(సలీం బాషా)
“పుష్ప”- అలియాస్ అల్లు అర్జున్
పుష్ప సినిమా లో అల్లు అర్జున్ కి(అంటే పుష్ప కి) ఒక భుజం కొంచెం వంకరగా ఉంటుంది, అయినప్పటికీ ఈ సినిమాని అల్లు అర్జున్ తన భుజాల మీద మోశాడు. ఒక మాటలో చెప్పాలంటే ఇది అల్లు అర్జున్ సినిమా!
ఈ సినిమా చాలా కాలం నుంచి అభిమానులను, సాధారణ ప్రేక్షకులను కూడా ఊరించి ఊరించి చివరకు ఉసూరనిపించలేదు కాని అంతగా అలరించలేదు కూడా! దర్శకుడు సుకుమార్ పుష్ప పాత్రను చాలా కష్టపడి తీర్చిదిద్దిన ప్రయత్నంలో విజయం సాధించాడు.
ఈ సినిమా గురించి చెప్పాలంటే ఒక మాదిరి పర్వాలేదు అని చెప్పక తప్పదు. ఈ మాట చెప్పడానికి కావలసిన కొన్ని అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి. సాధారణంగా ఒక సినిమా తీయడానికి కి చాలాకాలం పట్టడం, దాని పట్ల ఒకరకమైన ఉత్సుకత ఏర్పడడం, అంచనాలు పెరిగిపోవడం వల్ల సినిమా పట్ల ప్రేక్షకులకు కొంత ఆసక్తి ఏర్పడడం సహజం. ఆ ఆశతోనే ప్రేక్షకులు(ఇక అభిమానుల సంగతి చెప్పనవసరం లేదు) సినిమా చూడ్డానికి వస్తారు.
ఒక సినిమాను చాలాకాలం తీయడం, ప్రేక్షకుల అంచనాలు పెంచడం అన్నది రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది అది నెగిటివ్ కావచ్చు లేదా పాజిటివ్ (బాహుబలి లాంటి సినిమాలు) కావచ్చు. ఈ సినిమాకి కూడా అది వర్తిస్తుంది.
ఈ సినిమాలో అభిమానులకు కావాల్సిన అంశాలు పుష్కలంగా ఉన్నప్పటికీ, సాధారణ ప్రేక్షకులకు, రివ్యూ రైటర్స్ కు కావలసిన నెగిటివ్ అంశాలు కూడా ఉన్నాయి. ప్రేక్షక అభిమానులందరూ ఫీల్ అయ్యే ఒక నెగటివ్ అంశం ఈ సినిమా నిడివి. దాదాపు మూడు గంటల పాటు నడిచే ఏ సినిమా అయినా (అద్భుతంగా తీస్తే లేదా ఉంటే తప్ప) కాసింత కుంటు పడే అవకాశం ఉంది. అలా కుంటు పడకుండా ఉండడం కోసం దర్శకుడు చేసిన ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు అనే చెప్పాలి.
ఇంత చెప్పిన తర్వాత, నిజాయితీగా చెప్పాలంటే ఇలాంటి సినిమా తీయడం చాలా కష్టం. అంత కష్టపడి తీసిన సినిమా బాలేదు అని ఒక్కముక్కలో తేల్చడం సబబు కాదు. నేను ఎన్నో సినిమాలకి రివ్యూలు రాశాను. అనుభవంతో చెబుతున్నాను ఈ సినిమా కాసింత ఓపిక చేసుకుని, ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా, కొన్ని పట్టించుకోకుండా (ముఖ్యంగా సమంత ఐటమ్ సాంగ్, అర్జున్, రష్మీక ల మధ్య రొమాంటిక్ సన్నివేశాలు) చూడదగ్గ సినిమానే.
ఈ సినిమా లో (లెక్కల మాస్టర్ అయిన) దర్శకుడు సుకుమార్ లెక్క కొన్నిచోట్ల తప్పింది. ఒకటి సునీల్ ని విలన్ గా ప్రజెంట్ చేయడం. తమాషా ఏంటంటే ఈ సినిమాలో మంగళం శీను పాత్రలో విలన్ గా సునీల్ బాగానే చేశాడు. (ఆ మధ్య OTT “ఆహా” లో వచ్చిన ” కలర్ ఫోటో”లో అంత బాగా చేయలేదు) . అయితే అల్లు అర్జున్ కి విలన్ గా సరిపోలేదు.
ఇంక ప్రతినాయక ఛాయలున్న రెండో పాత్ర లో మలయాళంలో ప్రసిద్ధిచెందిన ఫహాద్ ఫాజిల్(ఎస్పీ షెకావత్) పాత్ర కూడా అంతే! ఆ స్థాయి నటుణ్ణి అలాంటి పాత్ర కు తీసుకోవడం ఎందుకో అర్థం కాలేదు. ఇక రంగస్థలంలో లో ఒక స్థాయి పాత్రలో నటించిన అనసూయను సునీల్ (మంగళం శీను )భార్య గా ఎన్నుకోవడంలో కూడా లెక్క తప్పినట్లే.
సినిమా కథ గురించి చెప్పాలంటే ఒక మామూలు కూలీ, ఎర్రచందనం స్మగ్లర్ గా ఎదగడం. ఇలాంటి సినిమాలు గతంలో చాలా వచ్చాయి. వీటన్నింటికీ మూలం అమితాబచ్చన్ deewar సినిమా. ఏమాటకామాటే చెప్పుకోవాలి అంటే, ఇది కొంచెం భిన్నమైన కథ తో నడిచే సినిమానే.
చాలావరకు బాగానే తీసినప్పటికీ, కొన్నిచోట్ల లెక్క తప్పడం, కొన్నిచోట్ల కథనం బాగున్నప్పటికీ కథ దారి తప్పడం, వంటి అంశాలు సినిమా ను మంచి సినిమా స్థాయికి చేరకుండా అడ్డు పడ్డాయి. కొన్ని అనవసరమైన సన్నివేశాలు, మరికొన్ని సాగ తీయబడిన సన్నివేశాలు సినిమాను దెబ్బతీశాయి.
ఇంత చెప్పాక సినిమా లో ఉన్న పాజిటివ్ పాయింట్స్ చెప్పకపోతే, సినిమాకు కాసింత అన్యాయం చేసినట్టే. అందులో ముఖ్యమైనది అల్లు అర్జున్ నట విశ్వరూపం. పుష్ప గా తన పాత్రకు పూర్తిస్థాయి న్యాయం చేసినట్లే.
సినిమాలో సంగీత పరంగా కొన్ని, సాహిత్య పరంగా కొన్ని, నాట్యం, చిత్రీకరణ పరంగా కొన్ని పాటలు బాగున్నాయి. ముఖ్యంగా ” సామి” పాట అన్ని విధాలుగా ఓ రేంజ్ లో ఉంది. నటన పరంగా రష్మిక పర్వాలేదు, రావు రమేష్ లాంటి వారికి ఇలాంటి పాత్రలు కొట్టిన పిండే. అయితే చెప్పుకోదగ్గ మరో పాత్ర అల్లు అర్జున్ అనుచరుడిగా ఉన్న కేశవ్ ది. ఈ పాత్రలో నటించిన జగదీష్ ప్రతాప్ మంచి నటనను ప్రదర్శించాడు. ముఖ్యంగా వీళ్లిద్దరి మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు బాగానే పండాయి.
ఈ సినిమాకు ప్రధాన బలం ఫోటోగ్రఫీ, చిత్రీకరణ, ఫైట్స్(ఓ స్థాయిలో ఉన్నాయి). ముఖ్యంగా అడవిలో చిత్రీకరించిన సన్నివేశాలు ఈ సినిమాకు హైలెట్ గా నిలుస్తాయి. అల్లు అర్జున్ తర్వాత ఈ సినిమాని నిలబెట్టేవి ఇవే!
మొత్తం మీద కొన్నిచోట్ల లెక్క తప్పి, అంచనాలకు సరిపోయే స్థాయిలో సినిమాను తీయలేకపోయినప్పటికీ , సినిమాను చూడగలిగే స్థాయిలో ఉండేలా తీశాడు అని చెప్పడమే దర్శకుడు సుకుమార్ కి ఇవ్వగలిగే కితాబు. రెండో భాగంలో లెక్కల మాస్టర్ సుకుమార్ లెక్క సరిచేసుకుంటాడేమో చూద్దాం.
(సలీం బాషా, రచయిత, కవి, పర్సనాలిటీ డెవెలప్ మెంట్ నిపుణుడు)