తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులపై ఆధారపడి కుల మతాలకు,ప్రాంతాలకు అతీతంగా అనేక రకాల (పెద్ద, చిన్న హోటల్స్,వసతి(లాడ్జ్) సముదాయాలు,టిఫిన్ సెంటర్ లు,ట్రావెల్స్ లాంటి అనేకం) వ్యాపారాలు చేస్తూ జీవనం సాగిస్తున్న వేలాది మంది తిరుపతి నగర ప్రజల జీవితాలతో చెలగాటం ఆడటం ధర్మమా గోవిందా!
తిరుమల శ్రీవారి దర్శనానికి కరోనా కారణంగా భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గడంతో తిరుమలలోని వ్యాపారస్తులతో పాటు తిరుపతి లోని అన్ని వర్గాల వ్యాపారస్తులు ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతూ అద్దెలు చెల్లించలేక కుటుంబాన్ని పోషించలేక ఆధ్యాత్మిక నగరం లో ఎక్కడ చూసినా ఇండ్లు,షాపుల గోడలకు టూలెట్ (TOLET) బోర్డులు కనిపిస్తున్నాయి ఇలాంటి పరిస్థితులలో మూడవ ఘాట్ రోడ్ ఏర్పడితే వాటి స్థానంలో SOLD OUT (ఇల్లు,అంగడి అమ్మబడును) బోర్డులు చూడాల్సిన పరిస్థితులు వస్తాయి!
తిరుమలకు మూడవ ఘాట్ రోడ్డు ప్రతిపాదనను ధర్మకర్తల మండలి వెంటనే ఉపసంహరించుకోవాలి!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులపై జరుగుతున్న ముక్కోణపు పోటీ (ప్రభుత్వం రైతులు న్యాయస్థానం) కారణంగా అభివృద్ధి ఎలా అటకెక్కిందో తిరుమలకు మూడు ఘాట్ రోడ్ ల ఆలోచన కారణంగా తిరుమల శ్రీవారి నిధుల దుభారాతో పాటు తిరుపతి అభివృద్ధి అనేది “ఎడారిలో ఎండమావిలా” మారుతుంది!
తిరుమలకు మూడవ ఘాట్ రోడ్ ప్రతిపాదనను శ్రీ వారి భక్తులు,టిటిడి ఉద్యోగస్తులు, స్థానికులు జిల్లా అధికార పార్టీ మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ముక్త కంఠంతో తిరస్కరించాలి !
టీటీడీ ధర్మకర్తల మండలి తొందరపాటు నిర్ణయాల కారణంగా తిరుమల తిరుపతి నగర ప్రతిష్ట ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంది!
తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం నిర్మించిన రెండు ఘాట్ రోడ్ లను ప్రతి సంవత్సరం ఐఐటి నిపుణుల పర్యవేక్షణలో బండరాళ్లు రోడ్లపై పడకుండా పటిష్టమైన చర్యలపై దృష్టిసారించాలే తప్ప అన్నమయ్య నడకదారిని సాకుగా చూపి మూడవ ఘాట్ రోడ్ ప్రతిపాదన తీసుకురావడం సమస్యకు పరిష్కారం కాదు!
తిరుమల శ్రీవారి ఆలయ భద్రతను,శేషాచలం కొండల్లో విస్తరించిన శ్రీవారి “ఎర్రచందనం” సంపదను దృష్టిలో పెట్టుకొని కడప జిల్లా కోడూరు వద్ద గల బాలపల్లి రిజర్వు ఫారెస్ట్ ఏరియా నుంచి అన్నమయ్య రోడ్డు మార్గం ఆలోచనను వెంటనే విరమించుకోవాలి!
తిరుమలకు అన్నమయ్య మూడవ ఘాట్ రోడ్ వేస్తే ఎర్ర స్మగ్లర్లకు రాచబాటగా,అక్షయపాత్రలా మారి శేషాచలం కొండలలొని ఎర్రచందనం పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం ఉంది!
తిరుమల ఘాట్ రోడ్ లోనే కాకుండా ఎత్తయిన పర్వత ప్రాంతాలలో వుండే దేవాలయాలకు వేళ్ళే మార్గాలు (హరిద్వార్,రిషికేశ్,చార్దామ్ లాంటివి ఎన్నో) వర్షాలు పడినప్పుడు బండరాళ్ళు దొర్లి పడటం సహజం వర్షాకాలానికి ముందే తగు చర్యలు చేపట్టాలి,వర్షాలు పడేటప్పుడు బండరాళ్ళు పడే ప్రదేశాలను గుర్తించి ప్రమాదాన్ని పసిగట్టి తీవ్రతను బట్టి కొన్ని రోజులపాటు రాకపోకలు నిషేధించడం లాంటివి శ్రేయస్కరం!
టీటీడీ ధర్మకర్తల మండలి,ఐఏఎస్ అధికారులు అధికార పార్టీ శాసనసభ్యులు తిరుమలకు 3 వ అన్నమయ్య ఘాట్ రోడ్డుపై పునఃసమీక్షించి నిన్న ప్రకటించిన ప్రతిపాదనను వెంటనే విరమించుకోవాలని శ్రీవారి భక్తుడిగా స్థానికుడిగా శిరస్సు వంచి నమస్కరిస్తూ విజ్ఞప్తి చేస్తున్నాను!