ఇంత నీచమైన కేంద్ర ప్రభుత్వాన్ని ఇప్పటివరకు చూడలేదని, భవిష్యత్తులో మళ్లీ చూస్తామో లేదో తెలియదనిముఖ్యమంత్రి కెసిఆర్ మండి పడ్డారు. ప్రతి అంశంలోనూ గందరగోళం చేయడమే కేంద్ర ప్రభుత్వ నైజంగా కనిపిస్తున్నది వ్యాఖ్యానించారు.
ప్రగతిభవన్ లో నిర్వహించిన క్యాబినెట్ సమావేశం అనంతరం సీఎం కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. బీజేపీ విధానాలను, కేంద్రం ధోరణిని తీవ్రంగా దుయ్యబట్టారు.
ఆహార భద్రత కల్పించడం చట్ట ప్రకారం కేంద్రానిదే బాధ్యత అని, దశాబ్దాలుగా ఇది జరుగుతున్నదేనని స్పష్టం చేశారు. అయితే బీజేపీ నాయకత్వంలోని కేంద్రం రైతులు, పేదలు, మధ్య తరగతి ప్రజల వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని ఆరోపించారు.
సామాజిక బాధ్యతను విస్మరించిన కేంద్రం ధాన్యం కొనుగోలుకు నిరాకరిస్తోందని విమర్శించారు. సేకరించిన ధాన్యాన్ని ప్రజలకు పంపిణీ చేసేది కేంద్రమేనని అన్నారు. ధాన్యం నిల్వలు కొనసాగించాల్సిన బాధ్యత కేంద్రంపైనే ఉంటుందని వివరించారు. ఈ విధానంలో లక్ష కోట్లు నష్టం వచ్చినా కేంద్రం భరించాలని అభిప్రాయపడ్డారు. కానీ కేంద్రం ఓ చిల్లరకొట్టు యజమానిలా వ్యవహరిస్తోందని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
బాయిల్డ్ రైస్ అంశంలో మెడమీద కత్తిపెట్టి తమ నుంచి కేంద్రం అంగీకార పత్రం తీసుకుందని వెల్లడించారు. “ప్రస్తుతం ఉన్న నిల్వలు మేం తీసుకోవాలంటే మీరు మున్ముందు పారా బాయిల్డ్ రైస్ తీసుకురాకూడదు” అని కేంద్రం షరతు విధించిందని, అందుకే విధిలేని పరిస్థితుల్లో అంగీకారం తెలిపామని కేసీఆర్ వెల్లడించారు. యాసంగి పంటలో నూకలు ఎక్కువ వస్తున్నాయని ఆ వడ్లను బాయిల్డ్ రైస్ గా మార్చాలని ఎఫ్ సీఐనే సూచించిందని, బాయిల్డ్ రైస్ పరిజ్ఞానంతో నూకల సమస్య పరిష్కారమైందని తెలిపారు. ఆ విధంగా రాష్ట్రంలో పారా బాయిల్డ్ రైస్ మిల్లులు వెలిశాయని తెలిపారు. కానీ పారా బాయిల్డ్ రైస్ కొనుగోలుకు కేంద్రం ఇప్పుడు నిరాకరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.