‘పోలవరంపై ప్రశ్నిస్తే అంత ఉలికి పాటెందుకో?’

పోలవరంపై ప్రశ్నిస్తే మంత్రి అనిల్ కుమార్ గారు నోరెందుకు పారేసుకొంటున్నారు?
(టి.లక్ష్మీనారాయణ)
2021 డిసెంబరు నాటికి పోలవరాన్ని పూర్తి చేసి చూపిస్తామని శాసనసభలో రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రిగా ప్రకటించింది మీరే కదా? ప్రాజెక్టు ఎత్తును కొలుచుకోవడానికి “టేప్” తెచ్చుకొమ్మని సవాల్ చేసిందీ మీరే కదా? అధికారదర్పం, అహంభావంతో విర్రవీగుతూ హావభావాలు ప్రదర్శిస్తూ సినిమా డైలాగుల రీతిలో గొప్పగా చట్టసభలోనే ప్రకటించారు కదా? మీరు చెప్పిన గడువు ముగిసిందని గుర్తుచేస్తే అసహనంతో నోరెందుకు పారేసుకోంటున్నారు? కాస్త విజ్ఞత ప్రదర్శించండి.
పోలవరం ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేకపోయారో జవాబుదారితనంతో రాష్ట్ర ప్రజలకు నమ్రతతో సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీపై ఉన్నది. పోలవరం బహుళార్థసాధక ప్రాజెక్టు నిర్మాణంలో జరుగుతున్న జాప్యంపై ప్రశ్నించే హక్కు ప్రతి ఆంధ్రప్రదేశ్ పౌరుడికి ఉన్నది. బాధ్యతతో సమాధానం చెప్పవలసిన మంత్రి అసహనంతో ఊగిపోతూ, ప్రశ్నించిన మీడియాపైన, విమర్శకులపైన నోరు పారేసుకోవడం అత్యంత బాధ్యతారహిత్యం, తీవ్రగర్హనీయం. కుసంస్కారంగా వ్యవహరించిన మంత్రిని అదుపులో పెట్టుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రిపై కూడా ఉన్నది.
జాతీయ ప్రాజెక్టుగా నిర్మాణంలో ఉన్న పోలవరంకు సంబంధించి రూ.55,548.87 కోట్లు వ్యయ అంచనాలతో రూపొందించిన డి.పి ఆర్.-2కు 2019 ఫిబ్రవరి 11న కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ సాంకేతిక సలహా మండలి ఆమోదం తేలియజేసినా, సంవత్సరాలు గడచిపోతున్నా ఎందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం లభించలేదో రాష్ట్ర ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపైన లేదా? ఈ సమస్యపై రాష్ట్రానికి చెందిన పార్లమెంటు సభ్యులు పార్లమెంటులో కేవలం ప్రశ్నలు వేయడం వరకే పరిమితమా? మోడీ ప్రభ్యత్వాన్ని ఎందుకు నిగ్గదీసి, సాధించలేక పోతున్నారు?
గడచిన రెండున్నారేళ్ళ కాలంలో పోలవరం ప్రాజెక్టుపై చేసిన వ్యయం, నిర్మాణ పనుల పురోగతి, పునరావాస పథకం అమలు తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేసి, ప్రాజెక్టు నిర్మాణం పట్ల తన చిత్తశుద్ధిని వెల్లడించాలి. పోలవరం ప్రాజెక్టు అథారిటీ “వెబ్సైట్” లో అధికారికంగా పెట్టిన ఆడిట్ నివేదికల మేరకు 2020 మార్చి 31 వరకు చేసిన మొత్తం వ్యయం రూ.17,327 కోట్లు. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత 2014 నుండి 2019 మార్చి 31 వరకు చేసిన వ్యయం రూ.10,861 కోట్లు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.876 కోట్లు మాత్రమే వ్యయం చేశారు. ఈ తరహాలో నిధులు వెచ్చిస్తూపోతే, ఎప్పటికి ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తవుతుంది? 2020-21 ఆర్థిక సంవత్సరం నివేదిక అందుబాటులో లేదు. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వమే శ్వేత పత్రం ద్వారా వెల్లడిస్తే సముచితంగా ఉంటుంది.

(టి.లక్ష్మీనారాయణ, కన్వీనర్,
ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి అధ్యయన వేదిక
విజయవాడ మొబైల్ నెం.9490952)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *