ఎవరు సీమ ద్రోహులు? ఎవరు సిగ్గుపడాలి?

(టి.లక్ష్మీనారాయణ)
అమరావతి రాజధాని పరిరక్షణకై సాగుతున్న మహాపాదయాత్ర ముగింపు కార్యక్రమాలలో పాల్గొనడానికి తిరుపతికి వచ్చా. మహాపాదయాత్ర ప్రారంభం రోజు పాల్గొని తుళ్ళూరు నుండి పెదపెరిమి వరకు ఏడు కి మీ. నడిచాను. తర్వాత గుంటూరు, కందుకూరుల్లో రెండు రోజులు పాల్గొన్నాను.
ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీకి చెందిన దినపత్రికలో “సీమ ద్రోహుల్లారా..సిగ్గుందా?” అన్న శీర్షికతో ఒక వార్త చదివాను. దానిపై స్పందించాలనిపించింది. ఎందుకంటే అమరావతి రాజధాని పరిరక్షణకై సాగుతున్న మహాపాదయాత్రను బలపరుస్తున్న రాయలసీమ ప్రజలను, అన్ని ప్రతిపక్ష పార్టీల నాయకులను – శ్రేణులను, నాలాంటి సామాజిక ఉద్యమకారులను ఉద్దేశించి, నిందిస్తూ – దూషిస్తూ ప్రచురించబడిన వార్త అది. కాబట్టే స్పందిస్తున్నా.
“రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ చిన్నదైపోయింది. ప్రజలు, ప్రాంతాల మధ్య ఐక్యత ముఖ్యం. రాష్ట్రం నడిబొడ్డులో రాజధాని ఉండాలి. రాజధాని నిర్మాణానికి 30,000 ఎకరాల భూమి కావాలి. నీరు పుష్కలంగా లభించే ప్రాంతంలో రాజధాని ఉండాలి. సచివాలయం, శాసనసభ, హైకోర్టు ఉన్నదాన్నే రాజధాని అంటారు. అమరావతిని రాజధానిగా మనస్ఫూర్తిగా బలపరుస్తున్నా”.

ఆణిముత్యాల్లాంటి ఈ మాటలు మాట్లాడింది ఎవరండి? ఒకనాటి ప్రతిపక్ష నాయకుడు, నేటి రాష్ట్ర ముఖ్యమంత్రే కదా? మరి, ఆయన కూడా సీమ ద్రోహేనా? జగన్మోహన్ రెడ్డి గారు మాట మార్చితే ప్రజలందరూ మాట మార్చాలా? మాటకు కట్టుబడి ఉండే జాతి తెలుగు జాతి కాదని చరిత్ర పుటలకెక్కాలా?
నైతిక విలువలకు కట్టుబడిన కోవకు చెందిన వారు, చెప్పిన మాటకు కట్టుబడి ఉంటారు. నేను గర్వంగా పునరుద్ఘాటిస్తున్నా, “అమరావతే మన ఏకైక రాజధాని”, రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం జరుగుతున్న ఉద్యమాల్లో భాగస్వామినౌతూనే ఉంటా.
సంకుచిత రాజకీయాలకు, వివాదాలకు అతీతంగా చట్టసభలు ఏకగ్రీవంగా తీర్మానం చేసి అమరావతిని రాజధానిగా నిర్ణయించి, ఆ గడ్డపై నుంచే పాలనసాగిస్తూ, 29,000 మంది రైతుల నుండి 34,000 ఎకరాల భూములను ప్రత్యేకంగా రూపొందించబడిన భూ సమీకరణ చట్టం ద్వారా సేకరించి, ప్రధాన మంత్రి శంకుస్థాపన చేసి, రాజధాని నిర్మాణానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చే నాటికే రు.9,000 కోట్లు ప్రజాధనాన్ని వ్యయం చేసి, వివిధ దశల్లో భవన సముదాయాల నిర్మాణాలున్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి అమరావతి నుండి రాజధానిని విశాఖపట్నానికి తరలిస్తానంటూ రాజధానిపై మాట మార్చి, కుట్రపూరితంగా వ్యవహరిస్తూ, విధ్వంసకర విధానాలు అమలు చేస్తుంటే ప్రజలు సమర్థించాలా! సమర్థించకపోతే “సీమ” ద్రోహులా?
అమరావతే మన రాష్ట్ర రాజధాని అంటే సీమ ద్రోహులని దుర్భాషలాడే వారి నైజాన్ని, సంకుచిత రాజకీయాలను అర్థం చేసుకొనే విజ్ఞత రాయలసీమ ప్రజలకు పుష్కలంగా ఉన్నది.
నిజాయితీగా వెనుకబడ్డ, కరవు పీడిత రాయలసీమ సమగ్రాభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం -2014 మేరకు హక్కుగా రాబట్టుకోవలసిన అంశాలు, తుంగభద్ర – కృష్ణా నదీ జలాల హక్కులను పరిరక్షించుకొంటూ, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేసుకోవడంపై దృష్టిసారించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాడాలి.
వెనుకబడ్డ, నిత్య కరవు పీడిత రాయలసీమ సమగ్రాభివృద్ధికి అంకితభాంతో నేను ఏ.ఐ.ఎస్. ఎఫ్.తో రాజకీయ జీవితం మొదలుపెట్టి, నాలుగున్నర దశాబ్దాల పాటు సీపీఐలో రాష్ట్ర స్థాయిలో కూడా వివిధ బాధ్యతల్లో ఉంటూ, రాష్ట్ర విభజన తర్వాత ఒక సామాజిక ఉద్యమకారుడిగా ఉద్యమాల్లో పాల్గొంటున్నా.
1975-80 మధ్య తిరుపతిలో విద్యార్థిగా ఉన్న కాలంలోనే 1977లో “రాయలసీమ సమగ్రాభివృద్ధికై విద్యార్థి – యువజన సదస్సు”ను నిర్వహించాం. నాటి నుండి వివిధ రూపాల్లో ప్రధానంగా కృష్ణా నదీ జలాల తరలింపుకు, శ్రీశైలం కుడి బ్రాంచి కాలువ (ఎస్.ఆర్.బి సి.), తెలుగు గంగ, గాలేరు – నగరి, హంద్రీ – నీవా, వెలిగొండ, తదితర భారీ నీటి పారుదల ప్రాజక్టుల సాధనకు అలుపెరగని పోరుసల్పుతూనే ఉన్నాం.
పాదయాత్రలు, చైతన్యయాత్రలు, ర్యాలీలు(వేల మందితో హైదరాబాదులో కూడా), ధర్నాలు, కలెక్టరేట్ దిగ్బంధనం, సదస్సులు, బహిరంగ సభలు, తదితర పోరాట రూపాల్లో ఉద్యమాలకు నాయకత్వం వహించిన వాడిని. కేసులను ఎదుర్కొన్న వాడిని. పలు దఫాలు అరెస్టు అయిన వాడిని. సమగ్ర అవగాహనలేని, సంకుచిత మనస్తత్వంతో ఎవరైనా కువిమర్శలు చేస్తే వాటిని ఏమాత్రం ఖాతరుచెయ్యను.

( టి.లక్ష్మీనారాయణ, సామాజిక ఉద్యమకారుడు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *