నేడు ఆ అగ్ని శిఖ 13 వ వర్ధంతి
వేదిక ఎక్కారంటే ఖంగుమని మోగే గొంతు, అది బద్దలయ్యే అగ్నిపర్వతం. నిర్భీతిగా మాట్లాడే వారు. బతికినంత కాలం ఉద్యమంతోనే ఉన్నారు…
(రాఘవ శర్మ)
“నాగరికతా అవహేళనలో
కన్నీళ్ళను అడుక్కుంటున్న
యుగభిక్షువును నేను.
విజ్ఞానం విసిరిన విషకిరణానికి
చెడిపోయిన ఆత్మచక్షువును నేను
వ్యధాశోకాల పీడిత లోకాలలో
విరిసిన కారుణ్యమహాబోధి వెలుగులో మెరిసిన తథాగతుణ్ణి నేను
అహంకారం శిలువపైన నవ్విన నెత్తురు వసంతాన్ని నేను
-జ్వాలాముఖి, పునర్‌యోనీ ప్రవేశం(1966)
మాటలకు మంటలు నేర్పిన వాడు, ఆ మాటలతో ప్రవాహగానం వినిపించిన వాడు, మాటలకు జలపాతపు హోరును జోడించిన వాడు, ఆ మాటల విస్పోటనం జ్వాలాముఖి.
ఆరుగురు దిగంబర కవుల్లో ఒకరిగా, విప్లవ రచయితగా, కవిగా, కథకుడిగా, నవలాకారుడిగా, అనువాదకుడిగా, సాహిత్య విమర్శకుడిగా మాత్రమే కాదు, కదిలించే ఒక మహావక్తగా తెలుగువారికీ సుపరిచితుడు జ్వాలముఖి.
జ్వాలాముఖి ఉపన్యసిస్తుంటే, ఆ మాటల జలపాతంలోకి దూకేయాలనిపిస్తుంది. ఉపన్యాసం ఆయన జీవలక్షణం.
డిసెంబర్ 14వ తేదీ మంగళవారం ఆ నిత్యచైతన్యశీలి 13వ వర్ధంతి.
హైదరాబాద్ సీతారాంబాగ్ దేవాలయంలో, 1938 ఏప్రిల్ 12న సంప్రదాయ వైష్ణవ కుటుంబంలో ఆయన జన్మించారు. సంప్రదాయం నుంచి ఆధునికం వైపు పయనించిన వీరవెల్లి రాఘవాచార్య దిగంబర కవిత్వంతో జ్వాలాముఖిగా అవతరించారు.
వేదిక ఎక్కారంటే, ఖంగుమని మోగే గొంతు, అది ఒక బద్దలయ్యే అగ్నిపర్వతం. నిర్భయంగా మాట్లాడే వారు. బతికినంత కాలం ఉద్వేగభరితంగానే జీవించారు.
ఉద్యమాలతోనే జీవన యానం సాగించారు. ఎలాంటి భేషజాలకు పోని సహజ గంభీరుడు, సంకుచిత్వానికి అతీతుడు.
జ్వాలాముఖి గొప్ప భావుకుడు, సహృదయుడు.ఆయనలో దూసుకుపోయే తత్వం ఎక్కువ. మనుషులతో ఆత్మీయంగా మాట్లాడడం, వారిపట్ల ప్రేమగా ఉండడం, హుందాగా ప్రపర్తించడం జ్వాలాముఖినుంచే నేర్చుకోవాలి.
తన భావజాలంతో విభేదించే వారితో కూడా ఆత్మీయంగా వ్యవహరిస్తారు. సమాజంలో కుళ్లును చూసి విపరీతంగా చెలించిపోయారు. ఆ ఆవేశంతోనే కవిత్వం రాశారు.
‘మనిషీ’ అన్న దీర్ఘకవితతో జ్వాలముఖి రచనావ్యాసంగం 1958లోనే మొదలైంది.
ఆయన దగంబర కవిత్వం ‘ సూర్యస్నానం’ తో మొదలైంది. తన ధిక్కార స్వరాన్ని వినిపించడానికి ఉపన్యాసం లా కవిత్వం కూడా సుదీర్ఘంగా సాగుతుంది.
హైదరాబాదు మహానగరం మత కల్లోలాలతో అట్టుడికి పోయినప్పడు, ప్రజలకు నచ్చచెప్పడానికి కర్ఫ్యూలో కూడా దూసుకుపోయిన సాహసి.
విరసం ఆవిర్భావ చోదకశక్తిగా పనిచేశారు. ఉరిశిక్ష గురించి చర్చించిన తొలినవల ‘వేలాడిన మందారం’ 1979లో రాశారు. అదే సంవత్సరం ఆయన రాసిన ‘పంజరం ఎగిరిపోయింది’ కథకు స్వాతి మాసప్రతిక మొదటి బహుమతి ఇచ్చింది.
భారతీయ సాహిత్య నిర్మాతలలో ఒకరైన ‘రాంఘేయరాఘవ’ ను అనువదించారు. శరత్ జీవిత చరిత్రను ‘దేశదిమ్మరి ప్రవక్త’ గా అనువాదం చేశారు. హక్కుల ఉద్యమంలో శ్రీశ్రీతో కలిసి రాష్ట్రమంతా పర్యటించారు. అనేక నిజనిర్ధారణ కమిటీల్లోనూ చురుగ్గా పాల్గొన్నారు.
పీడీ చట్టం కింద నిఖిలేశ్వర్, చెరబండరాజుతో పాటు అరెస్టయ్యారు. ముషీరాబాద్ జైల్లో 50 రోజులపాటు జైలు జీవితాన్ని అనుభవించారు. ఎమర్జెన్సీలోనూ కొద్ది రోజులపాటు కారాగార వాసం తప్పలేదు. రెండు సార్లు చైనాలో పర్యటించారు.
భారత-చైనా మిత్రమండలికి జాతీయ ఉపాధ్యక్షుడిగా, రెండు దేశాల మధ్య సత్సంబంధాల కోసం ఊపిరి ఆగిపోయేవరకు అవిశ్రాంతంగా పనిచేశారు. శాశ్వత నిద్రలోకి జారేముందు ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారో!
నేను హైస్కూలు చదివేరోజుల్లో ; 1967-70 మధ్య తొలిసారిగా జ్వాలాముఖిని చూశాను. వనపర్తిలో పాలిటెక్నిక్ కాలేజీ వార్షికోత్సవానికి అతిథిగా వచ్చారు. జ్వాలాముఖి మాట మాటకు విద్యార్థుల చప్పట్లతో ఆడిటోరియం మారుమోగిపోయింది. ఆ వయసులో నాకు ఆ మాటలేవీ అర్థం కాలేదు. ఏం మాట్లాడారో కూడా గుర్తు లేదు.
జ్వాలాముఖి మాట్లాడిన ఒకే ఒక్క మాట మాత్రం గుర్తుండిపోయింది.
“జంజాన్ని, మొలతాడును తెంపి పారేశాను” అన్నారు.
అంతే.. చాలా సేపటి వరకు చప్పట్లు ఆగలేదు. ఆ మాత్రం దానికి చప్పట్లు ఎందుకు కొడుతున్నారో!? అనుకున్నాను అర్థం కాక. అయిదారేళ్ళ తరువాత నేను కూడా ఆ పని చేసినప్పడు అర్థమైంది ఒకటి కులానికి, మరొకటి మతానికి ప్రతీకలని. ఆ రోజు ఆ యువతరం చప్పట్లు ఎందుకు కొట్టారో కూడా అర్థమైంది.
జ్వలాముఖి ఎన్నో సార్లు తిరుపతి వచ్చారు. తిరుపతిలో నిలుచుని, చుట్టూ కలయ చూస్తూ, మా పూర్వీకులు చిత్తూరు జిల్లాకు చెందిన వారు అన్నారు. ఇక్కడి నుంచే మెదక్ జిల్లా కు వలస వెళ్ళారు. ఆ తరువాత హైదరాబాదు సీతారాంబాగ్ లో స్థిరపడ్డారు.
తిరుపతి వచ్చినప్పుడు అనేక సార్లు కోనేటి కట్టపైనుంచి జ్వాలాముఖి ప్రసంగించారు. మరొకసారి బాలాజీ భవన్ లాడ్జిలో దిగినప్పడు వారిని కలవడానికి వెళ్ళాను.
చాలా పాత బడ్డ లాడ్జి. బాత్‌రూంలోకి వెళ్ళి పాకుడు వల్ల జారిపడ్డాను. జ్వాలాముఖి గబగబా వచ్చి నన్ను లేపి సపర్యలు చేశారు.
ఆ రోజు సాయంత్రం బహిరంగ సభ.
“ఈ దేశమంతా పాకుడు పట్టిన నేల. ఈ రోజు నువ్వు పడిపోతావు. రేపు మరొకరు పడిపోతారు. పడిపోయిన వారిని చూసినవ్వితే ఎలా!? మరొక రోజు నేను కూడా పడిపోతాను. మనమంతా పడిపోతాము. ఎందుకంటే, ఈ దేశ మంతా పాకుడు పట్టిన నేల. ఈ పాకుడునంతా కడిగేయాలి” అన్నారు.
జ్వాలాముఖి ఉపన్యాసానికి ప్రతీకలు అప్పటికప్పుడు ఇలా పుట్టుకొ స్థాయి.ఎక్కువగా పౌరాణిక ప్రతీకలతో ఉపన్యసిస్తారు. అవి ప్రజలకు దగ్గరగా ఉంటాయి, తేలిగ్గా అర్థమవుతాయి.
జ్వాలాముఖి కవిత్వంలో కాస్త సంక్లిష్టత ఉన్నా, ఉపన్యాసంలో ఎంతో స్పష్టత ఉంటుంది.
“గతం నుంచి, మతంనుంచి విముక్తి పొం దాలి ” అని పిలుపు నిస్తారు.
“ఊపిరాడని భారతీయుని కి తూర్పుగాలి చేరనీయండి “అని కోరతారు.
“బోధివృక్షం పిడికెడు నీడనీయలేదు. గాంధీ పథం గరిటెడు గంజిపోయలేదు.ధర్మ శాస్త్రాలు తలదాచు కోనీయలేదు. కర్మసిద్ధాంతం బానిసను చేసి వదిలేసింది ” అంటూ ఆవేదన వ్యక్తం చేస్తారు.
“దళారులు మర్యాద పురుషోత్తములు. విధులు విధేయతలు డాలర్ గీచిన గీతలు. డాలర్ క్రూరాన్ని మించిన టెర్రరిజం లేదు” ‘డాలర్ శరణం గచ్ఛామి’ లో సామ్రాజ్యవాదాన్ని ఇలా తూర్పారబడతారు. “జగం మిథ్య డాలర్ సత్యం” అని వ్యంగ్యోక్తి విసురుతారు.
“ప్రపంచీకరణ నిశ్శబ్ద మృత్యువు” అంటారు.
గుజరాత్‌లో మతకల్లోలాలు రేపి మారణహోమాన్ని సృష్టించినప్పడు జ్వాలాముఖి స్వయంగా అక్కడికెళ్ళి బాధితులను ఓదార్చి ధైర్యం చెప్పారు. ఈ నేపథ్యంలో ‘భస్మసింహాసనం’ అన్న దీర్ఘ కవితను రాశారు. దీన్నొక చిన్న కావ్యమని కూడా చెప్పవచ్చు.
“నమస్తేసదా హత్యలే మాతృభూమి. నిస్సిగ్గు దగ్ధభూమి.
తెగిపడిన ఆర్థనాదాలు, దయలేని వందేమాతరాలు” అంటూ మారణహోమానికి కారణమైన మతోన్మాదులను ఎత్తిచూపిస్తారు.
“గుజరాత్ మదించిన అబద్దాల ప్రయోగశాల
దాన్ని నిజాలనిప్పుల మీద నిశ్చలంగా నిగ్గు తేల్చాలి
గుజరాత్ కౄరత్వ హిందుత్వ చీకటి చెరసాల
దాన్ని సెక్యులర్ సంస్కారంతో బద్దలుకొట్టాలి
గుజరాత్ చచ్చిన మధ్యయుగాల వధ్యశిల
దాన్ని ప్రజల ప్రజాస్వామ్యంతో ముంచెత్తాలి ” అంటూ కర్తవ్యబోధ చేస్తారు.
“పీడిత జనసుఖాయ ప్రజాస్వామ్యం శరణం గచ్ఛామి,
తాడిత జనహితాయ లౌకి రాజ్యం శరణం గచ్ఛామి,
శోషిత జన సుభాయ సామ్యవాదం శరణం గచ్ఛామి,
బాధిత జన మోక్షా య విప్లవం శరణం గచ్ఛామి” అంటూ దిశానిర్దేశం చేస్తారు జ్వాలాముఖి.
జ్వాలాముఖి భౌతికం గా లేక పోవచ్చు.
మన మనసుల్లో నిత్యం జ్వలించే అగ్ని శిఖ లా శాశ్వతత్వం పొందారు.
(ఆలూరు రాఘవ శర్మ, సీనియర్ జర్నలిస్టు, తిరుపతి)