అమరావతి రాజధానికి హైకోర్టు తరలింపుకు సంబంధం లేదని రాష్ట్రపతి నోటిఫికేషన్ తో హైకోర్టు నెలకొల్పబడిందని పైగా పరిపాలన వికేంద్రీకరణ చట్టంలో కర్నూలుకు హైకోర్టు తరలింపుపై స్పష్టత లేదని చీఫ్ జస్టిస్ చేసిన వ్యాఖ్యలు సీమలో తీవ్ర సంచలనం కలిగించాయి.
(వి. శంకరయ్య)
శ్రీబాగ్ ఒడంబడిక రాయలసీమకు దిక్సూచి ! అధికారిక ముద్ర లేక పోయినా దానికి చారిత్రక ప్రాధాన్యత వుంది. అందుకే దశాబ్దాలు గడిచినా సీమ ప్రజల గుండెల్లో పదిలంగా గూడు గట్టుకొని వుంది. రాయలసీమలో వలస బతుకులు అంతమయ్యే వరకు ఇతర ప్రాంతాలతో సమానంగా సామాజిక ఆర్థికాభివృద్ధి సాధించే వరకు శ్రీ బాగ్ ఒడంబడిక సజీవంగానే వుంటుంది. టిడిపి హయాంలో ప్రతి పక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా చేసిన బాసలతో సీమ ప్రజలు పెద్దగానే ఆశలు పెంచుకున్నారు. ఫలితంగానే 2019 ఎన్నికల్లో ఏక పక్షంగా తీర్పు వచ్చింది. తదుపరి ఫలితం మాత్రం పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టయింది. అందుకే నేడు రాయలసీమ తిరిగి రగులుతోంది.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కర్నూలును న్యాయ రాజధానిగా చేస్తానని ప్రకటించినా ఏళ్లు గడుస్తున్నా ఒక్క ఇంచి కదల లేదు. అయితే అమరావతి రాజధాని కేసుల విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ చేసిన వ్యాఖ్యలు సీమ వాసుల ప్రజల కళ్లు తెరిపించాయి. అమరావతి రాజధానికి హైకోర్టు తరలింపుకు సంబంధం లేదని రాష్ట్రపతి నోటిఫికేషన్ తో హైకోర్టు నెలకొల్పబడిందని పైగా పరిపాలన వికేంద్రీకరణ చట్టంలో కర్నూలుకు హైకోర్టు తరలింపుపై స్పష్టత లేదని చీఫ్ జస్టిస్ చేసిన వ్యాఖ్యలు సీమలో తీవ్ర సంచలనం కలిగించాయి. ఇదిలా వుండగా అమరావతిలో హైకోర్టు పక్కనే కొత్త భవనాలకు టెండర్లు పిలవడం కృష్ణ నది యాజమాన్య బోర్డును కర్నూలు లో ఏర్పాటుకు ముఖ్యమంత్రి మొగ్గు చూపక పోవడం అగ్నికి వాయువు తోడైనట్లయింది
పాలనా వికేంద్రీకరణ గాని శ్రీ బాగ్ ఒడంబడిక అమలు గాని రాయలసీమలో రాజధాని లేక హైకోర్టు నెలకొల్పడంగానే నమ్మించే ప్రయత్నాలు జరుగుతున్నాయి . రాయలసీమలో హైకోర్టు పెట్టినంత మాత్రాన సీమ కోన సీమ కానేరదు.
1937 నవంబర్ 16 వతేదీ శ్రీ బాగ్ ఒడంబడికలో సంతకం చేసిన పెద్దలు ముందుగానే జాగ్రత్త పడి సీమ సమగ్రాభివృద్ధికి రాజధాని లేక హైకోర్టు ఒక అంశంగానే భావించి ప్రధమ ప్రాధాన్యత ఇవ్వ లేదు. పలు అంశాల్లో అదొకటి మాత్రమే. ఆ రోజుల్లో సమస్యాత్మకంగా వుండిన ఆంధ్ర యూనివర్సిటీకి చెంది రెండవ కేంద్రం అనంతపురంలో ఏర్పాటు తొలి అంశంగా చేర్చారు. రెండవ అంశంగా సాగునీటి ప్రాజెక్టులను పొందు పర్చారు. తుంగభద్ర పెన్నా కృష్ణ నదులపై నిర్మించే ప్రాజెక్టుల్లో సీమకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని నిబంధన చేర్చారు. వలస బతుకులు పోవాలని రైతులు పొలంలో విత్తనం వేసి ఆకాశం కేసి చూచే దుర్భర స్థితి నిర్మూలన కావాలని సాగునీరు అవసరమని భావించారు . అయితే దశాబ్దాలు గడచి పోయినా ఏం జరిగిందో ప్రత్యేకంగా చెప్ప పని లేదు.
పోనీ కోటి ఆశలతో జగన్మోహన్ రెడ్డికి ఏక పక్షంగా పట్టం గట్టినా నేడు ఏమైందీ కళ్ల ముందుంది. కేవలం రాజధాని లేక హైకోర్టు ఆశల ఊయ్యాల్లో సీమ ప్రజలను మభ్య పర్చేందుకు యత్నాలు జరుగుతున్నాయి- తప్ప దశాబ్దాలుగా పెండింగ్ లో వున్న ఏ ఒక్క ప్రాజెక్టు నిర్మాణం పట్టాలెక్క లేదు.
పైగా కృష్ణ బోర్డు నోటిఫికేషన్ తో రాష్ట్ర విభజన చట్టంలో రక్షణ గల మిగులు జలాల ఆధారంగా నిర్మించిన ప్రాజెక్టులే కాదు-ఎప్పుడో నిర్మించిన ప్రాజెక్టులకు ప్రమాదం ముంచుకొచ్చింది. ముఖ్యమంత్రి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పోతు రెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ పనులు అంతర్ రాష్ట్ర వివాదంలో చిక్కుకొన్నది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తో వ్యక్తిగతంగా ప్రదర్శించిన సౌభ్రాతృత్వం గొంతెండి పోతున్న సీమ ప్రాజెక్టుల అంశంలో వ్యక్తం చేయ లేక పోవడం సీమలో యువతను ఆలోచనలో పడేసింది. .
ఇక శ్రీ బాగ్ ఒడంబడికలో తదుపరి అంశంగా ఆనాటి నిర్దిష్ట పరిస్థితుల బట్టి (రాజ్యాంగం అమలులో లేదు) చట్ట సభల్లో కోస్తా రాయలసీమ జిల్లాల్లో రిజర్వేషన్లు మినహా జనరల్ స్థానాలు సమానంగా వుండాలని పొందు పర్చారు. ఆఖరు అంశంగానే రాష్ట్ర రాజధాని హైకోర్టు వేర్వేరు ప్రాంతాల్లో వుండాలని అయితే ముందు ఛాయిస్ సీమకు ఇవ్వాలని ఒడంబడికలో పొందు పర్చారు. 1953 లో అభిభక్త మద్రాసు రాష్ట్రం నుండి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన సందర్భంలో శ్రీ బాగ్ ఒడంబడిక పేరుతో కర్నూలును రాజధాని చేసి మిగిలిన అంశాలు పక్కన పెట్టడంతో రాజధాని అంశం మందుకు వచ్చింది.
సీమ సామాజిక ఆర్థిక గతిని మార్చే అంశాలను వెనక్కి నెట్టి చాల మంది పాలకులు చేతులు దులుపు కుంటున్నారు. శ్రీ బాగ్ ఒడంబడిక మేరకు కర్నూలు రాజధాని చేసిన నీలం సంజీవరెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా వుంటూ సిద్దేశ్వరం వద్ద బహులార్థ సాధక ప్రాజెక్టు నిర్మించాలనే డిమాండ్ వున్నా శ్రీ శైలం జలాశయం కేవలం జల విద్యుదుత్పత్తి ప్రాజెక్టుగానే నిర్మాణానికి అంగీకరించి సీమకు అపకారం చేశారు. ఆ రోజుల్లో శ్రీ శైలం జలాశయం స్థానే సిద్దేశ్వరం బహులార్థ సాధక ప్రాజెక్టు నిర్మాణం జరిగి వుంటే అంత క్రితం పట్టాలుకెక్కని కృష్ణ పెన్నార్ ప్రాజెక్టు ద్వారా సీమలో సాగయ్యే ఆరేడు లక్షల ఎకరాలకు సాగునీరు అందేది. శ్రీ బాగ్ ఒడంబడిక ఎవరెవరు ఏలా వాడుకొన్నారనేందుకు చాలా నిదర్శనాలున్నాయి.
వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు కూడా హైకోర్టును (ఏలాగూ రాజధాని లేదు).అమరావతి నుండి కర్నూలుకు తరలించడం సందేహాస్పదమే. రాజధాని కాష్టం మరి కొన్నాళ్లు కొన సాగించి శ్రీ బాగ్ ఒడంబడికలోని ఇతర ప్రాధాన్యత గల అంశాలను వాయిదా వేసే యత్నాలు జరుగుతున్నాయి. మరో ప్రమాదమేమంటే ఈ అంశంపై రాయలసీమలో వున్న “విభజన” భావ జాలం ఉపయోగించుకొనేందుకు ముమ్మర యత్నాలు జరుగుతున్నాయి.
ఇవన్నీ చూచి విసుగు చెందిన కొందరు ప్రత్యేక రాయలసీమ తప్ప మరో మార్గం లేదనే అభిప్రాయానికి వస్తున్నారు. ప్రాంతీయ అసమానతలు వున్నంత వరకు ప్రాంతీయ తత్వం పార దోలడం ఎవరి తరం కాదు. తెలంగాణ పోరాటాన్ని సీమలో కొందరు ఆదర్శంగా తీసుకుంటున్నారంటే వారిని నిందించి ప్రయోజనం లేదు. అర చేతిలో స్వర్గం చూపి మోసం చేసే నేతలపై వేలెత్తి చూప వలసి వుంది
(వి. శంకరయ్య విశ్రాంత పాత్రికేయులు 9848394013)