మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పరాభవం తర్వాత బిజెపి అగ్రనాయకత్వం పశ్చిమబెంగాల్ ని స్వాదీనం చేసుకోవాలనే దురాశను వదిలేసుకున్నట్లు ఉంది
కోల్ కతా మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోఅధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సీట్లన్నింటిని వూడ్చేసుకుంది. 144 వార్డులున్న కోల్ కతా కార్పొరేషన్ లో 134 వార్డులను ముఖ్యమంత్రి మమతాబెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ గెల్చుకుంది. ఇది 72 శాతం ఓట్లతో సమానం.
ఇక భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు మూడు వార్డుల్లో మాత్రమే గెలిచారు. సిపిఎంకు రెండు, కాంగ్రెస్ కు రెండుస్థానాలు దక్కాయి. పోలయిన వోట్లను తీసుకంటే వామపక్ష కూటమికి బిజెపి కంటే ఎక్కువ వోట్లు వచ్చాయి.
బిజెపికి 9.3 శాతం ఓట్లు పోలయితే,వామపక్షాలకు 11.7 శాతం పోలయ్యాయి. వామపక్షాల పునరాగమనంగా దీనిని చెప్పలేం కాని, ప్రాంతీయ పార్టీ బలమయిన నాయకత్వం ఉంటే భారతీయ జనతా పార్టీని దూరంగా పెట్టవచ్చని మమతా బెనర్జీ మరొక సారి రుజువు చేశారు.
తమ విజయాన్ని ప్రజాస్వామ్య విజయంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వర్ణించారు. బిజెపి ముక్త బెంగాల్ అనే ఆమె నినాదాన్ని బెంగాల్ ప్రజలు స్వీకరించినట్లే లెక్క. బిజెపితో పాటు, కాంగ్రెస్, పార్టీ, సిపిఎంలను కూడా బెంగాల్ ప్రజలు తిరస్కరించారని ఆమె ఓటర్లను కొనియాడారు.
కోల్ కతా మునిసిపల్ కార్పరేషన్ ను తృణమూల్ గెల్చుకోవడం ఇది వరుసగా మూడో సారి. మొదటిసారి 2010 ఈ సంస్థ తృణమూల్ వశమయింది. ఈ ప్రారంభంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కోల్ కతాలోని 133 వార్డులలో అధిక్యత సాధించింది. అదే ఇపుడు కూడా జరిగింది. బిజెపి బెంగాల్ ప్రజల పార్టీ కాదనే భావాన్ని ఆమె ప్రజల్లోకి బాగా చొప్పించి, ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా దూకుడుకళ్లెం వేయగలిగారు.
ఈ ఏడాది మే లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ అఖండ విజయం సాధించి 292 సభ్యులున్న అసెంబ్లీలో 213 స్థానాలు గెల్చుకుంది. తమతో స్నేహంగా ఉండి శత్రువుగా మారిని మమతకు బుద్ధిచెప్పి బెంగాల్ స్వాదీనం చేసుకుకోవాలనిప్రధాని మోదీ భావించారు. ఆయన స్వయంగా రంగంలోకి దిగి విపరీతంగా క్యాంపెయిన్ చేశారు. ఆయనకు తోడు కేంద్ర హోం మంత్రి అమిత్ షాకూడా క్యాంపెయిన్ చేశారు. అయితే, బిజెపి 77 స్థానాలు (2016లో కేవలం 3 స్థానాలుండేవి) గెల్చుకుని ప్రతిపక్ష పార్టీ అయింది. కాని, తృణమూల్ బిజెపి రాష్ట్రం నుంచి తరమేసే పథకం వేసింది. ఇది ఫలించింది. అనేక మంది ఎంపిలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతల బిజెపి వదిలేసి మళ్లీ తృణమూల్ కు తిరిగొచ్చారు. అదేవిధంగా మమతా బెనర్జీ అనేక నగదు బదిలీ పథకాలు ప్రారంభించారు. వీటితో తృణమూల్ తిరుగులేని శక్తి అయింది. నవంబర్ లో జరిగిన ఉప ఎన్నికల్లో గెలిచింది. ఈ వరుస పరాజయాల తర్వాత బెంగాల్ జోలికి ఇప్పట్లో వెళ్లలేమని బిజెపి భావించినట్లుంది. దీని ప్రభావం కోల్ కత్తా మునిసిపల్ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది.
బెంగాల్ పులి మమత రాజకీయ వ్యూహాల్లో దిట్టనే కాదు, ఎత్తుకు పైఎత్తులు వేయడంలో బిజెపి అగ్రనేత కంటే ఏమీ తక్కువ కాదని కోల్ కతా మరొక సారి రుజువు చేసింది.