ఒక సర్కార్ బడి సక్సెస్ స్టోరీ…

కొంతమంది టీచర్లుంటారు… చక్కగా బడికొచ్చి, శ్రద్ధగా పాఠాలు చెప్పి మంచి పేరు తెచ్చుకుంటారు.
మరికొంతమంది టీచర్లు, వీళ్లదంతా నిరాశావాదం. ఉద్యోగం కాబట్టి పాఠాలు చెబుతారు. గంటకొట్టగానే వస్తారు. గంటకొట్టగానే వెళ్లిపోతారు. ఎవ్వడికీ చదువుమీద శ్రద్ధలేదనే నిరాశతో క్లాస్ లోకి వస్తారు. తమ నిరాశావాదాన్ని సమర్థించుకునేందుకు  ‘గవర్నమెంట్ స్కూళ్ల లో చదివే పిల్లలు పేద వాళ్ల పిల్లలండి. వాళ్లకి చదవవంటే అసక్తి ఉండదు. ఎంతచెప్పినా తలకెక్కదు. పండగని, పబ్బమని, ఇంట్లో ఫంక్షన్ అని బడి ఎగ్గొడతారు,’ అందంగా తమ మానసిక జబ్బును సమర్థించుకుంటారు.
వీళ్లిదద్దరు మరొక రకం టీచర్లుంటారు.వాళ్లకి బది ప్రపంచం. పిల్లలే ప్రపంచం. చదవు మీద పిల్లల్లో ఆసక్తి  ఎలా పెరగదో చూద్దాం అని చాలెంజ్ గా  తీసుకుంటారు. ఈ క్రమంలో పిల్లల మనసు దోచుకుంటారు. తల్లితండ్రులను ఆకట్టుకుంటారు. తమ పాఠశాలను అందరి కంట పడేలాతీర్చి దిద్దుతారు. ఎక్కువ సమయం స్కూల్లో గడపుతారు. స్కూలును అందంగా, ఆహ్లాదకరమయిన ప్రదేశంగా మారుస్తారు. పిల్లలు బాగా చదవుకునేలా చూస్తారు, విజయవంతంగా చేస్తారు. అంతేకాదు, ఈ క్రమంలో సొంత డబ్బును ఖర్చు చేసి త్యాగం చేస్తారు. ఈ టీచర్లున్న గవర్నమెంట్ స్కూళ్లన్నీ విద్యార్థులతో, చక్కటి విద్యతో కలకలలాడుతుంటాయి. ఇలాంటి స్కూళ్లు కనబడగానే, తల్లితండ్రులు తమ పిల్లలను ప్రయివేటు పాఠశాలల నుంచి తీసుకొచ్చి వీటిలో చేర్పిస్తారు. ఇక్కడి టీచర్ల అంకితభావం, పిల్లల్లో ఉత్సాహం, ప్రగతి చూసి చాలా కార్పొరేట్ కంపెనీలు సాయం చేసేందుకు ముందుకు వస్తాయి. దాతలు కూడా ముందుకు వచ్చి ఇలాంటి పాఠశాలలకు సాయం చేస్తుంటాయి. ఇలాంటి టీచర్లు సంఖ్య ఈ మధ్య పెరుగుతూ ఉంది. ఇదొక మంచి సూచన. ఏమో ఎవరు చూశారు, ప్రజలంతా మళ్లీ ప్రభుత్వ పాఠశాలలవైపు మరలుతారేమో.
ఇలాంటి సర్కార్ స్కూలొకటి విశాఖపట్టణం  జిల్లా చంద్రంపాళెలంలో ఉంది. ఈ పాఠశాల(హైస్కూల్)  ను అక్కడి టీచర్లు ఎంత గొప్పగా తీర్చిదిద్దారంటే విద్యార్థుల బలగం నాలుగువేలు దాటింది. ఒక ప్రభుత్వ పాఠశాల ఇలా విద్యార్థులతో అలా క్రిక్కిరిసిపోతూ ఉండటం ఎక్కడయినా చూశామా, ఎపుడైనా విన్నామా?
ఈ జిల్లా పరిషత్ హైస్కూల్ ని Shining Model of Excellence  అని ఆ  మధ్య ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ ప్రశంసించింది. ఈ స్కూలు విద్యార్థులతో ఎంతగా కిటకిటలాడుతూ ఉందంటే ప్రతి తరగతికి ఆరు, ఏడు సెక్షన్లు ఏర్పాటు చేసి డిమాండ్ ను అకామిడేట్ చేయాల్సి వస్తున్నదని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’  రాసింది. ఈ  స్కూల్లో సోలార్ పవర్ తో నడిచే మల్టిపర్పస్ ప్లే ఏరియా కూడా ఉంది.
ఆరో తరగతి నుంచి పదో తరగతి దాకా ఉండే ఈ హైస్కూళ్లో ఆరో తరగతికి విపరీతమయిన డిమాండ్ ఉంది. 1975లో ఒక మామూలు సర్కార్ బడిలాగానే ఇదీ ప్రారంభమయింది, నూరు మందితో.  ఇపుడు పాఠశాలలో  4019 మంది విద్యార్థులున్నారంటే, జైకొట్టక తప్పదు.
ఈ స్కూళ్లో పిల్లలను చేర్పించేందుకు చుట్టుపక్కల 20 గ్రామాల ప్రజలు పరుగుపెడుతున్నారు. ఈ పాఠశాల విశాఖ మధురవాడ ప్రాంతంలోని చంద్రంపాళెంలో ఉంటుంది.
ఇక్కడ చాలా ప్రభుత్వ పాఠశాలలున్నాయి. ప్రయివేటు పాఠశాలలున్నాయి. కార్పొరేట్ పాఠశాలలూ ఉన్నాయి. ఇక్కడి తల్లితండ్రులు అయిదో తరగతి వరకు మాత్రమే ఈ పాఠశాలల్లో చదవిస్తున్నారు. అయిదు పాసవగానే, ఆరో తరగతికి చంద్రంపాళెం స్కూలుకి పరుగుపెడతారు. దీనితో ఈ పాఠశాలలకు ఎక్కడ లేనంత పోటీ ఎదరవుతున్నది.
ప్రతిసంవత్సరం జరిగే అడ్మిషన్లలో 80 శాతం ఆరో తరగతిలోనే ఉంటాయి. ఈ పాఠశాల ఇలా పాపులర్ కావడం వెనక జరిగిన కృషిమీద ‘బిబిసి- తెలుగు’ ఒక చక్కటి కథనం ప్రచురించింది.
ఈ ఏడాది ఇప్పటికే వేయిమంది పాఠశాలలొ చేరారు.మరొక మూడొందల మంది చేరుఅవకాశం ఉందని హెడ్ మాస్టర్ ఎం రాజబాబు చెప్పారు. ఈ పాఠశాల సక్సెస్ స్టోరీ తెలిసిన కార్పొరేట్ కంపెనీలు కొన్ని  సిఎస్ ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్సాన్నిబిలిటి) కింద  రకరకాల రూపాల్లో సాయం చేస్తున్నాయి.
ఈ స్కూలు విశేషమేమంటే…  కార్పొరేట్ స్కూలుకు ఏ మాత్రం తీసిపోని విధంగా విద్యాబోధన ఉంటుంది. అంతేకాదు, ఇది కాలానికి తగ్గట్టుగా కూడా ఉంటుంది.  ఇక్కడ లాంగ్వేజ్ స్కిల్స్, కంప్యూటర్ నాలెడ్జ్  అందించేందుకు అధ్యాపకులు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ఇది కూడా చాలా క్వాలిటీ శిక్షణ. అంటే, మళ్లీ ఖరీదైన ప్రయివేటు స్కూళ్ల వైపు తల్లితండ్రులు చూడకుండా స్కిల్ డెవెలప్ మెంటు అందిస్తున్నారు.
ఇంగ్లీష్ లాంగ్వేజీ నేర్పించేందుకులాంగ్వేజీ ల్యాబొరేటరీ వుంది. బిబిసి లెర్నింగ్ వీడియో ద్వారా భాషని నేర్పిస్తున్నారు. ఉచ్ఛారణ, ముఖ కవళికల ద్వారా భాషను నేర్పించేందుకు ప్రత్యేక శిక్షణ ఉంది. ఈ పాఠశాలలో చదివే విద్యార్థులంతా ఇంగ్లీష్ లో  చాలా స్ట్రాంగ్.   ఇదెంత వరకు వెళ్లిందంటే, వీళ్లకి ఆన్ లైన్ అందుబాటులో ఉండటంతో అనేక మంది నిపుణులతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు.
ఈ పాఠశాలలో కంప్యూటర్ శిక్షణ ఇచ్చేందుకు  ప్రత్యేకంగా ఒక టీచర్ ఉన్నారు.  ఇక్కడ 50 కంప్యూటర్లతో ఒక పెద్ద ల్యాబ్ ఉంది. పవర్ పాయింట్ ప్రజేంటేషన్ తో తరగతులు నిర్వహిస్తారు. సైబర్ స్మార్ట్ పేరుతో సైబర్ నేరాల మీద అవగాహన కల్పిస్తున్నారు. ఇ-మెంటరింగ్ పేరుతో ప్రపంచంలో ఏ సబ్జక్టు ఎక్స్ పర్ట్ తో నైనా పిల్లలకు ఇంటరాక్షన్ కల్పిస్తున్నారు.
పాఠశాలలో 20 రకాల క్రీడల్లో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. బుక్ రీడింగ్, స్టోరీ టెలింగ్ లో కూడా శిక్షణ ఇస్తున్నారు. ఇలాంటి పాఠశాల ఎక్కడైనా ఉందంటే, టక్కున  మనకు అదేదో  ఖరీదయిన ప్రయివేటు ఇంటర్నేషనల్ స్కూలు అనిపిస్తుంది. సర్కార్ బడి గుర్తుకు రాదు. అయితే, చంద్రం పాలెం జడ్ పి హెచ్ ఎస్ టీచర్లు,  జిల్లాపరిషత్ హైస్కూల్స్ ని కూడా ఈ కోవలో చేరుస్తున్నారు.
ఈ సర్కార్ బడి అన్నింటిలో టాపే. మంది ఎక్కువయినా ఇక్కడ విద్య క్వాలిటీ పలుచబడ లేదు.
చంద్రంపాళెం స్కూల్ సక్సెస్ స్టోరీ ప్రేరణతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిరెవిన్యూ డివిజన్ లో ఒక ‘స్కూల్ ఆఫ్ ఎక్స్ లెన్స్’ ప్రారంభించాలనుకుంటూ ఉంది. ఈప్రయోగానికి అవసరమయిన మంచి ఉపాధ్యాయులు అందుబాటులోకి వచ్చి విజయవంతం చేయాలని ఆశిద్దాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *