కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ లో యాసంగి వరిధాన్యం కొనబోమని పదే పదే స్పష్టం చేస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కెసీర్ రైతులకు హెచ్చరిక చేశారు. కేంద్రం బియ్యం కొనేదాక వెంటపడతాం అన్న ముఖ్యమంత్రి ఒక అడుగు వెనకేశారు. కేంద్రం వెంట పడకుండా రైతుల వెంటపడి యాసంగి లో వరి పంట వేయకుండా ఆపేసే లా చేయాలని కుంటున్నారు. దీనితో సమస్య కొట్లాట లేకుండా పరిస్కారం అవుతుంది.ఆ మధ్య ఐటీ మంత్రి KTR నాయకత్వం లో పలువురు మంత్రులు కేంద్ర పౌరసరఫరాల మంత్రి పీయూష్ గోయల్ ని కలసి బియ్యం కొనుగోలు గురించి మాట్లాడారు. యాసంగీలో బియ్యం సేకరించే ప్రసక్తే లేదని గోయల్ తెలిపారు. తర్వాత టీఆరెస్ ఎంపీలు పార్లమెంట్ ని బహిష్కరించారు. అపుడు ఇక TRS కేంద్రం మెడలు వంచుతుందని అంతా అనుకున్నారు. అయితే ఈ రోజు ముఖ్యమంత్రి ప్రకటన సారాంశం వేరేగా ఉంది. విచిత్రం.
ఈ రోజు ముఖ్యమంత్రి సమావేశంలో ఈ వ్యూహం చూచాయగ వెల్లడయింది. ఇవిగో వివరాలు:
“రాష్ట్ర ప్రభుత్వం యాసంగిలో వొక్క కిలో వడ్లు కూడా కొనలేదని, రాష్ట్రం లో యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయబోవడం లేదు,” అని ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు పునరుద్ఘాటించారు.
ఆయన ఇంకా ఏమన్నారంటే…
కేంద్రం అనుసరిస్తున్న ప్రమాదకర విధనాలనుంచి రాష్ట్ర రైతాంగాన్ని కాపాడేందుకు క్షేత్ర స్థాయిలోకి వెళ్లి, ధాన్యం కొనబోమనే విషయాన్ని అర్థం చేయించాలని సీఎం కెసీఆర్ కలెక్టర్లను, వ్యవసాయ అధికారులను సీఎం ఆదేశించారు. తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టంచేసే దిశగా తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తున్న దార్శనిక వ్యవసాయ విధానాలు స్వతంత్ర భారత చరిత్ర లో ఏ రాష్ట్రం అమలు చేయలేదని సీఎం కేసిఆర్ అన్నారు.
వీటిని కొనసాగిస్తామని స్పష్టం చేసారు. రాబోయే వానాకాలం పంటల సాగుపై ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని అన్నారు.
వానాకాలం లో ప్రధానంగా పత్తి., వరి., కంది సాగు పై దృష్టి సారించాలని కలెక్టర్ల ను, వ్యవసాయ అధికారులను కేసిఆర్ ఆదేశించారు.రైతులను ప్రత్యామ్నాయ లాభసాటి పంటల సాగు దిశగా సమాయత్తం చేయాలన్నారు.