తాజాగా జస్టిస్ చంద్రు గారు విజయవాడ వేదికగా చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ పరిణామాలపై సంపూర్ణ అవగాహనతో చేసినట్లు అనిపించడం లేదు.
“ఉతికారేసిన జస్టిస్ చంద్రు” అన్న మాటలను విని ఒకింత బాధతోనే స్పందిస్తున్నా.
మద్రాసు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చంద్రు గారంటే ప్రగతిశీల శక్తులకు అపారమైన గౌరవం. జై భీమ్ సినిమా చూశాక నాకు ఆయన పట్ల గౌరవం పెరిగింది. మానవ హక్కులు, పౌర హక్కుల పరిరక్షణ కోసం పోరాడుతున్న ఉద్యమకారులకు ఆయన స్ఫూర్తిగా నిలిచారు.
తాజాగా జస్టిస్ చంద్రు గారు విజయవాడ వేదికగా చేసిన వ్యాఖ్యలు మాత్రం నిస్సంకోచంగా వివాదాస్పదమైనవి. ఆయన వ్యాఖ్యలు నాకు చాలా ఆశ్చర్యం కలిగించాయి. ఆంధ్రప్రదేశ్ పరిణామాలపై సంపూర్ణ అవగాహనతో జస్టిస్ చంద్రు ఆ వ్యాఖ్యలు చేసినట్లు అనిపించడం లేదు.
1. న్యాయ వ్యవస్థను, న్యాయమూర్తులను దూషిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన కుసంస్కారులపై కేసులు పెట్టడాన్ని, అరెస్టు చేయడాన్ని, సిబిఐ విచారణను మానవ హక్కులు, పౌర హక్కులు, భావవ్యక్తీకరణ స్వేచ్ఛ పేరిట జస్టిస్ చంద్రు తప్పుపట్టడం ఆశ్చర్యం కలిగించింది. ఆయన వ్యాఖ్యలు అరాచక శక్తులను సంతృప్తి పరచవచ్చు.
2. అమరావతి భూకుంభకోణం ఆరోపణలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పరిగణలోకి తీసుకోకుండా జస్టిస్ చంద్రు గారు వ్యాఖ్యలు చేయడం చాలా విడ్డూరంగా అనిపించింది.
3. హైకోర్టు విచారణలో ఉన్న మూడు రాజధానుల అంశంపై జస్టిస్ చంద్రు గారు చేసిన వ్యాఖ్యలు తీవ్రఅభ్యంతరకరంగా ఉన్నాయి. అమరావతి రాజధాని అంశంపై సంపూర్ణ అవగాహనతోనే ఆయన వ్యాఖ్యలు చేశారా! అన్న అనుమానం వచ్చింది.
4. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపక్షాలతో కాకుండా న్యాయవ్యవస్థతో పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడిందని, అది వాంఛనీయం కాదని వ్యాఖ్యానించారు. దానికి బాధ్యులెవరు? లోపభూయిష్టమైన విధానాలు అమలుచేస్తున్న ప్రభుత్వమా! లేదా! న్యాయవ్యవస్ధా?
5. రాజధాని కేసులపై విచారణ చేస్తున్న హైకోర్టు బెంచ్ లోని ఇద్దరు న్యాయమూర్తులను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన విన్నపాన్ని ధర్మాసనం తిరస్కరించడాన్ని జస్టిస్ చంద్రు గారు ప్రశ్నించడంలో ఔచిత్యం కనపడడం లేదు. వికేంద్రీకరణ చట్టాన్ని, సీఆర్డియే చట్టాలను రాష్ట్ర ప్రభుత్వమే రద్దు చేసి, హైకోర్టులో ప్రమాణపత్రం దాఖలు చేయడానికి అదే కారణమన్న భావనను జస్టిస్ చంద్రు గారు వ్యక్తం చేయడం తీవ్ర అభ్యంతరకరంగాను, అసంబద్ధంగాను ఉన్నది.
6. ఆశ్చర్యం ఏమిటంటే, భారత రాజ్యాంగం కల్పించిన మానవ హక్కులు, పౌర హక్కులు, ప్రజాస్వామ్య హక్కులు ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు అనుభవిస్తున్నారా! లేదా! అన్న అంశంపై జస్టిస్ చంద్రు గారు మాట వరసకు కూడా ప్రస్తావించలేదు. దళితులపైనే ఎస్. సి. & ఎస్.టి. అట్రాసిటీస్ ప్రివెంన్సన్ యాక్ట్ క్రింద పోలీసులు అక్రమ కేసులు బనాయించిన ఉదంతాలు ఉన్నా వాటిపై వ్యాఖ్యానించ లేదు. ఒక ప్రభుత్వ డాక్టర్ సుధాకర్ మరణించారు. ఒక అధికార పార్టీ యం.పి. చిత్రహింసలకు గురైనారు. అమరావతి రాజధాని పరిరక్షణ కోసం రెండేళ్లుగా పోరుసల్పుతున్న రైతులు, ప్రత్యేకించి మహిళలు, దళితులపై ప్రభుత్వ నిర్భందకాండను జస్టిస్ చంద్రు గారు ఎందుకు చూడ నిరాకరించారో! అర్థం కాలేదు.