ఇటీవల రాహుల్ గాంధీ తాను హిందువుల ప్రతినిధి నన్నట్లూ నరేంద్ర మోడీ హిందూత్వ ప్రతినిధి అన్నట్లూ అక్కడక్కడ సభల్లో మాట్లాడుతూ ఉన్నాడు. అతని మాటల ప్రకారం మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాతే నిరుద్యోగము అధిక ధరలు లాంటి సమస్యలన్నీ దేశం ముందుకు వచ్చినట్లుగా ఏవేవో చెబుతున్నాడు. (మన దేశంలోని సమస్త సమస్యలు మోడీతోటే మొదలైనట్లు మాట్లాడే ఇతరులు కూడా ఉన్నారనుకోండి) అసమానతలతో నిండిన మన సామాజిక వ్యవస్థలోని సమస్త సమస్యలకు ప్రైవేటీకరణ ఒక్కటే పరిష్కారమని 30 సంవత్సరాలుగా మోగుతున్న కేంద్ర – రాష్ట్ర పాలకుల మోసపూరిత ప్రకటనలను వీరు బహిర్గత పరిచరు.
30 ఏళ్ల క్రితపు ‘సామ్రాజ్యవాద ప్రపంచీకరణ కాంగ్రెస్ ప్రభుత్వాల పుణ్యమే’ నని రాహుల్ చెప్పడు. సరళీకృత ఆర్థిక విధానాలనేవి, రాజకీయoగా బాబ్రీ మసీదు లాంటి మతోన్మాద సమస్యతో పెనవేసుకుని ఏకకాలంలో దేశంమీద భారత పాలకవర్గాలే రుద్దాయని తెలియనివ్వరు.
72 ఏళ్ల క్రితం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగం ఆమోదించే ముందు (26-11-1949) చేసిన ప్రసంగంలో ప్రస్తావించిన సామాజిక సమస్యల *గతి* ఏమిటో మాట్లాడరు. అన్నీ మోడీ తోటే మొదలైనట్లు చెప్పుకుంటూ పోతారు.
నిజానికి 25 ఏళ్ల ప్రపంచీకరణ విధానాలు మన సమాజాన్ని ఘోరమైన సంక్షోభంలోకి దిగజార్చి వేస్తే దానికి మేమే పరిష్కర్తలమంటూ భారతీయ జనతాపార్టీ దాని అధినాయకుడిగా మోడీ రంగంలోకి వచ్చారు. కానీ వాళ్ళ దగ్గర ఉన్న మంత్ర దండాలు రెండే!
1. మరింత ప్రైవేటీకరణ కావించే నిరంకుశ చర్యలు.
2. తమ విధానాలను ప్రశ్నించకుండా ఎదిరించకుండా భారత ప్రజా సమూహాలను సుడిగుండం లాంటి మతోన్మాద సంఘర్షణలో ప్రతినిత్యం కొట్టుమిట్టాడేటట్లు చేయటం..
హిందువులు అనగా అన్యమత ద్వేషులు అనే తత్వాన్ని సాంస్కృతిక స్థాయిలో ప్రజలపై వీరు రుద్దారు. ప్రజల ఆలోచనలను భావజాలాన్ని ఆచరణను కూడా కలుషితం చేస్తూ వస్తున్నారు. ఒకప్పుడు ఎన్నికల ముందు మాత్రమే జాతీయోన్మాదం , మతోన్మాదo వారికి అవసరం పడితే, ఇప్పుడు రోజువారి కార్యక్రమంగా ‘మతోన్మాద హిందూత్వ’ ను ప్రయోగిస్తే తప్ప, మతం పేరిట ప్రజలను అనునిత్యం పక్కదారులు పట్టిస్తే తప్ప అధికారంలో నిలవలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. రైతాంగ చట్టాలకు వ్యతిరేకంగా సాగిన సుదీర్ఘ పోరాటo వల్ల మతోన్మాదానికి బదులు ప్రజల ఎజెండా ముందుకు వచ్చింది. సామాజిక రంగం మీదకు వాస్తవిక జీవన సమస్యలను చర్చనీయాంశం చేసింది. ఇదే కొనసాగితే అంటే ఎన్నికలలో మతోన్మాద పూరిత కేంద్రంగా ప్రచారo సాగకుంటే వారి రాజకీయ మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది. అందుకే తాత్కాలికంగా మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంటూ వెనకడుగు వేశారు.
రానున్న ఉత్తరప్రదేశ్ ఎన్నికలలో *కాశీ మధుర అయోధ్య, మత మార్పిడి* లాంటి వాటి చుట్టూ ప్రచారo ప్రయోగించవచ్చు.
ఏదేమైనా రాహుల్ గాంధీ అత్యంత బలహీనమైన రూపాల్లో హిందువులు- హిందూత్వ అంశాలను ప్రస్తావిస్తున్నాడు, ప్రశ్నిస్తున్నాడు. దాని వాస్తవిక లోతుపాతులను తెలుసుకోవడానికి మనం ప్రయత్నిద్దాం.
హిందూ ముస్లిం ఐక్యతకు, దేశభక్తికి, త్యాగానికి ప్రతీకలైన అమరులు రామ్ ప్రసాద్ బిస్మిల్ – అశ్ఫాక్ ఉల్లా ఖాన్ లు ఉరికంబం ఎక్కి(19-12-1927) తొంబై నాలుగు సంవత్సరాలు అయిన రోజున వారిని స్మరించుకుంటూ…
హిందువులు హిందూత్వ* గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం!