అన్నమయ్య మార్గం మళ్లీ వార్తల కెక్కింది. తిరుమల శేషాచలం అడవి గుండా మూడో ఘాట్ రోడ్ వేయాలనుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో రెండో ఘాట్ రోడ్ లో కొండచరియలు విరిగిపడి దారి మూసుకుపోతూ ఉండటం, ఆ ప్రాంతంలో నేల క్రుంగి పోతూ ఉండటంతో మూడో రోడ్డు వేయాలని తిరుమల తిరుపతి దేవస్థానాల పాలకమండలి నిర్ణయించింది.
ఈ మూడో ఘాట్ రోడ్ ఏమిటో కాదు, శతాబ్దాల కిందట పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమయ్య తిరుమలకు చేరుకున్న అటవీ కాలిబాటయే. ఇపుడు ఈ మార్గాన్ని పునురద్ధరించాలని టిటిడి భావిస్తూ ఉంది. అయితే, దీనికి కొంతమంది వ్యతిరేక చూపుతున్నారు. మరికొందరు మద్దతు నిస్తున్నారు.
ఈనేపథ్యంలో ప్రముఖ చారిత్రక పరిశోధకుడు భూమన్ నేతృత్వంలో తిరుపతి యువకులు ఈ మార్గాన్ని మరొక సారి అన్వేషించేందుకు 18 కిమీ ట్రెక్ నిర్వహించారు. రేణి గుంట మండలం కరకంబాడి-బాలపల్లి నుంచి అన్నమయ్య మార్గం మొదలవుతుంది. ఈ ట్రెక్ ఫోటోలు ఇక్కడ అందిస్తున్నాం.
ఈ మధ్య కాలంలో వర్షాల వల్ల శేషాచలం అడవుల్లో మా ట్రెక్ ఆగిపోయింది. మేం వెళ్లాలనుకున్న ప్రాంతాలన్నింటిలో మనిషి లోతు నీళ్లు పారుతుండేవి. అయితే, ఇపుడు పరిస్థితి కొంత మెరుగుపడింది. అన్నమయ్య మార్గం సుగమంగా ఉండటంతో ఈ సండే ట్రెక్ కి ఈ దారి పట్టాం.
తిరుమలకు చాలా మార్గాలున్నాయి. పుల్లుట్ల మార్గం ఉంది, తరిగొండ వెంగమాంబ మార్గం ఉంది. ఇలాగే అన్నమయ్య మార్గమూ. అయితే, గొప్ప వాగ్గేయకారుడు అన్నమయ్య నడిచిన బాట కాబట్టి మిగతా మార్గాలకంటే కూడా అన్నమయ్య మార్గం బాగా ప్రసిద్ధి గాంచింది. ఈ మార్గాన్ని ఇపుడు మూడో తిరుమల మార్గంగా అభివృద్ధి చేయాలని ప్రతిపాదన. దీనికి తొందర్లో నే సర్వే కూడా జరుగుతుంది. అయితే, పుల్లుట్ల మార్గం ఇంకా అనుకూలంగా ఉంటుందని నేను మొదటి నుంచి చెబుతూ వస్తున్నా. అన్నమయ్య మార్గం లో మొదట ఇరుకు కాలి బాట వస్తుంది. ఇదొక ఏడు కిలోమీటర్లు వుంటుంది. ఆపైన మట్టి మార్గం వస్తుంది. అదొక మరొక పది కి.మీ ఉంటుంది, శ్రీగంధం వనం వరకు. ఈ మార్గం వేస్తే లోయల్లోకి వేయాల్సి ఉంటుంది. ప్రత్యామ్నాయ మార్గాల గురించి యోచన చేసే ముందు అందుబాటులో ఉన్న మూడు నాలుగు మార్గాలను సర్వే చేసి అన్నమయ్య మార్గం మీద ఒక నిర్ణయం తీసుకుని బాగుండేదేమో ననిపిస్తుంది.
నేను అన్ని మార్గాలు శోధించిన వాడిని. మామండూరు దగ్గిర రైల్వే అండర్ బ్రిడ్డి కింది నుంచి ఉన్న ప్రకృతి బాట మీద ప్రయాణించినట్లయితే, ఒక 20 కిమీ పొడవైన ఒక బండి దారి ఉంది. ఇది బ్రిటిష్ వాళ్లు వేసిన దారి. ఈ బండి దారి చక్కగా ప్రయాణ యోగ్యంగా ఉంది. ఒకసారి నేను కూడా ఆ దారి గుండా కారులో తిరుమలకు చేరుకున్నాను. ఈ దారి టిటిడి వారి దృష్టికి వచ్చిందో లేదో తెలియదు. ఈ దారిలో అంటే పుల్లుట్ల దారి లో ప్రత్యామ్నాయ మార్గం వేయడం చాలా సులువు. బహుశా అన్నమయ్య మార్గం అనేది మనోభావానికి సంబంధించిన విషయం కాబట్టి, దీనిని టిటిడి ఎంపిక చేసి ఉండవచ్చు.
ఎందుకంటే, చాలా కాలంగా ఈ మార్గం వేయాలనే డిమాండ్ కడప తదితర జిల్లాల వాసులనుంచి వుంది. అది ప్రజల వాంఛ కావట్టి ఒకపుడు మేం కూడా ఆ డిమాండ్ చేసిన వాళ్లమే. 1990 దశకంలో చెంగల్ రెడ్డి గారు టిటిడి అధ్యక్షులుగా ఉన్నప్పటి నుంచి ఈ డిమాండ్ చేస్తూ ఉన్నారు. దీనికోసం ఆయన చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు.
ఇక్కడ మరొక విషయం చెప్పాలి. రాజంపేట మాజీ ఎమ్మెల్యే, ఇపుడు కడప జిల్లా పరిషత్ ఛెయిర్మన్ ఎ అమర్నాథ్ రెడ్డి మూడు నాలుగు వేల మందితో ఈ మార్గం గుండా ప్రతి యేడాది ఒకసారి తిరుమలకు రావడం గత 19 సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తున్నది.
ఆయన కూడా ఈ డిమాండ్ ను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లినట్లు, దానికి సుముఖత వచ్చినట్లు తెలుస్తున్నది. ఈ మార్గంలో దట్టమయిన అడవేమీ లేదు. ఈ మార్గంలో నే బ్రహ్మగుండం అనే జలపాతం ఉంది. ఆలోయ మార్గంలోనే పైకి వెళితే మార్కండే తీర్థం వస్తుంది. ఈ లోయలో కొంచెం దూరం వెళ్లితే, ‘సత్రాలు’ అనే ప్రదేశం ఉంది. ఇక్కడ ఉన్న సత్రాలు అద్భుతమయిన కట్టడాలు. అయితే, పాడుబడి ఉన్నాయి. అన్నమయ్య కాలంలో కట్టారో, అంతకుముందు కట్టారో చెప్పలేం. మంచి ఇటుకలు వాడి, ఒకటిన్నర అడుగు మందంతో ఈ కట్టడాల గోడలు కట్టారు. తర్వాత ఈ ప్రాంతం ముస్లిం పాలకుల ఆదీనంలోకి వచ్చిందేమో, ఇక్కడకొన్ని ఆనవాళ్లున్నాయి. నిర్ధారించేందుకు మరింత పరిశోధన అవసరం.
దానికి దగ్గర్లోనే ఒక కోనేరు కూడా ఉంది. కోనేరు ఉందంటే అక్కడొక దేవాలయం కూడా ఉండి ఉందేమోననిపిస్తుంది.ఈ విషయాలను చరిత్రకారులు, పురాతత్వ వేత్తలు వెలుగులోకి తీసుకురావాలసిన అవసరం ఉంది.
14, 15 శతాబ్దాలలో ఏలిన రాజులు తిరుమలకు వెళ్ళే యాత్రికుల కోసమే ఈ బాట వేశారు. వారి కోసం ఈ కోనేరు, సేద తీర్చుకునేందుకు సత్రాలను నిర్మించారు. ఈ దారి పూర్తిగా చెట్లు చేమలతో మూసుకుపోయి ఉంటుంది.
సత్రాలు దాటాక మరొక మూడున్నర కిలోమీటర్లు సాగితే, ఎడమ వైపు లోయలోకి సన్నని కాలిబాట. ఒక్కొక్కరు మాత్రమే వెళ్ళ గలి గి నంత సన్నని దారి. లోయలోకి దిగుతుంటే ఇరువైపులా ఈత చెట్లే. వాటి మధ్యలో అనేక రకాల ఎత్తైన చెట్లు.
ఈ కట్టడం గోడల వెంబడి ఇలా చెట్టు పెనవేసుకుని పెరిగాయి. వీటిని చూస్తున్నపుడు నాకు కంబోడియాలోని అంగ్ కోర్ వాట్ గుర్తుకొచ్చింది. దానికి దీనికి పోలిక లేదు గాని, ఈ గోడలు ఆజ్ఞాపకాలను తీసుకువచ్చాయి. కంబోడియా గుడి వద్ద ఉన్న మర్రిచెట్టు దగ్గిర జేమ్స్ బాండ్ సినిమా తీసింది గుర్తుందా. అలాంటిదే ఈ మర్రి చెట్టు కూడా. చరిత్రను కాపాడుకోవాలనుకుంటే ఇలాంటి వాటిని పునరుద్ధరించకపోయినా, వాటిని బాగుచేసి కాపాడు కోవాలసిన అవసరం ఉంది. అక్కడికి సమీపంలోనే ఈతకాయల మంటపం ఉంది. ఇక్కడే అన్నమయ్య, ఇతర భక్తులు సేద తీరేవారు. అక్కడి నుంచి తిరుమల ముడు నాలుగు కిలోమీటర్ల దూరం మించి ఉండదు.
ఈ దారి గుండా ప్రయాణించాలని చాలా రోజులుగా అనుకుంటువచ్చా. ఇపుడది నెరవేరింది. సుమారు యాభై మంది మిత్రులు ముందుకు వచ్చారు. మా యాత్ర సజావుగా సాగింది. అన్నమయ్య అడుగుజాడలలో మేమూ కాలుమోపిన అనుభూతి పొందాం.
అన్నమయ్య మార్గంలో కాలిబాట ఉంది. ఈ దారిలో వెళ్తున్నపుడు ఏనుగులు వేసి లద్దెలు కూడా కనిపించాయి. అంటే ఇది ఏనుగులు సంచరించే ప్రాంతం అని అనుకోవాలి. అలాంటపుడు ఏనుగుల ఆవాస ప్రాంతంలో రోడ్లు వేసి, జనసంచారం పెంచితే వాటి ఉనికి దెబ్బతినిపో దా అనే అనుమానం నాకు కలుగుతూ ఉంది.
ఈ కారణంతో అన్నమయ్య మార్గంకంటే పుల్లుట్ల మార్గం మేలేమో అనిపిస్తుంది. అమర్ రాజ ఫ్యాక్టరీ, చైతన్య పురానికి మధ్య నుంచి వచ్చే ఈ దారిలో రోడ్దు వేస్తే ఎనుగల ఆవాసం కబ్జా జరగదని నేను అనుకుంటున్నా. ఇక్కడ వన్యమృగాలు తిరుగవు, రోడ్డు నిర్మాణం సులువు అని అనిపిస్తుంది.
మరొక సమస్య ఉంది. ఈ కాలిబాట కాకుండ మరొక వైపు మట్టి బాట వస్తుంది. అది గాలిపెంట దాకా వెళ్తుంది. కాలిబాట వదిలేసి మట్టి బాటను సంస్కరించుకుని తిరుమల మార్గం వేసుకో వచ్చు. మట్టి బాటలో ఎనుగుల సంచారం లేదు. ఈ మార్గం ఎంపిక చేస్తే, వాగ్గేయకారుడు అన్నమయ్యే కాదు, తాళ్ల పాక తిమ్మక్క, పెద తిరుమలా చార్యలు కూడా నడచిన ఈ మార్గంలో తామూనడిచామన్న అనుభూతి భక్తులు పొందుతారు. అంతేకాదు, ఈ మార్గంలో అక్కడ ఉన్న జలపాతాలు కూడా చూస్తూ తిరుమల యాత్రను ఆహ్లదకరం ముగించుకుంటారు.
తిరుమలకు ప్రత్యామ్నాయ మార్గం వేయక తప్పని పరిస్థితి వచ్చింది. రెండో ఘాట్ రోడ్ ప్రమాదకరంగా మారింది. ఒకసారి పదిటన్నుల బరువైన కొండరాయి రోడ్డు మీదకు దొర్లిన సంఘటన కూడా నాకు తెలుసు. అందువల్ల ముందు జాగ్రత్త చర్యలు తీసుకొనకపోతే, విషాదం ఎదురయ్యే ప్రమాదం ఉంది.
ఈ కొత్త మార్గం వాహనాలకే కాకుండా, పాదచారులకు కూడా అనువైన మార్గం ఉండాలని నా అభిలాష.
-భూమన్, తిరుపతి