగితే జ్ఞానదాహానికి హద్దుల్ని గీయాలి. ఏ చారిత్రిక కాలంలో, ఏ రాజకీయ దశలో, ఏ ఉద్యమ ఘట్టంలో ఏఏ మూల మార్క్సిస్టు గ్రంధాల్ని అధ్యయనం చేయాలో; నేటి విప్లవాచరణకి దాన్ని ఎలా అన్వయించాలో, ఏ విధివిధానాల ప్రకారం అధ్యయనం చేయాలో స్వానుభవపు పాఠమిది.
ఎప్పటినుంచో సేకరించి, భద్రపరిచిన గ్రంథసంపదకీ వాటి అధ్యయనానికీ మధ్య నాకైతే ఓ అగాధం ఏర్పడింది. *గ్రంధపూజ* పై మావో వ్యాసం నన్ను హెచ్చరిస్తోంది. వెంటాడే క్రింది వత్తిళ్ళు ఉన్నాయి.
ఒకవైపు గతంలోనే సేకరించి భద్రపరిచిన విలువైన పుస్తకాలు;
మరోవైపు బుక్ షాప్స్ ల్లో కొని దాచిన పుస్తకాలు!
ఇంకోవైపు పాత పుస్తక దుకాణాల్లో వెది(లి)కి తీసి అట్టలు, పిన్నులు, వేసి దాచిన గ్రంధాలు!
ఇంకా అధ్యయనం చేస్తూ ప్రామాణిక సమాచారాన్ని రాసి దాచిన నోటు బుక్స్!
చదువుతూ అండర్ లైన్స్ గీసి నోట్స్ లో రాసేందుకు పక్కన దాచిపెట్టిన బుక్స్!
ఇంకా దిన, వార, పక్ష మాస, పత్రికలెన్నో!
సోషల్ మీడియాలో వార్తలు, రైటప్స్ వగైరా!
విశాలాంధ్ర, ప్రజాశక్తి, మైత్రి, HBT, నవశకం వంటి ప్రచురణ సంస్థలు ప్రచురించే పుస్తకాలెన్నో!
‘మంచి పుస్తకం’ అందించే ఉత్తమ సాహిత్య సంపద! మార్క్సిస్టు దృక్కోణంతో ‘వేదిక’ నిర్వహించే విజ్ఞాన దాయకమైన ఆన్ లైన్ సెమినార్ల సిరీస్! ఇంకా గూగుల్ విజ్ఞాన సంపద!
పుస్తక ప్రియులు స్కాన్ చేసి పంపే పుస్తక సంపద!
‘ఆన్ లైన్’ సెమినార్లు! వినాలంటే, ఒక్కొక్కొటి రెండేసి గంటలు!
ఇన్నింటిని జీర్ణించుకునే సామర్ధ్యం ఉందా? నేడు నన్ను తొలిచే ప్రశ్న యిది.
అధ్యయనానికి పరిమితి వుంది. దానికి ‘ఆబతనం’ పనికి రాదు. పరిది దాటే ఆశ ఆచరణలో దురాశే!
ఇవేనా? ఇంకా ఉన్నాయి.
ఓవైపు రాజకీయ కర్తవ్య భారం!
ఇంకోవైపు ఉద్యమ నిర్వాహణా భారం!
మరోవైపు సంస్థాగత నిర్మాణ బాధ్యత!
సమకాలీన రాజకీయ అంశాలపై ప్రతిస్పందన!
ఎడతెరిపి లేని నిరంతర ప్రయాణాల భారం కూడా!
నన్ను నేనే సమీక్షిస్తే..
నా గడిచిన రాజకీయ జీవితం బారెడు! ఇక గడపాల్సింది మూరెడే!
దాచుకున్న పుస్తకాలు బండెడు! అధ్యయనం చేసినవి గంపెడే!
తక్షణ అధ్యయనం కై ఎంపికచేసి దాచిన పుస్తకాలు బుట్టెడు! చదివినవి పట్టెడే!
అంతర్జాతీయ రంగం!జాతీయ రంగం! ఆర్ధిక రంగం! రాజకీయ రంగం! పారిశ్రామిక, వ్యవసాయ, కార్మికరంగాలు! సాంఘిక, భౌతికవాద, లౌకికవాద రంగాలు! అధ్యయనంలో దేనికి ఎంత సమయమో, ఎంత ప్రాధాన్యతో, ఏది తొలి, ఏది మలి, ఏది ముందు, ఏది వెనక.. అంతా ఓ సందిగ్ద స్తితే!
రాజకీయ, ఉద్యమ, నిర్మాణ రంగాల జీవితం నాది. విప్లవోద్యమ కార్యాచరణకు ప్రధమ ప్రాధాన్యత ఇస్తూ మిగిలే కాలాన్నే అధ్యయనానికి సద్వినియోగం చేసే వీలు వుంటుంది. అది నాకు వుండే పరిదీ, పరిమితీ! నా వృత్తీ, ప్రవృత్తీ కూడా!
*జ్ఞానోదయం* తర్వాత అధ్యయన విధానంలో కుదింపులు, కత్తిరింపులు, కోతలు, వాతలు తప్పదు.
ఫాసిజం బుసలుకొట్టే నేటి కాలంలో మార్క్సిస్టు సిద్ధాంత అధ్యయనానికి ప్రాధాన్యత వుంది. దాని కంటే విప్లవ కార్యాచరణ ప్రాధాన్యత గలది. వీటిని సమన్వయం చేస్తూనే ముందుకు సాగాలనే ఆకాంక్ష నాది. ఈ స్థితిలో ఎంచుకున్న ప్రాథమ్యాల ప్రకారం దొరికే అరుదైన పుస్తకాల సేకరణకై పుస్తక ప్రదర్శనశాల సందర్శిస్తా. ఐతే వాటి సందర్శనలో అది ద్వితీయ స్థాయి ఆసక్తే! దానిని సందర్శించే పుస్తక ప్రియుల సందడి, సవ్వడి, సంరంభాల్ని కళ్ళతో వీక్షించి, చెవులతో విని ఆస్వాదించే ఆసక్తి ముఖ్యమైనది. సాహితీ లోకాన్ని తిలకించి, పలకరించి, పులకించి, పరికించి, పరవశించి సాహిత్య గుబాళింపుల్ని ఆస్వాదిచే ఆరాటమే ప్రధానం. ఆ మధుర క్షణాలకోసం వేచిచూస్తా
నోట్:-డిసెంబర్ 8-27 మధ్య హైదరాబాద్ లో, జనవరి 1-10 మధ్య విజయవాడలో పుస్తక ప్రదర్శన శాలల సందర్భ ప్రతిస్పందన యిది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *